మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-149

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-149
149- విదేశీ వస్త్ర బహిష్కరణ ,సహాయ నిరాకరణ లలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు ,ప్రజామిత్ర పత్రికాధిపతి ,ప్రగతిమార్గ చిత్రాలు మాలపిల్ల ,రైతుబిడ్డ దర్శకుడు –గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 – అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది.

జీవిత విశేషాలు
1898 జూన్ 24న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య – బాపమ్మల కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్వగ్రామం కూడా నందమూరే. రామబ్రహ్మం చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది. అతనికి 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు.

1924లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930లో మూసివేయవలసి వచ్చింది. ఆయన 1931లో అఖిలాంధ్ర రైతు మహాసభను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. 1934లో ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీనికి నాట్యకళ ప్రపూర్ణ బళ్ళారి రాఘవ అధ్యక్షులు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి ‘గండికోట పతనం’ అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.

ప్రజామిత్ర
ఆయన మద్రాసు నుంచి ‘ప్రజామిత్ర’ వారపత్రికను పదేళ్ళ పాటు నడిపాడు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు, కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశ ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్ర లోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వ్రాశాడు.

సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావులు ఇతనికి సహాయపడుతుండేవారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్నలు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.

తాపీ ధర్మారావు, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్ మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు.

సినిమా జీవితం
ఆయన ఆసక్తి సినిమాల మీదకుమళ్ళాక ఆయన పత్రికారంగాన్ని వదిలి పెట్టి సారథిచిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆయన 1934లో తీసిన శ్రీ కృష్ణ లీలలు చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం కోసం రామబ్రహ్మం, నిర్మాత పి.వి.దాసు కలిసి రాజేశ్వర రావు అనే నటుడిని బెంగుళూరు నుంచి తీసుకు వచ్చారు. తర్వాత 1936లో విడుదలైన ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో కూడా ఆయన పనిచేశాడు. ఈ అనుభవాలతో చిత్రనిర్మాణ కళ తనకు పట్టుబడిన తర్వాత, పౌరాణిక చిత్రాల జోరులో కొట్టుకుని పోతున్న జనం అభిరుచులను మార్చడానికి సాహసించి సఫలుడైన ధీశాలి గూడవల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల ఆయన తీసిన తదుపరి చిత్రం. సారథిచిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938లో విడుదలైంది.

మాలపిల్ల
దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమంతో బాటు గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాలపిల్ల చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించాడు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల చిత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల. జస్టిస్ పార్టీ వారి సమదర్శినితో బాటు ప్రజామిత్ర పత్రికకూ సంపాదకుడైన రామబ్రహ్మం పత్రికల కన్నా సినిమాయే శక్తివంతమైన ప్రచార సాధనమని గుర్తించి ఊపిరిపోసిన చిత్రమిది. ఆనాడు దేశాన్ని పట్టి ఊపేస్తున్న హరిజనోద్యమాన్ని రామబ్రహ్మం తన సినిమాకు ఇతివృత్తంగా తీసుకుని,గుడిపాటి వెంకటచలంతో కథారచన చేయించాడు. ఈ సినిమాకు తాపీ ధర్మారావు సంభాషణలు వ్రాశాడు.చలం, ధర్మారావు ఇద్దరూ ఆనాటి సమాజంలో చలామణి అవుతున్న అర్థం లేని ఆచారాలను అపహాస్యం చేసిన వారే. మాలపిల్ల చిత్రం లోని పాటలకు భావకవి బసవరాజు అప్పారావు కావ్యగౌరవం కల్పించాడు.ఇందరు ప్రముఖుల సౄజనాత్మక భాగస్వామ్యంతో తయారైన మాలపిల్ల తెలుగు నాట అఖండ విజయం సాధించింది. జస్టిస్ పార్టీ నేతృత్వంలో 1920వ దశాబ్దంలో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం జోరుగా నడిచిన ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

మాలపిల్ల చిత్రం కాంచనమాలను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన నల్లవాడే గొల్లపిల్లవాడే సూపర్ హిట్ అయింది. అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది.

ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక ‘నిరసన మహాసభ ‘ బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది. అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా “మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం” అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం రైతుబిడ్డ

రైతుబిడ్డ
ప్రధాన వ్యాసం: రైతుబిడ్డ (1939 సినిమా)

మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.

ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామానాయుడు వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు బి.నరసింహారావు.

ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీలో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.

రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన రోజులు మారాయి చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తా రైతాంగ చైతన్యం కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశాడు.

