త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-7
పార్ధ సారధి గారు భారతి పత్రికలో రాసిన వ్యాసానికి కొనసాగింపుగా ‘’అవధాని గారూ !నాకో కథ జ్ఞాపకం వస్తోంది .పూర్వం అదే వూరిలో ఏక గర్భ జనిత అన్నా చెల్లెలు పసితనం లో కృష్ణ వరదలో కొట్టుకుపోయారు .వాళ్ళను ఎవరో పెంచి పెద్ద చేశారు .కొన్నేళ్ళకు ఈ అన్నా చెల్లెలికి పెళ్ళి అయింది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ ఒకే తలిదండ్రులకు పుట్టిన బిడ్డలని తెలిసింది .అన్నిశాస్త్రాలు తెలిసిన ఒక పండితుడు ‘’ఆ ఇద్దరికీ నల్ల బట్టలు కట్టి కృష్ణలో లో పడేస్తే పాపపరిహారం అవుతుందని ఉపాయం చెబితే అలానే చేశారు .దైవ ప్రార్ధన చేస్తూ వాళ్ళు వాలు గా కొట్టుకు పోయి ఒక వూరిలో తేలేసరికి బట్టలు తెల్లబడ్డాయట. ఆవూరి పేరే వెల్లటూరు .ఇలాంటి గొప్ప ఉపాయం మీ పండితులెవరైనా చేసి ,ప్రజలమన్ననలు పొంది మహోత్కృష్ట ఉపకారం చేయచ్చు కదా ‘’అన్నాను .నామాటలు విని పెదవులు చప్పరించి నాతో లాభం లేదనుకొని తనదారిన తాను పోయాడు ..నేను కృష్ణాశ్రమం చేరేసరికి మధ్యాహ్నం రెండు అయింది .దాన్ని స్థాపించింది నల్లపాటి హనుమంతరావు గారనీ వారికిప్పుడు 35ఏళ్ళు అని తెలిసింది .గుంటూరుతాలూకా ఆరువేల నియోగి బ్రాహ్మణుడు .మెట్రిక్ పాసై ,అసహయోద్యమం రాకముందే అంటే 1916నుంచే అధోగతిలో ఉన్న పంచముల్ని అభి వృద్ధి లోకి తెస్తున్నారు .దేశం లో పెద్ద పెద్ద పండితులు కూడా మాల వాళ్ళను తాకితే తమ కులగోత్రాలు మంటలో కలిసి పోతాయని భావించే కాలం లో ఈయన పంచములను అక్కున చేర్చుకొని ‘’శ్రీ కృష్ణాశ్రమం స్థాపించి వారివిద్యా ఆరోగ్యం బాగోగులకు గొప్ప సేవ చేస్తున్నారు .ఆయన ఉద్దేశాన్ని ఆమోదించేవారు ఆకాలం లో ఎక్కువ మంది లేకపోయినా ,ఎంతో శ్రమించి ఆశ్రమం నిర్వహిస్తున్నారు .కొందరు బుద్ధిమంతులు ఈ హరిజన సేవకుడిని ‘’మాలవాడు ‘’అన్న సందర్భాలూ ఉన్నాయి .ఆంద్ర రత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు వీరికి ‘’’’మాల మాదిగోద్ధారక ‘’బిరుదునిచ్చారు .వీరు సంఘ ,కుల బహిష్కారం కూడా ఎదుర్కొన్నారు .ఇలాంటివి ఎన్ని కష్టాలు మీద పడినా చెదరని గుండె ధైర్యంతో శాంతంగా చిరునవ్వుతో ముందుకు మును ముందుకే సాగుతున్నారు .ఆశ్రమం లోనే ఉంటూ విద్యార్ధుల సత్ప్రవర్తనకు బాటలు వేస్తున్నారు .పిల్లలకు భక్తీ శాంతం ప్రేమ దేశభక్తి కలిగిస్తున్నారు .చాలామంది స్వలాభం కోసం ఇలాంటి పని చేస్తారు. వీరు దేనినీ అపేక్షించకుండా నిస్వార్ధంగా సేవ చే స్తున్నారు .ఆంధ్రలో అసహాయోద్యమం ప్రారంభం కావటానికి రెండేళ్లకు ముందే రావు గారుఈ ఆశ్రమ౦ స్థాపి౦చి ఆదర్శ ప్రాయులయ్యారు .1920లో వచ్చిన అసహాయోద్యమం తర్వాత ఈ సంస్థ మరింతగా అభి వృద్ధి చెందింది .ఇలాంటి మానవ సేవ ,దేశ సేవ చేస్తున్న హనుమంతరావు గారికి తగినంత ప్రసిద్ధి రాలేదు .
అంటరాని తనం సహజ మానవీయతకు విరుద్ధమైన దురాచారమే .పవిత్రమైన పచ్చని పంట పోలాలమధ్య కృష్ణ కాలువ వెంబడి ఈ ఆశ్రమం మనోహరంగాపూర్వపు రుష్యాశ్రమం గా ఉంది .ఆశ్రమ బాలురు నిమ్నజాతి వారుగా కనిపించరు .వారి నిత్య దిన చర్య మహా శ్రోత్రియుల ఇళ్ళలో జరిగెట్లుగా ఉండి నన్ను ఆశ్చర్యపరచింది .30మందిబాలురకు ఉచితంగా భోజన వసతి కలిపిస్తున్నారు .
ఆశ్రమ ఉద్దేశ్యాలు –పంచములకు భోజనవసతి కల్పించి వృత్తిపనులు ఉచితంగా నేర్పటం ,ఇతరగ్రామాలలో విద్యాలయాలు ఏర్పాటు చేయటం ,పంచములపై లోకం లో ఉన్న దురభిప్రాయాలను తొలగించటం ,పంచములు మతా౦తరులు కాకుండా కాపాడటం .
తిలక్ నిధినుంచి ,గుంటూరుజిల్లా కాంగ్రెస్ నుంచి మిగిలిన వదాన్యులనుంచి సంస్థకు విరాళాలు అందుతున్నాయి .ఈ ఆశ్రమానికి అన్నివిదాలాసాయం చేసి ,ప్రోత్సహించి వృద్ధి లోకి తేవాల్సిన బాధ్యత ఆంద్ర ప్రజలపై ఉంది ‘’ భారతి -1925 ఏప్రిల్ సంచిక .
1926లో ఈ ఆశ్రమం పెదపాలెం నుంచి గుంటూరులో కొన్న స్థలం లోకి రావు గారు మార్చారు .పాలెం మారుమూల పల్లె అవటం రవాణా సదుపాయం లేకపోవటం హైస్కూల్ అందు బాటులో లేకపోవటం వలన విద్యార్ధుల స౦ఖ్య పెద్దగా పెరగలేదు .గుంటూరు కృష్ణాశ్రమంలో 100మందికి బోర్డింగ్ కలిపించారు .10మంది ఉపాధ్యాయులున్నారు .బయటనుంచి మరో వందమంది వచ్చి చదువుతూ సంఖ్యను 200కు పెంచారు .ప్రభుత్వం బోర్డింగ్ గ్రాంట్ కింద నాలుగు వేలు ,టీచింగ్ గ్రాంట్ కింద 12వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు .ఇవి ఏమూలకూ చాలక రావు గారు సుమారు 6వేలరూపాయలు చందాల రూపం లో తిరిగి వసూలు చేసి నడుపుతున్నారు .తర్వాత గ్రాంటు పెంచటానికి జిల్లా లేబరాఫేసర్ మంచి సహాయ సహకారాలు అందించారు .
రావు గారికి అనేక సహాయ సహకారాలు అందిస్తున్న కోటలక్ష్మయ్య నాయుడు గారు చనిపోయారు .అప్పటికి వారి బాకీ తీరలేదు .కానీ నాయుడు గారు ధర్మకార్యాలకు ఒక లక్ష ,ముఖ్య స్నేహితులకు బంధువులకు కొంత ధనంచెందేట్లు ఆత్మబంధువులను ఎక్సి క్యూటర్స్ గా ఏర్పాటు చేస్తూ విల్లు రాశారు .ఎక్సి క్యూటర్లమధ్య భేదాలు ఏర్పడి కోర్టుకెక్కారు .మద్రాస్ హైకోర్ట్ రిసీవర్ ను నియమిస్తే ఆయన వీరిపై 5,600 రూపాయలకు వ్యాజ్యం వేసి డిక్రీ పొందాడు.రావుగారు మద్రాస్ వెళ్లి నాయుడుగారి అల్లుడు ,రిసీవర్ లతో మాట్లాడితే వారు ‘’భయం వద్దు .ధర్మకార్యాలకు కేటా ఇంచిన డబ్బు కింద మీ బాకీ రద్దు చేసి ,ఆశ్రమం ,భూమి మీకే చెందేట్లుగా చేస్తాం ‘’అని హామీ ఇచ్చారు .ఈలోగా రావుగారు కొండా వారితో సంప్రదించి ఆయనతోకలిసి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిని కలశారు .అ౦దరూకలిసి సీనియర్ వకీలు దొరస్వామి అయ్యర్ తో ఒకపరిష్కారం కుదిర్చారు .గుంటూరు ఆశ్రమానికి పది వేలు కిమ్మతుకట్టి ,దాన్ని నాయుడుగారి ధర్మకార్యాల డబ్బు నుంచి ధర్మంగా ఇచ్చేట్లుచేసి ఆశ్రమ స్థలం ఆశ్రమానికే ఉండేట్లు మహోపకారం చేశారు .
రావుగారు గుంటూరు బ్రాడీ పేటచివర్లో 1200గజాల స్థలం చాలా చౌకగా కొని,కో ఆపరేటివ్ సొసైటీ లో లోన్ తీసుకొని స్వంత ఇంటిని నిర్మించుకొన్నారు .16భాషలలో పండితుడైన తల్లావఝల శివ శంకర శాస్త్రి భట్టాచార్యుల వారు మంగళగిరి దగ్గర కాజ గ్రామం లో ఉండేవారు .ఆయన తరచుగా మంగళగిరి రావటం వలన ఇద్దరూ కలిసి కాంగ్రెస్ లో పనిచేశారు .వీరికోరికపై వీరిని కృష్ణాశ్రమం లో ఉపాధ్యాయునిగా నియమించారు రావుగారు . ఆతర్వాత ఏవేవో కారణాలలు చూపిస్తూ రావుగారిపై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని గోబెల్స్ ప్రచారం సాగింది .రావుగారు మస్తాపం చెందగా ,ఆశ్రమకమిటీ అధ్యక్షులు ఉన్నవవారు రావుగారు తీసుకొంటున్న ఆనరోరియం కు కమిటీ తీర్మానం ఆమోదమూ ఉన్నాయా అని అడిగితె లేదు వెంకటప్పయ్య గారికి చెప్పిచేశాను అనగా ,ఉన్నవ వారు తీర్మానం రాయించి కమిటీలో ఏకగ్రీవంగా పాస్ చేయించి,వాడిన మొత్తాన్ని రాటిఫై చేయించారు .అప్పటినుంచి లెక్కలన్నీ ఆడిట్ చేయించటం ప్రారంభించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-22-ఉయ్యూరు