మనమరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -76
76-సూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క ,యాతమేసి తోడినాఏరు ఎండదు ,పుణ్యభూమి నా దేశం నమో నమామి ,సీతాలు సింగారం పాటల ఫేం-జానపదులజాబిలి- జాలాది
జాలాదిగా ప్రసిద్ధుడైన జాలాది రాజారావు(ఆగస్టు 9, 1932 – అక్టోబరు 14, 2011) (Jaladi Raja Rao) ప్రముఖ తెలుగు రచయిత. ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించాడు.[1].
బాల్యం
1932, ఆగస్టు 9 న కృష్ణాజిల్లా, గుడివాడ మండలం దొండపాడులో జన్మించారు. నల్లగా ఉండటంతో వివక్షను ఎదుర్కొన్నానని చెప్పేవారు.
రచనా వ్యాసంగం
ఈయన పలు సాంఘిక నాటకాలు రచించాడు. 1000 దాకా కవితలు రాశారు. కనులు తెరిస్తే ఉయ్యాల … కనులు మూస్తే మొయ్యాల అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పిన కవి.
మరణం
2011, అక్టోబరు 14 న విశాఖపట్నం లోని తన స్వగృహంలో అస్వస్థతతో మరణించారు[2].
సినిమా పాటలు[మార్చు]
· పల్లెసీమ (1977) – సూరట్టుకు జారతాదీ సిటుక్కు సిటుక్కు వానచుక్కా
· దేవుడే గెలిచాడు – ఈ కాలం పది కాలాలు బతకాలనీ
· ప్రాణం ఖరీదు (1978) – యాతమేసి తోడినా ఏరు ఎండదు .. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.
· సీతామాలక్ష్మి (1978) -సీతాలు సింగారం … మాలచ్చి బంగారం – (ఉత్తమ పాట పురస్కారం)
· కోతల రాయుడు (1979)
· పునాదిరాళ్ళు (1979)
· మా ఊరి దేవత (1979)
· తూర్పు వెళ్ళే రైలు (1979) – సందపొద్దు అందాలున్నా చిన్నదీ
· అత్తగారి పెత్తనం (1981)
· బిల్లా రంగా (1982)
అల్లుడు గారు(1990)కొండ మీద
· మేజర్ చంద్రకాంత్ (1993) – పుణ్యభూమి నా దేశం నమో నమామి
జనం మది దోచిన జాలాది
తన పూర్వ గీత రచయితల బాణీలోనే సాగుతూ, తనదైన ముద్రను వేశారు ప్రముఖ పాటల రచయిత జాలాది రాజారావు. రాశి కన్నా వాసి మిన్న అన్న తీరున జాలాది పాటలు మురిపించాయి. వందలాది చిత్రాల్లో ఆయన పాట తన ఉనికిని చాటుకుంది. జానపదం పలికించగలరు, సాహిత్యం కురిపించగలరు, చైతన్య గీతాలనూ జ్వలింప చేయగలరు. ఏది చేసినా అందులో జాలాది బాణీ ప్రస్ఫుటంగా కనిపించేది. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆయన రాసిన కవితల వల్లే చిత్రసీమకు జాలాది సాహితీవిలువలు తెలిశాయి. ఆయన బాణీలో ఏదో మహత్తు ఉందని పసికట్టినవారు జాలాదికి అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. ‘పల్లెసీమ’ అనే చిత్రంలో “సూరట్టుకు జారుతాది చిటుక్కు చిటుక్కు…” అనే పాటతో జాలాది చిత్రప్రయాణం మొదలయింది. చివరి దాకా తనదైన బాణీ పలికిస్తూ జాలాది కలం సాగింది.
కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించిన జాలాది రాజారావు బాల్యం నుంచీ వివక్షకు గురయ్యారు. దాంతో ఆయన కవితల్లో సదా పేదవాడి ఆకలిమంట ప్రధానాంశంగా ఉండేది. ఇక ఆయన రాసిన నాటకాల్లోనూ జాలాది అదే తీరున సాగారు. కొంతకాలం ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేశారు. ఆ సమయంలో పలు ప్రాంతాలు తిరగడం వల్ల ఆ యా ప్రదేశాల్లోని యాసను పట్టేసి, తన పాటల్లోకి నెట్టేసి రంజింప చేశారు. దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాతలు బలరామరెడ్డి, పరంధామ రెడ్డి ప్రోత్సాహంతో మరో రచయిత మోదుకూరి జాన్సన్ సహకారంతో ‘పల్లెసీమ’కు పాట రాసే అవకాశం సంపాదించారు జాలాది. తొలి పాటలోనే అలతి అలతి పదాలతో జాలాది కలం చేసిన అల్లరి జనం మదిని గిల్లింది. విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడే గెలిచాడు’లోని “ఈ కాలం పది కాలాలు నిలవాలనీ…” అనే పాట, క్రాంతికుమార్ నిర్మించిన ‘ప్రాణం ఖరీదు’లో “యాతమేసి తోడినా ఏరు ఎండదు…” పాట జాలాది ప్రతిభను మరింతగావెలిగించాయి. పలువురు దర్శకులు ఆయన బాణీని మెచ్చి అవకాశాలు కల్పించారు.
ఇక మోహన్ బాబు తాను నిర్మించిన అనేక చిత్రాలలో జాలాది పాటకు ప్రత్యేకంగా పట్టాభిషేకం చేశారు. యన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన ‘మేజర్ చంద్రకాంత్’లో జాలాది కలం పలికించిన “పుణ్యభూమి నాదేశం… నమోనమామీ…” పాట ఇప్పటికీ తెలుగునేలపై మారుమోగుతూనే ఉంది. మరో విశేషమేమంటే, యన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’లో మరపురాని పాట రాసిన జాలాది, తరువాత ఆయన నటవారసుడు బాలకృష్ణ నటించిన ‘సుల్తాన్’లోనూ “ఆకాశం గుండెల్లో…” అంటూ సాగే పాటలోనూ దేశభక్తిని నింపారు. ఇక నందమూరి మూడోతరం హీరో జూనియర్ యన్టీఆర్ ‘సుబ్బు’లోనూ “ఐ లవ్ మై ఇండియా…” అంటూ దేశభక్తినే ఒలికించారు. ఇలా నందమూరి నటవంశంలో మూడు తరాల హీరోలకు దేశభక్తి గీతాలు రాసే అవకాశం జాలాదికి లభించడం విశేషం.
జాలాది పాటకు అనేక అవార్డులూ రివార్డులూ లభించి, తమ ఉనికిని మరింతగా చాటుకున్నాయి. చివరిదాకా జనాన్ని మెప్పించేలా పాటలు రాస్తూనే జాలాది పయనించారు. ప్రతి జాతీయ పర్వదినాన జాలాది పాట వినిపిస్తూ తెలుగువారి మదిలో దేశభక్తిని రగులుకొల్పుతూనే ఉంటుంది.
