మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-139139-తొలి నేపధ్యగాయని ,నటి -బెజవాడ రాజరత్నం

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-139
139-తొలి నేపధ్యగాయని ,నటి -బెజవాడ రాజరత్నం

బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా నటి, తొలి నేపథ్యగాయని . బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి, జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం, పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. అప్పట్లో రాజరత్నం పేరుతో ఇద్దరు నటీమణులుండేవారు. ఎవరెవరని గందరగోళం రాకుండా, వాళ్లిద్దరూ వాళ్ల వూరి పేర్లు తగిలించుకున్నారు. ఒకరు బెజవాడ రాజరత్నం. ఇంకొకరు కాకినాడ రాజరత్నం. వీరిలో కాకినాడ రాజరత్నం ప్రౌఢ పాత్రలు వేస్తే, బెజవాడ రాజరత్నం యువతి పాత్రలు ధరించేవారు. బెజవాడ రాజారత్నం గాయని, కానీ కాకినాడ రాజరత్నం గాయని కాదు.

ప్రైవేటు గీతాలు
మొదట్నుంచీ బెజవాడ రాజరత్నం గాయని. సంగీతం నేర్చుకున్నారు. శాస్త్రీయంగానూ, లలితంగానూ గీతాలు పాడడంలో నిపుణురాలు. ఆ రోజుల్లో రూపురేఖలు ఎలా వున్నా, పాట పాడగలిగే వాళ్లే నటీనటులు. అలా రాజరత్నం ముందు రంగస్థలం మీద నటిస్తూ పాటలు, పద్యాలతో రాణించింది. మనిషి బక్కగా వుండేది. చెప్పుకోవాలంటే అందమైన ముఖం కూడా కాదు. కాని, గాయనిగా అర్హతలుండడంతో, నాటకాల్లో నటించింది; సినిమాల్లోనూ ప్రవేశించింది. సినిమాలకి రాకముందు ఆమె గ్రామ్‌ఫోన్‌ కంపెనీకి పాడింది. ట్విన్‌ కంపెనీ ద్వారా రెండు రికార్డులు విడుదలైనాయి. ఒక రికార్డులో ‘మా రమణ గోపాల’, ‘శృంగార సుధాకర’ అని రెండు పాటలు వుండగా, ఇంకో రికార్డులో ‘హాయి హాయి కృష్ణ’; ‘చిరు నగవులు చిందుతూ’ అన్న పాటలు పాడిందామె. అన్నీ భక్తి పాటలే. అయితే ఆ రోజుల్లో రికార్డు మీద పాట ఎవరు రాశారో, ఎవరు స్వరపరిచారో వుండేది కాదు. ఈ రికార్డు మీద ‘మిస్‌ రాజరత్నం’ అన్న పేరే వుంటుంది.

చలనచిత్రరంగ జీవితం
దక్షిణ భారతదేశంలో నిర్మితమైన తొలి సినిమా సీతాకల్యాణం(1934)లో రాజరత్నం సీత. అంతవరకూ ఉత్తరదేశంలో నిర్మితమవుతూ వచ్చిన తెలుగు సినిమాలు- ‘సీతా కల్యాణం’తో మద్రాసులో మొదలైనాయి. పినపాక వెంకటదాసు గారు, వేల్‌ పిక్చర్స్‌ పేరుతో తడికెలతో స్టూడియో (ఆళ్వార్‌పేటలో) కట్టి ‘సీతాకల్యాణం’ తీశారు. చిత్రపు నరసింహారావు దర్శకుడు. కల్యాణి అనే ఆయన రాముడు. రాజరత్నానికి ఇది తొలి సినిమా.

మధ్యలో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా, నాటకాల్లోనూ నటిస్తూ- మళ్లీ పెళ్ళి (1939) చిత్రంలో నటించిన పాత్రకూ, పాడిన పాటలకీ ప్రశంసలు లభించాయి. రాజరత్నం ఇందులో రెండో నాయిక. ప్రధాన నాయిక కాంచనమాల. కొచ్చర్లకోట సత్యనారాయణ, రాజరత్నం జంట. ఆమె పాడిన ‘చెలి కుంకుమమే, పావనమే’, ‘కోయిలరో, ఏదీ నీ ప్రేమగీతి’, ‘గోపాలుడే’ పాటలు ఆ రోజుల్లో చాలా పాపులరు. కాంచనమాలతో కలిసి పాడిన ‘ఆనందమేగా వాంఛనీయము’ కూడా అందరూ పాడుకునేవారు. ఈ సినిమాతో రాజరత్నానికి మంచి పేరు వచ్చినా, నాటకాల్లో కూడా నటించేది. వై.వి.రావు అటు తర్వాత తీసిన విశ్వమోహిని (1940)లో నటించిందామె. ‘ఈ పూపొదరింటా’ పాట జనరంజకమైంది. పెద్ద హిట్టయిన ‘మళ్లీ పెళ్ళి’ తర్వాత, అంతటి పెద్ద హిట్టూ బి.ఎన్‌.రెడ్డిగారి దేవత (1941). చిత్తూరు నాగయ్య సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట- ‘రాదే చెలి నమ్మరాదే చెలి- మగవారినిలా నమ్మరాదే చెలీ’ ఇప్పటికీ నాటితరం వారికి బాగా గుర్తు. అలాగే అందులో ఆమె ‘నిజమో కాదో’, ‘ఎవరు మాకింక సాటి’ పాటలు కూడా పాడింది. ఇంకో పాట కూడా అందరి నోటా వినిపించేది. అది ‘జాగేలా వెరపేలా త్రాగుము రాగ సుధారసము’. ఈ పాటలన్నీ సముద్రాల రాఘవాచార్య రాశారు.

