మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -106
106-మౌనపోరాటం కర్తవ్యమ్ ఫేం ,కమిట్ మెంట్ ,విజన్ ఉన్న నిర్మాతల దర్శకుడు –ఎ.మోహన గాంధి
నేపధ్యము
1947 లో విజయవాడలో జన్మించారు. అక్కడే యస్.ఆర్.ఆర్;సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ వరకు చదివారు. తదుపరి మణిపాల్ లో ఇంజనీరింగ్ విద్యలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే చదువుకు
స్వస్థి చెప్పి విజయవాడ వచ్చేశారు. అప్పట్లో మణిపాల్ వెళ్ళేటప్పుడల్లా వీరి కజిన్ వెంకటరత్నంగారు తోడుగా వచ్చేవారు. ప్రయాణం మధ్యలో మద్రాసులో ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండవలసి వచ్చేది. అప్పుడే వెంకటరత్నంగారు తన స్నేహితులు శోభన్ బాబు గారిని కలవడానికి గాంధీతో కలిసి వెళ్ళేవారు. అప్పుడే శోభన్ బాబుగారు హీరోగా తెలుగు చిత్రసీమలో నిలదొక్కుకుంటున్నారు.మోహన్ గాంధి 1968లో చదువు మానేసి విజయవాడ వచ్చేశాక తిరిగి కోలుకోవడానికి నాలుగైదు నెలలు పట్టింది. స్టేజీ నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో సినిమాల పట్ల తన ఆసక్తిని వెంకటరత్నంగారికి చెప్పారు. వారు వెంటనే మోహన గాంధీని హీరో శోభన్ బాబుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. శోభన్ బాబుగారు వీరికి సినిమాల పట్ల గల ఆసక్తిని గమనించారు. మొదట ఎడిటింగ్ పట్ల తనకు ఆసక్తి ఉన్నదని శోభన్ బాబు గారితో చెప్పడంతో, ఎడిటింగ్ అంటే ఒక్క అంశానికే పరిమితమై పోతావు… దర్శకత్వ శాఖలో ప్రయత్నించు అని ఆయన సలహా ఇచ్చారు. తనకి చిత్రసీమలో ఎవరూ తెలియదని, మీరే రికమెండ్ చేయాలని గాంధీ అభ్యర్థించారు. అలాహీరో శోభన్ బాబుగారి ద్వారా తెలుగు చలన చిత్ర సీమలో 1967లో ప్రవేశించారు.
సినీ జీవితము
నాటకాల రాయుడు, పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు, దేవుడు చేసిన పెళ్ళి, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, కమలమ్మ కమతం, జీవన్ ధారా, మై ఇంతకామ్ లూంగా,యస్.పి భయంకర్…మొదలగు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు. శ్రీఅక్కినేని సంజీవి, శ్రీపి.సుబ్రహమణ్యం,శ్రీ పి.సి.రెడ్డి, శ్రీప్రత్యగాత్మ, శ్రీ తాతినేని.రామారావు, శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ మొదలైన వారి వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు గ్రహించి 1977లో తొలిసారి నిర్మాత
శ్రీ ఎ.వి.సుబ్బారావు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి అర్ధాంగి చిత్రానికి దర్శకత్వం వహించారు.[1]
ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం సినిమా, యమున, శారద నటించిన ఆడది సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి.[2]
ఉత్తమ చిత్రంగా మౌనపోరాటం నంది అవార్దు పొందింది.
దర్శకత్వం వహించిన చిత్రాలు
తెలుగు[మార్చు]
- అర్ధాంగి
- రౌడీ
- టెర్రర్
- భలే మిత్రులు
- మంచి మనసులు
- ఆడపడుచు
- పూజకు పనికిరాని పువ్వు
- ప్రేమ సామ్రాట్
- ముద్దుల మనవడు
- న్యాయానికి సంకెళ్ళు
- చినబాబు
- వారసుడొచ్చాడు
- మౌనపోరాటం
- జడ్జిమెంట్
- కర్తవ్యం
- ఆడది (1990)[3]
- పీపుల్స్ ఎన్కౌంటర్ (1991)
- ఆశయం
- జగన్నాటకం
- ప్రాణదాత
- పోలీస్ బ్రదర్స్
- రౌడీ మొగుడు
- మొగుడు గారు
- మా ఆయన బంగారం
- సంభవం
- వైభవం
- కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి
- పరశురాం
- ప్రేమ దొంగ
- వైభవం
కన్నడం
- సర్కిల్ ఇనస్పెక్టర్
- చాముండి
ఏ తరహా కథ తన దగ్గరకు వచ్చినా దాన్ని ఆకళింపు చేసుకుని, విజయవంతమైన సినిమాగా మలచడానికి నూరు శాతం కృషి చేసే అరుదైన దర్శకులలో ఎ. మోహనగాంధీ ఒకరు. తెలుగు చిత్రసీమలో కమిట్ మెంట్ అనే పదానికి పర్యాయపదం ఆయన. అందుకే అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన్ని తమ మనిషిగా భావించాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చాయి. నిజం చెప్పాలంటే మోహనగాంధీకి లభించిన విజయాలు మరో దర్శకుడికి దక్కి ఉంటే… ఇంకో స్థాయిలో ఉండేవారు. కానీ విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కృంగిపోకుండా తన పని తాను చేసుకు వెళ్ళడమే మోహనగాంధీకి అలవాటు. 1947 జూలై 7న విజయవాడలో జన్మించిన అన్నే మోహన గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని తెలుసుకుందాం.
