నటనాచార్య ‘ చింతా కబీర్ దాస్

‘నటనాచార్య ‘ చింతా కబీర్ దాస్

–ఏప్రిల్ 16 న తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా…
నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగునాట రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా తనదయిన ముద్రవేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చింతా కబీర్ దాసు గారి గురించి తెలుసుకుందాం…

నట ప్రస్థానం: మే 28, 1934లో మచిలీపట్నంలో చింతా బలరామమూర్తి, వెంకటేశ్వరమ్మ దంపతులకు జన్మించిన కబీర్ దాస్, చదువు పూర్తి కాగానే 1953 లో విజయవాడ ఆంధ్ర సిమెంట్ కంపెనీ లో ఉద్యోగంలో చేరారు. 1954 లో ఆంధ్ర సిమెంట్ కంపెనీ ఎంప్లాయిస్ యూనియన్ కల్చరల్ వింగ్ లో సి.హెచ్.రామచంద్ర రావు గారి ఆధ్వర్యంలో ‘నా చెల్లెలు ‘ నాటికలో నాయక పాత్ర ద్వారా నాటకరంగప్రవేశం చేశారు.
1956 లో విజయవాడలో ర.స.న సమాఖ్య (రసజ్ఞుల, సహృదయుల, నటీనటుల సమాఖ్య) లో చేరి ‘నటరాజ ‘ కె. వేంకటేశ్వర రావు, జి.ఎస్.ఆర్. మూర్తి గార్ల వద్ద దర్శకత్వం మెళకువలను తెలుసుకొని, నటనలో పాత్రలకు ఎలా జీవం పోయాలో క్రమశిక్షణతో నేర్చుకున్నారు. ఇక్కడ నాటకాలు ఆడుతూనే సత్య కళానికేతన్ లో కూడా ప్రధాన పాత్రల్ని తనకి తనే సాటి అనే భావన కలిగేటట్లుగా జనరంజకంగా పోషించేవారు.

వెంకన్న కాపురం, దంత వేదాంతం, కళాకార్, పెళ్ళిచూపులు, మట్టె బంగారం, గుడ్డిలోకం, అన్నా చెల్లెలు, మారని మనిషి, ఆరాధన, కీర్తి శేషులు, కనక పుష్యరాగం మొదయిన నాటకాల్లో విలక్షణమయిన నటనప్రదర్శించారు. దేశభక్తి ప్రభోదిత, చారిత్రాత్మక నాటకం ‘దేశం నీ సర్వస్వం ‘ అత్యంత ప్రతిభావంతమయిన దర్శకత్వపు విలువలతో, బలమయిన సన్నివేశాలతో పాత్రలకు ప్రాణం పోస్తూ ఆంధ్రదేశమంతా అనేక ప్రదర్శనలకు అవకాశం పొందిందంటే అందుకు అమూల్యమయిన వీరి దర్శకత్వ ప్రతిభే కారణం.

