చారిత్రకనాటకాలు జహంగీర్-నూర్జహాన్ ,షహన్షా అక్బర్ రాశాడు నానాలాల్ .చరిత్ర ,సత్యాలనుకవిత్వానికి సమన్వయపరచటమే లక్ష్యంగా రాశాడు .ఆ ప్రేమ జంటపై గొప్ప సానుభూతి తో రాశాడు .ఈ అపూర్వ రూపకాలు వర్ణ విన్యాసం చిత్రి౦చె తూలికా ప్రయత్నమన్నాడు .మహాపురుషుల ఆత్మావిష్కరణం ,వారు జీవించిన కాల స్వరూపం చిత్రించటం తన లక్ష్యమన్నాడు .టెన్నిసన్ రాసిన ‘’అక్బర్ డ్రీం ‘’,ప్లోరాస్టేల్ రాసిన ‘’స్వాప్నిక రాకుమారుడు ‘’నానాలాల్ కు ప్రేరణ .నానాలాల్ చిత్రించిన అక్బర్ వివిధ సంస్కృతులు ,మతాల కళాసాహిత్యాల జాతుల సంశ్లేషణావైభవం .సంఘమిత్ర రూపకం లో పద్యభాగాలన్నీ సంస్కృత ఛందస్సులో రాశాడు .మహేంద్ర ,సంఘ మిత్ర శ్రీ లంకకు బౌద్ధ ధర్మ ప్రచారానికి వెళ్ళటం ఇతి వృత్తం .నాటకం అంతా అశోకుడే కనిపిస్తాడు .
పౌరాణిక నాటకాలు
రాజర్షి భరత్ లో పౌరాణికానికే మొగ్గు చూపాడు .1927లో రాసిన ‘’విశ్వ గీత ‘’ ఏ వర్గానికీ చెందని నాటకం .కాలస్థల వస్తు ఐక్యాన్నియూరోపియన్లు పాటించి రాశారు అన్నాడు. తానుమాత్రం ‘’రసైక్యం ఒక్కటే ఐక్యం ‘’ అనే భావంతో రాశానన్నాడు .కవి భావనా సమృద్ధికి ,జీవిత నైతిక విలువలపట్ల ఆందోళనకు నిదర్శనం ఇందులో కనిపిస్తుంది .
ప్రేమ భక్తీ
నానాలాల్ కు ప్రేమ, భక్తీ ఆదర్శం .భజనల్లో ,హరి సంహిత లో దీన్ని ప్రదర్శించాడు .ఇంటి దగ్గర భజన గీతాలు తంబూరా పట్టుకొని పాడేవాడు కాని తనకు పాడటం రాదనే చెప్పేవాడు .రాజ్ కోట ప్రభుత్వాధికారిగా ఉన్నప్పుడు ప్రేమానందుని ‘’మామేరు ‘’గానం చేశాడు .ఏడాది తర్వాత డాకోర్ దేవాలయం లో తన హరి సంహిత లోని కొన్ని భాగాలు గానం చేశాడు .స్వామి నారాయణ సంప్రదాయం లో పెరిగిన వాడు నానాలాల్ .ఈ శాఖను శ్రీసహజానంద గుజరాత్ లో ప్రారంభించారు ఈయన్నే జీ మహారాజ్ అని గౌరవంగా సంబోధిస్తారు .ఈయన బోధనా తత్త్వం నానాలాల్ కు చాలా ఇష్టం .మతవిషయం లో సమన్వయ మార్గం నాది అన్నాడు ,-‘’-ఆయన ఉన్నాడు సమస్తచరాచరాలలో –నాచుట్టూ ప్రభువు ఉచ్చ్వాస నిస్వాసాలు లాగా నా అస్తిత్వం లోనే ఉన్నాడు.నా నాలుక విరాట్ విరాట్ అని తపిస్తుంది .ఔజ్వల్యంతో మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది –విరాట్ విశ్వ డోల ‘’అనే గీతం రాశాడు .విలియం బ్లేక్ కవితాచాయలుంటాయి .
ముగింపు
తాను యెంతో అభినివేశంతో రూపొందించి ప్రచారం చేసిన ‘’నవకవిత ‘’ఆశించినంతగా ముందుకు పోనందుకు కొంచెం బాధపడ్డాడు నానాలాల్ .విశ్వ జనీన ఉన్నత ప్రమాణాలనే ఆయన పాటించాడు వ్యాప్తి చేశాడు .పునరుజ్జీవన సందేశాన్ని అందించటం ,కవిత్వం లో విశ్వస్థాయి అందుకోవటమే తన ధ్యేయంగా భావించాడు .మాధ్యమిక విద్య నేర్చే విద్యార్ధులకు మంచి శరీరబలం ఉండాలని బోధించాడు .’’భారత దేశపు కవితగా ,చరిత్రగా జీవి౦చటమేతన ఆదర్శం’’ అన్నాడు .ప్రాచ్య పాశ్చాత్య మేలిమిని స్వీకరించాడు .ఆయన వేదాన్తిమాత్రం కాదు .స్త్రీపురుషులమధ్య పరస్పర మర్యాద ,స్నేహ సౌహార్దాలు ,సమాన దృష్టి ,ఉన్నత మానవీయ దర్శనం ,సత్య సౌందర్యాలను పాటించటం నానాలాల్ రచనలలో కనిపిస్తాయి .’’కలలు అమ్ముకొనే బేహారి కవి ‘’అన్నాడు .’’వివాహం అంటే దివ్య వ్యక్తిత్వం లోకి అడుగు పెట్టటమే ‘’అని ఉన్నత నిర్వచనం చెప్పాడు .కవిత్వంలో పవిత్రత పాటించాడు .’’కవిధర్మ వసంత ధర్మ౦’’అని గొప్పగా అన్నాడు .ఆధునిక గుజరాతీ సాహిత్యం లో నానాలాల్ రచనలు సర్వ శ్రేష్టాలు .’’గుజరాత్ గీతి కవితా ప్రభువు ‘’‘’.1946లో 69వ ఏటమహాకవి నానాలాల్ అమరుడయ్యాడు .
ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే చెప్పినట్లు యు ఎం.మనియార్ రచించిన దాన్ని డా అక్కిరాజు రమాపతి రావు గారు తెలుగు అనువాదం చేసిన ‘’నానాలాల్ ‘’పుస్తకం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-22-ఉయ్యూరు