శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం
వాకాడు వాస్తవ్యులు జూటూరు లక్ష్మీ నరసింహయ్య రచించగా కావలిలోని వాయునందన ప్రెస్ లో 1931లో ప్రచురింపబడింది .వెల బేడ.అంటే రెండు అణాలు .విజ్ఞప్తి లో కవి కూడలి గ్రామ సమీపం లో వేదికాపురి అనే పేరున్న తిన్నెలపూడి గ్రామం లో భక్తీ విద్యా వినయ సౌశీల్య సుహృద్భావ గౌరవాదులున్న శ్రీ కోటమ రెడ్డి చెంచు రాఘవరెడ్డి గారు శ్రీ వేణు గోపాల మందిరం కట్టింఛి స్వామికి సకల విధ పూజలు జరిపిస్తూ ఆ క్రితం ఏడాది స్వామి కళ్యాణోత్సవానికి ఆహ్వానించగా కవి గారు వెళ్లి ,ఆఉత్సవ వైభవం చూస్తూ ఉండగా మనసులో ‘’వేణుగోపాలుడు కృష్ణమూర్తి మము బాలన సేయు దయా౦తరంగుడై ‘’ అనే మకుటం ఆశువుగా స్ఫురించి వెంటనే రెండు పద్యాలు జాలువారాయి .రెడ్డి గారు విని ఆ మకుటంతో శతకం రాయమని కోరగా ,స్వామి అనుగ్రహం తో రాసి నాయుడి పేట వాస్తవ్యులు ఉభయ బాషా పాండితీ ధురీణులు,’’శ్రీ సోమశైలం ‘’మొదలగు గ్రంధకర్తలు బ్రహ్మశ్రీ ఉత్పల నరసింహ శాస్త్రి గారు ,ఆయనసోదరులు శ్రీ కృష్ణ శాస్త్రి గారు కొన్ని పద్యాలు సవరించారు .తర్వాత గూడూరు హైస్కూల్ ప్రధాన తెలుగు పండితులు ,ఉభయ భాషా వేద,వేదాంత విదులు ,లక్ష్మీ కటాక్షం మొదలైన గ్రంథకర్తలు ఆమూలాగ్రం సవరించి ముద్రణ కు అనుమతిచ్చారు .శ్రీ పైడిపాటి సుబ్బయ్యగారు కొన్ని సవరణలు చేశారు .రెడ్డిగారు స్వంతఖర్చుతో శతకం ముద్రించి అందించారు అని తెలియ జేశారు .ఉభయ వేదాంత శ్రీ కా౦డూర్ కృష్ణమాచార్యులు అభిప్రాయం తెలియజేస్తూ ‘’భాగవత కథాబోధనంగా శతకం ఉంది .శతకం లకార ప్రాస తో రాయాల్సి వచ్చినందువలన పునరుక్తులున్నా ,శ్రవణానదకం గా ,రసజ్ఞా హృదయ రంజకం గా శతకం ఉంది ‘’అని శ్లాఘించారు .
కవిగారు శతకాన్నిఉత్పల మాలగా అల్లి, వేణు గోపాలుని అలంకరించారు .మొదటి పద్యం –
‘’శ్రీ లలనా మనోహరుడు ,సేవక నేత్ర చకోర చంద్రుడా –పాలిత సర్వలోకు డఘుపంక్తి విభేదకుం డాశ్రితాలికిన్
శ్రీల నొసంగువాడు ,శుభ శీలుడు తిన్నెలపూడి వేణు గో –పాలుడు కృష్ణమూర్తి మము బాలన సేయు దయాంత రంగుడై’’అని రాశారు .తర్వాత ఉత్పలలు సువాసనలు వెదజల్లుతూ పరిగెత్తాయి .బాలుడు చిన్నికృష్ణుడు శుభంకరుడంచిత బర్హి బర్హ సంకీలిత మౌళి ‘’అన్నారు కాల గళార్చితుడు,సహితి కంఠ శరాసన భంజనుండు ,శంపాలతికాభ చేలుడు ‘’అనికీర్తించారు .లీలతో జగాలని తిప్పుతూ మాయకు దూరుడై ఉంటాడనీ ,’’శీలి ,సుగంధ పాత్ర తులసీ నవ పత్ర విరాజ మాన సన్మాలి ,కలాప మౌళి అనీ ,మకరిపాదం పట్టి లాగుతుంటే ‘’గోలుకోనంగ లేను నిను గోరితి మురారి ‘’అని వేడుకొన్న ‘’శు౦డాలం’’ ను రక్షించాడు .’’బాలశిఖామణీ దనుజబాధలకోర్వలేకున్నాము ‘’.అని ప్రార్ధించిన దేవతలను కాపాడాడు స్వామి .