మురహరిరావు, రత్నమాణిక్యం దంపతుల కుమారుడైన మోహనగాంధీ విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కళాశాలలో బీఎస్సీ చదివారు. ఎన్టీఆర్ వంటి మహానటుడు చదివిన కళాశాల అది. నాటక రంగంలో కాస్తంత అనుభవం ఉన్న మోహనగాంధీ మనసు డిగ్రీ పూర్తి కాగానే సినిమాల మీదకు మళ్ళింది. అప్పటికే చిత్రసీమలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబుకు తన బంధువు వెంకటరత్నంతో ఉన్న పరిచయాన్ని ఆధారం చేసుకుని చెన్నపట్నం చేరారు మోహనగాంధీ. 1967లో చెన్నయ్ వెళ్ళి, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డా… ఆ తర్వాత దర్శకత్వశాఖలో కుదురుకున్నారు. అక్కినేని సంజీవి, పి. చంద్రశేఖర్ రెడ్డి, తాతినేని రామారావు, ప్రత్యగాత్మ, వి. బి. రాజేంద్ర ప్రసాద్ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి, ప్రావీణ్యం సంపాదించారు. కష్టపడే స్వభావం, ఏ విషయాన్ని అయిన వెంటనే గ్రహించగలిగే నేర్పుతో పాటు మంచితనం కారణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ లోనే ‘అర్ధాంగి’ సినిమాతో దర్శకుడయ్యారు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన ‘అర్థాంగి’ ఆశించిన స్థాయిలో విజయం సాధించపోయినా, నిర్మాతకు మాత్రం లాభాలనే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘టెర్రర్’ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందించిన మోహనగాంధీ తాను ఏ కథకైనా న్యాయం చేస్తానని నిరూపించుకున్నారు. ఆయన తెరకెక్కించిన ‘మంచి మనసులు’ చిత్రంలోని ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే… ‘ గీతం ఇప్పటికీ సంగీత ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో ‘పూజకు పనికిరాని పువ్వు’ చిత్రం చేసిన మోహన గాంధీ ఆ తర్వాత అదే బ్యానర్ లో రూపొందించిన ‘మౌనపోరాటం’తో ఘన విజయం అందుకున్నారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సామాజికాంశాల దర్శకుడిగా మోహన గాంధీకి ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఏ నిర్మాత కాస్తంత భిన్నమైన చిత్రాన్ని తీయాలని అనుకున్నా ఆ రోజుల్లో వారి మొదటి ప్రాధాన్యం మోహన గాంధీనే అంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు మోహనగాంధీ చాలాకాలం పాటు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయారు. చిత్రం ఏమంటే విజయశాంతి నాయికగా ఆయన రూపొందించిన ‘కర్తవ్యం’, యమున హీరోయిన్ గా ఆయనే తెరకెక్కించిన ‘ఆడది’ సినిమా ఒకే రోజున విడుదలయ్యాయి. అందులో ‘కర్తవ్యం’ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు మోహనగాంధీ ఖ్యాతిని పదింతలు పెంచేసింది. ఓ పక్క లేడీ ఓరియంటెండ్ చిత్రాలు చేస్తూనే అగ్ర కథానాయకులతో, అగ్ర నిర్మాణ సంస్థలతో సినిమాలు తీశారు మోహనగాంధీ. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, రాజశేఖర్ తదితరులతో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఒకానొక సమయంలో భానుచందర్ – మోహనగాంధీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. నటీనటుల నుండి తనకు కావాల్సిన హావభావాలను స్వయంగా చూపించి మరి తెప్పించుకోవడం మోహన గాంధీ ప్రత్యేకత. ఆయన చూపే అభినయాన్ని అనుకరిస్తే చాలు తమ పని సులువు అయిపోతుందంటారు కొందరు నటీనటులు. తెలుగుతో పాటు కన్నడలోనూ పలు చిత్రాలు రూపొందించారు మోహనగాంధీ. అయితే ఇప్పుడు కథల కంటే కాంబినేషన్స్ కే నిర్మాతలు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన నిదానంగా చిత్రసీమకు దూరమయ్యారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన దాదాపు నలభై చిత్రాలను రూపొందించిన నిర్మాతల దర్శకుడాయన. ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న మోహనగాంధీ తెలుగు సినీ రంగ దర్శకుల చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకోవడం విశేషం.
