గోప బంధు దాస్ -1
అనే పుస్తకాన్ని శ్రీ రామ చంద్రదాస్ రచిస్తే శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం తెలుగు అనువాదం చేయగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా 1976లో ప్రచురించింది వెల.30రూపాయలు .
‘’ఒరిస్సా రాష్ట్రం లో సముద్ర తీర ప్రాంతం లో గోపబందు దాస్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .ఆయన ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటుకు తీవ్రకృషి చేశాడు కానీ ఆయన మరణించిన ఎనిమిదేళ్ళకు రాష్రం ఏర్పడింది .1920నాగపూర్ కాంగ్రెస్ లో ఆయన ఒరిస్సాకు ఒక రాజకీయ స్వప్నాన్ని ఆవిష్కరించాడు .రాష్ట్రీయ భావన ను జాతీయ స్రవంతిలో కలిపాడు .ఒరిస్సా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయించి తనరాష్ట్రం లో స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించాడు .ఒరిస్సాలో జాతీయ కాంగ్రెస్ కు పితృత్వం వహించాడు .గాంధీ ,లజపతి రాయ్ లతో సాన్నిహిత్యం నెరపాడు .స్వాతంత్ర్యం వచ్చాక ఆయన విస్మృత నాయకుడైపోయాడు .యాభైఒక్క ఏళ్ళకే మరణం కూడా కారణం .ప్రచారం కోరను అని లాలా కు స్పష్టంగా చెప్పాడు కూడా .1964జనవరి లో భువనేశ్వర్ లో జరిగిన కాంగ్రెస్ సభల ప్రాంగణానికి ‘’గోపబంధు నగర్ ‘’అని పెరుపెట్టటం ,ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయటం తప్ప ఆయనకు ఇంకేవిధమైన గౌరవం కలగలేదు .అందుకే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆయన జీవిత చరిత్రను ప్రచురించి ఒరియా వారికి సంతోషం కలిగిస్తోంది ‘’అని ఎస్ సి దాస్ పేర్కొన్నాడు .
ప్రారంభ దశ
గోపబంధు దాస్ 9-10-1877 ఒరిస్సా లోపూరీ జిల్లా సాక్షి గోపాల్ ఫిర్కా గంగా గోదావరీ సంగమ భార్గవీ నదీ తీరాన సువాందో కుగ్రామం లో పుట్టాడు .తండ్రి దైత్యారి దాస్ మూడవ భార్యస్వర్ణమయీ దంపతుల కుమారుడే గోప బంధు. ఇతన్ని కనే ముందు తల్లి మూడు రోజులు పురుటి నెప్పులతోబాధ పడితే ,స్వప్నం లో బిడ్డ ఆమెకు చెందే యోగ్యం లేదనీ పొరుగింటిలో నిద్రిస్తే సుఖ ప్రసవం జరుగుతుందని కల వస్తే ఆమెను దగ్గరలో ఉన్న చక్రధరదాస్ ఇంటికి తరలించారు ఆ ఇంటికి చేరిన మరుక్షణం లో సుఖ ప్రసవమై దాసు జన్మించాడు .కొద్ది రోజులకే ఆమె చనిపోయింది .గోపబందు అన్న నారాయణ్ అంతకు ముందే తండ్రి పెద్దన్న దీన బంధు కు దత్తత వెళ్ళాడు .ఆయన వితంతు సోదరి కమలాదేవి పిల్లాడిని పెంచే బాధ్యత తీసుకొన్నది ,
సువాందో నలభై ఇళ్ళున్న చిన్న ఊరు .కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు రెండు రైతు మూడు నేత,15 హరిజన కుటుంబాలున్నాయి . జనాభా 250.
వంశ పారం పర్యం
గోపబందు పూర్వీకులు జాజ్ పూర్ నుంచి గంగా వంశ రాజుల ఆహ్వానం పై వచ్చి బిల్హణ హరిపురం లో నివాసమున్నారు .కౌశిక గోత్రీకులు. తాత భగవాన్ దైవ భక్తి పరుడు .చదువుల అధిష్టాన దేవత సరళా దేవి భక్తుడు .ఒకసారి నాలుకకోసుకొని దేవికి సమర్పించటానికి సిద్ధపడ్డాడు .ఈ భక్తి మనవడు గోపబంధు కూ అబ్బింది
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-3-22-ఉయ్యూరు .