మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92
92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత,కలియుగ దశరధ –చందాల కేశవదాసు -2
ఉన్నత వ్యక్తిత్వం
వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టిగాని, కులాన్ని బట్టికాదనే వారు. ఎవరైనా దీనిని వ్యతిరేకిస్తే వాదించి మెప్పించేవారు. జక్కేపల్లికి దగ్గరలో ఉన్న రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసి పోయేవారు. ఆయన వీరాభిమాని. ఇదంతా గమనించిన దాసుగారు ఒకనాడు అతని బీదరికాన్ని చూసి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చుని విసనకర్రతో గాలి విసిరేవారు. ఈ వొక్క సంఘటన కేశవదాసు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేట తెల్లం చేస్తుంది. ఆయన జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని బెంగుళూరులోని గ్రామ ఫోను కంపెనీ వారు రికార్డులుగా విడుదల చేసింది.
హరికథా భాగవతార్ గా
హరికథలు చెప్పడంలో కేశవదాసుది ఎదురులేని ప్రావీణ్యం. పొలంపల్లి, దుబ్బాకుపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మర వంటి లెక్కలేనన్ని చోట్ల హరికథలు చెప్పి కీర్తి, ధనం సంపాదించారు. అష్టావధానిగా, హరిదాసుగా నాటి తెలుగు సమాజంలో కేశవదాసుది ఒక ప్రత్యేక స్థానముండేది. ఒకసారి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో జగ్గయ్యపేటలో లక్ష్మీకాంతయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్టావధానం చేశారు. అందులో ఆయన సాహితీ పాండిత్యాన్ని, భాషామార్దవాన్ని, భావసౌందర్యాన్ని, ధారాశుద్ధిని మెచ్చుకుని తమ నాటక సమాజంలో చేరి రచయితగా, నటునిగా పని చేయవలసిందిగా కోరారు లక్ష్మీకాంతయ్య. దాసుగారికి సంగీతం ఆరో ప్రాణం. పాపట్ల లక్ష్మీకాంతయ్య గారి సంగీత విద్యాప్రేరణతో ఆయన తనలోని సంగీతాభిరుచిని మెరుగుపరచుకున్నారు. ముఖ్యంగా లయశాస్త్రంపై ఎక్కువ దృష్టిపెట్టి ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల ఆయనను ‘లయబ్రహ్మ’ అనే బిరుదు అందుకున్నారు. జగ్గయ్య పేటలో జరిగిన హరికథా గానానికి ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయోలిన్ సహకారం అందించడం బట్టి చూస్తే దాసుగారి సంగీత వైదుష్యం హరికథా గాన ప్రతిభ ఎంతటిదో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. సంగీత విద్వాంసులు హుజూర్ నగర్ నివాసులైన యం వి యన్ ఆచార్య గారి స్వీయ పరిశీలన ప్రకారం దాసుగారి హరికథా గానంలో వారి గొంతులో ఒక పల్చటి బొంగురు లాంటి జీర వచ్చేదట అది కూడా వారి కథకు లోపంలా కాక ప్రత్యేక అందంలా అనిపించేదని అంటారు.
అష్టావధానిగా శతావధానిగా
కేశవదాసు ప్రాథమిక విద్యను తండ్రి వద్ద నేర్చుకున్నాడు. కాగా చిన్నతనాననే ఆయన మరణించడంతో తన అన్నగారైన వెంకటరామయ్య పోషణలో పెరిగారు. వెంకటరామయ్య బ్రహ్మచర్యం పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. ఆయన ఉపాధ్యాయునిగా పని చేసేవారు. అన్నగారి వద్దనే ఛందస్సు, అవధానం వంటి వివిధ ప్రక్రియల్లో ప్రవేశం పొందారు. అమరకోశాన్ని కంఠస్థం చేశారు. అన్నగారి వీధి బడిని తాను నడుపుతూ అందులోని విద్యార్థులనే పృచ్ఛకులుగా నియమించుకుని సమస్యాపూరణం వంటి వివిధ రంగాలతో అష్టావధానాన్ని సాధన చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సిరిపురంలో జమీందారు పిల్లలకు కొంత కాలం చదువు కూడా చెప్పారాయన. వారినే వృచ్ఛకులుగా చేసుకుని తన అవధాన విద్యనూ సాధన చేసారు. కేశవదాసు మొదటిసారి అష్టావధాన ప్రక్రియను భద్రాచలంలో ప్రదర్శించారు. ఆ తర్వాత హుజూర్నగర్, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్ల అష్టావధానాలు చేసి పండితులతో ప్రశంసలందుకున్నారు.
