మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72
72-తొలి ప్రేక్షక సంఘం స్థాపకుడు నటుడు ,నట శిక్షకుడు,దర్శకుడు ,రేడియో ఆర్టిస్ట్ ,సీతాపతి సంసారం,అగ్నిహోత్రావధానులు ఫేం –విన్నకోట రామన్న పంతులు
విన్నకోట రామన్న పంతులు ఔత్సాహిక నాటక రంగానికి నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి.
జీవిత విశేషాలు
ఇతడు 1920, ఏప్రిల్ 13న విజయవాడలో వేంకటకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విజయవాడ లోని గాంధీజీ మునిసిపల్ హైస్కూలు, కాకినాడలోని ఎఫ్.ఎ.సి.ఆర్.కాలేజి, విజయనగరంలోని మహారాణి కాలేజి, పూనాలోని లా కాలేజీలలో గడిచింది. ఇతడు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తరువాత, వృత్తిరీత్యా న్యాయవాదిగా జీవితాన్ని కొనసాగిస్తూనే మరోప్రక్క నటుడిగా నాటకాల్లో పాత్రలు ధరిస్తూ నాటకరంగం బాగుకోసం పాటుపడ్డాడు. ఇతడు నటనకు, ఆహార్యానికి సంబంధించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. వాటి మీద నటశిక్షణ, రూపశిల్పం, నాటక ప్రయోగం, రంగస్థల శాస్త్రం, వాచికాభినయం, మేకప్, మూకాభినయం, రససిద్ధాంతం, అంగికాభినయం,లైటింగ్, రంగస్థల నిర్మాణం, సాత్వికాభినయం మొదలైన పుస్తకాలు కూడా రచించాడు. ఆంధ్రప్రదేశ్లో మొదటి ప్రేక్షక సంఘం నటరాజ కళామండలిని స్థాపించాడు. నాట్య సంఘం కార్యదర్శిగా, రాఘవకళా కేంద్రం కార్యదర్శిగా సేవలను అందించాడు. జంధ్యాల, మురళీమోహన్, సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ మొదలైన వారికి నటనలో శిక్షణను ఇచ్చాడు. తెలుగు రంగస్థల, సినిమా నటుడు విన్నకోట విజయరాం ఇతని కుమారుడు. టెలివిజన్ నటుడు, సినిమా నటుడు ప్రదీప్ ఇతని మనుమడు[1].
నాటకరంగ౦
ఇతడు 1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు, కొప్పరపు సుబ్బారావు, డి.వి.నరసరాజు, కె.వి.ఎస్.శర్మ, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించేవాడు. ఇందులో అగ్నిహోత్రావధాన్లు పాత్రను రామన్నపంతులు గొప్పగా పోషించేవాడు. రాఘవ కళాకేంద్రం ప్రదర్శించిన విశ్వం పెళ్ళి, ఇనుప తెరలు మొదలైన నాటకాల్లో రామన్నపంతులు విలక్షణమైన పాత్రలను ధరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తరువాత డి.వి.నరసరాజు రచించిన “నాటకం” అనే నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించి తన కీర్తిని పెంచుకున్నాడు. ఈ నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీల్లో రచన, ప్రదర్శనలకు బహుమతులు లభించాయి. ఇవే కాకుండా వరవిక్రయం, పెద్దమనుషులు, ఈనాడు, ఆసామి, శ్రీరంగనీతులు మొదలైన నాటకాలలో కూడా పాత్రలు ధరించాడు. రామన్నపంతులు ఉత్తమ దర్శకుడిగా అనేక నాటకాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో ఎన్.జి.వో., నాటకం, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు ముఖ్యమైనవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి మరణించేవరకూ అనేక నాటకాలలో పాత్రపోషణ చేసేవాడు. సీతాపతి సంసారం ధారావాహిక నాటకంలో సీతాపతి పాత్ర ఇతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది.
