ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -1
‘’నానాలాల్ ‘’అనే పుస్తకాన్ని యు.ఎమ్ మనియార్ రచిస్తేతెలుగులోకి డా.అక్కిరాజు రమాపతి రావు గారు అనువాదం చేయగా సాహిత్య అకాడెమి 1979లో ముద్రించింది .వెల-రెండున్నర రూపాయలు .
తండ్రీ కొడుకులు
1905లో ప్రముఖ మేధావి ,సుప్రసిద్ధ నవలారచయిత గోవర్ధన్ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన గుజరాతీ సాహిత్య పరిషత్ సమావేశం లో ప్రముఖ కవి’’ కాంత్’’ అనే మణి శంకర భట్ నానాలాల్ ను ‘’ఉదిత కవితా పూర్ణ శశి ‘’అని కీర్తించాడు .ముందు హెచ్చరికలు లేకుండా నానాలాల్ ఆధునిక గుజరాతీ కోట నిర్మించుకొన్నాడు ఇరవై ఏళ్ళ లోపే .అప్పటినుంచి అవిశ్రాంత కవితా రచన చేసి దూసుకుపోయాడు .తండ్రి ప్రముఖకవి దలపతి రాం .తండ్రి రాసిన ‘’బపానీ పిప్పర్ ‘’కవిత సంప్రదాయ గుజరాతీ కవిత్వాన్ని విస్మయ పరచింది .దీర్ఘకాలం కవిత్వం లో జీవించి తండ్రి 1898లో మరణించాడు .ఆయన మృతి వార్త ప్రముఖ సాహిత్య పత్రిక ‘’జ్ఞానసుధ ‘’లో పట్టభద్ర స్థాయిలో ఉన్న కొడుకు నానాలాల్ రాసిన ‘’వసంతోత్సవ్ ‘’కవితతో పాటే ప్రచురి౦ప బడటం ఆశ్చర్యకరం .తండ్రిలాగానే కొడుకు కూడా 50 ఏళ్ళు కవిత్వాన్ని సుసంపన్నం చేశాడు .ఇలాంటి తలిదండ్రులు అరుదుగా ఉంటారు .1845లో తండ్రి కవిత బపాని పిప్పర్ మైలురాయి అయితే ,1895లో కొడుకురాసిన వసంతోత్సవ్ కవిత నవకవితా మార్గదర్శకమైంది .
16-3-1877న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో శుక్రవారం నానాలాల్ పుట్టాడు .1848నుంచే తండ్రి అక్కడ ఉంటున్నాడు .స్కాట్ దేశీయుడు ఏకే ఫోర్బ్స్ ఆహ్వానం పై ఆయన అక్కడికి వచ్చి స్థిరపడ్డాడు .దొరకు ‘’రాస మల్ ‘’విషయ సేకరణలో సాయం చేయమంటే వచ్చాడు .దలపత్ రాం గుజరాత్ దేశ భాషాసభ అనే గుజరాత్ విద్యా సభలో ఉద్యోగి .ఆయన ఆర్జించిన కీర్తి ప్రతిష్టలు వగైరాల వలన ఇంటిపేరు’’ తర్ వేది’’ అంటే త్రివేది విస్మృతిలోకి జారిపోయి కవిగా మాత్రమె లోకానికి పరిచయమయ్యాడు .కవి అనేదే తండ్రికీ కొడుకుకూ ఇంటి పేరు ఐపోయింది .ఇద్దరూ క్రియాపూర్ణ కవులే .
1893లో 16వ ఏట మెట్రిక్ పాసై ,గురువు కాశీ రాం దవే ప్రోత్సాహంతో కవిత్వ సాహిత్యాలపట్ల మక్కువ పెంచుకొన్నాడు .బొంబాయి అహమ్మదాబాద్ ,పూనా లలో కాలేజీలలో చదివి 1901లో బాంబే యూని వర్సిటి నుంచి ఎం ఏ డిగ్రీ పొందాడు .ఈయన 50వ పుట్టినరోజున ఈ యూనివర్సిటి నానాలాల్ ను ‘’విశిష్ట విద్యార్ధి ‘’గా గుర్తించి గౌరవించింది .ఆ సందర్భం లో ఆయన ‘’బొంబాయి యూని వర్సిటి ఉంది కనుకనే నానాలాల్ ఉన్నాడు’’అని వినయంగా చెప్పాడు ..చరిత్ర తత్వ శాస్త్రం ఇంగ్లీష్ లిటరేచర్ అభిమాన విషయాలుగా చదువుతున్నా కవితార్చన చేస్తూనే ఉన్నాడు .భారతీయ సంస్థానాధిపతులకు ఏర్పాటైన స్కాట్ కాలేజి లో ప్రిన్సిపాల్ అయి ,తర్వాత గుజరాత్ లోని రాజకుమార్ కళాశాలలో13ఏళ్ళు ఉద్యోగించాడు మధ్యకాలంలో సివిల్ జడ్జిగా ,రాజకోట్ సంస్థాన దివాన్ గా పనిచేశాడు .
1918లో సౌరాష్ట్ర విద్యాశాఖాధికారి అయ్యాడు .గాంధీ పేరుఅప్పుడే మారు మోగుతోంది. ఆయనపై ‘’ ,గుజరత్న తపస్వి ‘’కవిత రాశాడు .పెద్ద ఉద్యోగం, మంచి జీతం,పలుకుబడి ఉన్న ఈ పదవి కి రాజీనామా చేసి 1920లో అహ్మదాబాద్ లోఉంటూ ,1946 జనవరి 9 న చనిపోయే వరకు పాతికేళ్ళు అవిశ్రాంత కవితా రచన చేస్తూ కుటుంబాన్ని పోషించాడు .’’బూటు లేసులు కూడా కొనలేని రాబడిని కూడా కవిత్వం తో నేను పొందలేదు ‘’అని విచారించిన వర్డ్స్ వర్త్ కవిలాగా కాకుండా ,ఆర్ధికంగా ఏమాత్రం ఇబ్బంది పడలేదు నానాలాల్ .తండ్రి కవితామార్గాన్ని అనుసరించి ఋణం తీర్చుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-2-22-ఉయ్యూరు