మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –123
· 123-ఇల స్ట్రేటెడ్ వీక్లీ ఫోటోగ్రాఫర్,విజయావారి ఆస్థాన చాయాగ్రాహకుడు ,ఆంగ్లో ఇండియన్ –మార్కస్ బార్ట్లే -2
· చంద్ర్రుని చూపించిన బార్ట్లే
‘గుండమ్మ కథ’లో అక్కినేనికి, జమునకు పెళ్లవుతుంది. తొలిరాత్రి. డాబా మీద వధువు, వరుడు చేరారు. రాత్రి బాగుంది. కొబ్బరాకుల మీద నుంచి వీచే గాలి బాగుంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు సరే… ఏం మాట్లాడుకుంటారు. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. తెల్లగా, చల్లగా, నిండుగా ఉన్నాడు. అతన్ని మధ్యవర్తిగా తెచ్చుకుంటే పోదా… పాట మొదలవుతుంది.
‘ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తుమందు చల్లగా’…
ప్రేక్షకులూ వారిద్దరితో పాటు చందమామను చూస్తారు. చందమామతో కలిసి పాడతారు. చందమామను గుర్తు పెట్టుకుంటూ ఇంటికెళ్లి తమ డాబా మీద కూడా దానిని దించొచ్చేమోనని చూస్తారు. అది చందమామ మహాత్యమా? కాదు. సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే మహత్యం. తెలుగువారికి చంద్రుణ్ణి, పున్నమిని, వెన్నెలను, చల్లదనాన్ని ఇచ్చి మబ్బుల్లోకి చేరిన భావుకుడైన సినిమాటోగ్రాఫర్ ఆయన. ‘విజయా’ సంస్థలో సుదీర్ఘంగా పని చేసి, పని చేసిన ప్రతి సినిమాలోనూ చంద్రుణ్ణి స్టూడియోలోకి దించిన ఘనుడు. అందుకే చందమామను తెలుగువారు విజయావారి చందమామ అని కూడా అంటారు. జగతిలో నిజం చందమామ కంటే ఈ విజయావారి చందమామే బాగుంటాడు.
మార్కస్ బార్ట్లే ఆంగ్లో ఇండియన్. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో కెమెరా పట్టుకుని ప్రయోగాలు చేసి పెద్దయ్యాక సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. ట్రిక్ ఫొటోగ్రాఫీలో ఆయన జీనియస్. పాతాళభైరవి, మాయాబజార్‌లలో ఆయన విశ్వరూపం భారతదేశంలో మరెవరికీ సాధ్యం కానిది. కాని అవన్నీ ఆబాలగోపాలం వినోదానికి. కాని రస హృదయం కలిగిన స్త్రీ, పురుషులందరికీ ఆయన సేద ప్రసాదించినది తన చందమామతోనే. వీలున్న ప్రతిపాటలో ఆయన నిండు చందమామను చూపించేవాడు. శాంతం కలిగించేవాడు. ‘పాతాళభైరవి’లో ‘ఎంత ఘాటు ప్రేమయో’ డ్యూయెట్ చూడండి. రాజమహల్లో మాలతి పాడుతూ ఉంటుంది. నిండు చందురూడు వేళ్లాడుతున్న ఉద్యానవనంలో ఎన్.టి.ఆర్. ‘ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా’… అని జాబిల్లితో ఎన్.టి.ఆర్ నివేదించుకోవడం బార్ట్లే అందుకు తగ్గట్టుగా
చందమామను సెట్ చేయడం… అద్భుతం.
‘మిస్సమ్మ’ కథంతా చందమామే. ‘ఏమిటో ఈ మాయా’ పాటలో, ‘బృందావనమది అందరిది’ పాటలో చందురుడి అందమే అందం. ఆపై అదే సినిమాలో ‘రావోయి చందమామా’ అనే పాట మార్కస్ బార్టే›్ల చంద్రుడి కోసమే పుట్టింది. అసలు ఈ చంద్రుడే లేకుంటే వీళ్లందరి విరహాలు, వేడుకోళ్లు ఎలా తీరేవా అని.
‘జగదేకవీరుని కథ’లో బి.సరోజా ‘హలా’ అని చంద్రుడికి హలో చెప్పగా ఎన్.టి.ఆర్ పక్కన చేరగా ‘అయినదేదో అయినది ప్రియ గానమేదే ప్రేయసి’ పాట మొదలైతే చూడాలి ఆ పోటీ… ఎన్.టి.ఆర్ అందమా,
సరోజా దేవి చందమా, చంద్రుడి చందనమా.