భాగవత సప్తాహ నిర్వాహకునిగా
సప్త అంటే ఏడు అని అర్ధం సప్తాహము అంటే ఏడురోజులు నిర్వహించేది. బాగవత సప్తాహము బాగవత సంభందిత అంశాలతో ఏడు రోజులు నిర్వహిస్తారు. సప్తాహ్వః అని నిఘంటు ప్రకారం ఏడాకుల పొన్న చెట్టును కూడా పిలుస్తారు. ఏడురోజులనే ఎన్నుకోవడం వెనక తాత్త్విక కారణం ఏమిటంటే మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము ఏడు రోజులుగా నిర్వహిస్తారని ఒక వివరణ.
భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. శ్రీ మద్భాగవత పఠన సప్తాహ సంప్రదాయం ప్రథమంగా పరీక్షిత్తునకు శ్రీ శుకమహర్షి వినిపింపచేయడంతో మొదలైంది. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత ముప్పది సంవత్సరాలకు కలియుగ ప్రవేశం జరుగుతుంది. భాద్రపద శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు భాగవత సప్తాహంజరుపబడింది. దీనిఫలితంగా పరీక్షిత్తునకు మోక్షం లభించింది.అటువంటి బాగవత సప్తాహాలను కేశవదాసు గారు స్వయంగా భాద్యత తీసుకుని నిర్వహించే వారు.
శ్రీ శుకుడు నారదమహర్షి తో భాగవత సప్తాహ మహిమను తెలియజేసే రెండు విషయాలను గురించి తెలుసుకుందాం.
తుంగభద్రా నదీతీరంలో ఒక గ్రామంలో ఆత్మదేవుడు దుందులి అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. వారికి సంతానం లేదు. ఒకరోజు ఒక సన్యాసి వచ్చి ఆత్మదేవునికి ఒక పండు ఇచ్చి, దానిని భార్య చేత తినిపించమని చెప్పి వెళ్లాడు. కాని దుందులి ప్రసవ వేదన బాధలకు భయపడి ఆ పండును తినలేదు. అపుడే గర్భంతో వున్న ఆమె సోదరి అక్కడికి వచ్చింది. అక్కకు సాయంగా ఉండాలనే తలంపుతో చెల్లెలు అక్కతో ఒక మాట చెప్పింది. ‘‘నాకు పుట్టబోయే బిడ్డ నీకు పుట్టినట్లుగా ప్రకటించి, నేను నీకు సహాయంగా ఉంటూ బిడ్డను కొన్ని సంవత్సరాలు సాకుతాను. ప్రతిఫలంగా మాకు కొంత ధన సహాయం చెయ్యి’’ అదేవిధంగా అక్క చెల్లెళ్లు ఇద్దరూ రహస్య అవగాహనకు వచ్చారు. దుందులి ఆ పండును ఆవుకు తినిపించి, తాను గర్భిణిగా నటిస్తూ వచ్చింది. చెల్లెలి కుమారునిగా ప్రకటించి సాకుతూ వచ్చింది. ఆ బిడ్డడి పేరు దుంధుకారుడు. సరిగ్గా అదే సమయం పండు తిన్న ఆవు మనుష్య శరీరంతోను, ఆవు చెవులతోను ఒక మగబిడ్డను కన్నది. దానికి గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఆత్మదేవుడు ఇద్దరినీ సమానప్రేమతో పెంచాడు. గోకర్ణుడు సకల విద్యాశాస్త్రాలను బుద్ధితో అభ్యసించాడు. దుంధుకారుడు మాత్రం దుష్టుడై, ఆస్తిని ధ్వంసం చేసి ఇంటినుండి పారిపోయాడు. వీనిని గురించి దుఃఖించి తల్లిదండ్రులను మరణించారు. గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చి ఇంటిలో నిద్రిస్తుండగా ఒక ప్రేతం భయంకరంగా కనిపించింది. గోకర్ణుడు మంత్రజలాన్ని ఆ ప్రేతంపై చల్లగా అది ఇలా అంటుంది. ‘‘అన్నయ్యా! నేను