మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-145 145-‘’కొడుకుపుట్టాల ‘’నాటిక ఫేం ,రుద్రవీణ ,మరోచరిత్ర ,సీ.రా, మనవరాలు ,సీతమ్మవాకిట్లో సంభాషణ ఫేం –గణేష్ పాత్రో

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-145
145-‘’కొడుకుపుట్టాల ‘’నాటిక ఫేం ,రుద్రవీణ ,మరోచరిత్ర ,సీ.రా, మనవరాలు ,సీతమ్మవాకిట్లో సంభాషణ ఫేం –మాటల మాంత్రికుడు -గణేష్ పాత్రో
గణేష్ పాత్రో (జూన్ 22, 1945 – జనవరి 5, 2015) నాటక రచయిత, సినీ రచయిత.
జననం
ఈయన జూన్ 22, 1945లో జన్మించారు. ఈయన స్వస్థలం విజయనగరం జిల్లా, పార్వతీపురం.
విద్యార్థిజీవితం
గణేష్ పాత్రో తండ్రి, పార్వతీపురం దగ్గర ఒక చిన్న గ్రామానికి కరణంగా పనిచేసేవాడు. గణేష్ ప్రాథమిక విద్య అక్కడే సాగింది. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున, పార్వతీపురంలో ఒక ఇల్లు కొని అందులో బామ్మతో పాటు గణేష్ ను ఉంచి చదివించాడు. తనపై పెద్ద నిఘా లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని నాటకాలలో నటించడం ప్రారంభించాడు, పాఠశాల పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా చదవటం ప్రారంభించాడు. ఆ తరువాత వెనువెంటనే కుటుంబం మొత్తం పార్వతీపురానికి మారింది. ఆ కాలంలోని రావిశాస్త్రి స్ఫూర్తితో స్థానిక విశాఖ మాండలికంలో ఛందోబద్ధ కవిత్వం వ్రాయటానికి ప్రయత్నించాడు కానీ అది సఫలం కాలేదు. పీ.యూ.సి పూర్తయిన తర్వాత పై చదువులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడునుప్పడే విశ్వవిద్యాలయ సాంస్కృతిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా నాటకాలు వ్రాయటం, వాటిని రంగస్థలంపై ప్రదర్శించడం ప్రారంభించాడు.[1]
నాటక, సినీరంగ జీవితం
కొడుకు పుట్టాల నాటికతో యావద్భారతదేశంలో కీర్తి లభించింది. ఆ నాటిక అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై, ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారమైంది. 1970 ప్రాంతంలో రచన ప్రారంభించిన గణేష్ పాత్రో అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటకకర్తగా పేరు తెచ్చుకున్నాడు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేష్ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత. మృత్యుంజయుడు, తెరచిరాజు, తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాల, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు.[2]
1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించాడు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీరంగానికొచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంభాషణలు సమకూర్చాడు.[3] “హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం” నిర్ణయం సినిమాలో పాట రాశాడు.
ఈయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్ చిత్రాలు ఉన్నాయి.[4]
రచయితగా పనిచేసినిన సినిమాల పాక్షిక జాబితా
· సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) (సంభాషణలు, శ్రీకాంత్ అడ్డాలతో కలిసి)
· 9 నెలలు (2001)
· నిర్ణయం (1991) (సంభాషణలు, పాటలు)
· సీతారామయ్య గారి మనవరాలు (1991)
· రుద్రవీణ (1988)
· గౌతమి (1987)
· తలంబ్రాలు (1986)
· ప్రేమించు పెళ్ళాడు (1985)
· మయూరి (1984)
· మనిషికో చరిత్ర (1984)
· గుప్పెడు మనసు (1979) (సంభాషణలు)
· ఇది కథ కాదు (1979)
· మరో చరిత్ర (1978)
· అత్తవారిల్లు (1976)
మరణం
కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందిన గణేష్ పాత్రలో 69 ఏళ్ళ వయసులో 2015, జనవరి 5 సోమవారం ఉదయం కన్నుమూశాడు.[5]
ఇతర వివరాలు
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బైపాస్‌ రోడ్డుకు గణేష్‌పాత్రో రోడ్డుగా నామకరణం చేయబడింది.[6]
కుటుంబ అనుబంధాలను ఎంతో హృద్యంగా అత్యంత సహజ సిద్ధంగా ఆవిష్కరించే ప్రత్యేక కథా రచయిత గణేష్ పాత్రో సోమవారం చెన్నైలో కన్నుమూశారు. 69 ఏళ్ల ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బాల్యం నుంచి కథలు రాయడం, నాటకాల్లో నటించడం అలవరచుకున్న గణేష్ పాత్రో స్వగ్రామం విజయనగరం జిల్లా పార్వతీ పురంలో 1945 జూన్ 22న ఆదిలక్ష్మీనారాయణ పాత్రో, సూర్యకాంతం దంపతులకు ఆయన జన్మించారు. ఈ దంపతులకు 17 మంది సంతానంలో పెద్ద వాడు గణేష్‌పాత్రో.
ఈయన అసలు పేరు వేహ్రా సత్య గణ గంగ పోలీసు వెంకటరమణ మహా పాత్రో. బీఏ పట్టదారుడైన ఆయనకు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు అంటే ఎంతో అభిమానం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే చిత్ర రంగంలోకి వచ్చారు. నాటకాలు రాయడం, నటించడంపై మక్కువ చూపించే గణేష్ పాత్రోకు ప్రముఖ రంగ స్థల నటుడు కుప్పిలి వెంకటేశ్వరరావు నటన కంటే రచనలపై దృష్టి సారించాలని సలహా ఇవ్వడంతో పలు కథలను రచించా రు. పావల, కొడుకు పుట్టాల, ఆలోచించండి వంటి పలు నాటకాలను ఆయన రచిం చారు. తొలి నాటకం కొడు కు పుట్టాలకు జాతీయ అవార్డు రావడం విశేషం. ఈ నాటకం పలు భాష ల్లో అనువాదం అయిం ది. రేడియోల్లోనూ ప్రసారం అయింది.
సినీ ప్రస్తానం
గణేష్ పాత్రో సినీ రంగ ప్రస్తానం 1965లో మొదలైంది. అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని అయిన గణేష్ పాత్రో ఆయనలాగే నటించాలని ఆశపడే వారట. అయితే, ఆయన రాసిన పావల, కొడుకు పుట్టాల నాటకాల సమ్మేళనంతో మాకు స్వతంత్రం కావాలి అనే చిత్రాలను తెరకెక్కించారు. కృష్ణం రాజు, జయ ప్రద హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి నిర్మించారు. అలా, కథా రచయితగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన గణేష్‌పాత్రో 125కు పైగా చిత్రాలకు కథలు, మాటలను అందించారు.
బాలచందర్‌తో అనుబంధం
దివంగత ప్రఖ్యాత దర్శకుడు కే బాల చందర్‌తో గణేష్‌పాత్రో అనుబంధం విడదీయరానిది. ఆయన చేసిన ప్రతి చిత్రానికి తెలుగులో గణేష్‌పాత్రో సంభాషణలు అందించారు. వారి మధ్య మంచి సాన్నిహిత్యానికి ఇదొ క నిదర్శనం. బాలచందర్ దర్శకత్వం వహించిన మరో చరిత్ర, గుప్పెడు మనసు,ఆకలి రాజ్యం, రుద్ర వీణ, ఇది కథకాదు లాంటి పలు చిత్రాలు గణేష్‌పాత్రోకి మంచి పేరుతెచ్చి పెట్టాయి. బాలచందర్ అస్తమించిన వెళ్లిన రెండు వారాల్లోనే గణేష్‌పాత్రో కలం ఆగిపోవడం సినీరంగానికి తీరని లోటు.
కోడి రామకృష్ణతో 40 చిత్రాలు
సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ, గణేష్‌పాత్రోల కలయికలో 40 చిత్రాలు తెరకెక్కడం విశే షం. ముఖ్యంగా భార్గవ ఆర్ట్స్ పిక్చర్స్ అధినేత దివంగత ఎస్ గోపాల్ రెడ్డికి ఆస్థాన రచయితగా గణేష్‌పాత్రో వ్యవహరించారు. అలాగే, ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్‌తో కలసి ప లు చిత్రాలకు పనిచేశారు. మనిషికో చరిత్ర, మయూరి, ప్రేమించి పెళ్లాడు, నాట్య మయూ రి, అత్తవారిళ్లు, స్వాతి, చిలకమ్మ చెప్పింది, వం టి ఎన్నో చిత్రాలు రచయితగా గణేష్‌పాత్రోకు కలికి తురాయిగా మిగిలాయి. మంచి సంభాషణలేగానీ, పంచ్ డైలాగులు రాయన న్న నిబద్ధతతో మానవత విలువలకు అద్దం పట్టే చిత్రాలను చేసిన గణేష్‌పాత్రో చివరి చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కావడం విశేషం.
నంది అవార్డులు
గణేష్‌పాత్రో స్వాతి చిత్రానికి 1983లో, రుద్రవీణ చిత్రానికి గాను 1988లో ఉత్తమ నంది అవార్డులను అందుకున్నారు. మయూరి చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును దక్కించుకున్నారు. 2009లో ఆయన అభిమానంగా ప్రేమించే అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాన్ని, 2013లో మనసు కవి ఆత్రేయ బిరుదును అందుకున్నారు. గణేష్‌పాత్రోకు భార్య లక్ష్మికుమారి, కుమార్తెలు కనకమహాలక్ష్మి, సంయుక్త, కుమారుడు సీతారామ పాత్రో తదితరులు ఉన్నా రు. గణేష్‌పాత్రోకు తొలి రోజుల్లోనే దర్శకత్వ అవకాశం వచ్చినా, అని వార్య కారణాలతో తెరరూపం దాల్చ లేదు. కుటుంబ సభ్యులతో కలసి విశాఖ పట్నంలో నివశించాలన్న కోరిక ఆయనకు ఉన్నా, అది నెరవేరకుండానే అందరికీ దూరమయ్యారని కుటుంబ సభ్యులు పేర
మాటల రచయిత ‘గణేపాత్రో’ జయంతి స్పెషల్..
దేవుడు సర్వాంతర్యామి అని మనం అనుకుంటాం. కానీ.. అసలు సిసలు సర్వాంతర్యామి ఆకలి అని చెప్పిన మాటల మాంత్రికుడు
దేవుడు సర్వాంతర్యామి అని మనం అనుకుంటాం. కానీ.. అసలు సిసలు సర్వాంతర్యామి ఆకలి అని చెప్పిన మాటల మాంత్రికుడు.. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్యా.. కానీ దాన్ని నడిపే వాణ్ని కొనడం మన తరమా.. అంటూ గుండెల్ని పిండి చేసేలా పాత్రోచితంగా రాయగల నేర్పరి.. ఇన్నాళ్లూ మనం విడిపోయింది మృత్యు ఒడిలో కలవడానికా అంటూ చరిత్ర సృష్టించిన మరో చరిత్రను ఒక్క ముక్కలో ముగించి వినేవాడి కళ్లు చెమర్చేలా చేయగల రచయిత.. ఆయనే పాత్రోచిత సంభాషణలకు పెట్టింది పెన్నుగా పేరు తెచ్చుకున్న గణేష్ పాత్రో .. ఇవాళ గణేష్ పాత్రో జయంతి.
