ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -4
పై గీతాన్ని 1909లో నానాలాల్ రాశాడు .అందులో చివరి మాట ‘’సత్యమేవ జయతే ‘’అనేది భారత దేశ అధికార ముద్ర అంటే సీల్ లో స్థానం పొందింది .
వైయక్తిక గీతాలు
గురువు కాశీరాం దవే ,మిత్రుడు అమృతలాల్ పధియార్,తండ్రి దలపతి రాం ,ఇల్లాలు మానెక్ బాయ్ గురించి రాసిన గీతాలన్నీ ఇందులో చేరాయి .తండ్రిపై రాసిన ‘’పితృతర్పణం ‘’ఎలిజీ కాని నివాళి.భార్య పట్ల అనురాగ ,ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తూ రాశాడు .భార్యాభర్తలమధ్య ఆనంద సౌన్దర్యాలమధ్య ఆకర్షణలకుచోటు లేదు అంటాడు .
ప్రేమ గీతాలు
విశ్వ జనీన ప్రేమను వ్యక్తం చేసే గీతాలివి .పరమప్రేమ పరమబ్రహ్మ అన్నదే సందేశం .జయ ,జయంత్ రూపకం లో ప్రేమికుల సమాగమం లో పారవశ్యాన్ని వర్ణించాడు .ఏ స్థాయిలో ఉన్నా స్త్రీ స్వతంత్రురాలుగా ఉండాలి అని అభిప్రాయపడ్డాడు ..సత్యమైన ప్రేమకు అసత్యమైన దానికీ తేడా తెలియాలి ..’’కృష్ణ దేవుని వేణు గీతంలా నర్తిస్తూ – బృందావనం నుంచి యమునకదిలివస్తున్నది –ఈ నది ఒడ్డునే సౌందర్య పుష్పం వికసించింది ‘’.సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు –యమునాజలాలు వస్తూంటాయి ,పోతూంటాయి –కానీ తాజ్ ఆహ్లాద మధుర ప్రేమ జ్వాల –ప్రేమ దీపంగా ప్రకాశిస్తుంది .వెన్నెల కుప్పలా తాజ్ నిలిచింది .
వీర గీతాలు
మధ్యయుగ రాజపుత్ర సాహసాన్ని వర్ణిస్తూ కవితలు రాశాడు .’’శంఖాల భేరీల నినాదం తో –నా ప్రభువు ఘనవిజయ రణ కేతనం ఎత్తబడింది ‘’అని రాణి అంటుంది .
ప్రకృతి గీతాలు
అన్నిరకాల ఋతువులు పశుపక్షాదులను గొప్ప అనుభవంతో వర్ణించాడు నానాలాల్ .గిర్నార్ శిఖరాన్ని కాలపు గంభీరాకృతి అన్నాడు .గుజరాత్ కవులు సముద్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నానాలాల్ సాగర గీతాలు చాలారాశాడు –వెండి కెరటాల్లా బంగారు కెరటాల్లా ఊగేట్లు రారండి ‘’అన్నాడు .’’ఇక్కడ భూమి సముద్రాన్ని కలుసుకొంటున్నది –భూమినీ సముద్రాన్నీ చంద్రుడు ధవళ కాంతితో పూత పూస్తున్నాడు ‘’
మహాకావ్యం
1926-40కాలం లో తన కురుక్షేత్రమహాకావ్యం లోని 12 ఆశ్వాసాలు రాశాడు .’’భావ కవితా వేణువు ను అవతలుంచి మహా కావ్య భేరీ ‘’చేతబట్టాడు .అంతకు ముందు కొందరు కవులు ప్రయత్నించినా లక్ష్య శుద్ధి లేని కావ్యాలయ్యాయి .ఇలియడ్, షా నామా ,రామాయణ భారతభాగవతాలు సకల లోకకావ్యాలు అన్నాడు .తనకావ్యం మిల్టన్ మహాకవి ‘’పారడైజ్ లాస్ట్ ‘’లాంటిదని చెప్పాడు .