సినిమా రంగం
ఇతడు తెలుగు సినీరంగంలో ప్రవేశించి బి.యన్.రెడ్డి గారి బంగారు పాప (1954) చిత్రంలో మొదటిసారిగా జమిందారు పాత్రను పోషించాడు. తర్వాత వినోదా సంస్థ నిర్మించిన కన్యాశుల్కం (1955) చిత్రంలో కూడా అగ్నిహోత్రావధాన్లు పాత్రను పోషించి తన నటనకు ప్రశంసలందుకున్నాడు. బాపూరమణలు ఇతడిని పిలిచి తమ తొలిచిత్రం సాక్షి (1967) లో తడిగుడ్డతో గొంతులు కోసే ప్రతినాయకుడు మునసబు పాత్రను ధరింపజేశారు.
ప్రముఖ హాస్యరస చక్రవర్తి జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా ఇతని నాటకాల కంపెనీలో నటించాడు.[2] జంధ్యాల సినీ దర్శకునిగా మారిన పిదప తన తొలిచిత్రం ముద్ద మందారం (1981) లో కథకు కీలకమైన పాత్రను పంతులు చేత వేయించాడు.
చిత్రసమాహారం
· బంగారు పాప (1954) – జమీందారు
· కన్యాశుల్కం (1955) – అగ్నిహోత్రావధాన్లు
· దొంగరాముడు (1955)
· వరుడు కావాలి (1957)
· బాటసారి (1961) – జమీందారు
· శ్రీకృష్ణ కుచేల (1961)
· చదువుకున్న అమ్మాయిలు (1963)
· రామదాసు (1964)
· ఇల్లాలు (1965)
· శ్రీమతి (1966)
· సాక్షి (1967) – మునసబు
· బంగారు పిచిక (1968) – సన్యాసిరాజు
· స్నేహం (1977)
· ముద్ద మందారం (1981)
· మల్లెపందిరి (1982)
· ముగ్గురమ్మాయిల మొగుడు (1983)
మరణం
రామన్న పంతులు 1982, డిసెంబర్ 19న మరణించాడు[1]
–నటనకు కంచుకోట విన్నకోట
“విన్నకోట” అన్నమాట విని చాలా కాలమైంది. విన్నకోట అనే ఇంటిపేరుకు విశిష్టమైన పేరు తీసుకువచ్చినవారు విన్నకోట రామన్నపంతులు. వారు కన్నుమూసి కూడా చాలా ఏళ్ళు (1982) కావస్తోంది. వారు కన్నుతెరచి (1920)ఇప్పటికి వందేళ్లు పూర్తయింది. ఇది విన్నకోటవారి శతజయంతి సంవత్సరం. ఆ మహనీయుడ్ని తలచుకోవడం ఎంతో అవసరం. మహాకవి గురజాడ అప్పారావు రాసిన ” కన్యాశుల్కం” నాటకంలో రామన్నపంతులు పోషించిన పాత్రలు చిరంజీవిగా ఎప్పటికీ ఉంటాయి. మరో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు రచించిన “వరవిక్రయం” నాటకం ద్వారానూ విన్నకోటవారు తెలుగునాట సుప్రసిద్ధులు.
బహుముఖీనుడు
నటుడు, దర్శకుడు,న్యాయనిర్ణేత, రేడియో కళాకారుడుగా కళారంగంలో చిరయశస్సును ఆర్జించారు. విజయవాడలోనే జన్మించారు, ఐక్కడ విన్నకోటవారి వీధి కూడా ఉంది. న్యాయవాదిగా ధర్మమార్గంలో ఆర్జించిన సంపదను నాటకరంగ అభివృద్ధికి సద్వినియోగం చేసిన దానశీలి, త్యాగశీలి. గొప్ప మేధావి. నటనారంగానికి సంబంధించిన అనేక అంగాలు, రంగాలపై పరిశోధన చేసి, ఆ జ్ఞానాన్ని పదిమందికి పంచిపెట్టి, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దిన ఆచార్యతుల్యులు. నటశిక్షణ, రూపం, ఆంగిక, వాచిక, సాత్విక,మూకాభినయం, ఆహార్యం,రంగస్థల నిర్మాణం, రససిద్ధాంతం, నాటక ప్రయోగం, లైటింగ్ మొదలైన అనేక అంశాలపై అద్భుతమైన పుస్తకాలు రచించి లోకానికి అందించారు.వీటిపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి, ఎందరినో ప్రభావితం చేశారు. జంధ్యాల, మురళీమోహన్, సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయశర్మ వంటివారు విన్నకోటవారి దగ్గర సుశిక్షితులై, లబ్ధప్రతిష్ఠులయ్యారు.
కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు
వీరి కుమారుడు విజయరాం నటుడుగా అన్ని తెరలపై అందరికీ పరిచయమైనవారే. ముద్దమందారం ఫేమ్ గా చెప్పుకునే నటుడు ప్రదీప్ వీరి మనుమడు. గురజాడవారి “కన్యాశుల్కం” నాటకంలో అగ్నిహోత్రావధానుల పాత్రపోషణలో విన్నకోటవారికి మించినవారు ఇంతవరకూ ఎవ్వరూ లేరు. ఆయనే అగ్నిహోత్రావధానులేమో అనుకునేవారు.ఆ పాత్రకు అంతటి జీవం పోశారు. డివినరసరాజు రాసిన “నాటకం”అనే నాటకంలో ముఖ్యభూమిక పోషించి ఎంతో కీర్తిని గడించారు. ఎన్ జి ఓ, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు మొదలైనవి వీరి దర్శకత్వంలో పేరుతెచ్చుకున్న నాటకాలు. సినిమా రంగంలో వీరి నటనా ప్రతిభను బాగా వాడుకున్నవారు బి ఎన్ రెడ్డి, బాపు అనిచెప్పాలి. బంగారుపాపలో వేసిన జమిందార్ పాత్ర చాలా ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. తడిగుడ్డతో గొంతులు కోసే మునసబు పాత్రలో వీరి విన్యాసం చూసి తీరాల్సిందే. వీరిని ఆ పాత్రలో చూసిన వారందరికీ మొన్నటి దాకా పల్లెల్లో హడావిడి చేసిన కొందరు మునసబులు తప్పక గుర్తుకువచ్చి తీరుతారు.
జంధ్యాలతో అనుబంధం
సాక్షి సినిమాలో బాపురమణలు ఆ పాత్రను మలచిన తీరు కూడా అద్భుతం. జంధ్యాల కూడా విన్నకోటవారితో తన సినిమాల్లో నటింపచేసి, గురుఋణం తీర్చుకున్నారు. వీరితో ముద్దమందారంలో కీలక పాత్ర వేయించారు. దర్శకుడిగా జంధ్యాలకు ఇదే మొట్టమొదటి సినిమా కూడా. జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా నటించింది విన్నకోటవారి కంపెనీలోనే కావడం విశేషం. రామన్నపంతులుకు ఆకాశవాణితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. వారి తుది శ్వాస వరకూ అనేక నాటకాలకు పాత్రపోషణ చేసి అలరించారు. సీతాపతి సంసారం ధారావాహికంగా వచ్చింది,ఇందులో లీడ్ రోల్ వీరిదే. ఇది కూడా ఎంతో మంచిపేరు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పరచారు.దాని పేరు “నటరాజ కళామండలి”.