క్షణకాలం గుర్తుండే పంచ్ డైలాగులకన్నా.. కలకాలం గుర్తుండే మంచి డైలాగులతో మనపై ముద్రవేసిన గొప్ప రచయిత గణేష్ పాత్రో. ఆయన మాటలు రాసిన ఏ సినిమాలోనూ మాట సన్నివేశాన్ని డామినేట్ చేయదు.. ఎలివేట్ చేస్తుంది. సీరియస్ మాటలు రాయాలంటే గణేష్ పాత్రో కలం ఉరకలు వేస్తుంది. ఆకలిరాజ్యం పై అక్షరాలు ఎక్కుపెట్టిన పాత్రోనే.. మాటలతో రుద్రవీణలు వాయించారు..
వెండితెరకు రావడానికి ముందే గణేష్ పాత్రో తన నాటకాల, మాటల ద్వారా ఎన్నో స్టేజీలను దున్నేశారు. ఆయన మాటలతో అన్ని స్టేజీలు అదిరిపోయాయి. పావలా, కొడుకుపుట్టాలా, లాభం లాంటి నాటకాలు ఆ తర్వాతి కాలంలో సినిమాగానూ రూపుదిద్దుకున్నాయి. 1976లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘అత్త వారిల్లు’ చిత్రంతో సినీ మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. 1978లో వచ్చిన కె. బాలచందర్‌ సినిమా ‘మరోచరిత్ర’ ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది.
మరోచరిత్ర సినిమాతో శ్రీశ్రీకి అక్షర నైవేద్యం చేశాడు పాత్రో. శ్రీశ్రీ చెప్పినట్టు అంటూనే సన్నివేశానికి తగ్గట్టుగా తనమాటల సత్తా చూపించాడు. శ్రీశ్రీ విలువ మూడు రూపాయలు.. ఇక మనల్ని ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు అంటూ నాటి నిరుద్యోగం, కరవు పరిస్థితులను తన అక్షరాలతో కడిగిపారేశాడు పాత్రో.
మరోచరిత్రకు ముందే చిలకమ్మ చెప్పింది సినిమాతో బాలంచదర్ తో పరిచయమైంది పాత్రోకి. అందుకే ముందుగా ఆకలిరాజ్యం సినిమాకు ఆత్రేయతో రాయించాలనుకున్న బాలచందర్.. పాత్రో పాళీ పవర్ తెలుసుకుని ఆయన్ని రచయితగా తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు.. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూపాయి.. ఆ పరిచయమే పాత్రోని బాలచందర్ కు తెలుగుముఖంగా మార్చాయి.. అటు బాలచందర్ కూడా ఈయనపై ఉన్న ప్రేమతో ఆయన మాటలు రాయకపోయినా.. ఓ సినిమాకు ఆయన పేరునే మాటల రచయితగా వేశాడు..
బాలచందర్ కు తెలుగు ముఖంగా మారిన పాత్రోకి ఆయనకేం కావాలో తెలుసు. అలాగే తను చెప్పిన పాత్రలకు పాత్రో ఎలా రాస్తాడో బాలచందర్ కూ తెలుసు. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఎక్కడా ఒక్కమాట కూడా ఎగస్ట్రా గా అనిపించదు. ఇంక డ్రామాకు ఎక్కువ ఆస్కారం ఉన్న గుప్పెడు మనసు, ఇది కథ కాదు, రుద్రవీణ .. లాంటి సినిమాల్లో ఎక్కడా మాటలు దృశ్యాన్ని డామినేట్ చేయవు.. అది బాలచందర్, పాత్రోల అర్థవంతమైన బంధానికి ప్రతీక..
బాలచందర్ తర్వాత గణేష్ పాత్రో పెన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిన కథలు క్రాంతికుమార్ నుంచి వచ్చాయి. దీంతో ఆటోమేటిక్ గా ఈ ఇద్దరి బంధం ముదిరిపోయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి.. గుండె బరువెక్కించాయి. స్వాతి, మయూరి, సీతారామయ్యగారి మనవరాలు, 9నెలలు లాంటి సినిమాలతో పాత్రో తన పెన్ పవర్ చూపిస్తే, క్రాంతికుమార్ దర్శకుడిగా దమ్ము చూపించారు..
