మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92
92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి –చందాల కేశవదాసు
చందాల కేశవదాసు (జూన్ 20, 1876 – మే 14, 1956) తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి[1], నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశాడు. ఈయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో జూన్ 20, 1876 చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం లో మే 14, 1956 న మరణించాడు
బాల్యం, విద్యాభ్యాసం
కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు.[2] [3] కేశవదాసు తాత చందాల శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగిదేవిపాడుకు చెందిన వారు. ఆయన అక్కడే వైద్యవృత్తిని చేసేవారు. ఆయన ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ కూడా వైద్యవృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు. ఆ తరువాత తన నివాసాన్ని జక్కేపల్లికి మార్చారాయన, చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం మొదట వెంకటరామయ్య తర్వాత కేశవదాసు జన్మించారు. వెంకటరామయ్య వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య జీవనం యోగమార్గంలో గడిపారు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.
వంశనామం
18, 19 శతాబ్దాల మధ్య గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని `చందవోలు’ గ్రామం పేరు ప్రజల నోళ్ళలో నలిగి వాడుకలో `చందోలు’ గా మారింది. దీనిని పూర్వం `ధనదపురం’ గా పిలిచే వారు. ఙది 11వ శతాబ్దంలో వెలనాటి ఛోళులకు రాజధానిగా వుండేది. వీళ్ళు వేంగిని కాపాడిన సామంతులు. వీరు తదనంతరం వివిధ కారణాలతో చెదిరి వేర్వేరుగా స్థిరపడ్డారు. ఆంగ్లేయుల పాలన ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో, ఇటు నైజాం నవాబు స్వతంత్ర రాజుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంస్థానాధీశుల బాధలు వున్నాయి అటువంటి సమయంలో చందవోలు గ్రామంలోని తెలగ వంశీయులలో వైద్య వృత్తిని సాగిస్తున్న ‘శ్రీనివాసులు’ అనే ముఖ్యుడు చందవోలు గ్రామం నుంచి అనేక ఇబ్బందులు పడి అప్పటి ఉమ్మడి ఖమ్మంజిల్లా ఇప్పటి భద్రాద్రి జిల్లాకు చెందిన ‘గంగదేవిపాడు’ కు చేరుకున్నారు. ఆయుర్వేద వైద్య వృత్తిలో జీవనం సాగిస్తూ పేదలకు ఉచితంగా ఉదారంగా వైద్యం చేసే వారట. ఆ ఊరి వారి వీరిని సులభంగా గుర్తించేందుకు ‘చందోలు వారని’ పిలిచే వారు కాల క్రమంలో అది ‘చందాల’ వారుగా స్థిరపడిపోయింది అని చెప్తారు.
వివాహం
దాసుగారు వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. సంతానం లేదని రెండవ వివాహం చేసుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఇద్దరు భార్యలు మరణించడంతో శిష్యులు అభిమానుల వత్తిడితో మరో రెండు వివాహాలు చేసుకున్నారు. దురదృష్ణం వెంటాడినట్లు వారిద్దరు కూడా దూరం అవ్వడంతో తనకు ఇక వివాహం వద్దు అనుకుంటున్న దశలో చివరకు పలువురు ఒప్పించి కృష్ణాజిల్లా తిరువూరు పట్టణానికి చెందిన కాబోలు రామయ్య గారి కుమార్తె కాబోలు చిట్టెమ్మను వివాహం చేసారు. అంటే చిట్టెమ్మ గారు వీరికి లెక్క ప్రకారం ఐదవ భార్య అన్నమాట.మొదటి నలుగురి గురించి వారి పెద్ద కుమారుడు కృష్ణమూర్తిగారి సతీమణి వెంకట నర్సమ్మగారు అందించిన సమాచారం ప్రకారం. తమ్మర కడియాల నారాయణ గారి అక్క లక్ష్మమ్మ దాసుగారి మొదటి భార్య, నడిగూడెం దగ్గరి సిరిపురం అమ్మాయి రెండవ భార్య, ఖమ్మం గాడేపల్లి వెంకటప్పయ్య గారి వదిన మూడవ భార్య, తిరువూరు మొండి జగ్గయ్య గారి మరదలు నాలుగవ భార్య.
