శతాధిక బెంగాలీ గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్
బద్ధదేవ బోస్ జీవిత చరిత్రను ఆంగ్లం లో అలోక్ రంజన్ దాస్ గుప్తా రాస్తే తెలుగులోకి శ్రీ ఆవంత్స మో సోమసుందర్ అనువాదం చేయగా సాహిత్య అకాడెమి 1982లో ప్రచురించింది. వెల-4రూపాయలు .
‘’ఉత్తమాభిరుచి ,పరిపక్వ బుద్ధీ ,కలిగిన పాఠకులు లభించేంతవరకు వారికోసం నిరీక్షించటం రచయితకు బాధాకరం కాదు .సాహిత్య కృషి ఫలించినట్లే ‘’అంటాడు బుద్ధ దేవ బోస్.సరళల సుందర భాషలో ఆయన సాహిత్యం వెలువరించాడు .అతనంత అపార్ధాలకు గురైన వంగ సాహిత్యకర్త లేడు.ఇదే అతన్ని విశిష్టవ్యక్తిని చేసింది .విశిష్ట సాహితీ విన్యాసం అతడిది .తన అభిప్రాయాల్ని తానె ఖండించుకొంటాడు అమెరికన్ జాతీయకవి వాల్ట్ విట్మన్ లాగా .దీనికి కారణం అనంత మానవుల స్వరూపస్వభావాలతో మమైక్యం చెందటం కావచ్చు .అత్యధికంగాఉత్పత్తి చేసిన కళాకారుడు .అతడు సృజనోత్సవ భా౦డారమే .వందకు పైగారచించాడు .రవీంద్రుని తర్వాత లెక్కలోకి వచ్చేవాడు బుద్ధ దేవ్ .టాగోర్ పట్ల విమర్శనాత్మక గౌరవం ,,పరిశీలనాత్మక తిరస్కారం ఉన్నవాడు .ఒంటెత్తు పోకడ మనిషి అన్నారు .1924లో వెలువరించిన తొలి కవితా సంపుటి ‘’మర్మ వాణి’’నుంచే ఆయన పై విమర్శ నాలుగు దశాబ్దులు సాగింది .నైతిక నిష్టాపరులు సంఘ సంస్కర్తలు పత్రికా సంపాదకులు సనాతనధర్మ పండితులు తిట్టినా తిట్టు తిట్టకుండా ఈ నలభై ఏళ్లు తిడుతూనే ఉన్నారు ఆయన్ను .దీనికి కారణాలు –బాలకవిగా టాగూర్ వాత్సల్యం పొందటం ,లైంగిక అశ్లీల సాహిత్య నాయకమణి కావటం ,సమకాలీన సామాజిక ప్రతిబింబాలను తన సాహిత్యం లో చొప్పించటం ,సంప్రదాయ పత్రికాదిపతులకు అభ్యుదయ కల్లోలవర్గాలపట్ల ద్వేషమే అన్నాడు సువీర్ రాయ్ చౌదరి .
19-12-1970న కలకత్తా హైకోర్ట్ ఈయనకు అశ్లీల సాహిత్యం సృష్టిస్తున్నాడని శిక్షించింది .70రోజుల విచారణ ఫలితం ఇది .ఆ రోజే ఆయనకు భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’ప్రకటించింది .కావ్యాలు నవలలు వ్యక్తీ చిత్రణలు ,సాహిత్య విమర్శలు ప్రతీకాత్మక నాటకాలు ,వినోదపద్యాలు, సామాన్యులకు గాధలూ రాశాడు .తాత్వికంగా ఇవి ఒకదానిలో ఒకటి చొచ్చుకు పోయినవే కానీ తీర్దానికి తీర్ధం ,ప్రసాదానికి ప్రసాదం వంటివి కావు .నిత్య ప్రయోగాత్మకం ,చైతన్య విలసితాలు ఆతని రచనలు .మహాకావ్యాలలో క్లాసికల్ వస్త్వాశ్రయ విధానం అవలంబించాడు .కొన్ని చోట్ల అంతర్ముఖీనత కనిపిస్తుంది .రొమాంటిక్ కళాశీలిగా కనిపిస్తాడిక్కడ.మహాకావ్య మార్గానికి చెందినవాడుగా సుధీన్ద్రనాథ్ దత్తా గుర్తింపు పొందాడు .దీన్ని బుద్ధదేవ్ ఖండించాడు .ఆయన రొమాంటిక్ కవే అన్నాడు సవివరంగా .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-22-ఉయ్యూరు
—