ఇక ‘మాయాబజార్’దే కదా అసలు కథంతా. ఆ సినిమా అంతా ఎన్నోసార్లు చంద్రుడు కనిపిస్తాడు. ‘నీ కోసమే నే జీవించునది’ పాటలో చందమామలో ఏకంగా శశిరేఖనే చూస్తాడు అభిమన్యుడు. అసలు రెల్లు పొదల చాటు నుంచి ఉదయించిన చంద్రుడు ద్యోతకమవుతుండగా, నీటి అద్దంపై అతగాడి ప్రతిబింబం పడుతూ ఉండగా, నౌకాయానానికి బయలుదేరిన శశిరేఖను, అక్కినేనిని చంద్రుడు ఎంత ప్రేమగా తల నిమిరాడని. ఎంత అక్కరగా లాలించాడని. మార్కస్ బార్ట్లే మహిమ వల్ల శ్రీకృష్ణుడు, రుక్మిణి సరే బలరాముడు, రేవతి కూడా ముచ్చటగొలుపు తారు.
మార్కస్ బార్ట్లే గొప్పవాడని సినీ అభిమానులకు తెలుసు. ఆయనను చాలా ఇష్టంగా తలుచుకుంటారు. ఎప్పుడు ఆకాశాన పూర్ణ చంద్రుడు కనిపించినా ‘అదిగో విజయావారి చందమామ’ .
వెండితెరపై వెన్నెలను పరచి తెలుగువారికి కనులపండుగలను ప్రసాదించిన అద్వితీయ సినిమటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే! ముంబైలో ప్రెస్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ న్యూస్‌రీల్ కెమెరా అసిస్టెంట్‌గా లైటింగ్ అరేంజ్ చేసే బార్ట్లే తిరువళ్లువర్ (1941) చిత్రానికి సినిమటోగ్రాఫర్గా సినీరంగానికి పరిచయం అయ్యారు.
వాహినీ వారి స్వర్గసీమ (1945) ద్వారా బి.ఎన్.రెడ్డి బార్ట్లేను తెలుగు సినిమాలకు పరిచయం చేశారు. బి.ఎన్ సోదరుడు బి.నాగిరెడ్డి నిర్మించిన చిత్రాల ద్వారా తరతరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. బార్ట్లే సినిమటోగ్రఫీ ఆయా సినిమాలలోని సన్నివేశాలను మనోజ్ఞంగా మార్చివేస్తుంది. సినిమా టెక్నాలజీ ప్రాథమిక దశలో ఉన్న రోజుల్లో, హాలీవుడ్‌తో పోల్చుకుంటే నూరవవంతు కూడా తగిన పరికరాలు లేని రోజుల్లో మార్కస్‌బార్‌ట్లే ఫొటోగ్రఫీ హాలీవుడ్‌ను సైతం ఆశ్చర్యపరచింది. ఉదాహరణకు:
‘స్వర్గసీమ’లో నాగయ్య-జయమ్మలు మాట్లాడుకునే సన్నివేశంలో క్లోజప్‌లో జయమ్మ మోముపై గాలికి కదిలే ఆకులనీడలు, పాతాళభైరవిలో మాయలఫకీర్ చేతిని నరుక్కోవడం, తిరిగి మంత్రమహిమచే అతికించుకోవడం, మాయాబజార్లో మూడు జంటల ‘లాహిరి లాహిరి, ఘటోత్కచుని ‘వివాహభోజనంబు’ పాట, ‘జగదేకవీరుని కథ’లో అనేక రామారావుల సంగీతకచేరీ, తదితర సన్నివేశాలను చూసి నేటికీ మనం పరవశిస్తాం! మార్కస్బార్ట్లేపై త్రిపురనేని సాయిచంద్ రూపొందించిన డాక్యుమెంటరీని ఇటీవల హైదరాబాద్‌లో ప్రదర్శించిన సందర్భంగా ఆయన కుమారుడు అలెన్బార్ట్లే, అయన శ్రీమతి పదహారణాల తెలుగమ్మాయి సారాతో విచ్చేశారు. అలెన్బార్ట్లేతో ఇంటర్వ్యూ సారాంశం :
ఈ సందర్భాన్ని ఎలా భావిస్తున్నారు?
ఇదో గొప్ప సందర్భం. ప్రైస్ టు తెలుగు పీపుల్. డాక్యుమెంటరీ రూపొందించిన సాయిచంద్‌కు, నాన్నపై అభిమానాన్ని వ్యక్తం చేసిన భరద్వాజ, ఎస్.గోపాలరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు కినిగె అనిల్, బ్నిం, తదితరులకు ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక్కడి (లామకాన్) వాతావరణం కూడా చాలా సహజంగా ఉంది. ఈ క్షణాలు మరచిపోలేనివి.
లైటింగ్ రిహార్సల్స్!
