మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92
· 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత –చందాల కేశవదాసు -3
అనుయాయులు, శిష్యులు
1950-51 లో బేతవోలు వాస్తవ్యులైన ముడుంబై వేంకటాచార్య గారికి కేశవదాసు ఓ హరికథలో పరిచయం అయ్యారు. ఆచార్యులు వైద్యవృత్తిపై తనకున్న ఆశక్తి వలన దాసుగారి కుమారుడు కృష్ణమూర్తి డాక్టరని తెలుసుకుని ఆయన దగ్గర కాంపౌండర్ గా నాయకన్ గూడెం వచ్చి చేరారు. ఆయన ఒకనాడు ద్రాక్షరసం అనుకుని హైడ్రో క్లోరైడ్ త్రాగితే అయి విషంగా వికటించింది. దాంతో దాసుగారు స్వయంగా ఖమ్మం వెళుతున్న నైటు హాల్టు బస్సును వెనక్కి మళ్ళించి ఆయన్ని సూర్యపేట తీసుకు వెళ్ళి మద్రాసు నుంచి ‘ప్రోనట్’ అనే ఇంజక్షన్ తెప్పించి డా.శర్మగారితో వైద్యం చేయించి బ్రతికించారట. ఇద్దరు శిష్యులు తమ పుస్తకాలను దాసు గారివద్ద పరిష్కరింప జేసుకున్నారు వారు. బొర్రా కోటయ్య చౌదరీ అనే మాజీ కస్టమ్స్ అధికారి ‘భారత కర్మాగారము’ అనే సాంఘిక నాటకాన్ని రచించి దాన్ని దాసుగారితో పరిష్కరింప జేసుకున్నారు. దాసుగారి లాగానే దాన్ని రామాంకితం చేసారు. దబ్బాకుపల్లి డా చింతాల సుబ్బారావు రెండవ వారు ఆయన మాధవ శతకమును పరిష్కరింపజేసుకున్నారు.
వివాదాలు
1. శ్రీకృష్ణతులాభారం నాటకానికి చందాల కేశవదాసు 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని ‘మైలవరం బాలభారతి నాటక సమాజం’ వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో బలే మంచి చౌక బేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అనే మూడు పాటలే సినిమాల్లోకి ఎక్కాయి. (పైడిపాల రాసినట్లుగా) 1935, 55, 66 సంవత్సరాల్లో తీసిన మూడు సినిమాల్లోనూ ఈ మూడు పాటలున్నాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి… రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా టైటిల్స్‌లో కేశవదాసు పేరు చేర్చడం జరిగింది.[5]
2. పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు. అయితే, మొదట కవిగారు పాటలు చేర్చడానికి ఒప్పుకోలేదు. కాని మైలవరం బాలభారతి నాటక సమాజం పెద్దలు ఆయన్ని ఒప్పించారు. భక్తిగీతాలు మాత్రమే రాయాలని కవిగారు షరతు పెట్టి కేశవదాసుగారి పాటలతో నాటకాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. ఈ పాటలను 1929లో కురుకూరి సుబ్బారావు అచ్చువేశారు.[5]
3. సురభి నాటకంలోని మూడు పాటల్ని సినిమాలోకి ఎక్కించారని ‘ముక్తకంఠం’తో చెప్పిన పెద్దలు గౌరవనీయులు- వారి మాట శిరోధార్యమే. కాని నాటకం నుండి సినిమాకెక్కాయా? సినిమా నుండి నాటకంలోకి దిగినాయా? అనే సందేహానిక్కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే దాసు గారిపై పరిశోదన చేసిన డా॥ఎం.పురుషోత్తమాచార్య తండ్రిగారు వెంకట నరసింహాచార్యులు దాసుగారి సమకాలికులు. జగ్గయ్యపేటలో ఒక హరికథాగానంలో ఉండగా హెచ్.ఎం.రెడ్డిగారి నుండి పిలుపు వచ్చిందనీ, తాను వెళ్లి ‘ప్రహ్లాద’ సినిమాకు పాటలు రాసి వచ్చాననీ దాసుగారు చెప్పినట్లు తెలియజేసారు.[5]
జక్కేపల్లి ఇంటిపై రజాకార్ల దాడి