అత్తవారిల్లు కావడం వల్లనే కాక సప్తహ కార్యక్రమ నిర్వహణకు కూడా ఆయన పలుమార్లు తిరువూరు గ్రామాన్ని సందర్శించారు. తిరువూరుతో విడదీయలేని సంబంధం కేశవదాసు గారికి ఉంది. ఈ ప్రాంత ఆడపడుచును వివాహమాడిన ఆయనం సొంత ఖర్చులతో తిరువూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన బావి దాసు పేరుతో నేటికీ పిలవబడుతుండటం విశేషం. ఆరోజులలో భద్రాచలం శ్రీరాముడ్ని దర్శించుకునేందుకు తిరువూరు మార్గం నుండి వేళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటుచేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్న దానం చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కేశవదాసు భరించేవారు వీరికిు తిరువూరు, గంపల గూడెం ప్రాంతాల్లో విస్తృతమైన పరిచయాలున్నాయి. ఆయన ఆరోజుల్లో పాటలు పాడటంతో పాటు అష్టావధానం, శతావధానం చేసేవారు. పలు దేవాలయాలకు గాలి గోపురాలు కూడా నిర్మించారు. పలు గ్రంథాలలో ఉన్న అర్ధంకాని విషయాలను సులభరీతిలో బోధించేవారు. ఆయన చేసిన సేవల కు తిరువూరు సంస్థానం వారు ఘనంగా సత్కరించారు. 1933- 1935 ప్రాంతాల్లో తిరువూరు, తదితర ప్రాంతాల్లో స్వాతంత్య్ర ఉద్యమం బలంగా ఉండేది. దాసు తన గీతాలతో ప్రజల్లో దేశభక్తిని, చైతన్యాన్ని నింపేవారు.
సంతానం
· కేశవదాసు గారి మూడవ భార్య సంతానంగా రామకవి అనే ఆయన జన్మించారు. రామకవి గారికి ఛక్రధరరావు, చిట్టెమ్మ, సీతమ్మ కేదారి అనే నలుగురు పిల్లలు.
· కేశవదాసు చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల కృష్ణమూర్తి, సీతారామయ్య, ఆండాళ్ళు అనే ముగ్గురు పిల్లలు జన్మించారు.
· పెద్దవాడైన కృష్ణమూర్తి ముత్తాత శ్రీనివాసరావుగారి లాగా వైద్య వృత్తిని మార్గంగా ఎంచుకున్నారు. వైద్య విద్యను అభ్యసించి ఆర్ ఎం పి డాక్టరుగా స్థిరపడ్డారు. ఈయన తండ్రి రచనలు, సేవాకార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. వృత్తి కీర్తి సంపాదనలో మునిగిపోయారు. ఈయనకు వారి దగ్గరి బందువుల అమ్మాయి వెంకటనర్సమ్మ గారితో వివాహం అయినది. వీరికి శ్రీనివాస రావు, కేశవదాసు, ఉష, శ్రీదేవి అనే నలుగురు పిల్లలు
· రెండవ కొడుకు సీతారామయ్య భద్రాచలంలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. వీరికి సక్కుబాయి అనే ఆవిడతో వివాహం అయినది.వీరికి వెంకట కేశవరావు, సత్యనారాయణ, రామ మోహన్, పద్మ అనే నలుగురు పిల్లలు,
· మూడవ వారు ఆడపిల్ల పేరు ఆండాళ్ళు. కేశవదాసుగారు మునగాల వెళ్ళినప్పుడు గంధం నర్సయ్య అనే కుర్రవాడి బుర్రకథా గానాన్ని ముగ్ధులై అతని గురించి వాకబు చేస్తే ఆయన రేపాల కాంగ్రెసు ఉద్యమ క్యాంపు కార్యదర్శ అని కూడా తెలుసుకుంటారు. దేపాలలో జనతా కళా మండలి సంస్థ సభ్యుడిగా నర్సయ్య గారి నటనకు అభినందించి 1955లో తన కూతురైన ఆండాళును గంధం నర్సయ్య గారికి ఇచ్చి సాలంకృత కన్యాదానం చేసారట. గంధం దంపతులకు పద్మజ, సత్యనారాయణ, నీరజ, శ్రీనివాస్, శైలజ, శేషగిరిధర్ అనే ఆరుగురు సంతానం
