గోపబందుదాస్ -7
ఉప్పు తయారీ
సముద్రతీర రాష్ట్రం ఒరిస్సాలో గంజాం ,పూరీ ,కటక్ ,బాలాసూర్ జిల్లాలు బంగాళాఖాతం అంచున ఉన్నాయి .ఈప్రాంతప్రజలు హాయిగా ఉప్పు తయారు చేసుకొనేవారు .ఈస్ట్ ఇండియా కంపెని అధికారం లోకి వచ్చాక ఎక్సైజ్ సుంకం విధించి ఉప్పు తయారీకి ప్రభుత్వ అనుమతి కావాల్సివచ్చి ఆప్రాంతజనుల దరిద్రానికి దారితీసింది .అందరు వాడే ఉప్పు ధర ఆకాశానికి ఎక్కి౦ది .ఇది గ్రహించిన గోపబందు నిబంధనలు లేకుండా ఉప్పు తయారీకి ప్రజలకు హక్కు ఇవ్వాలని ఆందోళన ప్రారంభించాడు .రేవులలో ఉప్పు అంతర్జాతీయ వస్తువు .చిల్కా సరస్సు ,పారీకుడ్ ద్వీపం ఉప్పు తయారీకి ప్రసిద్ధి .ఇక్కడ దుర్భిక్షకారణం ఉప్పు తయారీలో హక్కు కోల్పోవటమే .శాసనమండలి లో గోపబందు ప్రభుత్వ అధీనం నుంచి ఉప్పు తయారీ తప్పించాలని తీర్మానం ప్రవేశపెట్టాడు .అంకెల వివరాలతో స్పష్టంగా ఉన్న తీర్మానం అది .ఫలితంగా చిల్కాలో ఉప్పు పరిశ్రమ పునరుద్ధరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది .ఒక జాయింట్ స్టాక్ కంపెని పెట్టటానికి ప్రభుత్వం సర్వే చేయించింది .దాసు చెప్పటంవలన లెఫ్టినెంట్ గవర్నర్ స్వయంగా వచ్చి చూశాడు .ఆయనకూడా హామీ ఇచ్చాడు .1918లో యుద్ధం ముగియగానే లివర్ పూల్ నుంచి ఉప్పు దిగుమతి మళ్ళీ మొదలైంది .అక్కడ ఉప్పు తయారీ లాభదాయకం కాదని సర్వే నివేదికలు చెప్పాయి .కానీ 1931లో గాంధీ –ఇర్విన్ ఒప్పందం ప్రకారం తీరప్రజలు ఉప్పు తయారు చేసి ,తలమీదమోసుకు పోగలిగినంత ఉప్పు ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్లిఅమ్ముకోవచ్చు అనే హక్కు లభించి గోపబందు ఆశయం నెరవేరింది .
విద్యా సమస్య
1921లోసత్యవాది హైస్కూల్ జాతీయ పాఠశాల గా మారి,దాస్ ఆశయాలకు విఘాతం కలిగి మూసేయాల్సి వచ్చింది .శాసనమండలి లో స్కూళ్ళకు భవనాలు ,పరికరాల విషయం లో నిబంధనలు సదలించమని తీర్మానంప్రవేశపెట్టి ,పూర్వ గురుకుల విధానం వివరింఛి సత్యవాది బడి విజిటర్స్ బుక్ లో సర్ ఎడ్వర్డ్ ‘’ఆరుబయలు విద్యావిదాన౦ ఆరోగ్యదాయకం .గాలి లేని భవనాలలో విద్య క్షయ వ్యాధి వ్యాప్తికి కారణం అవుతుంది ‘’అని రాసిన వాక్యాన్నీ జతచేశాడు
గోపబందు కృషి ఫలితంగా కటక్ రేవంషా కాలేజిలో ఎం ఎ ఇంగ్లిష్ బి ఎల్ క్లాసులు ప్రారంభమయ్యాయి .కటక్ లో ఇంజనీరింగ్ ,పూరీలో సంస్కృత కాలేజీ ఏర్పాటు చేయించాడు ,హైస్కూల్ కాలేజీ విద్యార్ధులకు పది శాతం ఉపకార వేతనం పొందేట్లు చేశాడు .ప్రతి ఏడాదీ ఒక విద్యార్ధిని ఒరిస్సా నుంచి ఎంపిక చేసి ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షకు లండన్ పంపాలని గట్టిగా కోరాడు .పూరీలోసురక్షిత నీరు పంపులద్వారా సరఫరా చేయాలనీ ,సహకార సంఘాలు రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని పట్టుబట్టాడు .ఒరిస్సా జిల్లబోర్డ్ చైర్మన్ పదవి అనధికార వ్యక్తికే దక్కాలని కృషి చేసి సఫలీ కృతుడయ్యాడు .శాసనమండలిలో రాజకీయ పార్టీ సభ్యుడిగాకంటే స్వతంత్రుడుగా వ్యవహరించి ఆదర్శ ప్రాయుడయ్యాడు .సింగ్ భం డిప్యూటీ కమీషనర్ స్కాట్ ‘’మీ ప్రసంగాలు ఇంగ్లాండ్ ప్రధాని ఎజె బాల్ఫార్ ప్రసంగాలులాగా స్పూర్తి దాయకాలు .కాంగ్రెస్ సభ్యులుగా మీరు మా ప్రభుత్వానికి వ్యతిరేకులైనా,,యూరోపియన్ ఆఫీసర్లమైన మేము మీవంటి నిష్కళంక దేశభక్తులను గౌరవిస్తాము ‘’అని కీర్తించాడు .
