మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-135
135-వెంకటేశ్వర మహాత్మ్య౦ కళాదర్శక ఫేం ,బాలరాజు మీసాల ఫేం గ్రిగ్ మెమోరియల్ అవార్డీ–ఎస్వి రామారావు
యస్.వి.యస్. రామారావు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు.
విశేషాలు
పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. బందరు లోని జాతీయ కళాశాలలో చదువుకున్నాడు[1]. మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో ‘లంబాడీ కన్య’ అనే వర్ణచిత్రం ఎన్నదగినది. ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్లలో తన చిత్రాలను ప్రదర్శించి అనేక బహుమతులు అందుకున్నాడు. 1934లో వేసిన ఒక పెయింటింగ్‌కు “గ్రిగ్ మెమోరియల్ మెడల్” లభించింది. ఈ బహుమతిని పుచ్చుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతడే. ఇతడు ఫ్రీ స్టయిల్ పెయింటింగులో సిద్ధహస్తుడు. ఇతనికి ఆధునిక చిత్రకళ పట్ల కొంత అయిష్టం ఉండేది. బందరుకే చెందిన పి.వి.దాసు ఇతడిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. పి.వి.దాసు తన వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో ఇతడిని కళా దర్శకత్వ శాఖలో చేర్చుకున్నాడు. ఇతడు కళాదర్శకత్వం వహించిన తొలి సినిమా శ్రీకృష్ణ లీలలు. ఇతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన చిత్రం 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రానికి సెట్సు, కాస్ట్యూములు తయారు చేయడంలో ప్రతిభ చూపించాడు. స్టుడియోలో వెంకటేశ్వరుని విగ్రహానికి నిజమైన విగ్రహంలోని నగల్లాంటి నగలను తయారు చేయడానికి చాలా శ్రమించాడు. ఫలితంగా ఆ చిత్రం చూసినవాళ్లవ్వరూ అది స్టూడియో విగ్రహమని నమ్మలేదు. బాలరాజు సినిమాలో హీరో పాత్రకు ఇతడు సృష్టించిన ‘మీసం’ స్టయిలు ఎంతో మందికి నచ్చింది. ఆ రోజుల్లో చాలామంది ఈ మీసాన్ని అనుకరించారు. ఇతడు నిర్మాతగా కూడా మారి రెండు చిత్రాలను నిర్మించాడు. 1970లో ఇతడు మరణించాడు.
కళాదర్శకుడిగా
- 1935 : శ్రీకృష్ణ లీలలు
- 1936 : ద్రౌపదీ వస్త్రాపహరణం
- 1938 : గృహలక్ష్మి
- 1938 : మాలపిల్ల
- 1939 : రైతుబిడ్డ
- 1939 : వందేమాతరం
- 1942 : సీతారామ జననం
- 1946 : బాలరాజు
- 1946 : ముగ్గురు మరాటీలు
- 1947 : మాయలోకం
- 1947 : యోగివేమన
- 1948 : బాలరాజు
- 1950 : స్వప్న సుందరి
- 1952 : చిన్న కోడలు
- 1952 : ధర్మదేవత
- 1957 : వినాయకచవితి
- 1957 : సారంగధర
- 1960 : దీపావళి
- 1960 : శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం
దర్శకుడిగా, నిర్మాతగా
- 1942 : బాలనాగమ్మ
- 1952 : చిన్నమ్మ కథ
ఎన్టీఆర్, సావిత్రి, ఎస్.వరలక్ష్మి ప్రధాన పాత్రల్లో పి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్యం’ . ఈ సినిమా విడుదలై నేటికి 61 వసంతాలు పూర్తి చేసుకుంది.
అప్పటికే పి.పుల్లయ్య.. టాకీ మొదలైన 8 ఏళ్ల తర్వాత 1939లో ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ (బాలాజీ)సినిమా తెరకెక్కించారు. అయితే.. ప్రజలు బళ్లు కట్టుకొని థియేటర్స్‌కు వెళ్లడమనేది శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ తోనే మొదలైంది. ఆ చిత్రం విడుదలైన 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్ వేంకటేశ్వర స్వామిగా.. సావిత్రి పద్మావతిగా.. యస్.వరలక్ష్మి అలివేలుమంగ పాత్రల్లో పి.పుల్లయ్య ఈ సినిమాను మళ్లీ తెరకెక్కించి మరోసారి అలాంటి విజయాన్నే నమోదు చేసారు.