ఉద్దండులతో సావాసం
ప్రసిద్ధ రాఘవ కళాకేంద్రం కార్యదర్శిగా వీరు పోషించిన పాత్ర ఎనలేనిది. ఈ సంస్థ ప్రదర్శించిన ఇనుపతెరలు, విశ్వంపెళ్లి మొదలైన నాటకాల్లో నటుడుగానూ విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్నారు. విన్నకోటవారి ప్రతిభ విలక్షణం. తెలుగునాటక రంగానికి ఊపిరిలూదినవారిలో విన్నకోట వారి స్థానం గణనీయం, స్తవనీయం. కొప్పరపు సుబ్బారావు, డివి నరసరాజు, నిర్మలమ్మ, సుంకర కనకారావు,కెవిఎస్ శర్మ మొదలైన ఉద్దండులతో వీరి సావాసం అపురూపం. కన్యాశుల్కం నాటక విజయంలో వీరందరి పాత్ర మరువలేనిది. విన్నకోటవారు సుమారు పదహారుకు పైగా సినిమాల్లో నటించారు. విద్యావంతుడైన విలక్షణమూర్తి విన్నకోట రామన్నపంతులును ఎన్నటికీ మరువలేం. ఇటువంటి వారి జీవితాలే కళారంగాలకు స్ఫూర్తిదీప్తులు.
నటనకు పెట్టని కోట విన్నకోట –శ్రీ పాండురంగ –ఆకాశవాణి మాజీసంచాలకులు
రంగస్థల, సినిమా నటులు విన్నకోట రామన్న పంతులుగారి (1920-2020) శత జయంతి సంవత్సరం సందర్భంగా…
కళాకారుల కుటుంబంలో వందేళ్ళు (13-4-1920) క్రితం పట్టిన విన్నకోట రామన్న పంతులు ఈనాటి కళాకారునికి ఆదర్శప్రాయుడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే, బందరు నాటకరంగంలో జరిగిన నాటక ప్రదర్శనలు చూసి ప్రభావితులయ్యారు.
దరిమిలా, విజయవాడలో న్యాయవాది వృత్తి చేపట్టిన తరువాత కూడా నాటకరంగాన్ని విస్మరించలేదు. మంచి నాటకాలు రావాలనీ, వాటిని ప్రదర్శించాలని, తగిన పాత్రలను తృప్తిగా పోషించాలని తహ తహ లాడేవారు. న్యాయవాదిగా జీవితాన్ని సాగిస్తూనే, మరొక పక్క నటుడుగా నాటకాల్లో నటిస్తూ నాటకరంగం బాగుకోసం పాటుపడ్డారు. విజయవాడలో కొప్పరపు సుబ్బారావు గారు స్థాపించిన రాఘవ కళాకేంద్రంలో చేరి అనేక నాటకాలను ప్రదర్శించారు. వీటిలో ముఖ్యమైనది D.V నరసరాజుగారు రాసిన “నాటకం” అనే నాటకం. దీంట్లో వీరి నటనకుగాను ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీలలో బహుమతి లభించింది.
వీరి జీవితంలో “కన్యాశుల్కం” నాటకం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేది ఇందులో ‘అగ్నిహోత్రావధానులుగా వీరి నటన నభూతో నభవిష్యతి”.
వీళ్ళమ్మా శిఖతరగ, ప్రతి గాడిదకొడుకు తిండిపోతుల్లా నా యింట జేరి నన్ననేవాళ్ళే. తాంబోలం యిచ్చేసాను. యిహ తన్నుకు చావండి”
ఈ డైలాగ్ ఎన్నిసార్లు విన్నా ఆయన విశ్వరూపం మనముందు సాక్షాత్కరిస్తుంది. ఈ పాత్రని నాటకంలోనూ సినిమాలోను కూడా రామన్నగారు పోషించడం విశేషం. ఈయనకి ప్రత్యాయన్మాయం ఎవరూ లేరన్న విషయం అందరికి తెలుసు. నాటకాలతో బాటు సినిమాల్లో కూడా వైవిధ్య భరితమయిన పాత్రలు పోషించారు. వీటిల్లో ముఖ్యమైనవి “కన్యాశుల్కం” “బంగారుపాప” “దొంగరాముడు” “బాటసారి” “ఇల్లాలు”.
