మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101
101-ఎమ్‌జి ఆర్ నే మెప్పించిన కధకుడు ,మహా డబ్బింగ్ రైటర్ ,’’కురిసింది వానా ‘’ పాట ఫేం,సంగీత దర్శకుడు,సినీ డైరెక్టర్ –రాజశ్రీ
రాజశ్రీ అనే ఇందుకూరి రామకృష్ణం రాజు (ఆగష్టు 31, 1934 – ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు.
జననం
వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ.
వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి బి.ఎస్సీ. పట్టా పొందారు. వీరు తొలినుంచి నాటక సాహిత్యాభిలాషి. వీరి ‘వదిన’, ‘ఆంధ్రశ్రీ’ నాటకాలు రాఘవ స్మారక కళాపరిషత్తులో ఉత్తమ రచనలుగా ఎన్నుకోబడ్డాయి. విశాఖ జిల్లా బోర్డు కార్యాలయంలో స్టెనో టైపిస్టుగా కొంతకాలం పనిచేశారు.
చలనచిత్ర రంగానికి తరలి వెళ్ళి పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు వద్ద సహాయ దర్శకునిగా చేరారు. తరువాత తమిళ చిత్రసీమ వీరిని కథకునిగా పరిచయం చేసింది.
సినీ రచయిత
రాజుశ్రీగా ప్రసిద్ధులైన ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రముఖ సినీ రచయిత. 1934 ఆగష్టు 31 న విజయనగరంలో అప్పలరాజు, నారాయణమ్మలకు జన్మించాడు. ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాశాడు. బి.యస్సీ ఫిజిక్సు పూర్తి చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి.ఏ.గా చేసి, అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ ఎం.జి.ఆర్.ని కలిసి ఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు. అది ఎం.జి.ఆర్. గారికి నచ్చడంతో “తేడివంద మాప్పిళ్ళై”పేరుతో సినిమా తీశారు. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాత దాదాపు 10 వరకు తమిళ చిత్రాలకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. సుమారు 1000 చిత్రాలకు రచన చేశారు. అంతే కాకుండా ఎంకన్న బాబు, మామా కోడలు, పెళ్ళిచేసి చూపిస్తాం , “పుదియ సంగమం” అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. చదువు సంస్కారం, నిజం నిద్రపోదు (1976), ఓ ప్రేమ కథ (1987) చిత్రాలకు దర్శకత్వం వహించారు. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలికి మాటలు రాశారు. మట్టిలో మాణిక్యం, బంగారు గాజులు చిత్రాలకు బంగారు నంది బహుమతులు అందుకున్నారు. రాజశ్రీ రచించిన చివరి చిత్రం ప్రేమికుడు. 1994 ఆగస్టు 14 న నిదురలోనే మరణించాడు.
అతని కుమారుడు రాజశ్రీ సుధాకర్ ఏవిఎమ్ వారి విక్రమ్ నటించిన జెమిని, సూర్య నటించిన వీడొక్కడే, లక్ష్మి గణపతి ఫిలిమ్స్ వారి అర్జున్ నటించిన సింగమలై వంటి కొన్ని తమిళ అనువాద చిత్రాలకు, మరి కొన్ని ఆంగ్ల అనువాద చిత్రాలకు మాటలూ,హృతిక్ రోషన్ నటించిన క్రిష్ , జోధా అక్బర్,ధూమ్-2, అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో రేస్, వంటి ఎన్నో హిందీ అనువాద చిత్రాలకు మాటలు-పాటలు రాశాడు.
