· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-167
· 167-విలనీ’’’ కి కొత్తర్ధం చెప్పిన ,’’అదే మామా మన తక్షణ కర్తవ్యమ్ ‘’ బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బా’డైలాగ్ ఫేం ,’’నాన్నగారు’’ పాత్రధారి –ఆర్ .నాగేశ్వరావు
ఆర్.నాగేశ్వరరావుగా ప్రసిద్ధుడైన తెలుగు సినిమా నటుని పూర్తి పేరు రాజనాల నాగేశ్వరరావు (1928 – 1959). విలన్ అంటే గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు ఉన్న వ్యక్తులు మన కళ్ళ ముందు మెదులుతారు. అయితే అవేమీ అక్కరలేకుండా విలన్ పాత్రధారి కూడా హీరో తరహాలో సాత్వికంగా కనబడవచ్చని, అతనిలోని క్రూరత్వానికి, బయటకు కనిపించే ఆకారానికి సంబంధం లేదని ‘విలనీ’కి కొత్త అర్ధం చెప్పిన విలక్షణ నటుడు ఆర్.నాగేశ్వరరావు. “బాబులు గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి” అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో అందరి నోటా వినిపించేది. అదే నోటితో ఆయన చెప్పిన “అదే మామా మన తక్షణ కర్తవ్యం” అంటూ పలికిన డైలాగ్ కూడా ఇప్పటికీ మరచిపోలేం. మొదటి డైలాగ్ అన్నపూర్ణా వారి దొంగరాముడు చిత్రంలోనిది కాగా, రెండవది విజయా వారి మాయాబజార్ చిత్రంలోనిది. కౄరమైన పాత్రలు పోషించడంలో ఆర్.నాగేశ్వరరావు తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇల్లరికం, ఇంటిగుట్టు, ఇలవేల్పు, శభాష్ రాముడు వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. విలన్ పాత్రలు వేయడంలో ఆయన ఎంత దిట్టో, వ్యక్తిగతంగా అంత వినయశీలి, సౌమ్యుడు. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న ఆర్.నాగేశ్వరరావు ఒకసారి కోడంబాక్కం అడవుల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆయన జీపునకు అడ్డంగా ఒక పులి వచ్చి నిలబడింది. అది ఆయనపై దూకడానికి సిద్ధపడడంతో చాకచక్యంగా జీపు నడిపి జీపుతో పులిని ఢీకొని చంపేశారు. ఆ విధంగా మృత్యువుని జయించిన ఆయన కొద్దిరోజుల్లోనే క్షయవ్యాధి బారినపడి తన 33వ ఏటనే కన్నుమూశారు. అప్పటికే ఆయనకు భార్య, అయిదుగురు పిల్లలు ఉన్నారు. విధికి తలవంచిన మంచి నటుడుగా రాజనాల నాగేశ్వరరావు పరిశ్రమ గుండెల్లో పదిలంగా ఉండిపోతారు.
· పేరుతెచ్చిన సినిమాల జాబితా
దేవదాసు (1953)
కన్నతల్లి (1953) …. చలపతి
పరోపకారం (1953)
అగ్గి రాముడు (1954)
దొంగ రాముడు (1955) …. బాబులు
జయం మనదే (1956)
మాయా బజార్ (1957) …. దుశ్శాసనుడు
వినాయక చవితి (1957)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) …. భీమసేనా రావు కొడుకు
అప్పు చేసి పప్పు కూడు (1958) …. రామ్ సింగ్
ముందడుగు (1958)
ఇల్లరికం (1959) …. శేషగిరి
పెళ్ళిసందడి (1959)
· కూతురు సుహాసిన చెప్పిన విశేషాలు
· ఆరడుగుల ఆజానుబాహుడు.. కన్ను తిప్పుకోలేని వస్త్రధారణ..
అందంగా కనిపించే విలక్షణ విలన్… సూటు వేసుకుంటే నిజాం నవాబు..
‘భలే మామా భలే…’ ‘ఇదే మన తక్షణ కర్తవ్యం…’ ‘బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి..’
‘రారోయి మా ఇంటికీ! మావా! మాటున్నదీ! మంచి మాటున్నదీ!’
ఈ మాటలపాటల ప్రత్యేకతలతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు…
కొద్ది సినిమాలలో నటించి, అతి కొద్దికాలం మాత్రమే జీవించి, తెలుగు సినీ పరిశ్రమలో అందమైన విలన్‌గా ముద్ర వేసుకున్న ఆర్. నాగేశ్వరరావు గురించి జ్ఞాపకాలుగా ఆర్ద్రమైన గుండెతో పంచుకున్నారు సింగపూర్‌లో నివాసం ఉంటున్న వారి పెద్ద కుమార్తె సుహాసిని..
