మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-4
ఆన౦దాశ్రమం కు అతిధులు అన్ని రోజుల్లో అన్ని వేళల్లో వచ్చేవారు .పూనాలో తిలక్ ఇల్లులాగా ఆప్టే ఇల్లు వీరితో నిండిపోయేది .శ్రీ రాం సింగ్ నిబద్ధతకాల కార్యకర్త .జబ్బుపడ్డ వారి వైద్య ఖర్చులు ఆప్టే భరించేవాడు .ప్లేగు వ్యాపించినప్పుడు ఆప్టే చేసిన మానవ సేవ నిరుపమానం .ఆశ్రమానికి అనేక రకాల సన్యాసులు వచ్చేవారు ఇబ్బందికూడా కలిగించేవారు .ఆప్టే జాగ్రత్తగా వారితో మసిలేవాడు .దొంగ స్వాములను కనిపెట్టేవాడు .ఆప్టే దేశం లో చాలాభాగాలు పర్యటించాడు .తిలక్ అంటే అభిమానం ,గౌరవం .చిన్నపిల్లలతో జంతువులతో సరదాగా గడిపేవాడు .1903నుంచి 1913వరకు ఆశ్రమం లో పదేళ్ళు గడిపాడు ఆనందంగా సంతృప్తిగా .కీర్తిప్రతిష్టలు కలిగాయి .1912అకోలా మరాటీ సాహిత్య సమ్మేళనానికి ఆప్టేను అధ్యక్షునిగా ఎన్నుకొని గౌరవించారు .బొంబాయి యూనివర్సిటి మరాటీ పరీక్షకు ఎక్సామినర్ గా నియమింపబడ్డాడు .విల్సన్ మెమోరియల్ ఉపన్యాసాలను యూని వర్సిటి ఆయన తో చేయించింది .
సాంఘిక రాజకీయ కార్యకలాపాలు
లోకమాన్యుని ముందు ఆప్టే ప్రతిభ బయట పడలేదు .పండిట్ విష్ణు శాస్త్రి స్థాపించిన న్యు ఇంగ్లిష్ స్కూల్ తర్వాత ఫెర్గూసన్ కాలేజి గా మారింది .ఆయన చౌకగా ఆదర్శమైన పుస్తకాలు ముద్రించాడు కేసరి ,మహారాలూ పత్రికలూ పెట్టి నిర్వహించాడు .నిబంధమాలా పత్రికపెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజలను ప్రేరణ చెందే వ్యాసాలూ రాసి ముద్రించాడు .1882లో శాస్త్రి చనిపోయాడు .ఆయన భావాల వ్యాప్తికోస౦ ఆప్టే అతని మిత్రులు కలిసి ‘’నూతన్ మరాటీ విద్యాలయ ‘’స్థాపించి ,ఇంగ్లీష్ బోధనా కళాశాలగా వృద్ధి చేశారు .ఆప్టే పూనికతో దీనికి ప్రభుత్వ గ్రాంట్ మంజూరైంది .తర్వాత న్యు పూనా కాలేజిగా మారి బాంబే యూనివర్సిటికి అను బంధ సంస్థ అయింది..పాలక వర్గ సభ్యుడైన ఆప్టే విలువైన ఫ్రెంచ్ ఇంగ్లిష్ సంస్కృత గ్రంధాలను కాలేజికి అందించాడు .
మహారాష్ట్ర పితామహుడు రానడే ప్రభావం ఆప్టే మీద బాగా ఉంది .మితవాద రాజకీయం ఆయన వలననే సంక్రమించింది .గోఖలే కూడా ఆప్తుడే .’’స్త్రీ వివాహ వయో చట్టం రోజులనుంచి ఆప్టే సాంఘిక ,రాజకీయ రంగ ప్రవేశం చేశాడు .ఆ చట్టం చేయాలని ప్రభుత్వం పై బాగా ఒత్తిడి తెచ్చాడు .దీన్ని సంప్రదాయ వాదులు వ్యతిరేకిస్తే ఆప్టే మహోపన్యాసాలతో ప్రజల మనసులను గెలిచి చట్టం చేయటానికి అనుకూలంగా తీర్మానం చేసేట్లు చేయగలిగాడు .ఆ సభలో ఆప్టే పై సంప్రదాయవాదులు రాళ్ళు రువ్వారు .ఆప్టే మొదలైనవారికి గాయాలయ్యాయి.కానీ ఈ సంఘటనతో ఒక స్థిరత్వం కలిగి ‘’మిత్ర మండల్’’సంస్థ స్థాపించి ,ప్రజా౦దోళనా విధానం నిర్ణయించి ,రానడే ,ఖాన్దాల్కర్ ,జస్టిస్ తెలంగ్ వంటి మహావ్యక్తుల మద్దతు సాధించారు .
అగార్కర్ పెట్టిన సుదారక్ పత్రిక 1912నాటికి కొనూపిరితో ఉంది .ఆప్టే సాయం చేసి మరికొన్ని నెలలు బతికించాడు .1895కాంగ్రెస్ సమావేశాలలో ఆప్టే ఆధ్వర్యం లో ‘’కాంగ్రెస్ సమాచార్ ‘’పత్రిక ఏర్పడి ,కాంగ్రెస్ కు ఇష్టపూర్తిగా పని చేశాడు .తిలక్ నాయకత్వం తో పూనా సార్వజనిక సభను అతివాదులు స్వాధీన పరచుకోన్నప్పుడు ,రానడే పోటీగా ఒకసంఘ సంస్కరణ సంస్థ ప్రారంభించాడు .గోఖలే లండన్ లో ఉండటం వలన ఆప్టే సహాయ కార్యదర్శి అయ్యాడు .1896లో మహారాష్ట్ర కరువులో రైతుల స్థితిగతుల లెక్కలు తయారు చేసే బాధ్యత ఆప్టే కి అప్పగించారు .ఆయన ఇచ్చిన నివేదిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నది .