తీసిన సినిమాలు
· మాలపిల్ల (1938) నిర్మాత, దర్శకుడు

· రైతుబిడ్డ (1939) రచయిత, దర్శకుడు

· ఇల్లాలు (1940) దర్శకుడు

· అపవాదు (1941) దర్శకుడు

· పత్ని (1942) దర్శకుడు

· పంతులమ్మ (1943) దర్శకుడు

· మాయలోకం (1945) దర్శకుడు

· పల్నాటి యుద్ధం (1947) దర్శకుడు

“రామబ్రహ్మం, బి.ఎన్.రెడ్డి తమకున్నలాంటి సంస్కృతే ప్రేక్షకులకు ఉన్నట్లుగా భావించేవారు తప్ప వారిని వెర్రివెంగళప్పలుగా చూడలేదు.” -కొడవటిగంటి కుటుంబరావు.

ఇతర వివరాలు
· రామబ్రహ్మం 1942-43, 1944-45 సంవత్సరాలలో రెండు సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

· రామబ్రహ్మానికి మధుమేహం వ్యాధి ఉంది. పల్నాటి యుద్ధం భారీ సినిమా నిర్మాణ సమయంలో (1946) హఠాత్తుగా అతనికి పక్షవాతం వచ్చింది. ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గకుండా అక్టోబరు 1న కాలధర్మం చేశారు.

· విజయవాడలో ఈడ్పుగంటి లక్ష్మణరావు కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవాద్యక్షునిగా ‘గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్’ అనే సంస్థను స్థాపించి సుమారు పది సంవత్సరాలు నాటక, సినీ రంగాలకు సేవచేశారు.

· తెనాలిలో రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబరులో ‘రామబ్రహ్మం సంస్మరణ సంఘం’ ఏర్పడి అతనితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి ‘స్మారక సంచిక’ను ప్రచురించారు.

· విజయవాడ గాంధీనగర్ లోని అలంకార్ సెంటర్ లో రామబ్రహ్మం కాంస్య విగ్రహాన్ని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆవిష్కరించారు.

అక్కినేని జ్ఞాపకాలు

“పూజ్యులు, పితృతుల్యులు శ్రీ గూడవల్లి రామబ్రహ్మంగారు తీసిన ’మాయలోకం’ (1945)లో నేను రాకుమారుడిగా నటించాను. ఐతే, ఆ వేషం వుందని తెలిసి ప్రయత్నించడానికి వెళ్ళినపుడు నాకేమీ తెలీదు. నమస్కారం పెట్టాలన్న కనీససంస్కారం కూడా తెలియనివాడిని. నన్ను పంపిన ఘంటసాల బలరామయ్యగారిని ”ఎవడయ్యా వీడు?” అని అడిగితే, ”మీ వాడే” అన్నారాయన. అంటే ’మీ కులం వాడే’నని సూచన. “అందుకేనా అంత…” అన్నారు రామబ్రహ్మంగారు అంత పొగరు నాకుందన్నట్టు! ”పల్లెటూరివాడు, పద్ధతులు తెలియవు. కాని మంచి కుర్రాడు. వృద్ధిలోకి రావలసిన వాడు” అని నా గురించి పెద్దలు చెప్పడంతో – రామబ్రహ్మంగారు నాకు ఆ వేషం ఇచ్చారు. అలా ఆయన దగ్గర చేరాను. క్రమేణా నాపట్ల ఆయనకి వాత్సల్యం కలిగింది. ప్రేమగా చూశారు. నన్ను తన ఇంట్లోనే పెట్టుకున్నారు. నాకు ఏం కావాలో అది పెట్టారు. నేను కుర్రాడిని గనక, నా ప్రవర్తన మీద ఒక కన్ను వేసి వుంచేవారు. రామబ్రహ్మంగారు గొప్ప సంస్కారి. ఆయన చూపిన వాత్సల్యాభిమానాలే నాకు పాఠాలైనాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను; తెలుసుకున్నాను. ఆయన ’మాలపిల్ల’, ’రైతుబిడ్డ’ వంటి సంచలన చిత్రాలు తీసిన గొప్ప దర్శకుడు. నా అదృష్టం వల్ల నేను ఆయన పెంపకంలో వుంటూ ’మాయలోకం’, ’పల్నాటియుద్ధం’ చిత్రాల్లో నటించాను. పెద్దవారి ప్రోత్సాహం, పెంపకం, ఆదరణా లభించకపోతే ఏ వ్యక్తీ ఉన్నత స్థానం పొందలేడు. నేను ఎప్పుడూ ఆయన్ని దర్శకుడిగా చూడలేదు. తండ్రిగా చూశాను. నన్ను ఆయన కొడుకులా చూశారు. వారి ఆశీస్సులు, అభిమానాదరాలే నాకు రక్షగా ఎంతో నిలబడ్డాయి.

అటువంటి గొప్ప దర్శకుడి జీవితకథను వివరిస్తూ పుస్తకం రావడం ఎంతో సంతోషం. పుస్తకాన్ని వెలువరిస్తున్న రచయితను, ప్రచురణ కర్తలను అభినందిస్తున్నాను!” అక్కినేని నాగేశ్వరరావు

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.