ముఖ్యంగా సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో డైలాగులన్నీ సాధారణంగానే ఉన్నాయనిపిస్తాయి.. కానీ కథాగమనంతో పోల్చి చూసినప్పుడు పాత్రో సంభాషణల సత్తా ఏంటో అర్థం అవుతుంది. సన్నివేశానికి అనుగుణంగా మాటలు రాయడం అంటే పాత్రో తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది.. ఈ సినిమా చూసిన తర్వాత.. ముఖ్యంగా రోహిణి హట్టంగడి చనిపోయిన తర్వాత అక్కినేని, మీనాల మధ్య వచ్చే సన్నివేశంలో పాత్రో మాటలు ప్రతిఒక్కరి గుండెల్ని పిండి చేస్తాయి..
కథకు పొంతన లేకుండా, పాత్రలకు సంబంధం లేకుండా రాసే రైటర్‌ కాదు ఆయన. ఒక క్యారెక్టర్‌కు ఒక మాట రాశాడంటే.. ఆ మాట సినిమా చూస్తున్న ప్రేక్షకుడి గుండెలోతుల్లోకి దూసుకెళ్లేది. కదిలించేది. నవ్వించేది. ఏడిపించేది. ఎంతటి విషయాన్నైనా వీలైనంత క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పడం గణేష్‌పాత్రోకు వెన్నతోపెట్టిన విద్య. ఆయన పాత్రలతో మాట్లాడించే ప్రతీమాట కథతో మమేకం అయ్యుండేది. హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రోజు రాయలేదు. అందుకే పాత్రో మాటలు పాత్రోచితంగానే మురిపిస్తాయి.
బాలచందర్ తో ఎక్కువ అనుబంధం ఉన్నా.. ఆయన సినిమాలతోనే ఎక్కువ ఫేమ్ అయినా .. తెలుగులో పాత్రో ఎక్కువగా మాటలు రాసింది కోడి రామృష్ణ చిత్రాలకు. వీరి కాంబినేషన్ లో దాదాపు 40 సినిమాలు వచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. అలాగే భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో వచ్చిన అన్ని చిత్రాలకూ పాత్రోనే మాటలు రాశారు.. ఈ సినిమాల్లో అప్పుడప్పుడూ కాస్త బూతు ధ్వనించిందనే విమర్శలూ పాత్రో పాళీలో ఉన్నాయి.. అయినా మరీ హద్దు మీరిన సంభాషణలు మాత్రం ఏ సినిమాలోనూ కనిపించవు..
వందకు పైగా సినిమాలకు మాటలు రాసిన పాత్రో చాలా వరకూ సీరియస్ సినిమాలకే ఎక్కువగా మాటలు రాశారు. అప్పుడప్పుడూ సరదాలకు పోయినా ఎప్పుడూ హద్దు మీరలేదు.. అయితే ఒకే ఒక్క పాటతో తనలోని చిలిపితనాన్ని చిరకాలం చేశారు పాత్రో. నిర్ణయం సినిమాలోని హలోగురూ ప్రేమకోసమేరోయ్ జీవితం అనే టీజింగ్ సాంగ్‌ని అన్ని సీరియస్ సంభాషణలు రాసిన పాత్రో రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్కటే రాసినా ఇప్పటికీ ఆ పాట ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకోని కుర్రాళ్లుంటారా ..?
సంభాషణా రచయితగా సన్నివేశానికి తగ్గట్టుగా ఎంతటి మాటలైనా రాసే పాత్రో రియల్ లైఫ్ లో మాత్రం చాలా సౌమ్యుడు. ఎవరినీ చేయి చాచి అడగడం తెలియని అమాయకుడు పాత్రో అంటాడు ఆత్రేయ. అందుకే ఓ దశలో సినిమా రంగంలో వస్తున్న విపరీత పోకడలు, మార్పులకు అనుగుణంగా తను మారలేక, మార్పును కాంక్షిస్తున్న వారిని అవకాశాలు అడగటం ఇష్టం లేక తన పెన్నునే కొంత కాలం పక్కన బెట్టారు.. క్రాంతికుమార్ డైరెక్షన్ లో వచ్చిన 9నెలలు తర్వాత పాత్రో దాదాపు పదిహేనేళ్లు సినిమా సంభాషణలకు దూరంగా ఉన్నారు.
దాదాపు వంద సినిమాలకు మాటలు రాసిన రచయిత కేవలం పరిశ్రమ పోకడలు నచ్చకే పదిహేనేళ్లు దూరంగా ఉన్నారంటే చిన్న విషయం కాదు.. కానీ కమర్షియల్ కాలిక్యుటేషన్స్ లో పడిపోయిన పరిశ్రమలో పాత్రో లాంటి ప్రతిభావంతమైన రచయితను పట్టించుకునేదెవరు.. అటు ఆయన కూడా ఎవరినీ తనకు అవకాశం ఇవ్వమని అడగలేదు. దీంతో ఇక పాత్రో పాళీలో ఇంకు ఖాళీ అయిపోయినట్టే అనుకుంటున్న టైమ్ లో శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఆయన కలంలో ఇంకు నింపి తన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి మాటలు రాయించారు. అదే ఆయన చివరి చిత్రం కూడా.. అయితేనేం.. అందరూ నవ్వాలంటూ ఆయన రాసిన మాటలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి కదా..
కుటుంబ వ్యవస్థలోని బంధాలు, ఆత్మీయతలకు గణేష్‌పాత్రో సంభాషణలు అద్దం పట్టాయి. ఇదికథకాదు, మరోచరిత్ర నుంచి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు ఎన్నో చిత్రాల్ని తన మాటలతో విజయపథంలో నడిపించారు. తెలుగులో తను మొహమైన బాలచందర్ మరణించిన అతి కొద్దికాలానికే మిత్రుణ్ని వెదుక్కుంటూ వెళ్లిపోయిన పాత్రో మరణం తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి తీరని లోటు..
గొల్లపూడి మారుతీ రావు కు పాత్రో రాసిన ఉత్తరం –
సరిగ్గా 19 రోజుల కిందట గణేష్‌ పాత్రో నాకో ఎస్సెమ్మెస్‌ పంపాడు.
‘డియర్‌ మారుతీ! (నన్ను ‘ఒరేయ్‌’ అని పిలిచే అతి తక్కువ మందిలో పాత్రో ఒకడు), నోటికి ఆపరేషన్‌ కోసం ఆసుపత్రిలో చేరాను. నువ్వు నా గురువువి. నువ్వెప్పుడూ గుంటూరు లంక పొగాకు చుట్ట కాల్చి ఆనందించడానికి వెనకాడలేదు. కాశ్మీరీ కిమామ్‌తో కలకత్తా పత్తాతో కట్టిన జర్దా కిళ్లీ సర్దాని కాదనలేదు. మంచీ చెడూ ఎప్పుడూ కలిసే వస్తాయి. చెడు అలవాటుని నువ్వు గుర్తించి దూరం చేసుకున్నప్పుడు దేవుడు నీకు వరమవుతాడు. చెడుని వదులుకోలేనినాడు నిన్ను తన దగ్గరికి తీసుకుంటాడు. ఈ విపర్యాయాన్ని నువ్వు నీ కొడుకులకు చెప్పు – పాత్రో”. ఇదీ అక్షరాలా ఆ సందేశం. నేను నిర్ఘాంతపోయాను. వెంటనే ఫోన్‌ చేశాను. మళ్లీ వెంటనే సమాధానం. ”ఓ నెలరోజులు మాట్లాడలేను. సారీ మారుతీ”. ఇక ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో తెలీదు. పాత్రో భార్య లక్ష్మి నాకు చిన్నపిల్లగా తెలుసు. అతని మామ – నటరాజు కె.వేంకటేశ్వరరావూ నేను ”ఒరేయ్‌” అని పిలుచుకునేంత సన్నిహితులం. విలవిలలాడిపోయాను.