రాజశ్రీ 1934 ఆగస్టు 31న విజయనగరంలో జన్మించారు. మహారాజా కళాశాల నుండి బి.ఎస్సీ, పట్టా పుచ్చుకున్నారు. చదువుకొనే రోజుల నుంచీ శ్రీశ్రీ అంటే ఆయనకు ఎంతో అభిమానం. దాంతో కవితలు, పద్యాలు రాసేసి చుట్టూ ఉన్న వారిని అలరించేవారు. నాటికలు, నాటకాలు రాసి వాటికి దర్శకత్వం వహించి ఆకట్టుకొనేవారు. విజయనగరం తాసిల్దార్ కార్యాలయంలో కొంతకాలం టైపిస్ట్ గా పనిచేశారు. తమిళ సూపర్ స్టార్ ఎమ్జీఆర్ కోసం ఓ కథ రాసుకొని, మదరాసు వెళ్ళి దానిని వినిపించారు. ఆ కథ ఎమ్జీఆర్ కు బాగా నచ్చింది. అదే కథతో ఎమ్జీఆర్ ‘తేడీవంద మాప్పిళ్ళై’ సినిమా రూపొందింది. ఆ తరువాత ప్రముఖ తెలుగు రచయితలు పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు దర్శకత్వం వహించిన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తెలుగువారి తొలి అనువాద చిత్రం ‘ఆహుతి’కి శ్రీశ్రీ రచన అలరించింది. అప్పటి నుంచీ శ్రీశ్రీ ఓవైపు తన బాణీ పలికిస్తూనే, మరోవైపు డబ్బింగ్ రైటర్ గానూ మురిపించారు. శ్రీశ్రీ అభిమాని అయిన రామకృష్ణంరాజు చిత్రసీమలో తన పేరును రాజశ్రీగా మార్చుకున్నారు. కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు నిర్మించిన “ఆడపెత్తనం” చిత్రానికి శ్రీరామ్మూర్తి వద్ద పనిచేసిన రాజశ్రీ, తరువాత “అన్న-తమ్ముడు, పరువు-ప్రతిష్ఠ, శాంత, నిత్యకళ్యాణం పచ్చతోరణం, శ్రీకృష్ణమాయ” వంటి సినిమాలకు రచనలో పాలు పంచుకున్నారు. అదే సమయంలో పది తమిళ చిత్రాలకు కథ స్క్రీన్ ప్లే రాశారు. తెలుగులో చలం, దాసరి నారాయణరావు వంటివారు రాజశ్రీని పాటల రచయితగా బాగా ప్రోత్సహించారు. చలం నిర్మించిన “సంబరాల రాంబాబు, బుల్లెమ్మా-బుల్లోడు, దేవుడమ్మ, తులాభారం, రాముడే దేవుడు, ఊరికి ఉపకారి” వంటి చిత్రాలకు పాటలతో అలరించారు.
చలం పరభాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసే సమయంలో రాజశ్రీతోనే రచన చేయించేవారు. అలా పలు భాషల చిత్రాలు చూస్తూ పట్టు సంపాదించారు. కొన్ని చిత్రాలను మన తెలుగు నిర్మాతలు డబ్బింగ్ చేసేవారు. దాంతో తెలుగు మాటలు, పాటలు రాజశ్రీ పలికించేవారు. అలా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు అందించడంలో రాజశ్రీ బిజీ అయిపోయారు. దాదాపు వెయ్యిపైగా చిత్రాలకు రాజశ్రీ అనువాద రచన చేశారు. వాటితో పాటు అనేక తెలుగు చిత్రాలకు కథలు అందించారు, పాటలు రాశారు. మణిరత్నం, శంకర్ వంటి టాప్ డైరెక్టర్స్ తమ తెలుగు అనువాద చిత్రాలకు రాజశ్రీతోనే పాటలు మాటలు రాయించుకొనేవారు. మణిరత్నం తెరకెక్కించిన ఏకైక తెలుగు చిత్రం ‘గీతాంజలి’ చిత్రానికి ఆయనే రచన చేశారు. శంకర్ రూపొందించిన ‘ప్రేమికుడు’ చిత్రానికి రచన చేశాక, నిద్రలోనే రాజశ్రీ కన్నుమూశారు.
రాజశ్రీ నేడు మనమధ్య లేకపోయినా, ఆయన రాసిన అనేక పాటలు ఈ నాటికీ అలరిస్తూనే ఉన్నాయి. ‘మా దైవం’లోని “ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే…” అనే పాట ఇప్పటికీ కులమతభేదాలకు అతీతంగా చర్చలు సాగే సమయంలో వినియోగిస్తూనే ఉన్నారు. “కురిసింది వానా… నా గుండెలోన…”, “యమునా తీరానా రాధ ఒడిలోన…”, “సింహాచలము మహాపుణ్యక్షేత్రము…”, “మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట…”, “నన్ను ఎవరో తాకిరి… “, “రాధకు నీవేరా ప్రాణం…”, “ఇదే నా మొదటి ప్రేమలేఖ…”, “ఇది పాట కానే కాదు…” వంటి పాటలు రాజశ్రీలోని కవిహృదయాన్ని మనముందు నిలుపుతూనే ఉంటాయి. పాటలు, మాటలు పలికించడంలోనే కాదు సంగీతం సమకూర్చడంలోనూ రాజశ్రీకి పట్టుంది. అది తెలిసిన కొందరు ఆయనతో స్వరకల్పన కూడా చేయించారు. “వెంకన్నబాబు, మామాకోడలు, పెళ్ళిచేసిచూపిస్తాం” వంటి చిత్రాలకు రాజశ్రీ సంగీతం అందించారు. ఇక “చదువు-సంస్కారం, నిజం నిద్రపోదు, ఓ ప్రేమ కథ” వంటి చిత్రాలకూ దర్శకత్వం వహించారు. రాజశ్రీ పేరు
గుర్తుకు రాగానే ఈ నాటికీ ఆయన బహుముఖ ప్రజ్ఞను గుర్తు చేసుకొనేవారెందరో ఉన్నారు.
మహారాజ “రాజశ్రీ” – అంటూ భువనచంద్ర చెప్పిన విషయాలు
చిత్ర పరిశ్రమ మహా విచిత్రమైనది. ఇక్కడ ఎవరూ ఎవరికీ చూసి నేర్చుకోవాల్సిందే. ‘సిలబస్సు” |… వుండదు…! పుస్తకాలూ వుండవు! సీనియర్స్ నడిచిన బాటలోనే జూనియర్స్ నడుస్తూ ‘అనుభవాల పాఠాలు” నేర్చుకోవాలి. “దేన్నీ నేర్పరు.
నేనీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక ‘వాన’ పాట రాసే ఛాన్సొచ్చింది! అదీ మెగాస్టార్ చిరంజీవికి! చిత్రం పేరు ‘గ్యాంగ్‌లీడర్’, సంగీతం బప్పీలహరి. ‘వానపాట’ అనుకోగానే నా మనసులో రెండు పాటలు మెదిలాయి. ఒకటి ఆత్రేయ గారి ‘చిటపట చినుకులు పడుతూ వుంటే” పాట…. రెండోది రాజశ్రీ గారి ‘కురిసింది వానా నాగుండెలోనా’ పాటా! ఆ రెంటినీ మనసులో నెమరు వేసుకున్న పది నిముషాల్లో “వానావానా వెల్లువాయే… కొండకోనా తుళ్ళీపోయే” పాట వుట్టింది.
తెలుగుపాట ఎన్నియుగాలు నిలిచి వుంటుందో అన్నియుగాలు పైన చెప్పిన రెండు పాటలూ “’వానపాట’కి పాఠ్య(గ్రంథాలుగా నిలిచిపోతాయి. పాటకి అంత “బలాన్ని” ఇచ్చే “కలం” రాజశ్రీ గారిది. సున్నితమైన పదాలు వాడుతూ…. ఆ పదాలకి ఒక లయ. ఒక వయ్యారం. కాన్త చిలిపిదనం. మరికాన్త జాణతనం అద్దటం రాజశ్రీగారికే చెల్లింది. పచ్చని చేలల్లో నడిచే పల్లె పడుచు లాంటిది రాజశ్రీపాట! చిరుగాలికి ఊగే చివురాకులాంటిది రాజశ్రీ మాట!! 1934 ఆగస్టు 31న పుట్టిన ఇందుకూరి రామకృష్ణంరాజుగారు బి.ఎస్.సి. ఫిజిక్స్ చేసి, ఆ తరువాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు గారి వద్ద పి.ఎ.గా చేసి ఆ “సెక్రటరీత్వం’ నచ్చక మద్రాసు మెయిలెక్కి చెన్న పట్టణం చేరారు. ఆ రోజుల్లో ఎం.జి.ఆర్.తో మాట్టాడాలంటేనే దడ. మహామహులు కూడా చేతులు కట్టుకు నిలబడాల్సిందే. అట్టాంటిది మన “రాజశ్రీ” గారు డైరెక్టుగా ఎం.జి.ఆర్ని కలిసి ‘సార్… మీ కోసం నా దగ్గర ఒక కథ వుంది. వింటారా” అని అడగటం దుస్సాహసమే. ఆయన ‘రాజు’ గారి ముచ్చటపడి … “చెప్ప’ మన్నారు. ‘విన్న’ 15 రోజులకే షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమా పేరు “తేడివంద మాప్పిళ్ళ”. ఎం.జి.ఆర్ డబుల్ రోల్ పోషించిన సినిమా అది. అది విజయవంతం కాగానే ‘రాజశ్రీ’ గారి స్టోరీ తోనే మరో ఎం.జి.ఆర్. సినిమా “నినైల్ నిండ్రగళ్’ (“జ్ఞాపకాల్లో నిలిచిన దానా” అని అర్థం) మొదలైంది. కానీ మధ్యలో ఆగింది. ఆ రెండో సినిమా డైరెక్టర్ శ్రీ కె.బాలచందర్. సినిమా ఆగినా, కె.బాలచందర్ రాజశ్రీగార్ల పరిచయం మాత్రం అంతటితో ఆగలా. ఆల్మోస్ట్ చివరి వరకు కొనసాగుతూనే వచ్చింది. ఆ రెండు గాక ‘కాదల్ పరవై, ‘పాయ్సాల్లాదే’ ‘ఎన్‌తంగై’ ఆదిగా అనేక తమిళ చిత్రాలకి తెలుగు “రాజశ్రీ” గారు
కథా స్కీన్ ప్లే అందించటం మనకి గర్వకారణం. 50 నుంచి 60 చిత్రాల వరకు ‘కథా – స్కీన్ ప్లే అందించారు. కళాకారులకు లలిత కళలకు నిలయమైన “విజయనగరం’లో శ్రీ, ఇందుకూరి గురవరాజు నారాయణమ్మ గారలకు పుట్టిన రాజశ్రీ గారు సుమారు 1000 డబ్బింగ్ చిత్రాలకు మాటలు పాటలు వ్రాశారు. ‘్టైయిట్ చిత్రాలు కనీసం 200 వుంటాయి. “ఎంకన్నబాబు’… “మామా కోడలు, “పెళ్ళిచేసి చూపిస్తాం…” వంటి తెలుగు సినిమాలకే గాక ‘పుదియ సంగమం (ప్రభు – సుహాసిని) అనే తమిళ చిత్రానికి కూడా నంగీత దర్శకత్వం వహించారు. పుట్టిన సంవత్సరం లోపే తండ్రిని పోగొట్టుకున్న రాజశ్ర్రీగారు… తండ్రిగా తన సంతానానికి ఏ లోటూ రాకుండా పెంచారు. వారి తనయుడు, ప్రస్తుతం ఇంగ్లీష్ నుంచి తెలుగు ‘డబ్బింగ్స్’లో యమా బిజీగా వున్న రాజశ్రీ సుధాకర్ మాటల్లో చెప్పాలంటే “నాన్నగారు కోపంగా వుండటం ఏనాడూ వేము చూడలేదు. వర్క్ అయిపోగానే సాయంకాలం ఇంటికొచ్చేటప్పుడు మా కోసం మాకిషస్టమైన వస్తువులూ తినుబండారాలు తెచ్చేవారు. అంతే కాదు… చాలామంది నాన్నగారి దగ్గరికి సహాయం” చెయ్యమంటూ వచ్చేవాళ్లు, జేబులో ఎంత వుంటే ‘అంతా’ ఇచ్చేవారాయన వాళ్ళకి. ఎవరు అడిగినా ‘లేదు’ అని చెప్పడం ఆయనకి అలవాటు లేదు. హి వజ్ ఎ వెరీగుడ్ ఫాదర్. వెరీగుడ్ హ్యూమన్ బీయింగ్”. రాజశ్రీ గారితో ఎన్నో చిత్రాల అనుబంధం వున్న శ్రీరామకృష్ణగారు (డైరెక్టర్ మరియు డైలాగ్ రైటర్ “రాజశ్రీ గారు డబ్బింగ్లో ఒక కొత్త వరవడిని సృష్టించారు. మనిషిగానూ రైటర్‌గాను ఆయన మహోన్నతుడు. మృదున్వభావి. స్నేహశీలి… గొప్ప మనిషి” అంటారు.