రామన్న పంతులు గారికి రేడియో అంటే ఇష్టం. రేడియోలో అనేక నాటకాల్లో ముఖ్యపాత్రలు ధరించారు. ముఖ్యంగా “సీతాపతి సంసారం” అనే గొలుసు నాటికలో సీతాపతి పాత్ర మర్చిపోలేని జ్ఞాపకం. అలాగే మంచి నడవడిక, వ్యక్తిత్వం, గర్వం ఇసుమంతలేని, మహామనిషి, తనకన్నా చిన్నవాళ్ళు దర్శకత్వం చేసిన రేడియో నాటకాల్లో ఇష్టపడి నటించేవారు. ఆయన కన్నా అన్ని విధాల చిన్నవాళ్ళమైనా రేడియో మిత్రులతో ఆప్యాయంగా వుండేవారు.
జంధ్యాలతో అనుబంధం
సాక్షి సినిమాలో బాపురమణలు ఆ పాత్రను మలచిన తీరు కూడా అద్భుతం. జంధ్యాల కూడా విన్నకోటవారితో తన సినిమాల్లో నటింపచేసి, గురుఋణం తీర్చుకున్నారు. వీరితో ముద్దమందారంలో కీలక పాత్ర వేయించారు. దర్శకుడిగా జంధ్యాలకు ఇదే మొట్టమొదటి సినిమా కూడా. జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా నటించింది విన్నకోటవారి కంపెనీలోనే కావడం విశేషం. రామన్నపంతులుకు ఆకాశవాణితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. వారి తుది శ్వాస వరకూ అనేక నాటకాలకు పాత్రపోషణ చేసి అలరించారు.
ఆయన శిష్యులలో చెప్పుకోదగ్గవారు జంధ్యాల, వీరభద్రరావు విజయరాం, ప్రదీప్. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన “ముద్దమందారం” ఆయన నటించిన సినిమా ఆఖరిది. దీంట్లో మూడు తరాలకు చెందిన ఆయన కుటుంబసభ్యులు పాల్గొనడం విశేషం. 1982లో వారి 62వ యేట విన్నకోట కన్నుమూసారు.
ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రనాటక కళాపరిషత్తు విజయవాడలో నిర్వహించిన ‘నాటక విద్యాలయం’లో నాటక నిర్వహణ, నటన, ప్రయోగం, మొదలయిన విషయాల మీద ఆధ్యాపకుడిగా నియమింపబడ్డారు. “నట శిక్షణ’ గురించి ఎన్నో పుస్తకాలు రాసారు.
ఈనాటి తరానికి ఆయన నటజీవితం ఒక స్ఫూర్తి. ఇటువంటి మహనీయుల అనుభవాలే నాటక రంగానికి దిక్సూచి.
శ్రీ బెల్లం కొండ నాగేధ్వరరావు
పువ్వు పుట్టుకతోనే తన పరిమళాన్ని వెదజల్లుతుంది కొందరు కళాకారులు అంతే ప్రధమ ప్రదర్శననుండి చివరి ప్రదర్శనవరకు వారి కళాప్రతిభ చూపించి ప్రేక్షకుల మనసును రంజింపజేస్తారు.ఆదే కోవకు చెందినవారు విన్నకోట రామన్న పంతులుగారు.
వీరు విజయవాడలో 1920/ఏప్రియల్ /13 వతేదిన వేంకట కృష్ణయ్య, అన్నపూర్ణమ్మగార్లకు జన్మించారు. అక్కడే గాంధీ మునిసిపల్ పాఠశాలలోనూ,కాకినాడలో ఎఫ్.ఏ.సి.ఆర్.కాలేజి,విజయనగరం మహరాణి కాలేజిలోనూ,పూనాలో న్యాయవాది పట్టాపుచ్చుకుని న్యాయవాదిగా వృత్తి కొనసాగాస్తూనే మరోపక్క నాటకాల్లో నటిస్తూ కళాసేవలు అందించేవారు.వీరు నటనకు,ఆహార్యానికి సంభంధించిన ఎన్నో మెలకువలు తనఉపన్యాసంలో పలుమార్లు వివరించేవారు. నటశిక్షణ, రూపశిల్పం,నాటక ప్రయోగం,రంగస్ధల శాస్త్రం,వాచికాభినయం ,మేకఫ్, మూకాభినయం,రససిధ్ధాంతం,ఆంగికాభినయం,లైటింగ్,రంగస్ధల నిర్మాణం,స్వాతికాభినయం మెదలైన విషయాలపై పుస్తకాలుకూడా రాసారు.తెలుగునేలపై మొదటి ప్రేక్షకులసంఘం’నటరాజ కళామండలి’ స్ధాపించారు.నాట్యసంఘం,మరియు రాఘవ కళాకేంద్రం కార్యదర్శగా సేవలు అందించారు.