జానపద జాబిలి జాలాది
· జాలాది అంటే జానపదమే గుర్తుకు వస్తుంది. ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు… పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు’… ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’.. ఇలా ఎన్నో… ఎన్నెన్నో జానపదాలు ఆయన కలం నుంచి జాలువారాయి… జానపదమే కాకుండా పుణ్యభూమి నాదేశం నమోనమామీ… ధన్యభూమి నాదేశం సదా స్మరామి… అంటూ దేశభక్తిని చూపి ధన్యజీవి అయ్యారు మన జాలాది. ఆయనది ఆదర్శ జీవితం. తండ్రితరం నుంచి కులాంతర వివాహాలు చేసుకున్న సంప్రదాయం వారిది. ఇమ్మానియల్ (జాలాది నారాయణ చౌదరి), అమతమ్మ దంపతులకు ఐదో సంతానంగా జాలాది రాజారావు జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వివక్షకు గురై ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అందుకే ఆయన కలం నుంచి జాషువా శైలి తొంగిచూస్తుంటుంది. జాలాది తన పాటల ద్వారా సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడారు. ఆగస్టు 9న ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
· బాల్యం, విద్యాభ్యాసం
· కృష్ణా జిల్లా గుడివాడ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం చేశారు. ఇక్కడ ఆయనకు కులం అడ్డుగోడైంది, పాఠశాలలోకి రానివ్వకుండా బయట కూర్చొని ఇసుకలో అక్షరాలు దిద్దమనేవారు. ఇలా ఇబ్బందులతోనే ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. అప్పటికే ఆయన చిన్నచిన్న కవితలు రాయడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయులు పండగలు, విశిష్టమైన రోజుల్లో మంచి పాట రాయరా రాజా అని అడిగేవారట.
· డ్రాయింగ్ మాస్టారుగా..
· విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం రాయివలసలో డ్రాయింగ్ మాస్టారుగా ఉద్యోగంలో చేరారు. అందరిచే రాయివలస మాస్టారుగా మన్ననలు పొందారు. ఇలా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఉద్యోగం చేస్తూనే వయోజన విద్య, నాటకాలు, నాటికలు రచనలు నిర్వహణ చేసేవారు. 1968లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
· మరఫురాని పాటలు
· సినీరంగంలో ప్రవేశించిన ఆయన మరఫురాని పాటలను అందించారు. ప్రాణం ఖరీదు సినిమాలో ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు… పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు’ పాటలో మనిషి జీవితంలో తారసపడే జీవిత సత్యాలు దొరుకుతాయి. పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా… పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా… బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో… గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో… అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే… సీము నెత్తురు పారే తూము ఒక్కటే… కూతనేర్చి నోల్ల కులం కోకిలంటరా… ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా… ఈ పాటలు ఈ నాటికీ జనం హదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’ పాట బతుకు చిత్రాన్ని చూపిస్తోంది. పుణ్యభూమి నాదేశం నమో నమామి.. ధన్యభూమి నాదేశం సదా స్మరామి పాట జాతీయ దినాల్లో ఏవేదికమీదైనా వినిపిస్తోంది.
· నేను రచయితని…
· నేను కవిని కాను రచయితని మాత్రమేనని చాలా వేదికల్లో జాలాది స్పష్టం చేశారు. వాస్తవాలకు దూరంగా ఊహాజనితంగా కవి రచనలు ఉంటాయి. రచయిత రాసినవి వాస్తవాలకు జీవితాలకు దగ్గరగా ఉంటాయన్నది ఆయన వాదన. ఈయన వాదంలో వాస్తవమున్నది. ఇందుకు ఆయన పాటలే ఉదాహరణగా నిలుస్తాయి. ఈయన సుమారు 280 సినిమాలకు 1200 పాటలు పాటలు రాశారు. ఎన్టీఆర్, మోహన్‌బాబు సినిమాలకు ఎక్కువ పనిచేశారు. చాలా పాటలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఉత్తమ పాటల రచయితగా ప్రశంసలు పొందారు.
· నచ్చిన కవులు
· శ్రీశ్రీ రచనలంటే చాలా ఇష్టమంటారు ఆయన. కొసరాజువంటి కవుల్ని ఆయన ఆరాదించేవారు. అయితే వీరి ప్రభావం లేకుండా తనదైన శైలిలో రచనలు చేశారు.
· రచనలు
· జాలాది పలు కవితలు, నాటికలు, బుర్రకథలు రాశారు. అమర జీవి, తండ్రి సమాధి, కారుమేఘాలు, గాజుపలకలు, విశ్వమోహిని, వంటి పలు రచనలు చేశారు.
· తుది మజిలి
· జీవీఎంసీ 42వ వార్డు శాంతినగర్‌లో ఉన్న కుమారుడు శ్రీనివాసరావు వద్ద చివరి మజిలీ గడిచింది. 2011 అక్టోబర్ 14న తుదిశ్వాస విడిచారు. అప్పటినుంచి జాలాది చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాకారులను గౌరవిస్తూ కళారంగానికి సేవచేస్తున్నారు.
· నేడు జయంత్యుత్సవాలు
· కళాభారతి ఆడిటోరియంలో జాలాది జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినీ నటుడు శరత్‌బాబు, పాటల రచయిత చంద్రబోస్‌కు ఈ సందర్భంగా సత్కరించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జాలాది రాజారావు కుమార్తె జాలాది విజయ ఒక ప్రకటనలో తెలిపారు.
·
· జాలాది ట్రస్ట్ తెలియ ఏసిన సమాచారం
మా నాన్న జాలాది… -డా।।జాలాది విజయ
సనాతన సాంప్రదాయంలో బుడి బుడి నడకలు నడచి, తనకంటూ ఓ మేలిమి ముద్రను రూపుదిద్దుకొని, ఆధునికతతో జానపద శైలిని వంటబట్టించుకొని సత్యసారాన్ని జీవిత సారాన్ని తన కలం నిండా నింపుకొని పాటపాటకూ ప్రత్యేకతలను దిద్దుతూ, అమ్మ కొంగును కంటి కొలిక్కివద్దకు పంపించి రెండే రెండు పదాల అర్థాలతో ‘కళ్ళు తెరిస్తే ఉయ్యాల…కళ్ళు మూస్తే మొయ్యాలం’టూ జగమెరిగిన నిజానిజాలను రంగరించి ఈ సమాజాన్ని మేల్కొల్పిన జానపదబ్రహ్మ ‘జాలాది’. మా నాన్నగారి ఆసలు పేరు జాలాది రాజారావు. జాలాది కలం పేరుగా సినీ చరిత్రలో ప్రసిద్ధి కెక్కినారు. మా నాన్నకు తెలిసిన ప్రేమ రెండు రకాలు. ఒకటి మాతృప్రేమ. రెండు దేశభక్తి. అమ్మను, మమ్మల్ని మాతృప్రేమతో చూసుకునేవారు. ఇక రెండోది తన పాటలనిండా దేశభక్తిని, సామాన్యుని యధార్థ సంఘటనల గాథలను ఇనుమడింపజేసేవారు. నాటి స్వాతంత్రదిన కాలం నుండి గుర్తు చేసుకుంటే మానాన్న బ్రిటీషు తెల్లదొరల గుట్టులను రట్టు చేసే చిన్న చీటీలను మన నాయకులకు రహస్యంగా అందించేవారు. ఒకసారి పట్టుబడి జైలుశిక్షను కూడా అనుభవించారు. ఆయనలో మాకు ఒక స్వతంత్ర సమరయోధుడు కనిపించేవారు. ఆ జ్ఞాపకాలను మరువకే మా నాన్నగారు మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో ‘పుణ్యభూమి నాదేశం నమోనమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి’ అనే ఎనిమిది నిమిషాల పాటను ఈ జాతికి అంకితం చేశారు. జాతీయ పురస్కార హోదా కలిగిన ఆ పాట…పురస్కారానికి నోచుకోకపోవటం మా కుటుంబానికి తీరనిలోటుగా మిగిలిపోయింది- ఎందరో రాజకీయ నాయకుల కుతంత్రాల వల్ల. ఆ పాట జనాల నోళ్ళలో ఘనకీర్తిని పొందింది గాని మా నాన్న మనసును గాయపర్చింది. తెల్లోడి తెలివితేటలకు కళ్ళెం బిగించిన నల్లోడి మేధస్సును ఉన్నత శిఖరాలకు ఆవిష్కరించిన ఘనత జాలాదికే దక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అని పిలిచే మహానాయకుని చేత తొలి చిందులు తొక్కించిన తొలిపాట జాలాదిది కావడం (యాతమేసి తోడినా ఏరు ఎండదు..పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు-పునాదిరాళ్ళు) మరో విశేషం.
