ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3
వసంతోత్సవ కావ్యం –ఇది కధనాత్మకకావ్యం .వసంత వర్ణన యదార్ధంగా ప్రతీకాత్మకం గా చేశాడు .టెన్నిసన్ ‘’ఇనోక్ ఆర్డెన్’’స్పూర్తితో రాసినకావ్యం ,అందులో దుఖం ఉంటె ఇందులో ఆహ్లాద ఉల్లాసాలున్నాయి .’’కొత్త ఆశల్ని చిగురిమ్పజేయటం నవజీవనం ప్రసారం చేయటం ,ఉన్నత ఆదర్శాలాతో మానవుల్ని ప్రభావితం చేయటం కవి లక్ష్యం’’అంటాడు నానాలాల్ .షెల్లీ వసంతరుతువును ‘’స్వాప్నిక వసుధా జగతికిసుషిర వాద్య ప్రబోధం ‘’అన్నాడు .పచ్చని మైదానాలు పర్వతాలు జీవకాన్తులతో రంగులతో నింపుతుంది అన్నాడు .నానాలాల్ ‘’వసంతం పునరుజ్జీవన ప్రతీక ,హేమంతంలో జడమైన ప్రకృతికి త్వరగా నూతనోత్సాహాన్నిస్తుంది వసంతం ‘’అన్నాడు .డిగ్రీ చదివేటప్పుడే మనకవి ‘’విశ్వ వ్యవస్థలో ప్రేమ వివాహ ప్రయోజనం ‘’వ్యాసం రాశాడు .ఆయనది సంకుచిత ప్రయోజనం కాదు విశ్వజనీనమైనది .
దోలన్ శైలి
శతాబ్దాల క్రితం చందోసంకెలలు వేసుకోన్నాం ..ఇవి స్వేచ్చా భావ ప్రకటనకు అడ్డు వస్తున్నాయి .కనుక బంధ విముక్తి చేయాలనుకొన్నాడు నానాలాల్ .దీనికి అనుగుణంగా లయాత్మక ‘’దోలన్ శైలి ‘’ఎన్నుకొన్నాడు .’’ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రకవి 22 శతాబ్దాల పాతకాలపు పాలనాధికారం పై చేసినతిరుగుబాటు ‘’గా చెప్పుకొన్నాడు .పూర్తిగా ఛందస్సు నుంచి కవిత్వం విడివడటం నానాలాల్ తోనే ప్రారంభమైంది .సంగీత లయను నియమ బద్ధంగా అనుసరించాడు .నర్మద్ కవి అడుగుజాడలలో ‘’గ్రాండ్ మీటర్ ‘’ను సృష్టించటానికి ఎంతో శ్రమపడ్డాడు .ఇది సాధించి కొలంబస్ పొందిన ఆనందాన్ని పొందాను అన్నాడు .పద్యాన్ని కవిత్వాన్ని అవినా భావ సంబంధం ఉన్నవి గా చూడలేదు .పద్యనియమాలను వచన నియమాలనూ చేది౦చేశాడు .
గుజరాత్, భారత దేశాలపై కవితలు
1903,08,35 సంవత్సరాలలో నానాలాల్ తనగీతాలను ‘’కేత లంక్ కవ్యో’’అంటే ‘’కొన్ని కవితలు’’పెరుతో మూడు సంపుటులుగా ముద్రించాడు .ఇవి ఆతర్వాత చాలాసార్లు పునర్ముద్రణ పొందాయి .కవిగా ఎంతటి పేరు పొందాడో దీన్ని బట్టి తెలుస్తుంది ..పాటల సంపుటాలు రాసలు భక్తి గీతాలు ,వ్యక్తి గీతాలకు లెక్కే లేదు .’’చిత్ర దర్శన్ ‘’అనే చిత్రగీతాలూ రాశాడు .కవితారచనలో ఒక అ౦తర్జాతీయ సంప్రదాయం ,ఆదర్శం అవలంబించినా ఆయన దృష్టి గుజరాత్ పైన కూడా వ్యాపించింది .సౌరాష్ట్ర ప్రకృతి సౌందర్యం జీవితం సంస్కృతీ లపై అసంఖ్యాక కవితలు రాశాడు .ఇలా రాసిన వాళ్ళు అంతకు ముందు పెద్దగా లేరనే చెప్పాలి .వీటన్నిటిలో ప్రేమ భక్తీ దేశభక్తి శౌర్యం ఆనందం ఉల్లాసం విశ్వజనీనమైనవే .గుజరాత్ గురించి కీర్తన రూపం లో రాశాడు .గుజరాత్ సుందర ఉజ్వల రూప పట చిత్రణ చేశాడు .-‘’భౌతిక దృష్టికి సులభమే –భారత దేశపు రాయీ రప్పల పొరలూ కశ్మలాలు దర్శించట –నగల నాణ్యత తెలిసిన బేహారి మాత్రమె విలువకట్టటం లాంటిది –ముత్యపు చిప్పను తొలుచుకొని పోగల చూపుమాత్రమే దాని ఉనికిని తెలియజేయగలదు –సూర్యుడిలోనూ మచ్చలున్నాయి –అయినా ఉజ్వల నభో మణి ని చీకటి కమ్మి వేయగలదా ?‘’అని ప్రశ్నించాడు కవిత్వంలో .-‘’ప్రాచీన గ్రీస్ ,రోమ్,ఈజిప్ట్ ,బాబిలోనుల పెద్దక్కగారు భారత దేశం –యుగయుగాలుగా కొల్లగొట్టినా,బాధించినా సుసంపన్నం –ప్రతియుగంలోనూ బాధించి వేధించారు –అయినాచిరంజీవి –సర్వలోక నాధుడే సృష్టించాడు –ప్రపంచ ఆధ్యాత్మికతను పెంపొందిం చేందుకు –సత్యమొక్కటే జయిస్తుంది –అని చాటటానికి భారత దేశం ఇంకా సజీవంగా ఉంది ‘’అని ఎలుగెత్తి చాటాడు నానాలాల్ కవి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-22-ఉయ్యూరు