కళారంగంలో ప్రవేశం
అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య ఈయనకు సంగీతంలోని మెలకువలు తెలియజేశాడు. గేయరచనలో, సంగీతం కూర్పులో, హరికథనంలో, రచనలో కేశవదాసు ఆరితేరాడు. కాంతయ్యనాటక సమాజంలోచేరి కవిగా, నటుడిగా పేరుగాంచాడు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థుడు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధా కృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చాడు. ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన ‘భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు’, అని శ్రీకృష్ణ తులాభారం సినిమాకు వన్నెతెచ్చిన గీతం కేశవదాసు రాసిందే. నాటకాల్లో మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుదే. ఈ ప్రార్థనా గీతాన్ని స్వరపరచిన ఖ్యాతి పాపట్ల కాంతయ్యకు దక్కింది. భక్త ప్రహ్లాద, కనకతార వంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు వ్రాశాడు. కొంతకాలం నాటకరంగానికి స్వస్తిచెప్పి తెలంగాణా అంతటా హరికథలు చెప్పాడు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, మూడు పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తి భావం, సరళత్వం తొణకిసలాడుతుంటాయి.
1930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, అముల నరసింహారావులు పాడగా బెంగుళూరులో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశాడు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. “కనక తార”, “లంకాదహనం” వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచాడు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశాడు.
నాటక రంగం
తెలుగు సమాజంలో ఏ నాటకానికైనా ప్రారంభానికి ముందు పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర – భళిరా హరి మహిమం బెరుగగ బ్రహ్మాదులు తరమా’ అనే ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన మన చందాల వారి కలం నుండి జాలు వారినదే.
“”పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతితపావన స్వప్రాకాశ || పరా||
వరదాయక సకలలోక వాంచిత ఫలనా ప్రమేయ పాహీ – పాహీ – మాం – పాహీ || పరా||””
సినిమా రంగంలోకి ప్రవేశం
నాటక రంగంలో చందాల కేశవదాసు మంచి పేరుతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటి దాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా ‘ఆలం ఆరా’ అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ. అదే యేడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని భక్త ప్రహ్లాద చిత్రం (1931-32)న ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో ఆయన సినీ జీవితం మొదలైంది.
