గోపబందుదాస్ -8
గాంధీతో కలిసి
ప్రతిజిల్లాలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేస్తూ ,..సమాజ్ ‘’వారపత్రిక స్థాపించి సమాచారం అందిస్తూ ,సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు గోపబంధు దాస్ .ఠానా కేంద్రం నుంచి పైస్థాయి వరకు కమిటీలు ఏర్పడ్డాయి ప్రజోత్సాహం విపరీతంగా ఉంది .అప్పుడే ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది .జలియన్ వాలాబాగ్ దారుణాలపై నిరసన దేశమంతా తీవ్రమైనాయి .రాష్ట్రం నలుమూలల నుంచి వాలంటీర్ లను సేకరించి సహాయ నిరాకరణ లో పాల్గోనేట్లు చేశాడు దాస్ .ఉత్కళ సమ్మేళనం కూడా పెద్ద ఎత్తున ముందుకు దూకింది .జాతీయభావం వెల్లివిరిసింది. స్కూళ్ళు కాలేజీలు వదిలి యువత కదిలి వచ్చింది .హరికృష్ణ మెహతాబ్ నవ కృష్ణ చౌదరి ,జదుమణిమంగరాజ్ వంటి నాయకులు దూసుకు వచ్చారు .లాయర్లు వృత్తివదిలి ఉద్యమం లో చేరారు .డిప్యూటీ కలెక్టర్ గోపబందు చౌదరి రాజీనామా చేసి ఉద్యమం లో చేరాడు .ప్రతిజిల్లాలో ఆశ్రమాలు స్థాపించి ఆశయాలు బోధించారు .జత్సింగ్ పూర్ లో ‘’అలకాశ్రమం ‘’ఏర్పరచి ప్రాణ కృష్ణ పధియారీ ,గోప నవ చౌదరి లతో కలిసి గోపబందు ‘’ఉత్కలస్వరాజ్య శిక్షా పరిషత్ —అంటే జాతీయ విద్యా పరిషత్ నెలకొల్పి ,చదువు మానేసి ఉద్యమం లో చేరినవారికి పాఠశాలలు పెట్టి మానేసిన చదువు పూర్తీ చేయించారు .దీనికోసం సత్యవాది స్కూల్ ను జాతీయ పాఠశాలగా మార్చాడు దాస్ .
ఒరిస్సాలో గాంధీ
నాగపూర్ కాంగ్రెస్ లోనే గోపబందు మహాత్ముడిని ఒకసారి ఒరిస్సా పర్యటన చేయమని కోరగా 23-3-1921న కటక్ వచ్చాడు గాంధి .గోపబందుకు సాయం రాగానే ప్రభుత్వం బెదిరి పోయింది .ఖత్జూరీ నది ఇసుకతిన్నెలపై గాంధీ కి స్వాగతం పలుకుతూ ‘’ మీరు ఎదురు చూస్తున్న గాంధీ ఇక్కడికే వచ్చారు .బుద్ధుడు కబీర్ ,శంకర రామానుజులు ఈ పవిత్ర గడ్డను పావనం చేశారు .మూడు వందల ఏళ్ళక్రితం చైతన్య ప్రభువు ఈ పవిత్ర ఇసుకతిన్నేలమీదనే ప్రజలకు ప్రేమ సందేశం పంచాడు .ఇవాళ మరొక మహనీయుడు రాజకీయ ప్రేమ సూత్రాన్ని బోధించటానికి వచ్చాడు .ఆయన సందేశం విని దానిప్రకారం నడుద్దాం ‘’అన్నాడు . గోపబందు వెంటరాగా గాంధీ పూరీకి పాద యాత్ర చేశాడు .దారిలో సత్యవాది స్కూల్ సందర్శించి ,అక్కడి ఉపాధ్యాయ విద్యార్ధులకు కర్తవ్య బోధ చేసి ,తర్వాత బహిరంగ సభలోనూ మాట్లాడి ఒకరోజు ఇక్కడ గడిపాడు .మర్నాడు పూరీ వెళ్లగా గోపబందు వ్యంగ్యాత్మకంగా ‘’ఆపండి సోదరులారా మీ చప్పట్లు .శాంతికి భంగం కలుగుతుందని ప్రభుత్వం అనుకొన్నది .ఆహి౦స మన మార్గం .ముప్పైకోట్ల భారతీయులు ఒక్కసారి చపట్లు మోగిస్తే ,లక్షమంది బ్రిటిష్ వాళ్ళు అదృశ్యమై పోతారు .ఈమహాత్ముని వ్యక్తిత్వం దక్షిణ అమెరికాలో లోకానికి బాగా తెలిసింది .ఆమహ నీయుడే కైరా జిల్లాలో క్షామబాదితులను ఆదుకోన్నది.ఇకపూరీ జిల్లాగురించి ప్రత్యేకంగా చెప్పాలా?.ఆయన మానవుడు కాదు పురుషోత్తముడు .దైవ దూత .క్షామ నివారణకు ఇంకా పూర్తీ స్థాయి చర్యలు జరగలేదు .మనగవర్నార్ సరిగ్గా స్పందించ లేక పోయారప్పుడు .