మరో ఆరు రోజుల తర్వాత కె.బాలచందర్‌ గారు కన్నుమూశారు. బాలచందర్‌కి ‘తెలుగు ముఖం’ పాత్రో. సందేశం కోసం నన్ను పలకరించిన వారందరికీ చెప్పాను. బాలచందర్‌గారి అన్ని చిత్రాలకీ రాసిన గణేష్‌ పాత్రో చాలా గొప్ప విషయాలు చెప్పగలడనీ- అతనే రాయగలడనీ. అయితే ఆ రెండు పనులూ చేసే స్థితిలో లేడు పాత్రో. విషాదానికి కలం కదలకపోవడం, కన్నీరు కార్చడానికి కళ్లు కలిసిరాకపోవడం దురదృష్టం.
ఈ పన్నెండు రోజులూ పాత్రో నా మనస్సులో కదులుతూనే ఉన్నాడు. ఉండబట్టలేక జనవరి రెండున ఒక మెసేజ్‌ పంపాను. ‘కోలుకుంటున్నావా?’ అని. అప్పటికి సమాధానాన్ని పంపే స్థితిలో లేడట పాత్రో. కేన్సర్‌ శరీరంలో చాలా భాగాలకి వ్యాపించింది. మాత్రలతో బాధనుంచి అతన్ని మభ్యపెడుతూ వచ్చారు.
దాదాపు 54 సంవత్సరాల కిందట నన్ను పరిచయం చేసుకోడానికి – మా తమ్ముడి ద్వారా ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా స్టేషన్‌కి వచ్చేవాడు. అప్పుడు పోస్టల్‌ డిపార్టుమెంటులో ఉద్యోగం. అలా వచ్చిన వ్యక్తులు ఇద్దరు – గణేష్‌పాత్రో, కె.వివేకానంద మూర్తి. విశాఖలో రైలు దిగినప్పటినుంచి మళ్లీ రైలు ఎక్కేదాకా నాతోనే ఉండేవారు. వాక్యరచన, శిల్పం, ఉక్తి చమత్కృతి, సంభాషణ చాతుర్యం – అన్నీ ఇద్దరితో చర్చించేవాడిని. ఇద్దరూ జీవితమంతా గర్వంగా ‘నా గురువు’ అని చెప్పుకున్నారు. ఇద్దరూ నన్ను ఏకవచనతో పిలిచేంత సన్నిహితులయిపోయారు.
ఆంధ్ర నాటకకళా పరిషత్తు, విజయవాడ పోటీలలో (1970 సెప్టెంబరు 8) నా నాటిక ‘కళ్లు’కి దీటుగా గొప్ప రచన చేశాడు పాత్రో. పేరు ‘పావలా’. ఆనాడు ‘కళ్లు’ ఉత్తమ రచన కాగా, మిగతా బహుమతులనన్నింటినీ మేమిద్దరం పంచుకున్నాం. ‘పావలా’ నాటికను మిశ్రో అద్భుతంగా ప్రదర్శించాడు. సినీమా రంగంలో ఎన్నో గొప్ప చిత్రాలకు బాలచందర్‌గారికి ‘తెలుగు ముఖ’మయి నిలబడ్డాడు. కమల్‌హాసన్‌కి శ్రీశ్రీని అలవాటు చేశాడు. శ్రీశ్రీ కవితల్ని అలవోకగా చదువుతాడు కమల్‌. అతని ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’ వంటి చిత్రాలు ఏ రచయితనయినా ఈర్ష్య పడేటట్టుచేసే గొప్ప చిత్రాలు. పాత్రో యింటినిండా నందుల పంట. సినీ నటుడిగా నేను నటించిన అన్ని గొప్ప పాత్రలనూ పాత్రోయే రాశాడు. ‘సంసారం ఒక చదరంగం’, ‘మనిషికో చరిత్ర’, ‘డబ్బు