దుంధుకారుడను. నా దుస్థితి చూడు. మీరు ఎన్ని నీతులు చెప్పినా నేను వినలేదు. నాకు సద్గతి మార్గం చూపవా’’ అందుకు గోకర్ణుడు ‘‘తమ్ముడూ! నేను వెళ్లిన పుణ్యస్థలాల్లో నీ గురించి తర్పణలు విడిచాను. గయలో శ్రాద్ధం కూడా చేశా. ఐనా నీలో మార్పు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని తమ్ముడితో అన్నాడు. ‘‘గయలో శ్రాద్ధం చేసినా నాకు విముక్తి రాలేదంటే నేను ఎంత పాపినో, నాకు నిష్కృతి లేదు’’ అంటూ అన్న ఎదుట విలపించాడు దుంధుకారుడు. ఒక నెల తరువాత చెప్తాను అని చెప్పి, గోకర్ణుడు సూర్యజపం ప్రారంభించాడు. సూర్యభగవానుడు కరుణించి భాగవత సప్తాహం చేయమని చెప్తాడు. అదేవిధంగా గోకర్ణుడు భాగవత సప్తాహాన్ని ప్రారంభించాడు. ఒక సద్బ్రాహ్మణుని ముఖ్యశ్రోతగా నియమించి, గోకర్ణుడు భాగవత పఠనాన్ని మొదలు పెట్టాడు. దుంధుకారుని ప్రేతం అక్కడ వున్న ఒక వెదురు చెట్టులో ప్రవేశించి దీక్షతో వినడం ప్రారంభించింది. ఆ చెట్టుకు ఏడు కణుపులు వున్నాయి. ఒక్కోరోజు శ్రవణం అవగానే ఒక్కొక్క కణుపు పెద్ద శబ్దంతో ప్రేలిపోసాగింది. ఏడవ శ్రవణంతో సంపూర్ణమైనందున ఏడవ కణుపు కూడా ప్రేలిపోయింది. దానిలో నుండి అత్యంత మనోహరుడు పీతాంబరిధారియై సాక్షాత్తూ శ్రీకృష్ణుని వలె దివ్య తేజస్సుతో మనుష్యరూపంతో వెలుపలికి వచ్చాడు. గోకర్ణుని పాదాలకు నమస్కరించాడు. ప్రేత రూపాన్ని దూరం చేసి తనను రక్షించినందుకు అన్నయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇంతలో వైకుంఠం నుండి విమానం ఒకటి వచ్చి, దేవదూతలు దుంధుకారుని ఆహ్వానించి, విమానంలో కూర్చోమన్నారు. అపుడు గోకర్ణుడు విష్ణుదూతలను ఇలా అడిగాడు. ‘‘ఓ దివ్యదూతలారా! ఇంతమంది విష్ణుపురాణం శ్రవణం చేస్తే ఈ ఒక్కరినే ఎందుకు ఆహ్వానిస్తున్నారు.?’’ అందుకు వారు ‘‘ఓ పుణ్యాత్ముడా! నీ ప్రశ్నబాగుంది. కాని వినటం మాత్రమే చాలదు. ఇంతమందిలో ఎందరు మనఃప్రాణాలను కేంద్రీకరించి విన్నారో చెప్పగలవా? శ్రవణమే కాదు, మననం కూడా చేయాలి. శ్రీకృష్ణ లీలాతత్త్వంలో ఏకమవ్వాలి. ఈప్రేతం అలా చేసి ప్రేతవిముక్తినే కాదు వైకుంఠ ప్రాప్తిని సాధించింది. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆత్మార్పణ చేసుకోవాలి. ఇంకొక భాగవత సప్తాహం చేయండి. అపుడు దీక్షతో నీ వలె శ్రద్ధ్భాక్తులున్నవారు వైకుంఠప్రాప్తిని పొందగలరు’’ అని సమాధానం చెప్పారు. గోకర్ణుడు విష్ణుదూతల మాట విని మళ్లీ సప్తాహం చేశాడు. ఈసారి సాక్షాత్తు శ్రీహరియే అవధరించి, గోకర్ణునితోపాటు శ్రద్ధాసక్తులతో వినిన వారినందరిని శ్రీకృష్ణ స్వరూపులుగా మార్చి, తనతోనే వైకుంఠానికి తీసికొని వెళ్లాడు. ఓసారి అపార కృపావత్సలుడైన శ్రీమన్నారాయణుడు కలియుగంలో భాగవత సప్తాహ శ్రవణం చేసిన వారందరి హృదయాల్లోనూ నేను నివసించేటట్లు వరాన్ని ప్రసాదిం చాడు.