· ‘కర్తవ్యం’..1990 జూన్ 29న విడుదలైన ఈ సినిమా తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త సూపర్‌స్టార్‌ని పరిచయం చేసింది.ఆ స్టార్ ఎవరో కాదు విజయశాంతి.సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతీ ఐ పి ఎస్ గా విజయశాంతి బాక్సాఫీస్ వద్ద నటవిశ్వరూపం చూపారు.‘లేడీ అమితాబ్’ అనే ఇమేజ్ను ఆమెకు కట్టిన బెట్టిన ‘కర్తవ్యం’ 1990 జూన్ 29న విడుదలై 2020 జూన్ 29 నాటికి 30 సంవత్సరాలు పూర్తిచేసుకుంటోంది.
· కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్‌లకు చెల్లెలుగా నటించిన విజయశాంతి ఆ తర్వాత తరం స్టార్ హీరోలైన కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు వారి తర్వాత తరం అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్‌బాబు.. ఇలా అందరితో జోడీ కట్టారు. అయితే ఆమెను నటిగా మరో కోణంలో ఆవిష్కరించింది మాత్రం దర్శకుడు టి.కృష్ణ. విప్లవ భావజాలాలుండే ఆయన సమాజంలో జరిగే తప్పులను తన సినిమాల ద్వారా ప్రశ్నించారు. ఆయన తెరకెక్కించిన ‘నేటి భారతం, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు’ వంటి చిత్రాలతో విజయశాంతిలోని సిసలైన నటిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. అలా విజయశాంతి ఒక వైపు అగ్ర కథానాయకుల నాయకిగానూ.. మరోవైపు మహిళ ప్రాధాన్యతా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ‘కర్తవ్యం’ ఆమెకు యాక్షన్ స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోలకు సమానమైన మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన చిత్రమిదే.
·
· లేడీ ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ బేడీ ప్రేరణతో సినిమా చేద్దామని డైరెక్టర్ మోహనగాంధీ తన ఆలోచనను నిర్మాత ఎ.ఎం.రత్నంకు చెప్పారు. ఆయనకు నచ్చడంతో పరుచూరి బ్రదర్స్ కథను సిద్ధం చేశారు. ఓ నగరంలో అన్యాయాలు, అక్రమాలు చేసే రాజకీయ నాయకుడు ముద్దుకృష్ణయ్యకు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతీకి మధ్య జరిగే పోరాటమే ‘కర్తవ్యం’. 1989 నవంబర్ 2న ఈ షూటింగ్ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రేమ్ చంద్ (టి.కృష్ణ పెద్ద కొడుకు,గోపిచంద్ అన్నయ్య) కెమెరా స్విచ్ఛాన్ చేయగా, కిరణ్ బేడీ క్లాప్ కొట్టారు. క్లైమాక్స్ మినహా సినిమాను మ్రదాస్, వైజాగ్ల్లో పూర్తి చేశారు. కొంత నష్టానికే నిర్మాత ఎ.ఎం.రత్నం సినిమాను విడుదల చేశారు. తొలి ఆటకే సినిమా హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఆ రోజుల్లో మూడు కోట్ల రూపాయలను వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది ‘కర్తవ్యం’.
విజయశాంతికి లేడీ అమితాబ్ అనే ఇమేజ్‌తో పాటు జాతీయ ఉత్తమనటిగా అవార్డును తెచ్చి పెట్టింది ‘కర్తవ్యం’. అలాగే ఫిలింఫేర్, నంది అవార్డులను కూడా అందుకున్నారామె. తమిళంలో ‘వైజయంతి ఐపీయస్’ పేరుతో అనువాదమై ఘన విజయాన్ని సాధించింది. హిందీలోనూ ‘తేజస్విని’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలోనూ విజయశాంతినే టైటిల్ రోల్ పోషించారు. అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది.
1990 అక్టోబర్ 7న మద్రాసులోని విజయా మహాల్లో వంద రోజుల వేడుకను చేశారు. ఈ వేడుకకి ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ బేడీతో పాటు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విజయశాంతి కెరీర్లో అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా ‘కర్తవ్యం’కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుందనడంలో సందేహం లేదు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-22-ఉయ్యూరు