మనిషి “’మంచితనం’ “చావు’లో ‘తెలుస్తుందంటారు పెద్దలు. ఎప్పుడూ వైట్ మరియు వైట్‌లో కనిపించే రాజశ్రీ, గారిది సునాయాస మరణం. “ప్రేమికుడు” పూర్తి చేసి మధ్యాహ్నం ఇంటికొచ్చి మరుసటి రోజు మొదలు పెట్టాల్సిన “డ్యూయెట్ సినిమా పాటలు ట్రాన్స్‌లేట్ చెయ్యమని సుధాకర్‌కి చెప్పి భోజనం చేసి కాసేపు కునుకుతీద్దామని పడుకున్న రాజశ్రీ, గారు ‘నిద్రలోనే’ ‘సిద్ధి’ పొందారు. అంతకన్నా “మనిషి నిర్మలత్వానికి’ బుజువేముంటుంది?
రాజశ్రీగారి మొదటి డబ్బింగ్ సినిమా ‘మూఢ నమ్మకాలు”. చివరి సినిమా ‘ప్రేమికుడు’. సూపర్ హిట్ ఫిలిమ్… బులైమ్మబుల్లోడు, మట్టిలో మాణిక్యం, దూడూ బసవన్న తోటరాముడు మొదలగునవి. సూపర్హిట్సాంగ్స్… “కురిసింది వానా నాగుండెలోన’, ‘ఓ బంగరు వన్నెల చిలకా, ‘ఇడ్లీపాపా…. ఇడ్లీ పాపా”నీపాపంపండేను నేడు’ ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’ మొదలగునవి… ఇక సూపర్‌హిట్ డబ్బింగ్ పాటలకి లెక్కేలేదు. ఎ.ఎం.రత్నంగారు రాజశ్రీ గార్ల కాంబినేషనంటే సూపర్ హిట్టే! . దర్శకత్వం వహించిన చిత్రాలు ‘చదువు సంస్కారం’,. రాజశ్రీగారి చిత్రాలు – మట్టిలో మాణిక్యం – బంగారు. గాజులు.” / ఇవిగాక ఎన్నో, సన్మానాలు, కళాసాగర్ ఎవార్డులు వారిని వరించాయి. వారు సంగీత దర్శకత్వం వహించిన “ఎంకన్న బాబు, “మామా కోడలు’ చిత్రాల్లో పాట వ్రాసే అవకాశం రావడం నా అదృష్టం. “హి ఈజ్. ఆల్వేస్ దేర్ అప్ ఎబౌవ్ ది స్కై. స్మయిలింగ్ లైక్ ఎ ఫ్లవర్ అన్న జేమ్స్, ఐర్ధాండ్ కవిత రాజశ్రీ గార్ని తల్చుకున్నప్పుడల్లా నాకు గుర్తు వస్తూనే వుంటుంది.
400కు పైగా డబ్బింగ్ సినిమాలకు ఆయన రచన చేశారు. ఆయన ఎక్కువగా తమిళం, కన్నడం నుంచి తెలుగులోకి డబ్ చేసిన చిత్రాలకు డైలాగ్స్, సాంగ్స్ రాశారు. సాధారణంగా స్ట్రయిట్ సినిమాల రచనతో పోల్చుకుంటే, డబ్బింగ్ సినిమాలకు రచన చేయడం ఈజీ అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ డబ్బింగ్ సినిమాకు డైలాగ్స్ రాయడం ఎంత క్లిష్టమైన పనో ఒకసారి రాజశ్రీ చెప్పారు.
ముక్తా ఫిలిమ్స్ వారి ‘వెళ్లితిరై’ ఆధారంగా వచ్చిన ‘మూఢనమ్మకాలు’ ఆయన తొలి చిత్రం. “డబ్బింగ్ రచయితలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే తలనెప్పి రచన ఇది. ఎందుకంటే తెరమీద నటీనటుల పెదవుల కదలికకు తగ్గట్టు ఒరిజినల్ డైలాగ్‌కు న్యాయం చేస్తూ తెలుగులో సంభాషణలు రాయాలి. సంభాషణల భావం చెప్పగలం. పెదాల కదలికకు సరిపోయేలా ఎలోగో చేయగలం. కానీ అదే పాట అయినప్పుడు చాలా కష్టం.” అంటూ ఆయన ఓ ఉదాహరణ చెప్పుకొచ్చారు.
