మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83
83-తెలుగు సినీ తొలి నృత్య దర్శకుడు –వెంపటి సత్యం
కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించిన వెంపటి సత్యం అనే పెద్ద సత్యం ను ఆయన కుటుంబం వారు నాట్యకళ అన్నం పెట్టదని ,ఆయన్ను దూరంగా ఉంచి మామూలు విద్య చెప్పించారు .కానీ సత్యం దాన్ని కొనసాగించలేదు .15వ ఏటనే నృత్యం నేర్చుకోవట౦ మొదలు పెట్టారు .ఏకాగ్రతతో నేర్చి ప్రతిభ కనబరచారు .వేదాంతం రాఘవయ్య ,వేదాంతం జగనన్నాద శర్మ వంటి వారితోకలిసి కూచిపూడి యక్షగానాలలో పాల్గొన్నారు .కానీ ఆ విద్య కడుపు ని౦పలేక పోయింది .
సత్యంగారు బందరు వెళ్లి అడివి బాపిరాజు గారి వద్ద చిత్రలేఖనం లో తర్ఫీదు పొందారు .తిండికి లేకుండా వారాలకు వారాలు ఉపవాసలున్నారు .వీరిలోని నాట్య ప్రతిభ గుర్తించిన బాపిరాజు గారు ‘’నువ్వు చిత్రకళ లో కంటే నాట్య కళ లోనే బాగా రాణిస్తావు బాబూ ‘’అని చెప్పి బలవంతంగా పంపించేశారు .
1940లో బాపిరాజు గారు ‘’మీరాబాయి ‘’చిత్రానికి కళా దర్శకత్వం వహించారు .శిష్యుడు వెంపటి పెద్ద సత్యం గారికిఆసినిమాలో నృత్యం చేసే అవకాశం కల్పించారు బాపిరాజు .కానీ తర్వాత అవకాశాలు రాక ఎదురుచూపులు తప్పలేదు .నృత్య నాటికలలో పాల్గొంటూ వచ్చిన దానితో జీవించారు .ఇవి బాగా క్లిక్ అయి 1941లో సినీ నృత్య దర్శకత్వానికి అవకాశం లభించింది .భక్తిమాల అనే సినిమాలో మొదటి సారిగా సత్యంగారు నృత్య దర్శకులుగా స్థానం పొంది రికార్డ్ సృష్టించారు .అంతకు పూర్వం నాట్యం చేయాల్సిన పాత్రధారులు ఎవరికీ వారే స్వంతంగా నాట్యం తయారు చేసుకొనే వారు .డైరెక్టర్ ఉండే వాడు కాదు .సత్యంగారితోనే డైరెక్టర్ హోదా నాట్యానికి కలిగింది అదీ ఆయన గొప్పతనం .ఇలా చిన్న స్థాయిలో డాన్స్ డైరెక్టర్ గా ప్రారంభమైన సత్యం గారి జీవితంఎంతో ఎత్తుకు ఎదిగింది .
సత్యం గారుఎందరో నటులకు,నృత్య దర్శకులకు మార్గదర్శి అయ్యారు .సన్ని వేశాలలో తనదైన భావాలను డైరక్టర్ కు చెప్పి ఒప్పించి చొప్పించే వారు .నిరంతర కృషితో 300కు పైగా సినిమాలకు నృత్య దర్శకులయ్యారు సత్యం గారు .భారత నాట్యం తోపాటు ,కధక్,ఒడిస్సీ నృత్యాలు కూడా చేయించారు .హిందీ ,తమిళ ,కన్నడ సినిమాలకూ డాన్స్ డైక్క్షన్ చేశారు .స్వయం కృషితో చిత్ర రంగం లోఎదిగిన మహా నృత్యదర్శకులు సత్యంగారు .చిరస్థాయిగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు .
సత్య నృత్యదర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో1957- సువర్ణ సుందరి ,1963 నర్తన శాల,1966 శ్రీ కృష్ణ పాండవీయం వంటివి ఎన్నో ఉన్నాయి .ఎల్ విజలక్ష్మి రాజసులోచన ,గీతాంజలి మొదలైన వారిని తెలుగు చిత్రాలలో ప్రవేశ పెట్టిన ఘనత సత్యం గారిదే .ఎన్టి రామారావు ప్రతిభకు గీటురాయి అయిన నర్తన శాలలో బృహన్నలపాత్రకు ఆయన కల్పించిన నృత్యం చిరస్మరణీయం .రామారావు గారికి ఎన్నో రాత్రులు ,పగళ్ళు నృత్యం నేర్పించి నటి౦పజేసి కీర్తి ప్రతిష్టలు సాధించిపెట్టారు సత్యం .కేవలం శాస్త్రీయ నృత్యాలు సినిమాలలో పెద్దగా రాణిం చవనీ , మారుతున్న అభిరుచులు కాలాన్ని బట్టి నృత్యాలలోనూ మార్పులు రావాలని సత్యం కోరేవారు .అని ప్రముఖ చిత్రకారుడు కధకుడు మా. గోఖలే అంటే మాధవపెద్ది గోఖలే చెప్పారు .సత్యంగారు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం లో శివుడు గా నటించారు .
తన బృహన్నల పాత్రసృష్టికి అయిదుగురు బ్రహ్మలున్నారు అని నందమూరి అభిప్రాయం
సత్యం గారు నృత్యదర్శకత్వం చేసిన కొన్ని ముఖ్య చిత్రాలు
· Chhoti Bahu (1971)
· భక్త ప్రహ్లాద (1967)
· నర్తనశాల (1963)
· శ్రీ సీతారామ కళ్యాణం (1961)
· శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960)
· జయభేరి (1959)
· సువర్ణ సుందరి (1957)
· భాగ్యరేఖ (1957)
· పాండురంగ మహత్యం (1957)
· చరణదాసి (1956)
ఇంతటి గొప్ప నృత్య దర్శకుడి పై గూగుల్ లో ఒక్క వాక్యమే కనిపించటం ఆశ్చర్యం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-22-ఉయ్యూరు