భక్త ప్రహ్లాద (1931, 1942)
ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, హిరణ్యకశ్యపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఈమె పాడిన పరితాప భారంబు భరియింప తరమా పాటనే చందాల కేశవదాసు సినిమాకు రాసిన తొలిపాట. ఇదేగాక ఈమెనే పాడిన తనయా ఇటులన్ తగుపలుకు, మునిపల్లె సుబ్బయ్య పాడిన భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక ఇటు చేసెదవా రెండు పాటలు కూడా చందాల వారు రాశారు. అయితే చిత్రంలో రంభ పాడిన వింతాయెన్ వినన్ సంతసమాయెనుగా దేవేంద్రా అనే పాట కూడా వొకటుంది. ఇది ధర్మవరం వారు భక్త ప్రహ్లాద నాటకం రాసినపుడే రాయగా ఈ పాటను నాటకాన్ని సినిమాగా తీసినపుడు కూడా అట్లానే ఉంచేశారు. దీంతో తొలి సినిమా పాట రచయిత కూడా ధర్మవరం వారేననే వాదన ఒకటి ప్రారంభించారు ఆ మధ్య. కనీసం ధర్మవరం వారి పాటను తొలి సినిమా పాటగా, చందాల వారిని తొలి తెలుగు సినీ కవిగా పరిగణించాలని రాశారు కూడా. కానీ కేవలం సినిమా కోసం రాసిన పాటనే సినిమా పాటగా భావించాల్సి ఉంటుంది గనుక చందాల కేశవదాసు గారే తొలి తెలుగు సినీ కవిగా చరిత్ర కెక్కారు. తొలి చిత్రం భక్త ప్రహ్లాద (1931-32)కు రాసిన పాటలు, 1942లో తీసిన భక్త ప్రహ్లాదలోనూ వాడుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం (1935)లో రాసిన పాటలు ఆ తరువాత 1956, 1966లోనూ అందుకే ఆయన తెలుగు సినిమా వాచస్పతిగా చరిత్రకెక్కారు.
మొదటి పాట
చందాల కేశవదాసు గారు భక్తప్రహ్లాద సినిమా కోసం మూడు పాటలు రాసారు మరి వీటిలో ఏది తొలి గీతం అనేది కూడా ప్రధానంగా వేసే ప్రశ్న అయితే సినిమాలో కథ ప్రకారం కాకుండా పాట రాసిన చరిత్ర ప్రకారం చూస్తే మొదటి పాట ‘‘ పరితాప భారంబు భరియింప తరమా’’ అనేది.
ఈ పూర్తి పాట ఇలా వుంటుంది కానడరాగం ఆదితాళం లో సాగుతుంది ఈ పాట
పరితాప భారంబు భరియింప తరమాకటకట నే విధి గడువంగ జాలుడు పతి ఆజ్ఞను దాట గలనా పుత్రుని కాపాడ గలనా …..పరి 1. ఈ విషము నేనెటులను తనయుని ద్రావింపగలను? ధర్మమును కాపాడుదునా? తనయుని కావగగలనా? …. పరి! | ” |
— చందాల కేశవ |
సతీ సక్కుభాయి (1935, 1954)
‘భక్త ప్రహ్లాద’ (1931-32) తరువాత కేశవదాసు గారు రచయితగా పని చేసిన సినిమా ‘సతీసక్కుబాయి’ (1935). భారతలక్ష్మీ ఫిలింస్ వారి ఈ చిత్రంలో ‘కృష్ణా పోబోకురా’, ‘రాదేల కరుణా’, ‘ఆటలాడు కోరా’, ‘పాలుమీగడ పలుమార్లు భుజియించి’, ‘పాషాణ మెటులైతివో’, ‘జాగేలా కావగ రారుగా’ పాటలు రాశారాయన. చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రధారి తుంగల చలపతిరావు, సక్కుబాయి పాత్రధారిణి దాసరి కోటిరత్నం ఈ పాటలు పాడారు. ఆ రోజుల్లో ప్లే బ్యాక్ పద్ధతి లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకునేవారు.