ఇప్పుడు మనఃరుదయాలకు ఏలిక ఈ గవర్నర్ మహాత్మాగాంధీ ఎలా ప్రవర్తించారో మీకు తెలుసు .పూరీకి రాకుండానే క్షామం ఇక్కడ ఉన్నట్లు ప్రకటించారు.ధనం వర్షంగా కురిసింది దేశం అన్ని ప్రాంతాలనుంచి .ఈ ధారాపాతం ముందు ప్రభుత్వం విదిల్చిన మెతుకులు కొట్టుకుపోయాయి .పూరీ జనం పునరుజ్జీవులయ్యారు .మనప్రాణదాత మన హృదయనేత ఇక్కడ సశరీరంగా మన ముందున్నారు .ఇక్కడ వందలాది జనం క్షామం తోచావటం నేను ప్రత్యక్షం గా చూసి చలించిపోయాను .మనుష్యుల్ని ఇలాచంపిన పాపం ప్రభుత్వానిదే .మనం మహాత్ముని అనుసరించి సహాయ నిరాకరణ లో పాల్గొ౦దా౦.మహాత్మా గాంధీ జీ !కస్టాలు భరిస్తున్నా ,మా ఒరిస్సా ప్రజలు సహాకనిరాకరణలో పని చేసి ముందున్నారు .కష్టాలను భరించే శక్తి మాకున్నది .బుద్ధుని పవిత్ర దంతం ,కబీరు సమాధి రామానుజమఠం,నానక్ దివ్యగీతాలు ఇక్కడే పూరీలో ఉన్నాయి .గంగాయమునలు లాగా హిందూ-ముస్లిం ఐక్యత కోరాడు సంత్ కబీర్ ‘’అని దిశా నిర్దేశం చేశాక, గాంధీ ప్రసంగించాడు .
తర్వాత బరంపురం వెళ్ళారు .అది గంజం జిల్లాలో ఉన్నా ,మద్రాస్ ప్రెసిడెన్సి లో భాగమైన ఒరియా మాట్లాడే జనం ఎక్కువగా ఉన్న ప్రాంతం .ప్రజలు గాంధీకి ఘనస్వాగతం పలికారు .గోపబందు ప్రభావం ఏమిటో మహాత్ముడికి తెలిసింది .ఈ ఒరిస్సా పర్యటన తర్వాతే గాంధీ ‘’ప్రతి ఒరియా మనిషి తిండికి ,గుడ్డకు నోచుకోనేదాకా నేను పూర్తి ధోవతి కట్టను ‘’ అని ప్రతిజ్ఞ చేశాడని చెప్పుకొంటారు .
సమాజ్ పత్రిక
ఒరియాభాషలో గౌరీ శంకర రాయ్ ప్రారంభించిన ‘’ఉత్కళ దీపిక ‘’అనే పత్రిక ఉంది .కటక్ ప్రింటింగ్ వారు ముద్రించేవారు ఇదొక్కటే అప్పటి పత్రిక .ఒక పత్రిక ప్రారంభించమని శశిభూషణ్ రధ్ తో గోపబందు చెప్పాడు .ఆయన ‘’ఆశ’’ పత్రిక పెట్టాడు .గోపబందు పెట్టిన పేరే అది .గోపబందు సంపాదకత్వం లో 1919వరకు అది సాక్షీ గోపాల్ నుంచి వెలువడేది .ప్రచురణ బరంపురం నుంచి జరిగేది .
ఒక వార పత్రిక అవసరమని గుర్తించి శాసనమండలి సభ్యుడిగా వచ్చిన జీతం లో 16వందలు మిగిల్చి జాగ్రత్త చేసి ఒకసారి సాక్షీగోపాల్ వచ్చి గుడిలో పడుకొంటే ఎవరో దొంగిలించేశారు .నిరాశపడకుండా పత్రిక నడపాల్సిందే అనుకొన్నాడు .పూరీకి చెందిన సత్యవాది త్రిపాఠీపత్రికా రచయితా సత్యవాది స్కూల్ టీచర్ కూడా .సత్యవాది ప్రెస్ మొదటి మేనేజర్ .ఈయనకు డబ్బు ఇచ్చిపంపిస్తే చేతి ముద్రణా యంత్రాన్ని కొని సాక్షీ గోపాల్ కు తెచ్చాడు .సత్యవాది స్కూల్ దగ్గర పూరి ఇంట్లో దాన్ని నెలకొల్పారు .దీనితో సత్యవాది పత్రిక ముద్రణ జరిగేది .
సమాజ్ పత్రిక అవసరం ఏమిటో దాస్ వివరించాడు .ప్రజల ఆశయాలకు దర్పణం ఆ పత్రిక అన్నాడు .ప్రతి శనివారం వెలువడేది .గ్రామీణ ప్రజల బాగోగులు అందులో వచ్చేవి .ప్రభుత్వ విదానాలలోలోసుగులు ప్రజలకు తెలిసేవి .భాష సామాన్యులకు అందుబాటులో ఉండేది .నాలుగు పెజీలపత్రిక .రాధానాథ రధ్ ను సంపాదకుడిని చేశాడు .సహాయ సంపాదకుడు హరిహర రధ్.పత్రికపై ఏదో అభియోగం మోపి ఒకసారి గోపబంద్ ను నెలరోజులు జైలులో పెట్టారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-22-ఉయ్యూరు