భలే జబ్బు’, ‘రామాయణంలో భాగవతం’, ‘పుణ్యస్త్రీ’, ‘పద్మావతీ కళ్యాణం’ – యిలాగ. రచయితగా పాత్రో నా శిష్యుడు. నటుడిగా వెండితెర మీద పాత్రో నా వూపిరి. కావాలని, పిలిచి ఆయా సినిమాలకు పాత్రోయే రాయాలని నేను పట్టుబట్టిన సందర్భాలున్నాయి. నాటకీయత, విసురూ, మాటల్లో పదునూ, తనదయిన భావ దారుఢ్యం- యిన్నిటిని సాధించగల రచయిత పాత్రో. తణుకులో ‘సీతారామయ్యగారి మనుమరాలు’ చూస్తూ మొదటి ఫ్రేమ్‌ నుంచీ కంటతడిపెడుతూనే ఉన్నాను. అప్పుడు పాత్రో తణుకులోనే ఉన్నాడు. రూంకి పిలిచి మరీ కావలించుకున్నాను. ఓ భయంకరమైన ఆపరేషన్‌ కలిసిరాకపోగా, చాలా యిబ్బందులతో జీవించాడు పాత్రో. సంవత్సరం కింద ప్రపంచ తెలుగు మహాసభలకు కౌలాలంపూర్‌ వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే గదిలో గడిపాం. కౌలాలంపూర్‌లో నా పుట్టిన రోజు జరిపాడు. బాలచందర్‌గారిని ఎప్పుడు కలవాలన్నా మా రూటు పాత్రో ద్వారానే. పాత్రో అంటే అమితమైన గౌరవం, గురి, అభిమానం బాలచందర్‌గారికి. బాలచందర్‌గారి సాన్నిహిత్యం ఓ వ్యసనం. లభిస్తే దానినుంచి ఎవరూ తప్పుకోలేరు. బాలచందర్‌గారితో కలిసి పన్నెండో రోజునే నిష్క్రమించాడు పాత్రో. నాకే కాదు – నా భార్యని ‘శివానీ’ అని ఆత్మీయంగా పిలిచే రెండో మిత్రుడు (మొదటి మిత్రుడు బీ.వీ.రామారావు). నా పిల్లలకి సన్నిహితుడు. రొటీన్‌గా ‘మెలోడ్రామా’ని పూసుకుని, రాసుకుని తెరమీద వ్యాపారం చేసే చిల్లర వ్యాపారులలాగ కాక – కొత్తదనాన్నీ, కొత్త ధనాన్నీ, కొత్త నుడికారాన్నీ యివ్వగల గొప్ప దర్శకులు – బాలచందర్‌, క్రాంతికుమార్‌ వంటివారి సాంగత్యం లభించిన అదృష్టవంతుడు. ఆ సాంగత్యాన్ని సార్ధకం చేసిన ప్రతిభాశాలి. ‘మారుతీ’ అన్న పిలుపుని ఆప్యాయంగా పిలిచే అతి కొద్దిమందిలో నేను నష్టపోయిన ఆత్మీయుడు. తెలుగుమాటకి కవిత్వపు చెమ్కీని అద్ది కొత్తరకం కన్నీటికి కొత్త అర్థం చెప్పిన కవి. నాటకంలో, సినీమాలో అద్భుతమయిన టైమింగ్‌ని ఒడిసిపట్టుకున్న రచయిత – పాత్రో, తన జీవితానికి వచ్చేసరికి సెలవు తీసుకోడానికి – ఒకే ఒక్కసారి టైమింగ్‌ మిస్సయాడు! – గొల్లపూడి మారుతీరావు (రచయిత, నటుడు)
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-20-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.