1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు,కొప్పరపు సుబ్బారావు,డి.వి.సుబ్బారావు,కే.వి.ఎస్.శర్మ,నిర్మలమ్మ మోదలగు వారితోకలసి’కన్యాశుల్కం’నాటకాన్ని విజయవంతంగా పలుమార్లు ప్రదర్శించారు.అందులో అగ్నిహాత్రావధానులు పాత్రను వీరు గొప్పగా పోషించేవారు.ఇంకా ‘విశ్వం పెళ్ళి’-‘ఇనుప తెరలు’ మొదలగు నాటకాల్లో విలక్షణమైన పాత్రలు వీరు ధరించేవారు.అనంతరం డి.వి.నరసరాజు గారు రచించి ‘నాటకం’ అనే నాటకంలో ఒక మూఖ్యపాత్రను పోషిస్తూ నాటకరంగంలో మంచి నటుడిగా మరింత గుర్తింపు పొందారు.ఈనాటకానికి ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో అనేక బహుమతులు లభించేవి.వీరు ఉత్తమ దర్శకుడిగా’ అనేక నాటకాలలో బహుమతులు అందుకున్నారు. ‘వరవిక్రయం’-‘పెద్దమనుషులు’-‘ఈనాడు’-‘ఆసామి’-‘శ్రీరంగనీతులు’ ‘ఎన్.జి.వో,నాటకం,లేపాక్షి,సంభవామి యుగేయుగే, దశమగ్రహాలు, సీతాపతి సంసారం వంటి పలు నాటకాలు వీరి నటనకు వన్నెతెచ్చాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్ర ప్రారంభంనుండి వీరు మరణించేదాక అనేక నాటకాలు వినిపించేవారు.
జంధ్యాల,మురళీమోహన్,సుత్తివీరభద్రరావు,సుబ్బరాయశర్మ గార్లకు నటశిక్షణ ఇచ్చారు.తెలుగు రంగస్ధల,సినిమా నటుడు విన్నకోట విజయరాం గారు వీరికుమారుడే,టెలివిజన్,సినిమా నటుడు ప్రదీప్ వీరి మనమడే!
సినిమారంగంలోవీరు ప్రవేసించి తొలిసారిగా బి.యన్ రెడ్డి గారి ‘బంగారుపాప'(1954) ‘కన్యాశుల్కం'(1955) ‘దొంగరాముడు'(1955) ‘వరుడు కావాలి'(1957)’బాటసారి'(1961)’శ్రీకృష్ణ కుచేల'(1961) ‘చదువుకున్న అమ్మాయిలు'(1963)’రామదాసు'(1964) ‘ఇల్లాలు’ (1965) ‘శ్రీమతి'(1966) ‘సాక్షి'(1967)’ బంగారు పిచ్చుక'(1968) ‘స్నేహం'(1977)’ముద్దమందారం'(1981)’మల్లెల పందిరి'(1982) ‘ముగ్గురమ్మాయిల మొగుడు'(1983)(వీరి మరణానంతరం విడుదల జరిగింది) వంటి పలు చిత్రాలలో నటించారు.
తన అరవై రోండో ఏట 1982/ డిసెంబర్ /21 న కళామతల్లి పదసేవకై బ్రహ్మలోకం తరలి వెళ్ళారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-2-22-ఉయ్యూరు