సినిమాలకి వచ్చిన తర్వాత కూడా రాజరత్నం పది, పన్నెండు ప్రయివేట్‌ గీతాలు గ్రామ్‌ఫోన్‌కి పాడింది. సినిమాలకి నిదానంగా ప్లేబాక్‌ విధానం వస్తోంది. వందేమాతరం(1939)లో నాగయ్య, కాంచనమాల పాడిన పాటలు ముందే రికార్డు చేసి, ప్లేబాక్‌ పద్ధతిలో చిత్రీకరించారు. ప్లేబాక్‌ కాకపోయినా, కృష్ణ అనే అబ్బాయికి సాబూ పాడాడు. ఒకరికి ఇంకొకరు పాడడం ఇలా మొదలైనా, ఈ పాట ముందుగా రికార్డు చెయ్యలేదు. వేరొకరిచేత ముందుగా పాడించి, రికార్డు చేసి ప్లేబాక్‌ చేసి చిత్రీకరించినది- మళ్లీ పెళ్లిలో హీరో వై.వి.రావుకి ఆ చిత్రం సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు పాడారు. ఆ లెక్కలో ఓగిరాల మొదటి నేపథ్య గాయకుడు.

1943లో వాహిని వారి భక్తపోతన విడుదలైంది. ఈ సినిమాలో రాజనర్తకి సామ్రాజ్యానికి ‘ప్లే బాక్‌’ పాడినది – బెజవాడ రాజరత్నం. ఈ విధంగా తెలుగు సినిమాల్లోని మొదటి నేపథ్య గాయనిగా రాజరత్నం చరిత్రకెక్కింది. 1943లో వచ్చిన భాగ్యలక్ష్మిలో రావు బాలసరస్వతీ దేవి ‘తిన్నెమీద సిన్నోడ’ పాడారు- కమలా కోట్నీస్‌కి. ‘భక్తపోతన’ రికార్డు మీద రాజరత్నం పేరుంది. ఇది మంచి సమయము రారా అన్నది ఆ పాట. అదేకాదు- పోతన సినిమాలో నాగయ్య, మాలతి, నాళం వనజాగుప్త- ‘మానవసేవే- మాధవసేవా’ పాట పాడారు; కాని, గ్రామ్‌ఫోన్‌ రికార్డులో బెజవాడ రాజరత్నం – మాలతి పాడిన చరణాలు పాడింది. నాగయ్య, వనజాగుప్తలు మళ్లీ పాడారు. ఇదొక విశేషం.

రాజరత్నం తమిళంలో కూడా నటించి, పాటలు పాడింది. ‘మోహిని’ అనే చిత్రంలో నాయిక మాధురికి ప్లేబాక్‌ పాడిందామె. జెమిని వారి జీవన్ముక్తి (1942)లో రాజరత్నం నటించి, పాడింది. ఆమె, సూరిబాబు కలిసి పాడిన ‘జోడుకొంటారా బాబూ, జోడుకొంటారా’ పాట అప్పట్లో ప్రజల నోట వినిపించేది. ఘంటసాల బలరామయ్య తీసిన ముగ్గురు మరాఠీలు (1946) రాజరత్నం చిన్నపాత్ర ధరించి రెండు పాటలు పాడింది. అయితే ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించలేదు; ఎక్కువ నేపథ్య గీతాలూ పాడలేదు. మంచి కంఠంతో, హాయిగా పాటలు పాడేది గనక, పాటలున్న పాత్రలుంటే ఆమె చేత నటింపజేసి పాడించేవారు. ఆమె పాడిన పాటలన్నీ పాపులర్‌ అయినాయి.

ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత విజయ సంస్థ నిర్మించిన జగదేకవీరుని కథ (1961)లో ‘జలకాలాటలలో’ పాటలో రాజరత్నం కూడా పాడింది- నలుగురిలో ఒకరికి. దీని తర్వాత పాడిన దాఖలాలు లేవు.

బెజవాడ రాజరత్నం పేరు చెబితే, సినిమా సంగీతపు నూతన యవ్వనంలో ఒక మధుర తరంగం జ్ఞాపకం వస్తుంది. ఆమె పాడుతుంటే అది ఒక తేనె వాగు. నేర్చి, వల్లెవేసి ముక్కున పట్టి అప్పజెప్పిన పాట కాదు. సాధన వలన, శిక్షణ వలన సిద్ధించినదీ కాదు. దైవదత్తమైన వరం! అని- సినిమా సంగీత విశ్లేషకుడు, పరిశోధకుడూ వి.ఎ.కె. రంగారావు ఒక సందర్భంలో రాశారు.

నటించిన సినిమాలు
· 1934 – సీతా కల్యాణం

· 1939 – మళ్లీ పెళ్ళి

· 1940 – విశ్వమోహిని

· 1941 – దేవత, దక్షయజ్ఞం

· 1942 – భక్త పోతన, జీవన్ముక్తి

· 1944 – తాహసీల్దార్

· 1946 – ముగ్గురు మరాటీలు

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.