· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -123
· 123-ఇల స్ట్రేటెడ్ వీక్లీ ఫోటోగ్రాఫర్,విజయావారి ఆస్థాన చాయాగ్రాహకుడు ,ఆంగ్లో ఇండియన్ –మార్కస్ బార్ట్లే
మార్కస్ బార్ట్లే (ఆంగ్లం: Marcus Bartley) (జ.1917[1] – మ.1993) తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు.
బాల్యం
ఆంగ్లో ఇండియన్[2] అయిన బార్ట్లే 1917, ఏప్రిల్ 22న శ్రీలంకలో జన్మించాడు. తల్లి డొరొతీ స్కాట్, తండ్రి జేమ్స్ బార్ట్లీ.[3][4] చిన్నతనంలోనే ఈయన కుటుంబం మద్రాసు చేరింది. ఈయన తండ్రికి స్టిల్ ఫోటోగ్రఫీ అభిరుచి ఉండేది. అది బార్ట్లేకి అబ్బింది. పదమూడేళ్ల వయసులోనే బ్రౌనీ కెమెరాతో ఫోటోలు తీసేవాడు. దానికి తండ్రి పోత్సాహము కూడా తోడయ్యింది. ఇతడికి నెలకొక ఫిల్ము రీలు కొనిచ్చి దానితో కనీసం ఎనిమిది ఫోటోలైన మంచివి తియ్యాలని షరతు పెట్టేవాడు. ఈ విధంగా ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చదువును లక్ష్యపెట్టలేదు. కొడుకు తీసిన ఫోటోలు నచ్చడంతో కొడుకుకు 1933లో ఇంకాస్త మంచి కెమెరా కొనిచ్చాడు. బార్ట్లే తీసిన ఫోటోలు అప్పట్లో మద్రాస్ మెయిల్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ప్రచురించబడేవి.[5]
మద్రాసు మెయిల్ పత్రికకు ఆర్ట్ ఎడిటరుగా పనిచేస్తున్న జాన్ విల్సన్ బార్ట్లేకు ఫోటోగ్రఫీలో మెళుకువలు నేర్పాడు. 1935లో బార్ట్లే చదువుకు స్వస్తి చెప్పి విల్సన్ సిఫారుసుతో బొంబాయి వెళ్ళి ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ స్టాఫ్ ఫోటోగ్రాఫరుగా ఉద్యోగం సంపాదించాడు. రెండేళ్లు తిరగ్గానే ఆ ఉద్యోగంపై బార్ట్లేకు ఆసక్తి పోయింది. తాను ఊహించిన సౌందర్యాన్ని నిశ్చల చిత్రాలలో బంధించలేనని ఆయనకు ఆర్ధమైంది. అప్పట్లో వార్తా చిత్రాల నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన బ్రిటీష్ మూవీటోన్ సంస్థ, పశ్చిమ భారతదేశానికి సంబంధించిన వార్తాచిత్రాలను తీయటానికి సంకల్పించి, అందుకై తమ ప్రతినిధిగా టైమ్స్ ఆఫ్ ఇండియాను నియమించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ హార్బర్ట్ స్మిత్, బార్ట్లేను పిలిపించి, ప్రొఫెషనల్ మూవీ కెమెరా వచ్చా అని, బార్ట్లేను అడిగాడు. అందుకాయన, ఎక్కడ తనకు వచ్చిన అవకాశం జారిపోతుందో అని ఓయస్సన్నాడు. అయితే వెంటనే పనిలో చేరమన్నాడు హార్బర్ట్ స్మిత్. ఉద్యోగంలో చేరగానే ఆయన చేతికి డెబ్రీ కెమరా ఇచ్చారు. అప్పటి వరకు మూవీ కెమెరా చూడని బార్ట్లేకి, దాన్ని ఉపయోగించడం రాదు. రహస్యంగా ఆ కెమెరాతో బాంబే టాకీస్ లాబొరేటరీకి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జుగా ఉన్న తనకు పరిచయస్తుడైన జర్మన్ వ్యక్తి జోలే వద్ద ఆ మూవీ కెమెరాను ఉపయోగించడాన్ని మొత్తంగా నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న నైపుణ్యంతో తొలిసారిగా వందర్పూర్ ఉత్సవాలను చిత్రీకరించి బ్రిటీషు మూవీటోన్ ప్రశంసనలను పొందాడు.
సినిమా రంగం
బార్ట్లే 1945లో బి.ఎన్.రెడ్డి తీసిన స్వర్గసీమ సినిమాతో తెలుగు చలనచిత్రరంగములో ప్రవేశించాడు. డిజిటల్ టెక్నాలజీ, యానిమేషన్ లేని రోజుల్లో మాయాబజార్, పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసి ఆనాటి మేటి సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నాడు. బార్ట్లే పనిచేసిన చివరి తెలుగు సినిమా 1974లో విడుదలైన చక్రవాకం. ఈయన 1978లో కాన్స్ లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవములో మలయాళ చిత్రం చెమ్మీన్కు గాను బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[6] 1980వ దశకంలో సినిమాలనుండి విరమించుకున్నా, కెమెరాల మీద ప్రేమతో, కెమెరాలు సర్వీసింగు చేయటమనే హాబీతో శేషజీవితాన్ని గడిపాడు. బార్ట్లే 1993 మార్చి 14న మద్రాసులో మరణించాడు
నలుపు తెలుపు లలో చందమామను అత్యద్భుతంగా చూపిన మేటి ఫోటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే. వియవారిచంద్రుడు అనే బ్రాండ్ నేం సాధించాడు
చిత్ర సమాహారం
· స్వర్గసీమ (1945)
· యోగివేమన (1947)
· గుణసుందరి కథ (1949)
· షావుకారు (1950)
· పాతాళభైరవి (1951)
· పెళ్ళిచేసి చూడు (1952)
· చంద్రహారం (1954)
· మిస్సమ్మ (1955)
· మాయాబజార్ (1957)
· అప్పుచేసి పప్పుకూడు (1958)
· జగదేకవీరుని కథ (1961)
· గుండమ్మ కథ (1962)
· చెమ్మీన్ (మలయాళం) (1965)
· శ్రీకృష్ణసత్య (1971)
· చక్రవాకం (1974)
· యహీహై జిందగీ (హిందీ) (1977)
· మామంగమ్ (మలయాళం) (1979)
· పార్వతి మళ్ళీ పుట్టింది (మలయాళం) (1982)
· జిందగీ జీనే కేలియే (హిందీ) (1984)
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-22-ఉయ్యూరు