శతాధిక బెంగాలీ గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -3
మానవ జీవితం ప్రక్కనే అనంత జీవజాల ప్రపంచం సహ జీవనం చేస్తోంది .కాని ఇదిమాత్రం నిరాదరణకు గురైంది .దీన్ని హిల్స ,బాంగ్ అంటే కప్పలు,జొనాకి అంటే మిణుగురుపురుగులు కవితల్లో చర్చించాడు బుద్ధ దేవ్.వీటిలో స్వయం సమృద్ధిగల సమైక్య జీవన విధానం తెలియజేశాడు –‘’కప్పలన్నీ కలిసి బృందగానం చేస్తే –దేనికీ భయం లేదు –కరువు కాటకాలు ఉండవు .-మేఘం కమ్మినట్లు పచ్చిక పరచుకొంటే –పొలాల్లో నీరు నిలువులోతు నిలుస్తుంది –మెత్తని శరీరాలతో –సన్నని వజ్రాల్లాంటి మెరిసే కన్నులతో –పైకి చూస్తూ ధ్యానమగ్నమై –వేద ఘోషలాగా వాటి గానం గాలిలో తేలుతుంది.-బెకబెక మంటూ దీక్షగా మూఢ విశ్వాసాన్ని ప్రచారం చేస్తుంది మండూకం ‘’.
1948లో ‘’ద్రౌపది చీరలు ‘’అతని కవితలు ప్రచురితాలైనాయి .సాంప్రదాయ భాషా విధానం పక్కన పడేసి ఎజ్రాపౌండ్ చెప్పిన ఇమేజిస్ట్ మాని ఫెష్టో ను పూర్తిగా అనుసరించాడు .ఈ దశ గడిచాక శీతేర్ ప్రార్ధన ,వసంతేర్ ఉత్తర కావ్యాలలో ఉన్న సందిగ్ధావస్థ ఆయన మానసిక స్థితే .-‘’తల్లి గర్భ కోశం కూడా చీకటే –కాలం అందుకే ఒకమేలి ముసుగు –అ౦గుష్టమాత్ర నిద్రామూర్తి నిశ్శబ్దంగా –ఒక్క దీపమైనా వెలగని అంధకారం లో –నీ లోపలి నామ రహిత శూన్యం లో –హే శిశూ !మళ్ళీచేతులు జోడించి ప్రార్ధించు కొత్తజన్మకోసం –వాసనలన్నీ సిద్ధంగా దాచుకో ‘’.అంత్యప్రాసలు అనుప్రాసలతో జీవం పోశాడు .
క్రమంగా అవనీంద్ర నాధ టాగూర్ ,ఆనంద కుమారస్వామి ల మార్గం లో ఉపనిషత్తులపట్ల ఆధునిక దృక్పధాన్ని వివరించాడు .బహురూప వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు .కవితను అంతర్ముఖీనం చేశాడు .’’చల్లగా కోణార్క లోని –అప్సర చూపించే స్వర్గంలా –నల్లని చీకటిని చుట్టుకొని –ఆ అప్సరస వక్షోజాలు ఒక హస్తానికి లొంగి –చూపుల్ని చెదరగోట్టింది ‘’.ఫ్రీరేఫ లైట్స్ సంప్రదాయం తో మొదలెట్టి ,ఇంప్రెష నిష్ట భావాలదాకా వచ్చి అతని భావ ధార ఆగింది .ఇందులో సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ల సమ్మేళనం కనిపిస్తుంది –‘’నువ్వొక ఐ౦ద్ర జాలిక అవగుంఠ నానివి –నేనొక పరిపక్వత నొందని కవిని ‘’అంటాడు .
1966లో తుప్పు పట్టిన బాకు మొనపాటలు సంపుటి ప్రచురించాడు .తుప్పుపట్టిన బాకుమొనశారీరిక శక్తి హీనతకు ప్రతీక .దాని నగ్నమైన మొన కవితా సునిశిత్వానికి ప్రతీక.’’-స్నేహితులంతా మృత్యు వాత పడ్డారు –ప్రకృతి కాలగర్భం లో కలిసింది ‘’లలో ఏకాకి తనం కనిపిస్తుంది –‘’స్వరూపరహిత౦ గా వర్షారాత్రి –వెలివేయబడ్డ వనితలా –పేవ్ మెంట్ మీద దొర్లుతోంది –నెమ్మదిగా మనసంతా ఆక్రమిస్తోంది ‘’.
అతని గద్య కధలు యాత్రోపాఖ్యానాలు లో జాతీయ అంతర్జాతీయ విధానాలు కలిసిపోయాయి –‘’మళ్ళీ అక్కా చెల్లెళ్ళు గట్టి నేలపై నిలబడ్డారు-ఆకలి మంటల్లో మండటానికి సిద్ధంగా ‘’.ఫ్రెంచ్ బాడ్లేర్ కవిత్వాన్ని వంగ దేశీయులకు పరిచయం చేసింది ఈయనే .దీనితో బెంగాలీ భాషకు కొత్త వారసత్వాన్ని అందించాడు .’’చార్లెస్ బాడ్లేర్-కవిత్వం ‘’ ను బుద్ధదేవ్ 1961లో ప్రచురించాడు .ఈ ఇద్దరూ అవిభాజ్యకవితా మూర్తులు అని అర్ధమవుతుంది .1970లో రైనర్ మేరియా రిల్కే కవితా వైభవం పుస్తకం రాసి ప్రచురించాడు .అందులో పవిత్రత ,ఆత్మా తీత స్థితి ని పట్టుకొన్నాడు .కొత్త నుడికారాన్ని సృష్టించుకొన్నాడు .దీన్ని అపభ్రంశ వంగభాష న్నారు గిట్టని వాళ్ళు .
‘’బుద్ధ దేవ్ బాసూర్ శ్రేష్ఠ కవితా ‘’పేరుతొ ఒక గ్రంథం1969లో వచ్చి,వెంటవెంటనే మూడు ప్రచురణలు పొందింది .ఇందులో ఆయన అనువాదాలూ చేరాయి .అంటే అనువాదకుడుగా సుస్థిర స్థానం పొందాడన్నమాట .ఈయన అనువాదాల్లో కాళిదాసు కవితా చాయలు తొంగి చూస్తాయి .మందాక్రాంత వృత్తాన్ని బెంగాలీ లో మహా భేషుగ్గా ఇమిడ్చి మెప్పు పొందాడు .బరోమేజర్ చాడో –ఆరురుతువులు లో ఆయన మనోహర కాల్పనిక లోకం దర్శిస్తాం ..శాబ్దిక అలంకారాలు అనుప్రాసలను ఆశ్చర్యకరంగా ప్రయోగిస్తాడు .పిల్లల మనస్సులను యిట్టె ఆకర్షిస్తాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-2-22-ఉయ్యూరు .