నాన్నతో ఒక మలయాళ సినిమా షూటింగ్‌కు మాత్రమే వెళ్లాను. ఆయన సాధారణంగా స్టూడియోకి తీసుకువెళ్లరు. లైటింగ్ అమర్చుకునేందుకు ఏకాంతాన్ని కోరుకుంటారు. తానెంతో గౌరవించే దర్శకులను సైతం లైటింగ్ అమర్చుకునే సందర్బంలో సెట్లోకి రావద్దనే వారట. లైటింగ్ పూర్తయ్యాక ఆయా సన్నివేశాల్లోని నటీనటులందరితో రిహార్సల్స్ చేయించేవారట. తాననుకున్న ఎఫెక్ట్ రాబట్టాకే షూటింగ్‌కు ‘రెడీ’ అనేవారట. ఈ డాక్యుమెంటరీలోనూ ఆయనో విలువైన మాట చెప్పారు. ‘చిత్రకథలో ఒరిజినాలిటీ ఎంత ముఖ్యమో ప్రతీ సన్నివేశంలో లైటింగ్ కూడా అంతే ముఖ్యం’ అన్నారు.
పగటిపూట మాయాబజార్లో వెన్నెలరాత్రిని చిత్రీకరించిన నాన్న ఆర్ట్ ఫిలిమ్లపై కూడా తన ముద్ర వేశారు. ఆయన ప్రతిభ వెనుక అసాధారణమైన కృషి ఉంది. ఆదివారం నాన్న షూటింగ్ పెట్టుకునేవారు కాదు. తప్పనిసరిగా ఇంట్లో ఉండేవారు. ఇంటి వాతావరణాన్ని ఆనందిస్తూనే కెమెరా లెన్స్‌లను శుభ్రం చేసుకునేవారు. ఏమాత్రం తేమ ఉన్నా, సూక్ష్మాతిసూక్ష్మమైన ధూళికణం ఉన్నా ప్రేక్షకులకు ఇవ్వాల్సింది ఇవ్వలేం అనేవారు! కంటిపాపకంటే కెమెరాలెన్స్ను జాగ్రత్తగా చూసుకునేవారు. ఎప్పుడూ అప్టు
డే సినిమటోగ్రఫీని ఆర్ట్ అండ్ సైన్స్ కలయికగా అభివర్ణిస్తారు. పెద్దన్నయ్య ‘మార్కస్’ నాన్న వారసత్వంగా ఆర్ట్‌ను అందిపుచ్చుకున్నారు. సినిమటోగ్రఫర్గా కొన్ని చిత్రాలకుపనిచేసి దివంగతులైనారు. నాకు అందులోని సైన్స్ అబ్బింది. నాన్న నుంచి ‘సైన్స్’ పార్ట్‌ను నేను అనుసరిస్తున్నాను. ‘బార్ట్లే లెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ నిర్వహిస్తున్నాను. డిజిటల్ కెమెరాలకు ఫిలిం కెమెరా లెన్స్‌లను అమర్చుతున్నాను. హాలివుడ్, యూరోప్ దేశాలకు లెన్స్‌లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వ్యాపారవిషయాలను సారా చూస్తోంది. మా పెద్దమ్మాయి నతాషా నా వలెనే ఇంజనీరింగ్ చేసింది. చిన్నమ్మాయి సాషా (19) స్వయంగా సినిమటోగ్రఫీ చేస్తూ ఫిలిమ్లు రూపొందిస్తోంది. ‘ఇప్పుడప్పుడే నా గురించేం చెప్పకు’ అంటుంది!ట్‌గా ఉండేవారు.
రెండు మలయాళ, నాలుగు హిందీ సినిమాలకూ సినిమటోగ్రఫీ చేశారు.‘చెమ్మీన్’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా (1978) కేన్స్ గోల్డ్‌మెడల్ పొందారు. మత్స్యకారుల జీవితకథ అయిన ఆ చిత్రంలో షార్క్ చేపల కదలికలను కథానుగుణంగా అద్భుతంగా చూపారు. తాను లైటింగ్ అరేంజ్ చేసుకునే సమయంలో దర్శకుడిని కూడా సెట్లోకి అనుమతించేవారు కాదు. ఆదివారం తప్పనిసరిగా సెలవు తీసుకునేవారు. అదీ, కెమెరాలు, లెన్స్‌లు సరిచూసుకునేందుకే! తనవద్ద శిష్యరికం చేసిన బి.ఎన్.కొండారెడ్డి, బాబూరావులు ఉత్తమ సినిమటోగ్రాఫర్లుగా ఎదిగారు. షావుకారు, పాతాళభైరవి, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ, జగదేకవీరునికథ, గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు… తదితర చిత్రాలలో బార్ట్లే కెమెరాతో చేసిన చిత్రానువాదం చిరస్థాయిగా ఆకట్టుకుంటుంది.
సశేషంమీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-22-ఉయ్యూరు