మహాకావ్యమంటే మహాపురుషుల మహావీరుల అద్భుత సాహస పరాక్రమ ప్రదర్శనల మహా గాధ’’అని ఉపోద్ఘాతం లో చెప్పుకొన్నాడు .10.703 చరణాలతో ,12ఆశ్వాసాలుగా రాశాడు .ప్రతి ఆశ్వాసం లో సంక్షిప్తంగా కధ చెప్పాడు మిల్టన్ లాగా .మొదటి ఆశ్వాసం పేరు ‘’యుగాంతరం ‘’..రెండులో శ్రీ కృష్ణ రాయబారం ,మూడులో ‘’నిశ్చయం ‘’గా యుద్ధం చేయాలనుకోవటం ,నాలుగులో కురుక్షేత్ర సంగ్రామమ ,తర్వాత కృష్ణుడు చక్రం చేబట్టటం ,భీష్మ పతనం ,7పద్మ వ్యూహం ,8భ్రాంత సాయంతనం ,9లో అన్నదమ్ముల యుద్ధం ,10’’కాలఘంట ‘’11శరతల్పం ,12మహా చక్రం .’’మహాచక్రం కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో దూసుకు వచ్చింది –దాని ప్రతిధ్వనులు విశ్వాన్తరాళమంతా ఆక్రమించాయి .-రసాతలం కన్నా దిగువ స్థానం నుంచి ప్రభవించి అదృశ్యమైంది –పవిత్ర హోమాగ్ని నిట్టనిలువుగా వ్యాపించినట్లుంది –స్వర్గలోకపు ఊర్ధ్వోర్ధ్వ స్థానాలకు సాగింది ‘’అని వర్ణించాడు .వ్యాసమహర్షి ప్రత్యక్షమై పశ్చాత్తప్తహృదయంతో ఉన్న పాండవులకు జ్ఞానోప దేశం చేస్తున్నాడు-‘’ధర్మరాజా !కురుక్షేత్ర సంగ్రామం –నీ హృదయాన్ని పశ్చాత్తాపం లో ముంచేసింది –ఈ చక్రం విశ్వ సృష్టి లయాత్మకం .-అణువులు అమాంతంగా శిలలుగా ,శిలలు పర్వతాలుగా పరివర్తన చెందే దృశ్యం –రాళ్ళు రజో రేణువులుగా మార్తున్నాయి చూడు –ఇది చక్రం –విశ్వలయాత్మకం –జననమరణాలకు ఆవల ఆనంద లోకం ఉంది దర్శించు ‘’అన్నాడు .ఈకావ్యానికి భరత వాక్యం మహాప్రస్థానం .
రూపక రచన
1909-43మధ్య నానాలాల్ 12నాటకాలు రాశాడు .విషయాలను చరిత్ర ,పురాణాలనుంచి ,మరికొన్ని స్వయంగా కూర్చాడు .ప్రపంచాన్ని సంస్కార వంతం చేయటమే ఆయన రూపకాల ఉద్దేశ్యం .దాదాపు ఇవి సంగీత రూపకాలుగా ఉంటాయి .షెల్లీ ‘’ప్రోమిడియాన్ అండ్ బౌండ్ ‘’గోధే’’’’ఫాస్ట్’’లను౦చి కూడా ఇతి వృత్తాలను తీసుకొన్నాడు .బెర్నార్డ్ షాను కాచి వడపోసినట్లు అనిపిస్తాడు .టెన్నిసన్ భావాలను రూపకాలలో పొందు పరచాడు .షెల్లీ లాగా స్వాప్నిక జగత్తులో విహరిస్తాడు .సౌందర్యం కాల్పనికత ఆదర్శ లోకం ఇద్దరి లక్ష్యాలు .ఉదాత్తత ఆదర్శ ఉద్బోధనం లతో సాగుతాయి .19వ శతాబ్దిలో ఇంగ్లాండ్ లో కావ్యరూపకం ,-పోయెటిక్ ప్లే,క్లోసేట్ ప్లే అనే రచనలను పోలి షెల్లీ టెన్నిసన్ లు రాశారు .ఆప్రయత్నమే చేశాడు నానాలాల్ .సాంఘిక పౌరాణిక చారిత్రిక రూపకాలు రాశాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-22-ఉయ్యూరు–