రంగస్థల నటుడిగా
మైలవరం కంపెనీ వారి బాలభారతి సమాజం పక్షాన నాటక ప్రదర్శనకోసం ఈయన జగ్గయ్యపేట, విజయవాడ, గుంటూరు, తెనాలి మొదలైన ప్రాంతాలు తిరిగారు.
స్వాతంత్రోద్యమంలో
1930-33 మధ్య మనదేశంలో స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్నకాలం. సమకాలీన పరిస్థితులకు స్పందించడం కవుల విధి ముఖ్యంగా సామాజిక బావాలు అధికంగా గల దాసు గారు అందుకు తగినట్లు గానే తన మేధా శక్తితో ఉద్యమాన్ని కొన్ని దశలుగా విభజించి అసింహా పద్దతిలో పోరాటం నడుపుతున్న గాంధీగారి విధానాలకు ముగ్ధుడై గాంధీని తన రచనలతో ప్రశంసించకుండా వుండలేక పోయారు. ‘‘జయతు జై’’ అంటూ పాట రాయడమే కాక దానిని ఆకుల నరసింహారావు, యస్ రాజేశ్వర రావులతో పాడించి బెంగుళూరులో స్వంత ఖర్చులతో రికార్డు చేయించి ఉద్యమానికి దోహదకారి అయ్యేలా దానిని విడుదల చేసారు. అనేక స్థానిక పోరాటాలలో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. తన ప్రాంతంలో నిరంతర స్పూర్తిని నింపడంలో ముఖ్య భూమిక పోషించే వారు.
కులవ్యవస్థలో ఆధిపత్య దోరణిని అణచివేత దోరణులను దుయ్యబట్టే వారు తన చర్యల ద్వారా కూడా వాటిని ఆక్షేపించేవారు. జక్కేపల్లి దగ్గరున్నరాజుపేటకు చెందిన వెంకయ్య అనే హరిజనుడు దాసుగారి హరికథలను విని మురిసిపోయేవాడట. ఆయన బీదరికాన్ని చూసి చలించి పోయి ఆయనను ఇంటికి పిలిచి పక్కన కూర్చుని భొజనం పెట్టంచడమే కాకుండా విసనకర్రతో విసిరే వారట.
అన్నగారి వెంకట్రామయ్య నుంచి పొందిన ఆధ్యాత్మిక గుణాలను ధ్యానం తపస్సు ఉపాసనలను గాంధిపద్దతిలో మేళవించి తన సేవా గుణాన్ని జోడించి ప్రజల్లో జాతీయ భావం పెంపొందేందుకు వీలుగా తన జీవితం మొత్తాన్ని మలచుకోవడమే కాదు. వందలాది సప్తాహ కార్యక్రమాల్లో అదే పద్దతిలో జాతీయ భావాన్ని ఉద్భోదించేలా మాట్లాడేవారట.
గుప్త దాతగా
· తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న కలపను సీతారామచంద్రస్వామి రథగోపుర నిర్మాణానికి వాడారు.
· తమ్మరలో గాలిగోపురం, ధ్వజస్తంభం పనులు డబ్బులేక ఆగిపోతే ఇంటికి మనిషిని పంపించి బార్యచేతి బంగారు గాజులు తెప్పించి అమ్మారు.
· జగ్గయ్య పేటలో సప్తాహం పూర్తయిన తర్వాత పండిత సత్కారాలకు డబ్బు సరిపోకపోతే తన చేతి బంగారు కంకణాన్ని అమ్మారు.
· నల్గొండ జిల్లా హుజూర్నగర్ దగ్గర్లో వున్న సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించారు.
· ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని జీర్ణోద్దరణ కావించారు.
· ఆరోజులలో భద్రాచలం శ్రీరాముడ్ని దర్శించుకునేందుకు తిరువూరు మార్గం నుండి వేళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటుచేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్న దానం చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కేశవదాసు భరించేవారు.
· తిరువూరు సత్యనారాయణ స్వామి ఆలయం ఎదురుగా ఆర్ టి సి బస్టాండు ప్రహారీ గోడను ఆనుకుని ప్రస్తుతం వున్న దాసుగారి బావి అని పిలవబడుతున్న బావి అప్పట్లో భద్రాచలం వెళ్లే యాత్రికుల సౌకర్యంతోపాటు గ్రామ నీటి అవసరాలకు కూడా ఉపయోగపడాలని తవ్వించినదే.
· కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించారు. ఆలయానికి సంభందించిన వింజామరలల వంటి అనేక వస్తువులు అవసరమైన మరమత్తులు, అదనపు హంగులకు సాయపడ్డారు
· కనక్తార పినిమా పనులు పూర్తికాగానే కలకత్తానుంచి తిరిగి వస్తుండగా నిర్మాత దాసుగారి చేతిలో 600 రూపాయిలు పెట్టారట వెంటనే దాసు గారు ఆ డబ్బుతో తమ్మర స్వామికి రెండు చామరాలు (విసనకర్రలు) ఞక భూచక్ర గొడుగు కొని తీసుకు వచ్చి స్వామికి సమర్పించినాకనే అప్పటి వారి నివాసం జక్కేపల్లికి వెళ్ళారట
· పోలంపల్లిలో కనక్తార నాటకం వేయించగా వచ్చిన పదివేల రూపాయిలను అక్కడి గ్రంధాలయానికి పుస్తకాలు బీరువాలు కోసం వినియోగించారు.
యోగ సాధన
కేశవదాసు చిన్నప్పటినుంచే ఆధ్యాత్మిక గోష్టుల పట్ల చాలా శ్రధ్ద చూపే వాడు, ప్రాధమిక విద్య అంతా తండ్రి దగ్గరే పూర్తి చేసుకున్నప్పటికీ, తండ్రి లక్ష్మీనారాయణ దాసు గారి చిన్నతనంల లోనే దూరం కావడంతో అన్న వెంకట్రామయ్య దగ్గర పెరిగాడు. వెంకట్రామయ్య ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఉపాసనా విధ్యను సాధన చేసే వారు. బ్రహ్మచర్య వ్రతావలంబకులు తమ్ముడు దాసుకు ఉపాసన విద్యను, రామనామ మంత్రాన్నీ ఉపదేశించింది వెంకట్రామయ్య గారే. కానీ తమ్ముడిని తనలా ఆజన్మ బ్రహ్మచారిగా వుండకుండా వివాహమాడి వంశోధ్ధారణ చేయమని ఆదేశించారు. హరికథకులు కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామం లోని ఒక యోగి పుంగవులు శ్రీ నాగ దాసు గారి ఆద్యాత్మిక జీవితాన్ని అద్యయనం చేసి వారిపై నాగదాసు గారి గురించి హరికథ కూడా వీరు రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ సమీపంలోని సుజాత నగర్ బస్ స్టేజీ దాటిన తర్వాత వచ్చే కొండగుహలన్నింటినీ తిరిగి అంకమ్మ విగ్రహం చెక్కి కొంతకాలం సాధన చేసారు. దానికి పసుపు గుడ్డ చుట్టి స్టేజికి సమీపంలో ఒ గుడికట్టి అందులో విగ్రహాన్ని స్థాపించారు. అదే అంకమ్మ గుడి అది ఇప్పటికీ వుంది.
రచనలు
ముద్రితాలు
ఈ పుస్తకములు ముద్రణకు నోచుకున్నవి కానీ ప్రతులు బొత్తిగా అరుదైపోయినవి స్వల్పంగా అక్కడక్కడా దాచబడిన ప్రతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయవలసి వుంది
· కేశవ శతకం
· కనకతార – (1926) నాటకం
· కనక్తార పాటలు
· బలి బంధనం – (1935) ఆరు అంకముల నాటకం
· శ్రీరామ నామామృత గేయము (1922) [4]
· సీతాకళ్యాణం
· రుక్మాంగద
· మేలుకొలుపులు
· జోలపాటలు
· సత్యభామా పరిణయం (హరికథ)
· సీతా కల్యాణం (హరికథ)
· రుక్మాంగద (హరికథ)
· నాగదాసు చరిత్ర (హరికథ)
· శ్రీరామ దండకము
· పంచరత్నాలు
· మోతీలాల్ స్మృతి పద్యము
· శ్రీరామ స్తవ రాజము
· పండితాభిప్రాయములు (సతి సక్కుబాయి)
· రాధాకృష్న పాటలు
· శ్రీకృష్ణ తులాభారము నాటకము నందలి కీర్తనలు
· గాంధీ ప్రశంసా గీతము
· మోతీలాల్ స్మృతి గీతము
· సతీ సక్కుభాయి సినిమా పాటలు
· శ్రీకృష్ణ తులాభారము సినిమా పాటలు
· సతీ అనసూయ సినిమా రచన
· ముందుమాటలు (బలిబంధనము, నాగదాసు చరిత్ర, సతీ సక్కుభాయి నాటకం)
అముద్రితాలు
ఈ రచనలు రాతప్రతులుగా వేర్వేరు వ్యక్తుల వద్ద అందుబాటులో వున్నవి వీటిని ముద్రణలోకి లేదా కనీసం ఎలక్ట్రానిక్ ప్రతులుగా అందుబాటులోనికి తేలవలసి వున్నది.
· పంచముఖ ఆంజనేయ దండకము
· అష్టావధాన పద్యాలు
· పాపట్ల కాంతయ్య గారి స్మృతి పద్యాలు
· మంగళహారతులు
· జోల పాటలు
· హెచ్చరికలు
· మేలు కొలుపులు
· ఇతరమైన పాటలు
· భక్త ప్రహ్లాద సినిమా పాటలు
· కనక్తార సినిమా పాటలు,పద్యాలు
· విరాట పర్వము (హరికథ)
అలభ్యాలు
ఆనోట ఈనోట విన్నవి, వివిధ సందర్బాలలో ప్రస్తావించబడినవి అయిన కొన్ని రచనలు తెలియవస్తున్నాయి కానీ వీటిప్రతులను వెదికి సంపాదించి సాహితీలోకానికి అందుబాటులోనికి తీసుకురావలసిన అవసరం వున్నది.
· వీరరాఘవ శతకము
· రుక్మాంగద నాటకము
· పాదుకా పట్టాభిషేకము నాటకము
· లంకాదహనము నాటకము
· సతీ తులసి నాటకము
· సీతాకళ్ళాణ నాటకము పాటలు
· భక్త అంభరీష హరికథ
· సీతాకళ్యాణము హరికథ
· లవకుశ హరికథ
· లంకాదహనం సినిమా రచన
· కనక్తార సినిమా రచన
· దేశమాత దిగులేల దేశభక్తి గీతము
సినిమా పాటలు
· కనకతార
· లంకాదహనం
బిరుదులు
· ఆంధ్రసూత
· కలియుగ దశరథ
· నటనా వతంస
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-2-22-ఉయ్యూరు —