‘సతీ సక్కుబాయి’ మహారాష్ట్రానికి చెందిన భక్తురాలి కథ. రంగస్థలం నాటకంగా ప్రసిద్ధికెక్కడంతో 1935లో సినిమా తీశారు. భారత్ లక్ష్మీ పిక్చర్స్ పేరిట చారురాయ్ దర్శకత్వంలో కలకత్తాలో నిర్మించారు. చిలకమర్తి లక్ష్మినరసింహం పంతులు, సినిమాకి మాటలు, పాటలూ రాశారు. కొన్ని పాటలు చందాల కేశవదాసు రాశారు. ‘కృషాలపోబోకుమా, రాదేలా కరుణ, ఆటలాడుకోరా, పాలు మీగడ వెన్న పలుమార్లు భుజియించి పాషాణమెటులైతివో’, ‘జాగేలా కానరారుగా’ − పాటలు చందాల రాసినవి. ‘సక్కుబాయి’ (1935)లో పురుషుడే స్త్రీ పాత్ర ధరించడంమరో విశేషం! సూరవరపు వెంకటేశ్వర్లు రంగస్థలంమీద ‘సక్కుబాయి’లో అత్త పాత్ర ధరించి ప్రసిద్దిపొందడంతో ఆయన చేతనే సినిమాలో అత్త పాత్ర ధరింపజేశారు! నాటకాల్లో పురుషులు స్త్రీ పాత్రలు ధరించడం, స్త్రీలు పురుషపాత్రలు ధరించడం వుండేది. అయితే, సక్కుబాయి తర్వాత కాబోలు స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలిగాని, పురుషులు వెయ్యరాదు’ అన్న నిబంధన విధించారు ప్రభుత్వం, సెన్సార్‌వారూ. మారువేషాలు వేసుకుని, స్త్రీలు పురుషపాత్రల్లోనూ, పురుషులు స్త్రీ పాత్రల్లోనూ కనిపించవచ్చు అది వేరు.
శ్రీకృష్ణ తులాభారం (1935, 1955, 1966)
మరింగంటి వెంకట నరసింహాచార్య కవి (క్రీ.శ. 1770) తన బహురచనలలో నొకటిగా ఈ కథను సుమారు 1040 ద్విపదలలో రచించారు. ప్రబంధకవితేతరులైన జానపద- గ్రామీణ జనులు చదివి-చదివించుకొని ఆనందించే విధంగా దీన్ని రచించటం ఒక విశేషం సుప్రసిద్ధమైన పారిజాతాపహరణ ప్రబంధంలో ‘పుణ్యక వ్రతము’ పేర ఈ కథ (54-90 పద్యాలు) కలదు. కాని దానిలో తులాభార ప్రసక్తిలేదు..శ్రీ కృష్ణతులాభారం’ ముత్తరాజు సుబ్బారావు రాసిన రంగస్థల నాటకం. ఇది భారత, భాగవతాల్లో లేని కవ్పిత కథ. అంతకు ముందు ఎవరు కల్పించారో గాని, ముత్తరాజు సుబ్బారావు నాటకం బాగా మంచిపేరు పొందింది. దాంతో తొలిసారిగా చిత్ర రూపం దాల్చి 1935లో విడుదలైంది. ముఖర్జీ, రాజారామ్ అనే వారు దర్శకత్వం వహించారు. జయసింగ్ అనే ఆయన కృష్ణుడు, ఋష్యేంద్రమణి సత్యభామ, కపిలవాయి రామనాథశాస్త్రి నారదుడు. విశేషం ఏమిటంటే, ఋష్యేంద్రమణి, కాంచనమాల, రేలంగి, లక్ష్మీరాజ్యం వంటి నటులకు ఇదే తొలిచిత్రం! 1955లో రాజరాజేశ్వరీ వారు ఇదే చిత్రం తీశారు. సి.ఎస్.రావు దర్శకుడు కాగా, రఘురామయ్య కృష్ణుడు, సూరిబాబు నారదుడు, ఎస్.వరలక్ష్మి సత్యభామ. ఇదీ బాగానే నడిచింది. 1966లో డి.రామానాయుడు సురేష్ పతాకం కింద మళ్లీ ‘శ్రీ కృష్ణ తులాభారం’ తీశారు. రామారావు కృష్ణుడు, కాంతారావు నారదుడు, జమున సత్యభామ, కమలాకర రామేశ్వరరావు దర్శకుడు. 1935లోనే సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన కాశీ ఫిలింస్ వారి శ్రీకృష్ణ తులాభారం‘తో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ చిత్రంలో రాసినవి మూడు పాటలు. అవి భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్ మోసగింతువా, కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి. వీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. అయితే ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం చిత్రాన్ని 1955, 1966ల్లో నిర్మించినపుడు కూడా వాడుకున్నారు. అది కేశవదాసు గారి కవితా వైభవానికి నిదర్శనం. 1966లో డి.రామానాయుడు తీసిన చిత్రంలో దాసుగారి పాటలు వాడుకుని వారి పేరును సినిమాలో గాని, పాటల పుస్తకంలో గాని వేయలేదు. ఇది గమనించిన వారి కుటుంబ సభ్యులు 1970లో ఖమ్మం కోర్టులో కేసు వేయగా దిగివచ్చిన నిర్మాతలు సినిమా టైటిల్స్‌లో ఆయన పేరు వేశారు.