గోఖలే లండన్ లో ఉన్నప్పుడు 1897లో మనదేశం లో ప్లేగు వ్యాధి విజ్రుమ్భించింది .ప్రజారక్షణ బాధ్యతా సైన్యానికి అప్పగించింది ప్రభుత్వం. సైన్యం అనేక దురంతాలు అరాచకం అవినీతి.స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడి ప్రజా విశ్వాసం కోల్పోయింది.ప్రజలు బహిరంగ సభలలో నిరసన తెలిపారు ,ఆప్టే మొదలైనవారు గోఖలేకి ఉత్తరం ద్వారా విషయాలు తెలియజేశారు .నాయకుల ప్రకటన అబద్ధం అని ప్రభుత్వం అంటే,లండన్ లో ఇండియా కార్యదర్శికి దక్కన్ సభ ద్వారా అనేక ఉత్తరాలు పంపారు .గోఖలేకు యదార్ధ స్థితి తెలియజేయటానికి తిలక్ కూడా పక్కా సమాచారం సాక్ష్యాలతో సేకరించాడు .కానీ బొంబాయి రాగానే అరెస్ట్ చేసింది ప్రభుత్వం .వీళ్ళు సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం మూడో కంటికి కనపడకుండా నాశనం చేసింది .సాక్ష్యా చూపించాలేకపోవటం వలన రానడే సలహా మేరకు గోఖలే లండన్ లో బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పగా అతివాదులు ఆయన్ను విమర్శించారు .తానుకూడా గోఖలే పరాభవానికి కారణం అని భావించిన ఆప్టే ,ఆయన తిరిగి వచ్చాక దక్కన్ సభ కార్యదర్శి పదవి గోఖలే కు అప్పగించాడు .
పూనా ముఖ్యులు కొందరు లిబరల్ యూనియన్ స్థాపించి రాజకీయాలు చర్చించేవారు .ఆప్టే కూడా వెళ్ళేవాడు .1905లో గోఖలే ‘’భారత్ సేవా సంఘం ‘’స్థాపించాడు .కరమాణుక్ తోబాటు ,జ్ఞాన ప్రకాశ్ పత్రికకు కూడా ఆప్టే 1888నుంచి 1894వరకు సంపాదకుడుగా ఉన్నాడు .1894మద్రాస్ కాంగ్రెస్ సభలకు ఆప్టే వెళ్లి ,సింహళం కూడా చూసి వచ్చాడు .1906లో జ్ఞానప్రకాశ్ పత్రికను సర్వెంట్స్ ఆఫ్ ఇండియా తీసుకోనేవరకు పత్రిక అజమాయిషీ ఆప్టే చేశాడు .ప్లేగు సమయంలో ఆప్టే చేసిన అనితరసాధ్యమానవ సేవకు బొంబాయి ప్రభుత్వం ‘’కైజర్ ఇ హింద్’’ పతకాన్ని బహూకరించింది .ఆ ఆపద సమయం లో ఆన౦దాశ్రమం అనాధ బాల శరణాలయం గా ఉంది. తర్వాత ఆప్టే ఆయన స్నేహితులు కలిసి ‘’అనాధ బాల శరణాలయం ‘’స్థాపించి సేవ చేశారు .
1909లో ప్రభుత్వం ఆప్టే ను పూనా పురపాలక సభ్యుని గా చేసింది .తర్వాత అనేక హోదాలలో పని చేసి అధ్యక్ష ఎన్నికలో ఓడిపోయాడు. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ,శ్రీ గోపాలకృష్ణ గోఖలే వంటి అతిరధులతో పని చేసిన అనుభవం ఆయనది. మురికినీరు పారుదల వ్యవస్థ మెరుగుపరచాడు .పురపాలక పాఠశాలసంఘం లో 13ఏళ్ళుసభ్యుడుగా అందులో ఆరేళ్ళు అధ్యక్షుడుగా ఉన్నాడు .పూనా శిశుమరణాల గురించి నివేదిక తయారు చేయించి ప్రభుత్వానికి తగిన చర్యలకోసం పంపాడు .పురపాలక వస్తు ప్రదర్శన శాలను పునర్నిర్మించాడు .ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ స్థాపించాడు .సంత్ జ్ఞానదేవ్ స్వస్థలం అలంది పరిపాలన సభ్యుడుగా సేవ చేశాడు .డఫరిన్ ఫండ్ ఏర్పాటుకు తోడ్పడ్డాడు .ఈ నిధి నర్సుల శిక్షణ కోసం ఏర్పడింది ,ఇన్ఫ్లుఎంజా హాస్పిటల్ స్థాపించి అందులో పని చేసి ఇన్ఫ్లుఎంజా వ్యాధి అరికట్టటానికి సాయపడ్డాడు . ఇలా లెక్కలేనన్ని ప్రజాహిత కార్యాలలో సేవతో తనదైన ముద్ర వేశాడు హరినారాయణ ఆప్టే .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-3-22-ఉయ్యూరు