స్వామిముగ్ధమోహన రూపాన్నివర్ణిస్తూ –
‘’చాల విశాలమౌ నురము ,శాంత శుభాకృతి బద్మ నేత్రముల్ –బాలకరీంద్ర యానము ,శివంబగు భావము ,నీశ్వరత్వమున్
వ్యాళ శయానమున్ గరుడ యానము గల్గి న యట్టి ‘’వాడు వేణుగోపాలుడు . బాలిక యోగమాయ ను చూసి బాలిశుడైన కంసుడు కాళ్ళూ చేతులు పట్టి ,కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ నేలకు లాగితే, పైకెగసే నేర్పు చెప్పిన నేర్పుగాడు .’’బాలుడటంచు ముద్దులిడు భామల బట్టుచు మోవినోక్కి ,కేంగేలులన్ జెక్కులన్నిమిరి గేలి చేసే చిలిపి కృష్ణయ్య .దూడలు పాలకు ఏడుస్తుంటే ఆవులదగ్గరకు దూడల్ని తోలి ఆడుతూ పాడుతూ వెళ్ళే గోపాలుడు కన్నయ్య .బ్రహ్మ చేసిన తప్పిదానికి ‘’బాలక ,వత్స రూపముల దాల్చి న విశ్వమయుడు ‘’.అత్తమామల్ని పిల్లని వదిలేసి అర్ధరాత్రిలో వేణునాదానికి ఆకర్షితులై రావటం బాగుందా ‘’అనే బోధగురువు స్వామి .మీ మనస్సంతాభక్తితో నిండింది కదా ఇంకా చాలదా అని కొంటె ప్రశ్న వేసినవాడు .’’సాలము నెక్కి తద్వసన జాలము దాచిన దన్ను జూచి యా –బాలికలెల్ల సిగ్గువడి ,వారి తరంగల ను౦ డలేక –దత్సాలము జేర వల్వలనోసంగి మమత్వము బాపు వేణుగోపాలుడు కేవలతత్వాన్ని బోధించాడు .121వ పద్యం లో తప్పులుంటే క్షమించమని చెప్పి ,122వ పద్యం లో ధర్మకర్త కోటమ రెడ్డి రాఘవరెడ్డి గారిని యశస్సుతో కాపాడమని వేడాడు వేణుగోపాలుని .
చివరి 124వ పద్యం లో –
‘’మూలము బ్రహ్మమంచు దలపోసెడు జూటురు పద్మనాభ స –చ్ఛీలి కుమార లక్ష్మీ నరసింహ ధరామారు నెల్ల వేళలన్
శ్రీల నొసంగి బ్రోచు, శుభ చిత్తుడు,సద్గుణమూర్తి వేణు గో-పాలుడు కృష్ణమూర్తి మము బాలన సేయు దయాంత రంగుడై’’అని ముగించారు కవి .
ఇంతకంటే కవి ఏమీ తనగురించి చెప్పుకోలేదు .కవిత్వం ద్రాక్షాపాకం .బాలకృష్ణ లీలా విలాసంగా భాగవత ధర్మాను గుణంగా శతకం రాశారు కవి .కవిపేరు, శతకం పేరు మన వాళ్ళు ఎక్కడా పేర్కొనక పోవటం ఆశ్చర్యమే .గొప్ప భక్తి శతకం ఇది .కవినీ, శతకాన్నీ పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది . మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-2-22-ఉయ్యూరు