పారిజాతాపహరణ ప్రబంధంలోని కథను – తిమ్మనకవి సంస్కృత హరివంశాధారంగా గ్రహించి సంక్షేపించినా ‘తులాభార’ ప్రసక్తిలేదు. ప్రస్తుత ద్విపద కృతి కర్త కొంత వరకు ముక్కుతిమ్మన కృతిని అనుకరించినా వర్ణనలు – కల్పనలతో కథను పెంచి ‘తులాభారము’ను వేయించినాడు. పారిజాతాపహరణంలోని కొన్ని సన్నివేశాలను మార్చి ఔచిత్యం పాటించిన ద్విపద కావ్యకర్త కథాకథనంలో శ్రద్ధకన్పరచినాడు – ఈయన మార్పుల్లో నారదుడు విచ్చేసి ఏకాంతంలో వున్న సత్యభామకే తులాభారం విషయం వివరిస్తాడు. చైత్రమాసం బదులు – ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశినాడు మాత్రమే చేయవలెనని – మార్గశీర్ష ప్రాముఖ్యాన్ని తెల్పుతాడు. మహర్షి ఆనతి ప్రకారం మార్గశీర్షంలో సత్యభామ వ్రతాన్ని చేస్తే – నారదుడే అష్టదిక్పాలకులకు పతిదాన వ్రత విశేషాలను చెప్పి ఆహ్వానిస్తే వీరితో పాటు మునిజనం, బ్రాహ్మణ బృందం విచ్చేస్తుంది. ఒక వైపు కౌరవులు వస్తే శ్రీ కృష్ణుడేవారికి తగిన పనులప్పగిస్తాడు (రాజసూయయాగంలోవలె) వీరే గాక – కుబ్జ. ద్రౌపది, రాధ, ప్రద్యుమ్నుడు, సాత్యకి విచ్చేసి వ్రత సంబంధ కార్యాలను చేస్తారు. ఇట్లా వీరి వర్ణన కార్యక్రమాలు మొదలగు వాటితో కథ పెరిగింది. పతిదానవ్రత సమయానికి ‘రుక్మిణి’ రాకపోవటం సవతులకయ్యమే ప్రధానమని రేవతీ ద్రౌపదులు భాషించుకోవటం జానపదుల యధార్థకథనంవలె కలదు.