1946లో విసునూరి దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి తన మనుషులతో దొడ్డి కొమురయ్యను చంపించగా మొదటి సాయుధపోరాటం ప్రారంభం అయ్యింది. 1947 లో అప్పటి నైజాం రాష్ట్రం అంతా 8 నిజాం ఉస్మానలీ పాలనలోకి వచ్చింది.అజాద్ హైద్రాబాద్ నినాదంతో ఆయన ఇత్తేహాద్ ఉల్ ముస్లిమీన్ నాయకుడు కాశిం రజ్వీ నాయకత్వాన ‘రజాకార్’ సైన్యం ఏర్పాటు చేసాడు. చివరకు రజాకార్ దళాల చేతిలో కీలుబొమ్మగా మారి వారినుంచి తన అధికారం కాపాడుకునేందుకు వారిని గ్రామాలపై దోపిడీలకు ఉసిగొల్పాడు. దీన్ని వ్యతిరేఖించిన స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆంద్రమహాసభ సంఘలు సమైఖ్యంగా సత్యాగ్రహపు పోరాటాలకు పిలుపునిచ్చాయి. అదే పిలుపులో బాగంగా రజాకార్ దళాల అకృత్యాలకు నిరసన గళం వినిపించారు దాసుగారు సైతం. ఈ వ్యతిరేఖను సహించలేని రజాకార్లు మరింత సైన్యాన్ని జతచేసుకుని ముమ్మరంగా దాడులను చేయడం మొదలేసింది. అందులో బాగంగానే 1948 జూలైలో రజాకార్లు జక్కేపల్లిలో ప్రవేశించి భీభత్సం సృస్టించారు. కేశవదాసు ఇంటిని దోచుకున్నారు. ఆయన రచనా సంపద, వస్తు సామగ్రి, ఆస్తిపాస్తులు ధన దాన్యాలు దోపిడీకి గురయ్యాయి. ఆ సంవత్సరం చివర్లో తన పొలాలను నమ్మకస్తులకు అప్పగించి దాసు గారు కుటుంబంతో సహా జక్కేపల్లి నుంచి ఖమ్మం చేరారు. కానీ కృష్ణమూర్తి గారి వైద్య వృత్తి సాధనకు ఖమ్మం కంటే ఏదైనా గ్రామీణ ప్రాంతం బావుంటుందని ఓ రెండేళ్ళ అనుభవంలో గ్రహించి 1950లో నాయకన్ గూడెం చేరారు.
మరణం
1950లో నాయకన్‌గూడెంకు మారింది. కేశవదాసు గారు చివరి రోజులను నాయకన్ గూడెంలోనే గడుపుతూ అక్కడే 1956 మే 14న అంటే దుర్ముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాడు చివరి శ్వాస విడిచారు.[3]
చివరిగా తమ్మర దర్శనం
1956 ఏప్రిల్ లో మనసుకి ఊరటకావాలంటే గతంలో వెళ్ళినట్లే తమ్మర సీతారామచంద్రుని దర్శనం కోసం వెళ్ళారట. కానీ మునుపటి ఉత్సాహం వారిలో లేదు ఎందు కంటే అక్కడ ఎప్పటిలా తన చిన్ననాటి స్నేహితులు నరసింహాచార్యులు, హనుమచ్ఛాస్త్రి, పాపట్ల లక్ష్మీకాంతయ్య మొదలైన వారు కనిపించలేదు. వారు అప్పటికే పరమపదించారు. అంతా శూన్యంగా అనిపిస్తుంటే అలా గోడకు చేరగిల పడి అప్పటి దేవాలయ ధర్మకర్తలలో ఒకరైన నారపరాజు నారాయణ రావు గారితో నిర్వేదంగా అంపశయ్యమీద స్వయం మరణాన్ని కోరుకున్న భీష్ముడిలా ఇలా అన్నారట. ఇప్పటికే 80, 90 ఏళ్ళు వచ్చేశాయి. నేను తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు గతించి పోయారు. చేయాల్సిన చేయగల పనులన్నీ భగవంతుడి దయమేరకు కుదిరినంతా చక్కబెట్టేశాను. పిల్లలను పెంచి ప్రయోజకులను చేసాను. ఇహ ఉండి ఎందుకు ఒక్కణ్ణి ఏకాకిని ప్రయాణానికి సిద్దమవుతాను అన్నారట తమ్మరనుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉపాసనాధ్యాన లక్షణాలు మరింతగా పెరిగాయట, ఆహార తీసుకోవడం బాగా తగ్గించారట. ఎప్పటిలాగానే మే 14న రామనామ స్మరణతో నిద్రలేచిన దాసుగారు స్నానాదికాలు ముగించుకుని నిలువు నామాలు పెట్టుకుని ఆరోజు కొడుకు కృష్ణమూర్తిని ఎక్కడికీ వెళ్ళవద్దని ఆదేశించారట. నవ్వుముఖంతో ప్రశాంతమైన వదనంతో ఇంట్లోవారందరినీ, ఇంటినీ ఒకసారి కలియజూసి కన్నులు మూసుకుని ధ్యానంలోకి జారిపోయారట. అలా ధ్యానం చూస్తుండగానే దీర్ఘ నిద్రయై వారికి ఇష్టమైన తమ్మర రామునిలో లీనంమై పోయిందని కుటుంబ సభ్యులు కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు.