మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-164
· 164-రామోజీ కుడిభుజం,కీరవాణి,సుధా చంద్రన్ లను పరిచయం చేసిన –అట్లూరి రామారావు
· నిన్నటి తరం సినీ ప్రముఖుడు, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను దీర్ఘకాలం పర్యవేక్షించిన అనుభవజ్ఞుడు అట్లూరి రామారావు కన్ను మూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పల్లె జీవితపు స్వచ్ఛతకూ, అచ్చతెలుగు తనానికీ నిదర్శనంగా తెల్లటి పంచె, లాల్చీలోనే ఎప్పుడూ కనిపించే అట్లూరి క్రమశిక్షణ, సమయపాలన, పద్ధతిగా కార్యనిర్వహణకు మారుపేరు.
1925 జూన్ 26న ఆయన జన్మించారు. పత్రికాధి పతి రామోజీరావుదీ, అట్లూరిదీ ఒకే ఊరు. కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరలోని పెదపారుపూడికి చెందిన ఆయన, రామోజీ ‘మార్గ దర్శి’ ఆరంభించిన తొలి నాళ్ళ నుంచి వెంట నిలిచిన సన్నిహితుల్లో ఒకరు. ‘ఉషాకిరణ్ మూవీస్’ పేరిట చిత్ర నిర్మాణా నికి విస్తరించినప్పటి నుంచి ఆ వ్యవహారాల్లో కుడిభుజంలా వ్యవహరించారు. ఆ సంస్థలో జంధ్యాల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984) మొదలు ‘మయూరి’, ‘ప్రతిఘటన’ (’85), ‘మౌనపోరాటం’(’89), ‘అశ్వని’ (’91) లాంటి హిట్ చిత్రాలు అట్లూరి చిత్ర నిర్మాణ నిర్వహణలో తయారైనవే. పత్రికావార్త ఆధారంగా నర్తకి సుధాచంద్రన్ను అన్వేషించి ‘మయూరి’ లాంటివి తీయడంలో అట్లూరిది ప్రధానపాత్ర. సంగీత దర్శకుడు కీరవాణిని పరిచయం చేయడంలోనూ ఆయన పాత్ర.
నిజానికి, అట్లూరి చదువుకున్నది కేవలం 5వ తరగతి వరకే. అయితే, ఆ రోజుల్లోని హిందీ భాషా ప్రచార ఉద్యమం వేడితో హిందీ చదివారు. అప్పట్లో గాంధీ గారిని కలవడమే కాక, హిందీ ప్రచారానికి చేసిన కృషికి గాంధీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. కొంతకాలం హిందీ అధ్యాపకత్వం కూడా చేశారు. ప్రజా నాట్యమండలి సభ్యుడూ, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త అయిన పెరుమాళ్ళుతో స్నేహం చేసి, రంగస్థలంపై స్త్రీ పాత్రలు పోషించేవారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారు హిందీలోకి అనువదించిన తెలుగు నాటకాల్లో నటించారు.
‘మాభూమి’ తదితర ప్రయోజనాత్మక నాటకాల్లో నటించారు. తరువాత కాలంలో రామోజీ పిలుపు మేరకు ఆయన సంస్థలో చేరి, తొలుత వివిధ పత్రికల ప్రచురణ చూసేవారు. సినీ నిర్మాణబాధ్యతలు చేపట్టాక అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ, నటనాభిరుచిని కొనసాగించారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలోనే ఎన్టీఆర్ ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రంలో సబ్‌రిజిస్ట్రార్ పాత్రలో ఆయన కనిపించారు.
‘ప్రతిఘటన’లో గాంధేయవాది పాత్రలో, ‘మౌనపోరాటం’లో హీరో తండ్రి పాత్రలో ఆదర్శవాదిగా తెరపై మెరిశారు. ఆ మధ్య హీరో వేణుతో వచ్చిన ‘సదా మీ సేవలో’నూ నటించారు. మీద పడుతున్న వయసు కారణంగా 2000ల నుంచి క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకున్నారు. అట్లూరి 6-2-2015న 90వయేటమరణి౦చారు.
·
165-N.A.T.సంస్థ స్థాపకుడు ,శ్రీకృష్ణావతారం ,మహామంత్రి తిమ్మరుసు ,రఫీని తెలుగు కు పరిచయం చేసిన సినీ నిర్మాత –అట్లూరి పుండరీకాక్షయ్య
· అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 – ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసఎన్.టిి “నేషనల్ ఆర్ట్ థియేటర్” స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. కర్తవ్యం సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.
·
బాల్యం
ఆయన కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న మెకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. ప్రహ్లాద సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవాడు. అక్కడే ఎన్.టి.ఆర్తో పరిచయం ఏర్పడింది. తరువాత రామారావు సినిమాల్లో వేషాల కోసం మద్రాసుకు వెళ్ళడంతో ఆయన తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి నేషనల్ ఆర్ట్స్ నిర్వహించేవాడు.
సినిమా పరిచయం
1951 లో రామారావు పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాడు. అప్పటికే రామారావు నటుడిగా నిలదొక్కుకొని ఉన్నాడు. ఈయన్ను తీసుకెళ్ళి చక్రపాణికి అప్పగించాడు. అలా విజయా సంస్థలో వంద రూపాయల జీతంతో పనిలో చేరాడు. ఒక రోజు రామారావు వచ్చి తను ఒక కంపెనీ ప్రారంభిస్తున్నాననీ, అందుకు ఆయన్ను ప్రొడక్షన్ కంట్రోలర్ గా ఉండమని కోరాడు.
త్రివిక్రమ రావు నిర్మాతగా నేషనల్ ఆర్ట్స్ బ్యానర్ పై పిచ్చి పుల్లయ్య అనే సినిమా ప్రారంభించారు. అందులో పుండరీకాక్షయ్య ఒక పాట కూడా పాడారు. తరువాత వహీదా రెహమాన్ కథానాయికగా జయసింహ అనే సినిమా తీశారు. ఆ తర్వాత రేచుక్క పగటి చుక్క, పాండురంగ మహాత్యం, సీతారామకళ్యాణం మొదలైన సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేశాడు. సీతారామకళ్యాణం విడుదల సమయంలో అనారోగ్యం పాలయ్యాడు. అదే సమయంలో ఆయన చదివిన అప్పాజీ నవలను సినిమాగా తీయాలనుకున్నారు. అలా ప్రారంభమైందే మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమా గుమ్మడికి బాగా పేరు తెచ్చిన చిత్రం. దీనికి కేంద్ర ప్రభుత్వ నుండి రజత పతకం కూడా లభించింది.
నటుడిగా
కర్తవ్యం సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను పరుచూరి బ్రదర్స్‌తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా ఏ.యం.రత్నం పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత మామా కోడలు, శివయ్య, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ మొదలైన 20 తెలుగు, 5 కన్నడ సినిమాల్లో నటించాడు.
సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.
మరణం
పుండరీకాక్షయ్య చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, ఫిబ్రవరి 2 గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు కన్నుమూసారు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-22-ఉయ్యూరు