“ఒక తమిళ చిత్రం తెలుగులోకి డబ్ చేస్తున్నాం. అందులో హీరోయిన్ జయలలిత. హీరోకి పొడుపు కథల్ని వేస్తూ పాట పాడుతుంది. హీరో ఆ పొడుపు విప్పాలి. ‘అక్కాళె వొరువన్, అప్పావై ఒరితియుమ్‘. హీరో విడగొట్టి చెపుతాడు. ‘అ కాళై ఒరువన్, అ పావై ఒరువన్‘ అని. హీరోయిన్ కలిపి చెప్పిన మాటని విడగొట్టడంతో అర్థం మారింది. కాళై అంటే మగ. పావై అంటే ఆడ. ఈ చరణాలప్పుడు తెరమీద క్లోజ్ షాట్లో వీళ్లుంటారు. కచ్చితంగా పెదాల కదలికకు తగ్గట్టు పాట రాయాలి. ఎలా? ఎంత ఆలోచించినా ఏం తోచలేదు. నాకు అది మొదటి చిత్రం. అప్పటికే ఎంతో అనుభవం, పేరుగల రచయిత అనిశెట్టిగారిని ఆ పాదం వరకు రాసిపెట్టమని అడిగాను. ఆయన చాలాసేపు ఆలోచించి పెదవి విరిచి వెళ్లిపోయారు. తమిళానికి సరైన అర్థం ‘అక్కయ్య మొనగాడు, అమ్మకు జతగాడు‘ అని. దాన్ని నేను ఇలా రాశాను – ‘అక్కకు అయ్య మొనగాడు, అమ్మకు జతగాడు‘ అని.”
చిత్రసమాహారం
కొన్ని ముఖ్యమైన చిత్రాలు
· శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)
· పెళ్ళి పందిరి (1966)
· పెళ్ళి రోజు (1968) (గీతరచన)
· బంగారు గాజులు (1968) (కథా రచన)
· సత్తెకాలపు సత్తెయ్య (1969)
· సంబరాల రాంబాబు (1970)
· మట్టిలో మాణిక్యం (1971)
· బుల్లెమ్మ బుల్లోడు (1971) (గీతరచన)
· దేవుడమ్మ (1973)
· తులాభారం (1974)
· చదువు సంస్కారం (1975) (కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం)
· అర్జున గర్వభంగం (1979) (మాటలు, పాటలు) (అనువాదం – కన్నడ)
· స్వయంవరం (1982)
· ఖైదీ (1983)
· డార్లింగ్ Darling డార్లింగ్ (1983)
· ప్రేమసాగరం (1983) (అనువాదం – తమిళం)
· మౌన రాగం (1986) (అనువాదం – తమిళం)
· నాయకుడు (1987) (అనువాదం – తమిళం)
· విచిత్ర సోదరులు (1989) (అనువాదం – తమిళం)
· ప్రేమ పావురాలు (1989) (అనువాదం – హిందీ)
· గీతాంజలి (1989)
· చిలిపి సంసారం (1990) (అనువాదం – తమిళం)
· దళపతి (1992) (అనువాదం – తమిళం)
· జంటిల్ మేన్ (1993) (అనువాదం – తమిళం)
· ప్రేమికుడు (1994) (అనువాదం – తమిళం)
· మైఖేల్ మదన కామరాజు (అనువాదం – తమిళం)
· ఘర్షణ (పాతది) (అనువాదం – తమిళం)
· వైశాలి ( అనువాదం- మళయాళం)
· ఆడదాని అదృష్టం (మాటలు)
కొన్ని ఆణిముత్యాలు
· కురిసింది వాన నా గుండెలోన… – బుల్లెమ్మ బుల్లోడు
· యమునాతీరాన రాధ మదిలోన… – గౌరవం-అనువాదం
· సింహాచలము మహా పుణ్య క్షేత్రము… – సింహాచల క్షేత్రమహిమ
· మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట… – మట్టిలో మాణిక్యం
· నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి… సత్తెకాలపు సత్తెయ్య
· మామా చందమామ విన రావా… సంబరాల రాంబాబు
· ఎక్కడో దూరాన కూర్చున్నావు… దేవుడమ్మ
· నిన్ను తలచి మైమరచా… – విచిత్ర సోదరులు
· మధువొలకబొసే ఈ ఛిలిపి కళ్ళు– కన్నవారి కలలు
· రాధకు నీవేర ప్రాణం – తులాభారం
· నీ నీడగా నన్ను కదలాడనీ
· ఇదే నా మొదటి ప్రేమ లేఖ –స్వప్న
· ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే –మాదైవం
· ఇది పాట కానే కాదు–తలంబ్రాలు
సశేషం
రేపు మహాశివరాత్రి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-22-ఉయ్యూరు