మాన్స్ ఫర్డ్ సంస్కరణలు 1921లో అమలుకు వచ్చాయి .1920కలకత్తా కాంగ్రెస్ సభలలో చిత్తరంజన్ దాస్ అధ్యక్షతలో సహాయనిరాకరణ సమర్ధించింది .గోపబందు స్థానం లో మధుసూదనదాస్ శాసనమండలి సభ్యుడయ్యాడు .
ఉత్కళ సమ్మేళనమహాసభ
ఒరిస్సా నాయకుడిగా గోపబందు జాతీయనాయకులు ఎందరితోనో సన్నిహిత సంబంధాలు ఉండేవి .1919ఈద్గా లో జరిగిన ఉత్కళ సమ్మేళనం లో గోపబందు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు .తన అధ్యక్షోపన్యాసం లో ‘’ఉత్కళ ఒరియాలకు భేదం లేదు .అందరికీ చెందింది .ఒరిస్సా లో ప్రవహించే నది మహానది .ఒరిస్సాను స్పృశించే సముద్రం మహోదధి .ఒరిస్సాలోని పర్వతం మహేంద్రం .ఒరిస్సాస్వామి జగన్నాధుడు .ఒరిస్సా స్మశానవాటిక ‘’స్వర్గద్వారం ‘’.వీటన్నిటిలో మహత్వం కనిపిస్తుంది .జాతి దృష్టిలో రాజుకు ,పనివాడికి తేడాలేదు .ఒరిస్సా గ్రామ ప్రాంతాలలో చావిళ్ళు కు ప్రత్యేకత ఉంది మత సంఘపర న్యాయస్థానాలు అవి .స్త్రీలే కుటుంబ సౌభాగ్యం .మాతృభాషలో విద్యాబోధన జరగాలి .ఒరియావారు ఎక్కడున్నా వ్యక్తిత్వం వదులుకోరాదు .దూకాలి లేదా చావాలి అదే మన ధ్యేయం ప్రతి యుగం లోనూ సాధుపురుషులుఒరిస్సాకు వచ్చారు ,’’ఇంతటి ప్రబోధాత్మక ప్రసంగం చేసినా ఉత్కళ సమ్మెలన మహాసభ కాంగ్రెస్ లో విలీనం కావటానికి ఒప్పుకోలేదు .మరో సభలో చంద్ర శేఖర బెహరా చేసినప్రయత్నమూ కలిసిరాలేదు .అయినా గోపబందు అధైర్య పడలేదు .
1920సెప్టెంబర్ లో కలకత్తా లో జరిగిన ప్రత్యెక కాంగ్రెస్ సభలకు గోపబందు హాజరై ,సహాయనిరాకరణ తీర్మాననినికి అనుకూలంగా వ్యవహరించి .ఇక్కడికి రావటానికి నాలుగు రోజులముందు పూరీలో తన అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ మావేశం ఏర్పాటు చేశాడు .డిసెంబర్ నాగపూర్ సమావేశానికీ వెళ్ళాడు .భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని గాంధీకి వివరించి చెప్పి ఒప్పించాడు .దీన్ని తీర్మానం గా చేయించి ఆమోదింపజేశాడు .ఒరిస్సాకు తిరిగివచ్చి ఒరిస్సా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పరచాడు . సింగ్ భం జిల్లా కమిటి దీనికి అనుబంధమైంది .1920డిసెంబర్ 30 చక్రధరపూర్ సమావేశం జరిగింది .జాతీయ కాంగ్రెస్ ఆశయాలను సమర్ధించింది .భారత్ లో ఒరిస్సా ఎలా భాగమో ,భారత జాతీయతలో ఒరియా జాతీయత అంతర్భాగం అని గోపబందు వివరించాడు .ఉత్కళ సమ్మెలన సభను భారత జాతీయోద్యమలో ఒక అంగంగా చెయ్యటానికి శాయశక్తులా గోపబందు కృషి చేశాడు .అప్పటినుంచి కాంగ్రెస్ వాది అయ్యాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-22-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్