కొందరు సినీ ప్రముఖులకు జాలాది పాట కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. డైలాగ్‌కింగ్ మోహన్‌బాబుకు కుంతీపుత్రుడులో-లేలే బాబా నిద్దుర లేవయ్యా, రౌడీగారి పెళ్ళాంలో కుంతికుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం, అసెంబ్లీ రౌడీలో కొండమీద చుక్కపోతూ, దాని వణుకు చూస్తే ఉలికిపాటు, బ్రహ్మలో చిక్కు చిక్కు బండి, దాని దూకుడెక్కువండి అనే పాటలను అందించారు.
మురళీమోహన్ గారికి వారాలబ్బాయి సినిమాలో 6 పాటలు అందించారు. కాకిచేత జీవిత సత్యాన్ని ఒంటరితనంలో వున్న ఏకాకితనాన్ని గుర్తుచేస్తూ సమాజ బంధాన్ని కలిపారు. ఎర్రమందారంలో ‘యాలో యాలో ఉయ్యాల’ అంటూ జన్మబంధాన్ని తెలియజేశారు. జీవుడు తొమ్మిది మార్గాల ద్వారా బయటకు వెళతాడని మానవజన్మ రహస్యం మనిషికున్న నవరంధ్రాలేనని ఆ జీవి మరణానంతరం ఏ రూపంలో ఏ గుమ్మంలో నుండి బయటకి వెళుతుందో ఎవరూ కనిపెట్టలేరనే జన్మరహస్యాన్ని బట్టబయలు జేసిన మహాజ్ఞాని జాలాది. మనిషేమో చిన్నది, గుమ్మాలు తొమ్మిది, ఏ దారి పోయేవురా జీవా ఏ దారి పోయేవురా’ అనే పాటలోని విశ్లేషణతో మానాన్న సైకాలజీ మాకు జీవితాన్ని నేర్పింది. మూడు తరాల వారసత్వ సినీ హీరోలకు పాటలను అందించిన ఘనత జాలాదికే దక్కుతుంది. సినిమా దిగ్గజం నందమూరి తారకరామారావు గారికి ‘పుణ్యభూమి నా దేశం’ (మేజర్ చంద్రకాంత్), రెండవతరమైన మేటి హీరోలు కృష్ణ, కృష్ణంరాజులకు, బాలకృష్ణ (సుల్తాన్‌లో) ‘జనగణమన జనయిత్రి నా భరతభూమి’ పాటలను అందించారు. మూడవ తరమైన జూనియర్ ఎన్టీఆర్‌కి ‘ఐ లవ్మై ఇండియా’ (సుబ్బు) అనే పాటను అందించారు. ఈ మూడు పాటలు కూడా నందమూరి వంశంలో దేనిని తెలియజేస్తున్నాయో మీకు అర్థమయ్యే వుంటుంది. మొదట స్వాతంత్య్రం సంపాదించుకోవాలి. తరువాత స్వతంత్రం సంపాదించుకున్న దేశాన్ని రోజూ దినచర్యగా పూజించాలి. ఆ తరువాత నా దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఆ నాయకులతో ఈ సమాజానికి గొప్ప పిలుపునిచ్చిన దేశాభిమాని, మాతృభూమిపుత్ర, దేశ శ్రేయోభిలాషిగా జాలాదిని కీర్తించడంలో ఏమాత్రం సందేహించనక్కర లేదు. మా నాన్నగారు డ్రాయింగ్ మాస్టారుగా ఎందరినో తీర్చిదిద్దారు. ఇంకా తన బాధ్యత సరిపోలేదని ఈ దేశానికంతటికీ తన సందేశాన్ని, తన బాధను, తన వ్యధను, తన సత్యశోధనను