కబీర్ దాస్ గారునటిచడం, దర్శకత్వం వహించడమే కాకుండా…. కళాదర్శిని లోనూ, ప్రజానాట్య మండలి లోనూ ఔత్సాహిక కళాకారుల కోసం వర్కు షాపులు అనేక సంవత్సరాల పాటు నిర్వహించారు.
ఆకాశవాణి నాటకాలు : వేదిక పైన, ప్రేక్షకులముందు నటించడమే కాకుండా శ్రోతల మెప్పు పొందేటట్లుగా 1970 నుంచి ఆకాశవాణి లో శ్రవ్య కళాకారుడిగా మూడు దశాబ్దాలపాటు అనేక శ్రవ్య నాటకాల్లో నటించారు. 1985 లో పొందిన ‘నటనాచార్య ‘ బిరుదు వీరి నటకిరీటంలో కలికితురాయిగా భావించవచ్చు.
కబీర్ దాస్ గారు నటించిన ‘కనక పుష్యరాగం ‘ నాటకం సాంగ్ అండ్ డ్రామా డివిజన్ వారు నిర్వహించిన అఖిలభారత స్థాయి ప్రాంతీయ భాషా నాటకాల్లో ప్రథమ బహుమతిని సాధించింది. గుర్తింపు పొందిన అనేక నాటకపరిషత్తులు నిర్వహించిన నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా ప్రముఖుల ప్రశంసలతో పాటు, గౌరవం పొందడం వెనుక వీరి అవిరళకృషి ఎంతో వుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పురస్కారాలు : నాలుగు దశాబ్దాల కళాసేవకి గుర్తింపుగా – నిడదవోలు ‘రాఘవ కళానిలయం ‘ వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్-2001 అందుకోవడంతో వీరి నట జీవితానికి గొప్ప గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
నాటకంలో రచయిత సృష్టించిన పాత్ర అస్థిపంజరమయితే, దర్శకుడి సృజనాత్మకతతో కూడిన దర్శక ప్రతిభ తో రక్తమాంసాలు చేర్చిన శరీరానికి తన విశిష్టమయిన ఆలోచనా శక్తితో జీవం పోసిన మహానటుడు కబీర్ దాస్ గారు. అలాంటి కబీర్ దాస్ గారి నటన తో కూడిన అద్భుత నాటకాన్ని చూసి పరవశించి పోయింది తెలుగు నాటకరంగ ప్రేక్షకలోకం.

1964 తిరుపతిలో జరిగిన వేంకటేశ్వర నాట్యకళా పరిషత్తులో ప్రదర్శించిన అన్ని నాటకాల్లోనూ నటించిన నటీనటుల డైలాగులు పరిశీలించిన న్యాయనిర్ణేతల ‘బెస్ట్ డైలాగ్ రెండరింగ్ ‘ అవార్డ్ పొందారు కబీర్ దాస్.
2011, జూలై 1 న అమెరికా ‘తానా ‘ మహాసభల్లో ‘బెస్ట్ తానా ఎచీవ్మెంట్ అవార్డ్ ‘ పొందడం తన మనసుకు మరింత ఆనందాన్ని కలగజేసిందంటారు కబీర్ దాస్. ఇవన్ని ఒక ఎత్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం ‘విశిష్ట పురస్కారం-2017 ‘ తనకి దక్కడం మరో ఎత్తని హర్షాన్ని వ్యక్తం చేసారు కబీర్ దాస్.
కుటుంబం : 1969 లో వివాహం జరిగిన చింతా కబీర్ దాస్ – నిర్మల దంపతుల ‘వివాహ గోల్డెన్ జూబిలీ ‘ 2019 నవంబర్ 19 న తమ ముగ్గురు కొడుకులు, కుమార్తె-అల్లుడు బంధుమిత్రుల సంక్షంలో ఆనందంగా జరుపుకోవడం వారి వైవాహిక జీవితంలో మరపురాని ఘటనగా పేర్కొన్నారు.

నాటకాల్లో అనేక పాత్రల్ని సునాయాసంగా, రస్పోరకంగా, కరుణ రసప్రధానంగా, హాస్యదాయకంగా, పాత్రోచితంగా నటించిన కబీర్ దాస్ గారికి జీవితంలో అలనాటి మధుర స్మృతుల్ని మననం చేసుకుంటే – నాటి భారతంలో దృతరాష్ట్ర మహారాజుకి చూపులేదని – తన కళ్ళకి గంతలు కట్టుకున్న భార్య గాంధారి లాగా కాకుండా, శారీరకంగా అన్ని బావున్నా నరాల బలహీనత వల్ల కంటిచూపు మాత్రం కోల్పోయిన కబీర్ దాస్ గారికి అనురాగవతి అయిన భార్య నిర్మల గారు ఎంతో సహనంతో, ఓర్పుతో అందించే సేవలు, కుటుంబ సభ్యులు సహకారం నిరుపమానం.
తన 86 ఏళ్ళ వయస్సులో నాటకరంగానికి చేసిన సేవల్ని తలచుకుంటూ వారి భవిష్య జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని తెలుగు నాటకరంగ దినోత్సవ సందర్భంగా నాటకరంగం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

అని తెలియజేశారు కళామిత్ర అడివి శంకరరావు

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -17-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.