సతీ అనసూయ (1935]
1935లో అరోరా ఫిలిమ్స్ ఆరోరా ఫిలిమ్స్ వారు ‘అనసూయ’ చిత్రాన్ని కోల్‌కత్తాలో తీశారు. ఈ సినిమాకి మాటలు, పాటలు, పద్యాలూ అన్నీ కేశవదాసే రాశారు. ఈ సినిమా విశేషం ఏమిటంటే, తొలిసారిగా ఒక మహిళ చిత్రనిర్మాతగా రావడం. ఆమె దాసరి కోటిరత్నం. ఆమే అనసూయ పాత్రధారణి కూడా. అయితే, ఈ సినిమా బాగా నడవ లేదు. 1936లో సి.పుల్లయ్య బాలలతో తీసిన ‘అనసూయ’ మాత్రం బాగా నడిచింది. ఈ సినిమాతో పాటు ‘ధ్రువవిజయం’ కూడా విడుదల చేశారు. కేశవదాసు గారు 1935లో మూడు సినిమాలకు రచయితగా పని చేశారు. ఆ మూడో సినిమా సతీ అనసూయ ఈ సినిమాకు స్క్రిప్టుతో సహా మాటలు, పాటలు రాశారాయన. అలా కేశవదాసు పూర్తి స్థాయిలో రచయితగా పని చేసిన చిత్రం ఇది. ఈ సినిమా పాటల పుస్తకంలో అనసూయ స్క్రిప్టు పట్టుకుని ఉన్న దాసుగారి ఫొటోను ప్రచురించడం విశేషం. అలాంటి సందర్భం సినీ చరిత్రలో ‘నభూతో న భవిష్యతి’గా చెప్పుకోవచ్చు. దేవుని దయ ఉంది ఐలెసో, ప్రహ్లాదుగావ స్తంభమునందు నృహరివై, మాతయని మాట విని, కురుతే గంగా సాగర గమనం వంటి పాటలు సతీ అనసూయలో దాసుగారు రాసినవే. ఆ తరువాత దాసుగారికి సినిమా అవకాశాలు వరుస కట్టినవి.
లంకా దహనం (1936]
చందాల కేశవదాసు ‘లంకాదహనం’ సినిమాకి కూడా మాటలు, పాటలు, పద్యాలూ రాశారు. ఇది 1936లో వచ్చించి. రాధా ఫిలిం కంపెనీ పేరిట కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించారు. నటేశన్ అనే ఆయన హనుమంతుడిగా నటించారు. ఈ సినిమాలో వింతగా కనిపించిన విషయం ఏమిటంటే − హనుమంతుడు చెట్టుకింద కూచుని ‘ఎపుడు కృపాకలుగునో’’ అన్న త్యాగరాజకీర్తన పాడడం. ఈ సినిమా సరిగా ఆడక పోవడం వల్లా పాటల పుస్తకం లేకపోవడంవల్లా ఇతర నటుల వివరాలు తెలియరాలేదు.
కనక తార (1937, 1956)
‘ద్రౌపదీ వస్త్రాపహరణం తీసిన సరస్వతీ టాకీస్ వారు కనక్తార సినిమాను హెచ్.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ, ఆరణి సత్యనారాయణ, కడారు నాగభూషణం, గంగారత్నం ప్రధాన పాత్రధారులు. రంగస్థలంపై ‘కనక్తార‘గా చెలామణి అయినా నాటకం వెండి తెర మీదికి వచ్చేసరికి కనకతార అయింది. దప్పిచే నాలుక తడిపొడి లేక పద్యం, ఎంత బాగుండది సక్కని గుంటారాయే నా, యేంటి అబ్బో నా వొల్లు మంటెత్తుతాది పాటలు బహుళ జనాదరణ పొందినవి. ఇదే సినిమాను 1956లో మరోసారి తీసినపుడు కూడా దాసుగారి పాటలను యధాతథంగా వాడుకున్నారు. కనకతారకు రాసిన కథ, పాటలు 1937, 1956లోనూ యధాతథంగా ఈ సినిమాల్లో వినియోగించుకున్నారు
రాధాకృష్ణ (1939)
1939లో లక్ష్మీ్ సినీ టోన్ సంస్థ వారు స్థానం నరసింహ రావు గారినే రాధగా పెట్టి ఈ సినిమా తీసారు. రాధాకృష్ణ నాటకం కోసం దాసుగారు రాసిన 22 పాటల నుంచి కొన్ని పాటలను ఈ చిత్రం కోసం వాడుకున్నారు.
బాలరాజు (1948)
1948 లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతి సినిమాగా ప్రతిభా బ్యానర్ మీద ఈ సినిమా తీసారు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వం, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీస్ వరలక్ష్మీ్ కస్తూరి శివరావు ముఖ్యపాత్రలు ధరించారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-22-ఉయ్యూరు