గోప బంధు దాస్ -5
విద్యారంగం లో ప్రయోగాలు
పూరీజిల్లా సత్యవాది సాక్షీ గోపాల్ ప్రాంతం కొంత పట్టన లక్షణాలు కలిగి ఉంటుంది .రాయ్ బహాదర్ మధు సూదన రావు సూచన మేరకు విద్యా రంగం లో వినూత్న ప్రయోగం కోసం సాక్షీ గోపాల్ ను ఎన్నుకొన్నారు దాసు బృందం .సత్యవాది కూడా అనుకూలమైనదే .బ్రాహ్మణ అగ్రహారాల కేంద్రం .ఇక్కడి వైదికులలో సనాతన చాందసం ఎక్కువ .సాక్షి గోపాల్ దాగ్గర రామచంద్రాపూర్ వాస్తవ్యుడు హరిహరదాస్ పూరీ సంస్కృత కాలేజి వ్యవస్థాపకుడు .ఈయనతో దాసు ,రావు లకు మంచి సంబంధం ఉంది. హరిహర్ యూరోపియన్ లతో బాగా సంబంధాలున్న ఆంగ్ల విద్యాధికుడు .చాన్దసాన్ని వ్యతిరేకించటానికి నిలబడిన స్థిర చిత్తుడు.అక్కడ హరి దాస్ స్మృతులకు గౌరవం కలిపించి తాము అనుకొన్నది ఆచరణలో పెట్టవచ్చని సాక్షీ గోపాల్ నే ఎన్నుకొన్నారు .అప్పుడే రామచంద్ర పూర్ కు చెందిన గోపీనాధ దాసు ఒక మిడిల్ వెర్నాక్యులర్ స్కూల్ పెట్టటానికి సిద్ధపడుతున్నాడు .ఆ స్కూల్ ను సాక్షీ గోపాల్ లో పెట్టమని దాసు నచ్చ చెప్పాడు .19మంది విద్యార్దులతో ‘’సత్యవాది మిడిల్ ఇంగ్లిష్ స్కూల్ ‘’ను 12-8-1909న గోపబందు ప్రారంభించాడు .ఇది ఆయన బారిపాడా కు లాయర్ గా వెళ్ళటానికి ముందు జరిగింది .ఇదే తర్వాత సత్యవాదీ నికుంజ పాఠశాలా ఉద్యమానికి దారి తీసింది .
దేవాలయ ఆవరణలో స్కూలు మొదలైంది సాక్షిగోపాల్ దేవాలయ ప్రాంగణం లో రెండు ఎకరాల భూమిని అద్దెకు ఇవ్వమని సేక్రేటరిగా ఆలయ సంఘాన్ని కోరాడు .అక్కడ దట్టంగా అందమైన వకుళ(పొగడ ) నికుంజం ఉంది.ఆ చెట్ల నీడలలో బడి తరగతులు నిర్వహించవచ్చు అనుకొన్నాడు .కానీ వాతావరణం అనిశ్చితం కనుక భవన నిర్మాణం ఆలోచించాడు .చందాలు వసూలు చేస్తూ చెట్లకింద తరగతులు నిర్వహింప జేశాడు .ప్రభుత్వం రికగ్నిషన్ ఇచ్చింది .11-10-1911న పండిట్ నీలకంఠ దాస్ వచ్చి చేరటంతో హైస్కూల్ గా మార్చే ప్రయత్నం జరిగింది .హైస్కూల్ పెట్టాలన్న గోపబందు కోరిక ఇలా నెరవేరింది .
పాఠశాల లక్ష్యాలు
ప్రాచీన గురుకుల విధానం లో విద్య నేర్పటం .రుసుము తక్కువ .వసతి గృహం ఏర్పాటు . అందులో నిరాడంబర జీవితం ,నిజాయితీ ఉపాధ్యాయుల నియామకం ,వృత్తి విద్యా బోధనా ,ఆధ్యాత్మిక ,నైతిక ప్రబోధం ,.ఇలాంటివి చాలాచోట్ల నిర్మించాలని ఆశయం .అన్నికులాల వారు వచ్చి చేరటం తో చాన్దసులకు ఆగ్రహం కలిగి ,హిందూత్వం భ్రష్టమౌతుందని భయపడి 22-3-1912న బడి పూరి గుడిసెలను తగల బెట్టించారు .దీనివలన అరుదైన పుస్తకాలు ,సుమారు ఐదువేల రూపాయల సామగ్రి దగ్ధమైనాయి .ఏమి చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది .గోపబందుకు వార్త తెలిసి వెంటనే సత్యవాదికి వచ్చి ,స్నేహితులకు ధైర్యం చెప్పి పక్కా గృహం లో పాఠశాల నిర్వహించాలని దైవ సంకల్పం అని చెప్పి నిధుల సేకరణకు పూనుకొన్నాడు .ఒక వినతిపత్రం పై అందరూ సంతకాలు చేశారు ఒరిస్సా అన్ని ప్రాంతాలనుంచి డబ్బు ధారాపాతం వచ్చి చేరింది .సంస్థానాలు కూడా దనం ఇచ్చాయి .బడి ఆగిపోకుండా జరుగుతూనే ఉంది .అగ్ని పెట్టిన ఆరుగంటలలో పోరుగూళ్ళకు వెళ్లి కొబ్బరిమట్టలు పోగేసి తెచ్చి తాత్కాలిక ఆశ్రయం కల్పించారు .తర్వాతకొద్ది రోజుల్లో ఇటుకలతో ఎబ్లాక్, బిబ్లాక్ నిర్మాణాలు జరిగాయి .1913లో శాశ్వత భవనం తయారయ్యాక ఈ రెండు బ్లాకులు భోజన గృహాలుయ్యాయి .
ఆరుబయట చదువు
అగ్ని ప్రమాదం జరిగాక వచ్చి చూసిన గోపబందు ప్రాంగణం లో మర్రి వకుళ ,రావి కొమ్మలు దట్టంగా ఉన్న చోటు చూసి ‘’గుప్త బృందావనం ‘’అనీ ‘’రహస్య నికున్జమని ‘’పేరుపెట్టి ఆనీడలో తరగతులు నిర్వహింప జేశాడు .గోప బంధు ,నీలకంఠ ఆ స్థలాన్ని కొన్ని విభాగాలు చేసి ,ప్రతి విభాగం లో ఇటుక సున్నం తో ప్లాట్ ఫాం నిర్మించి దానిపై ఉపాధ్యాయుడు కూర్చుని బోధన చేసేట్లు ఏర్పాటు చేశారు .బ్లాక్ బోర్డ్ లను చెట్ల మొదట్లో కట్టించారు .విద్యార్ధులను ఆకుల చాపల మీద కూర్చో బెట్టారు .
పునర్నిర్మాణం
1913మొదట్లో కొత్త భవన నిర్మాణం మొదలైంది.పునాదిలో రూపాయి అర్ధ ,పావలా,బేడ అణా నాణాలు వేశారు .పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పేర్లను కాగితం పై రాసి సీసాలో పెట్టి పాతిపెట్టించారు .విద్యార్ధులు చక్కగా సహకరించి తమ స్వప్న ఫలం పొందారు .1914కు సర్వాంగ సుందరంగా పాఠశాల భవనం పూర్తయింది .అగ్ని పునీతమై ఈ విద్యాలయం మళ్ళీ సర్వాంగ సుందరమై అభి వృద్ధి చెందింది .హరిహరదాస్ నీలగిరి వదిలి ,తర్వాత కటక్ లో పియర్ మెమరి అకాడమిలో ఉపాధ్యాయుడుగా పని చేసి ,మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరాడు .1913లో తొమ్మిది ,పది తరగతులు ప్రారంభించారు .కలకత్తా యూని వర్సిటి నుంచి ఆర్ధిక శాస్త్రం ఎం ఎ పొందిన పండిట్ గోదావరీస్ మిశ్రా ఉపాధ్యాయుడుగా చేరాడు .నీలకంఠ ,మిశ్రాలు ప్రభుత్వ ఉద్యోగాలలో చేరితే అత్యున్నత పదవులు పొందేవారు .కానీ గోపబంధు ప్రేరణతో ,దేశాభిమానం తో ఈ విద్యాలయం లో చేరి సేవ లందించారు .వీరందరి నిబద్ధత విశిష్ట కృషి వలన సత్యవాది పాఠశాల అత్యంత వేగంగా అభి వృద్ధి చెంది ఆ నాటి ఒరిస్సాక్షీణ సంస్కృతి మధ్య ఒక విశిష్ట విద్వత్ కేంద్రంగా భాసిల్లింది .కీర్తి ప్రతిష్టలు వ్యాపించటంతో రాష్ట్రం నలుమూలలనుంచి విద్యార్ధులు వచ్చి చేరి వృద్ధి చెందారు .సాక్షీ గోపాల్ స్కూల్ అంటే మామూలు స్కూలు కాదు దేశాభిమానం ,మనోవికాసం జాతీయతా వ్యాపింపజేసే లక్ష్యశుద్ధి కల ఆదర్శ విద్యాకేంద్రం అని పేరుపొందింది .
సత్యవాది విద్యా విధానం
విద్యార్ధులు ఉపాధ్యాయులు కలిసి ఉంటారు .ప్రధానోపాధ్యాయుడు కుటుంబ యజమానిలా వ్యవహరిస్తాడు .య౦గ్ టీచర్స్ అన్నయ్యలుగా ఉంటారు .హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులను ఒరవడి పెడతాడు .ఉపాధ్యాయుల విడిగా విశ్రాంతి గది లేదు .హెడ్ తో సహా అందరూ ఒకే గదిలో కూర్చునేవారు .ఉపాధ్యాయుడు ఇవాళ చెప్పిన పాఠాలపై మర్నాడు ప్రశ్నలు వేసి పరీక్షిస్తాడు . వ్రాతపని చూస్తాడు మెరుగు పడటానికి సూచనలు చేస్తాడు ..వసతి గృహానికి వెళ్లి వెనుకబడిన విద్యార్ధులకు మళ్ళీ బోధించి వాళ్ళను మిగిలినవారితో సమానం అయెట్లు శ్రద్ధ తీసుకొంటాడు .గణిత బోధకుడు హరిహర దాస్ చేతిలో బెత్తం తో కర్ర చెప్పులతో హాస్టల్ లో తిరిగేవాడు .
ప్రతి తరగతి వారూ ‘’తరగతి పత్రిక ‘’నిర్వహించేవారు .ప్రధానోపాధ్యాయుని ఆధ్వర్యం లో పాఠశాల పత్రిక నిర్వహించేవారు .దీనిలో ఉపాధ్యాయులు విద్యార్ధులు రచనలు చేసేవారు .ఆనాటి పదవ తరగతి పత్రికలలో ‘’వాణి’’కి ప్రత్యేకత ఉండేది .ఉపాధ్యాయ విద్యార్ధులు స్వీయాకవితా గానం చేసేవారు .ఒక విద్యా కుటుంబం అంటే ఇలా ఉండాలి అని ఆచరణలో చూపించారు .
చర్చాసదస్సులు ప్రతి శనివారం జరిగేవి .దీనికి అందరూ హాజరవ్వాలి .రాష్ట్రం దేశం లో ప్రసిద్ధులైన వారిని ఆహ్వానించి ప్రసంగాలు చేయించి స్పూర్తి కలి గించేవారు .సర్వ సమర్ధులను శక్తి వంతులను తయారు చేసే విద్యాలయంగా తీర్చిదిద్దారు .ప్రతిభావంతులను ఏరి తెచ్చి వారికి విద్యాలయ ఖర్చుతో ఉత్తమ విద్య అందించేవారు .విహార యాత్రలకు తీసుకువెళ్ళి వారిలో సంస్కృతీ వారసత్వం పై అవగాహన కల్పించేవారు .ప్రతిఏడాది కోణార్క ,ఖండగిరి లకు నడకమీద విహారయాత్రకు తీసుకు వెళ్ళేవారు .అక్కడే గుడారాలు వేసి ఆవరణ శుద్ధి చేసి భోజనాలు వండుకొని తినేవారు .ఐకమత్యం కలిసిఉండటం అలవాటు అయ్యేవి .ఇలాంటి యాత్రలవలన కృపాసిందు మిశ్ర ‘’కోణార్క ‘’అనే ప్రసిద్ధ చరిత్ర గ్రంధం ,కావ్యం రాశాడు .
వసతి గృహాన్ని బ్లాకులుగా విభజించి ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఉంచేవారు .ప్రతి బ్లాక్ కు ఒక విద్యార్ధి మానీటర్ గా ఉండేవాడు .తర్వాత మూడుకు పెంచారు .తలిదండ్రులు పిల్లలకు పంపే డబ్బు హెడ్ మాస్టర్ పేరు మీద పంపెట్లు చేసి మితిమీరిన ఖర్చు జరుగకుండా అదుపు చేసేవారు .క్రమశిక్షణపై చర్చ జరిపేవారు .గడ్డు సమస్య లను పర్యవేక్షకుడు పరిష్కరిస్తాడు ఆయన పరిధి దాటితే హెడ్ మాస్టర్ మానిటర్ల సమావేశం లో పరిష్కరించి ‘’ఒక న్యాయస్థానం స్టేటస్ కల్పిస్తాడు .మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-22-ఉయ్యూరు