మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82-
82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2
సూరిబాబుది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ‘ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ‘ చిత్రంలో ఆయన పాడిన పాటను తెలుగు భాషోద్యమానికి కృషి చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా గారు తమ వ్యాఖ్యలో గుర్తుచేశారు……
నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ నటించిన “వేంకటేశ్వర మహత్యం” సినిమా చూశాను.అందులో నారదుడిగా నటించిన పి.సూరిబాబు వెంకటేశ్వరుని విగ్రహం ముందు నిలబడి”కళ్ళుతెరవరా నరుడా” అనే పాట అద్భుతంగా పాడుతాడు.ఆ పాట దొరుకుతుందేమో అని చాలా చోట్ల ప్రయత్నించాను.సినిమాలో పాటలు ఎక్కువయ్యాయని ఈ పాటను తీసేశారని కొందరు చెప్పారు.విఏకే రంగారావు గారి దగ్గరకూడా ఈ పాట లేదు.ఇలాంటి పాటలను ఎక్కడో ఒకచోట భద్రపరచాలిగానీ పూర్తిగా తీసెయ్యటం వలన అమూల్యమైన తెలుగు సినీ సాహిత్యం,సంగీతం ఎవరికీ దొరకకుండా పోతోందని నా బాధ.
కంచులా మ్రోగే కంఠస్వరంతో, కఠినంగా అనిపించే పద్యాలను పామరులకు సైతం అర్థమయ్యేలాగా సుస్పష్టమైన ఉచ్చారణతో పాడి అటు రంగస్థలాన్ని, ఇటు తెలుగు చిత్ర రంగాన్ని సుసంపన్నం చేసిన నటుడు పువ్వుల సూరిబాబు.
పువ్వు పుట్టగానే పరిమళించిందట. అలా సూరిబాబు ఆరేళ్ళ వయసులోనే బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన రంగారావు పాత్ర పోషించాడు. దాంతో నాటకాల మీద మోజు బయిల్దేరింది. ఆది ఆయనతో బాటు పెరిగి పెద్దదై చదువును వదిలిపెట్టేలా చేసింది. అంతేకాదు… స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా బొమ్ములూరు గ్రామం వదలి పోయేలా చేసింది. అక్కడనుంచి పారిపోయిన సూరిబాబు ఎక్కడో వున్న గద్వాల్ లో తేలాడు. అక్కడ వున్న గద్వాల్ సంస్థానం వారి నాటక సమాజంలో జేరాడు. రామదాసు నాటకంలో రాముడు, కృష్ణలీలలులో బాలకృష్ణుడు లాంటి వేషాలు వేసాడు. కొంతకాలానికి అక్కడనుంచి గుంటూరు వచ్చి దంటు వెంకట కృష్ణయ్య గారి సమాజంలో జేరాడు. అప్పట్లో ప్రముఖ నటుడు కొప్పరపు సుబ్బారావు గారి శిష్యరికం చేసి సుశిక్షుతుడైన నటుడిగా తయారయ్యారు సూరిబాబు.
అనంతరం గుడివాడలో స్వంతంగా నాటక సమాజాన్ని నెలకొల్పి అత్యున్నత సాంకేతిక విలువలతో నాటకాలు ప్రదర్శించారు. అయితే నష్టాలు రావడంతో దాన్ని మూసేసి 1936 లో తెనాలి జేరుకున్నారు. అక్కడ కూడా అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆ సమయంలోనే ద్రౌపదీ వస్త్రాపహరణం తో చిత్రసీమలో ప్రవేశించారు. మాలపిల్ల చిత్రంలో ఆయన పాడిన ‘కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ….’ పాట వాడ వాడలా మార్మోగింది. చాలా చిత్రాల్లో నటించడమే కాక తన పాటలు, పద్యాలు తానే పాడుకున్నారు. అంతేకాదు పాటలను, ముఖ్యంగా పద్యాలను స్వరపరచడానికి సంగీత దర్శకులు సూరిబాబు గారి సహకారం తీసుకునేవారు. అలా మహాకవి కాళిదాసు చిత్రంలోని మాణిక్య వీణాం……. శ్లోకం స్వరకల్పనలో ఈయన హస్తం కూడా వుంది.
సూరిబాబు గారు తన భార్య రాజేశ్వరి గారి పేరు మీద రాజరాజేశ్వరి నాట్య మండలిని స్థాపించి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ముఖ్యంగా కొప్పరపు సుబ్బారావు గారు రచించిన ‘ తారాశశాంకం ‘ నాటకం వారికి ఎంతో పేరు తెచ్చింది. ఆయన రంగస్థలం మీద రామదాసు, రాముడు, చినరంగారావు, ధర్మారాయుడు, రంగారావు, గజేంద్రుడు, తక్షకుడు, కశ్యపుడు, నారదుడు, కంసుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విప్రనారాయణుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, రారాజు, సుబుద్ధి లాంటి ఎన్నో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు.
కళ్ళు తెరువరా నరుడా
కళ్ళు తెరువరా నరుడా
నీ ఖర్మ తెలియరా [[కళ్ళు]]
కలిమిలేములకు కష్టసుఖాలకు
కారణమొకటేరా నీ ఖర్మే మూలమురా[[కళ్ళు]]
వేపనువిత్తి ద్రాక్షకోసమై
వేడుక పడుట వెర్రికదా
కాలికి రాయి తగులుటకన్న
రాయికి కాలే తగులునురా [[కళ్ళు]]
కమలనాభుని పదకమలములే
కలుష జలధికీ సేతువురా
కలిమాయలలో కలతజెందినా
ధరణికి అదియే తారకమగురా [[కళ్ళు]]
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-22-ఉయ్యూరు
.