కుక్కుటేశ్వర శతకం
పిఠాపురం అనే పాదగయా క్షేత్రం లో వెలసిన శ్రీ కుక్కుటేశ్వరస్వామిపై శ్రీ వక్క లంక శ్రీనివాసు కవి శతకం రాశారు .స్వామి కోరి రాయించి అంకితమివ్వమని కలలో చెబితే కవిగారు నెరవేర్చారు ..’’కువలయానందకర శర్వ కుక్కుటేశ ‘’అనేదిమకుటం .స్వభాను సంవత్సర చైత్ర శుద్ధ శుద్ధ అష్టమి కి శతకం పూర్తీ చేసి అంకితమిచ్చాడు కవి .
‘’సుగతి నొప్పారు గౌతమీ సురవరతట-పులినస్థిత’’పాదగయ ‘’పుణ్యమూర్తి
వందనము శూలి ,,భక్తాళి వశ వినోద – కువలయానందకర శర్వ కుక్కుటేశ’’అనేది రెండవ పద్యం .క్రోధ తిమిరం మన్నూ మిన్నూ కానకుండా చేస్తోంది శరణు ఇవ్వు .పిఠాపురం లో నువ్వున్నావని మర్చేపోయాను క్షమించు .సర్వం నీకే ఇస్తా .శరణు .దక్షిణకాశి పీఠికాపురం లో వెలిశావు.కాలం పరిగెత్తిపోతోంది .మాత రాజేశ్వరి మహిమ తో నీ పాద సంసేవనమివ్వు .’’ప్రధమేశ ‘’అని మొక్కితే అన్నీ తీరుస్తావు .’’భక్తజన భాగధేయ –సుభాగ్య చరిత –పాపజనులను క్షమ జూచే భవనాశుడవు ‘’.పిత్రువనం లో పాదగయ లో నీ మూర్తి బహు సుకీర్తి ‘’అన్నాడు .
శివరాత్రినాడు జరిగే కోటి శతవ్రత పూజ చూసి తరిస్తాను .’’బేసికన్నుల ప్రొడ హో భేషు నీదు –చరితం ‘’ఇంత అని ఎవరూ తెలుసుకోలేరు .’’పునుకుల పేరు వదిలి –రావోయి మాతోడి విందు గుడియ ‘’అని ఆహ్వానించాడు .’’ఆరుత రుద్రాక్ష జపమాల అగ్రమునను –యాగవాటిక ,పాణినియతుల యష్టి –లింగరూపము ‘’ఇవే నీ లీల .’’హే ప్రపన్నార్తి హరా శంభు హేకృపాళో-పాహిమాం భక్తజనపాల పాహి శర్వ ‘’అని వేడుకొన్నాడు .సూనృత వాక్యం ఘనం అది సువ్రత ఫలం .అదే పరం ఏదీనీకంటే వేరు కానేకాదు .’’సచ్చి దంబోధి హంసవై సాగరమున –నిరత కేళిని దేలెడి నీలకంఠ’’మాపాపాలుమాన్పు ..అష్టమూర్తి ,రుద్రా గుణ భద్ర శాంతంపు రూపసి నువ్వు ‘’సూర్య శశినేత్ర-నీ అగ్ని నేత్రం తెరిచి ఇబ్బంది పెట్టకు .’’శంకరా పాహిమాం ‘’అంటే పొంగిపోయి రక్షిస్తావు .
‘’పాదగయ లో స్నానం చేసి శైవ వైష్ణవులందరూ వరుత నరిగినా వైష్ణవులు ఎందుకో నిన్ను ఎరగరు ?’’చంద్రునకు నూలుపోగు ‘’చందంగా రచన సాగించి ‘’గీతాల రత్నహారం ‘’సమర్పించాను అన్నాడు భక్తిగా కవి .మాసశివరాత్రి సోమవారం ఉపవాసంతో నిన్ను కొలిచే భక్తులకు కొదవ ఏమీ ఉండదు ‘’అని భరోసా ఇచ్చాడు .’’కుక్కుటాకార మామక కూర్మి మనము –వేగ నీ యందచిగిరించి విరుయునట్లు –వరము దయచేసి ,నీలోక వసతి నిమ్ము –కువలయానందకర ,శర్వ కుక్కుటేశ ‘’అని 104గీతం పాడి చివరిదైన 108లో ‘’భక్తితో ఈ కుక్కుటేశ్వర శతకం పఠించే వానికి ‘’ఇచ్చెదవు గాతవీ విమలపథము-కువలయానందకర ,శర్వ కుక్కుటేశ ‘’అనే పద్యంతో శతకం పూర్తి చేశాడు కవి .కింద గద్య లో భ్రమరాంబికా రామలింగేశ్వర రత్న పుత్రుడు భారద్వాజస గోత్రుడు సుజన విదేయుడు శ్రీ వక్కలంక శ్రీనివాసరాయ ప్రణీతం ‘’అన్నాడు .
గీతపద్య శతకం ఆద్యంతం భక్తి రసప్రవాహంగా నడిచింది సరళపదాలు.పాదగయ క్షేత్ర వైభవం ,స్వామి కున్న అపార కారుణ్య దృష్టి అన్నీ కవితలలో పొంగిపారాయి .ఈ శతకం గురించి ,కవి గురించి మన చరిత్ర కారులు ఎక్కడా చెప్పినట్లు నాకు తెలియదు .పుస్తకం ఏసంవత్సరం లో ప్రచురి౦పబడి౦దీ, వెల వివరాలు కనిపించలేదు ముందు పేజీలు లభ్యం కానందున .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-22-ఉయ్యూరు