ఓ సారి హిట్టైన కథతోనే వేరే ఆర్టిస్టులతో సినిమా తెరకెక్కించి సక్సెస్ సాధించడం ఆషామాషీ కాదు. కానీ పుల్లయ్య మాత్రం తాను తెరకెక్కించిన కథతో మరోసారి సినిమా తీసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు.
ఈ సినిమాకు ఆచార్య ఆత్రేయ మాటలతో పాటు కొన్ని పాటలను రాసారు. అంతేకాదు ఈ సినిమా చివరి సన్నివేశాలపై వేంకటేశ్వర స్వామి మహాత్యాలను చెప్పే వ్యాఖ్యాతగా మారారు. ఈ సినిమాలోని పాటలు విశేష జనాదరణ పొందాయి.
పద్మావతి, లక్ష్మీ దేవిల మధ్య కయ్యం సన్నివేశంలో శ్రీనివాసుడు శిలావిగ్రహంలా మారతాడు. ఏ పురాణంలోని ఈ సన్నివేశాన్ని పుల్లయ్య తనదైన శైలిలో చిత్రీకరించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు.
ఈ సినిమా కోసం తిరుపతివలే గర్భాలయం సెట్ వేసి దేవుణ్ణి ప్రతిష్టించారు. వాహినీ స్టూడియోలో నిర్మాత నాగిరెడ్డి ఇల్లు వెనకనే ఉన్న ఫ్లోర్లో తిరుమల గర్భగుడి సెట్ వేసారు. కే.జి.వేలుస్వామి అనే శిల్పి …సినిమాలో మూల విరాట్టుతో పాటు మిగతా విగ్రహాలను తయారు చేశారు. కళా దర్శకుడు ఎస్.వి.ఎస్.రామారావు ఎంతో సహజంగా తీర్చిదిద్దారు.
ఈ సినిమా కోసం వేసిన వేంకటేవ్వర స్వామి విగ్రహాన్ని నిజంగానే వేద మంత్రాల మధ్య ప్రతిష్టించారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు .. నిత్య ధూప దీప నైవేద్యాలు ఇతర కైంకర్యాలను గుడిలో జరిగినట్టే చేసేవారు. ఈ సినిమాకు అప్పట్లో మొత్తంగా 11 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అప్పట్లో ఈ సినిమాకు వచ్చే కలెక్షన్ల కంటే హుండీలో వచ్చే డబ్బులు ఎక్కువ వచ్చేవట. హుండీలో వచ్చిన డబ్బులను తిరుపతికి పంపించేవారట
ఈ సెట్లోనే ఘంటసాల మీద ‘శేషశైలా వాసా శ్రీ వేంకటేశా అనే పాట తీశారు.ఘంటసాల నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో మొత్తం 17 పాటలు, 10 పద్యాలు, 1 స్తోత్రం ఉన్నాయి.ఇందులో సుప్రభాతం పద్యం మినహా మిగతా పద్యాలు నారపరెడ్డి రాశారు. ఈ సినిమా ప్రదర్శన జరిగినంత కాలం అన్ని థియేటర్స్ ఆవరణలో వేంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంచి పూజించేవారు.
ఈ సినిమా విడుదలైన 23 ఏళ్ల తర్వాత హిందీలో ‘భగవాన్ బాలాజీ’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తే.. అక్కడ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా మొత్తంగా 20 కేంద్రాల్లో విడుదలైతే.. 16 కేంద్రాల్లో శతదినోత్సవం, 1 కేంద్రంలో రజతోత్సవం జరుపుకుంది. అంతేకాదు రిపీట్ రన్లో ఎన్నో సార్లు వంద రోజులు నడిచి రికార్డు క్రియేట్ చేసింది శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ సినిమా
. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత ఎన్టీఆర్.. తన స్వీయ దర్శకత్వంలో ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ అంటూ ఈ సినిమాను రీమేక్ చేసారు. ఈ చిత్రంలో జయప్రద, జయసుధ పద్మావతి, అలివేలు మంగ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ నారదుడిగా నటించారు. ఈ చిత్రంలో బీబీ నాంచారమ్మ కథను జోడించి తెరకెక్కించడం విశేషం.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-3-22-ఉయ్యూరు