ప్రతిఒక్కరికి అందజేయాలని సినీరంగ ప్రవేశం చేసి భరతజాతి గర్వించదగ్గ పాటలను సినీ కళామతల్లికి అందించారు. అవార్డుల రివార్డుల ఘన సత్కారాలతో కీర్తిని పొందినా ఏదో తెలియని లోటు తనను వెంటాడుతున్నదని కలాన్ని కొద్దికాలం పాటు ఆపివేశారు. మరలా మీరు పాటలు రాయాలి అని మోహన్‌బాబు గారు వచ్చి చెప్పినా మా నాన్నగారు రాయనన్నారు. ఎందుకని ప్రశ్నించిన మోహన్‌బాబు గారికి ఎదురు సమాధానం చెప్పకుండా…సంస్కృతి వికృతించింది. జాగృతి అరవిరుస్తుందనుకున్నా గాని జాతికున్న సంప్రదాయం ఆరవ ఆంగ్లభాషతో అరకొర కొనసాగుతుంటే నా కలం తెలుగుతల్లి మెడలో వేసే పూలమాల… దీనిని అజాతి పాలు చేయలేనని అర్థం పర్థం లేని పాటలు నేను రాయలేనని చెప్పి, పంపించారు. అప్పుడు నాకనిపించింది. సొమ్ముకోసం సోకు గానీ, నీతి కాదని. సోకేసుకుని సొమ్ము చేసుకునేవాళ్ళు కుప్పల్లా పెరిగిపోతుంటే తన దేశ ధనం, అభిమతం దెబ్బతింటుందని కలాన్ని పక్కనపెట్టిన కల్మషం లేని భారతీయుడ్ని తొలిసారిగా చూసినట్లనిపించింది. తదుపరి వందేమాతరం శ్రీనివాస్ గారువచ్చి చిన్నపిల్లాడి మనస్తత్వం కలగలిపిన ఓ తపస్వి..చిన్న సందేశాన్ని ‘కిట్టు’తో ఈ సమాజానికి పరిచయం చేయాలనుకుంటున్నాం. మీ పాట నా నోట..ఈ మాట పదికాలాలు బ్రతికుండాలని బ్రతిమలాడితే కలాన్ని మరలా కదిలించారు మానాన్న. రచయితే కాదు కవి కూడా. కాకులమ్మ, విశ్వమోహిని అనే కావ్యాలను కూడా రాసిన కవి మా నాన్న-జాలాది.
జాలాది గురించి ఎంత చెప్పినా తక్కువే..నాన్న కూతురినై పుట్టినందుకు నాకు గర్వంగా వుంది.
ఎడారిలో వెన్నెల తీరుతెన్నులు
ఇసుక తిన్నెలపై పరుస్తుంది
సినీలాకాశంలో వేల తారలు
వెలుగు దివ్వెలను చిమ్మినా
జాలాది జాబిల్లి ముందు చిన్నబోవునే తప్ప మిన్న అవ్వవు.
జానపదుల మాంత్రికుడు –జాలాది
ఆయన తండ్రి జాలాది ఇమ్మానియేల్ కృష్ణా జిల్లా బోర్డుసభ్యునిగా ఉండేవారు. స్వాతంత్రంలో పాల్గొని జైలుకు వెళ్ళేవారు. ఆయన అడుగుజాడల్లో రాజారావు నడిచారు.13 ఏళ్ళలోనే మారువేషాలు వేసి అజ్ఞాతంలో ఉన్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తదితర జాతీయ నాయకులకు కొరియర్‌గా పనిచేసేవారు.
పుట్టినప్పుడే ఆయన తల్లి అనారోగ్యంపాలు కావడంతో తోబుట్టువుల హేళన చేసేవారు. అదే ఆయనకు జీవితానికి పాఠం నేర్పిందని ఓసారి వెల్లడించారు.
తొలుత ఆయన కృష్ణాజిల్లాలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేశారు. కానీ అక్కడ రాజకీయాలు తట్టుకోలేక 1968లో ఉద్యోగం మానేశారు. స్నేహితుల ప్రోద్బలంతో మదరాసు వచ్చి జానపద సాహిత్యాన్ని పరీక్షించుకున్నారు. మొట్టమొదటిసారిగా ‘పల్లెసీమ’లో పాట రాశారు. జానపదులు పలువురిని ఆకర్షించింది. ఆయన మూడవ కుమార్తె జాలాది పాటలపై పిహెచ్డి కూడా చేశారు.
తూర్పు వెళ్ళే రైలు, ప్రాణం ఖరీదు, కోతలరాయుడు, మేజర్ చంద్రకాంత్, పెదబాబు వంటి చిత్రాలకు ఆయన పాటలను ‘యాతమేసి తోడినా ఏరు ఎండదు..’ ‘రెండు చిటికల వేళ్లు కలిస్తే కళ్యాణం.. రెండు కాలి బొటన వేళ్లు కలిస్తే నిర్యాణం..’ ‘పుణ్యభూమి నాదేశం నమోనమామి..’ అంటూ ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు.
గ్రామ మూలాల్లో మరుగనపడిన జానపదులను వెలికి తెచ్చిన ఘనుడు జాలాది. ఇంటిపేరుతో సినీ పరిశ్రమలో స్థిరపడిన ఆయన ఎంతోమంది హీరోలకు పాటలు రాశారు. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మేజర్ చంద్రకాంత్లోనే ‘సుఖీభవ.. సుమంగళి..’ పాట కూడా ఎంతో ఆకట్టుకుంది.
సూరట్టుకు జారుతాది సితుక్కు సితుక్కు వానసుక్క.. అంటూ జానపదాన్ని జాలువార్చిన.. సినిమాల్లో తొలినాళ్లలో జానపద జాలాది అనే పిలిచేవారు.
ప్రముఖుల సంతాపం
1932లో జన్మించిన జాలాది, పదమూడేళ్ళలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారనీ, ఆ భావాలు ఆయన జీవితాన్నిమార్చాయని సినీ గీతరచయిత సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది.జీవిత సత్యం బోధించిన పాటల సూరీడు జాలాది .
కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన ప్రపంచ రచయితల రెండవ సమావేశం లో జాలాది అద్భుత ప్రసంగం తన పాటల గానం తో ఉర్రూత లూగించాడు .ఆయనే ఆ సమావేశాలకు హైలైట్ గా నిలిచాడు .నేను చాలా ముగ్దుడనయ్యాను .అంతకుముందు గుడివాడలో ఒక నటుని జయంతి సమా వేశం లో జాలాది ,కైకాల సత్యనారాయణ గార్లు ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్పుడు చూశాను జాలాది తో నేనూ ,ఉయ్యూరు సాహితీ మండలి ప్రముఖులు శ్రీ గూడపాటి కోటేశ్వరరావు పరిచయం చేసుకొని మాట్లాడాం .ఆయన్ను మా సాహితీ మండలి కి ఆహ్వానించి ఫోన్ నంబర్ తీసుకొన్నాను .ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడాను .ఆయన చనిపోయాక బెజవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జాలాది విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసి ,శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారితో ఆవిష్కరణ చేయించిన సభకు హాజరయ్యాను .
పల్లె సీమ సినిమాలో జాలాది రాసిన ‘’సూరట్టుకు జారతాది ‘’పాట నాకు మహా ఇష్టం .ప్రాణం ఖరీదులో ‘యాతమేసి తోదినాఎరు ఎండదు ‘’కూడా బాగా కదిలించేపాట గా ఇష్టం