· ‘నాన్న పోయేనాటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు. నాన్నకు మాసివ్ అటాక్ రావటం, మేడ మీద నుంచి ఆయనను కిందకు తీసుకు రావటం, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించటం, ఇంటికి తీసుకువచ్చి హాలులో.. నిండైన విగ్రహంలాంటి నాన్నను పడుకోపెట్టడం.. పక్కనే అమ్మ కన్నీరుమున్నీరవ్వటం… నా మనసు ఆయన జ్ఞాపకాలలోకి పరుగులు తీస్తూనే ఉంటుంది.
· ఐస్‌క్రీమ్ చేసి పెట్టేవారు..
నాన్న సికింద్రాబాద్ జీరాలో పుట్టి పెరిగారు. నాన్న నాయనమ్మ కడుపులో ఉండగా తాతగారు పోయారు. అప్పటికే నాన్నకు ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న వాళ్ల అన్నయ్య ఇంట్లోనే పెరిగారు. అది నాన్న సొంత ఇల్లే. నాన్న మంచి పొజిషన్‌కి వచ్చాక ఆ ఇల్లు వాళ్లకి ఇచ్చేశారు. నాన్న నవాబులతో దోస్తీగా ఉండేవారు. ఆయన మాట్లాడే భాషలో తెలంగాణ నవాబుల హిందీ ఉర్దూ మాండలికం ఉండేది. అమ్మ రత్నాబాయి గుంటూరు లో పుట్టి పెరిగింది. నాన్నగారిది మేనరికం. మేం ఐదుగురు పిల్లలం. మోహన్, తాతాజీ, సుహాసిని (నేను), శ్యామ్, చాందినీ. అన్నయ్యలు, తమ్ముడు గతించారు. నేను, చెల్లి మాత్రమే ఉన్నాం. నాన్న పోయేనాటికి చెల్లెలికి నాలుగేళ్లు, నాకు ఎనిమిది సంవత్సరాలు. అందరం హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నాను
· రిక్షాలో వెళ్లమన్నారు..
అమ్మ వాళ్లందరూ తరచుగా భద్రాచలం వెళ్లేవారు. రైల్వే స్టేషన్ మా ఇంటికి దగ్గరే. కాని అందరూ పని పూర్తి చేసుకుని వెళ్లేసరికి ట్రైన్ టైమ్ అయిపోయేది. అందుకని నాన్న పరుగెత్తుకుంటూ, ఇంజన్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి, రైలు ఆపించేవారట. బ్రిటిష్ టైమ్‌లో తాతయ్య (అమ్మవాళ్ల నాన్న) ట్రైన్ ఇంజిన్ డ్రైవర్‌గా ఉండేవారు. బహుశః అందుకే ఆపేవారేమో. ‘జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి, స్కూల్‌కి రిక్షాలో వెళ్లండి’ అని చెప్పేవారు నాన్న. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆదివారం స్వయంగా ఐస్‌క్రీమ్ తయారుచేసి పెట్టేవారు. అవకాశం ఉన్నప్పుడు బీచ్‌కి తీసుకెళ్లి, మాతో దాగుడు మూతలు ఆడేవారు.
· డ్రై ఫ్రూట్స్ తెచ్చేవారు..
మేం పొద్దున్నే నిద్ర లేచి హాల్‌లో కూర్చుని చదువుకుంటుంటే చూడటం ఇష్టం నాన్నకు. కారులో అన్నవరం తీసుకువెళ్లేవారు. నదీ తీర ప్రాంతంలో డ్రైవింగ్ చేయటం చాలా ఇష్టం. అక్కడ స్నేహితులందరితో కలిసి భోజనం చేసేవారు. ప్రతి వారం మద్రాస్ ప్యారిస్ కార్నర్ నుంచి స్వీట్స్, పూలు, కూరలు తెచ్చేవారు. ఆ రోజుల్లోనే అంటే 1955 ప్రాంతంలోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెచ్చేవారు. అమ్మ వంటలు బాగా చేసేది. నాన్న మంచి ఆహారం మితంగా తినేవారు. ప్రతిరోజూ రాత్రి పరాఠాలు, నాన్‌వెజ్ తినేవారు. హైదరాబాద్ స్టయిల్ ఆహారం ఇష్టపడేవారు. మీగడ పెరుగంటే చాలా ఇష్టం.
· అప్పుడు మేం ఉన్న మా ఇంటితో ఎప్పటికప్పుడు కొత్త అనుబంధం ఏర్పడుతూనే ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ నాన్నతో కలిసి పెరిగిన వాళ్లు, ‘‘మీ నాన్నతో కలిసి పెరిగాం. మేమంతా చనువుగా ఆయనను ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లం’’ అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్‌పి రోడ్‌లో ఇప్పటికీ పాత హార్డ్‌వేర్ దుకాణాలున్న ప్రాంతానికి వెళితే, ‘మిమ్మల్ని బాగా చూసినట్లు ఉంది. అచ్చం నాన్నగారిలా ఉన్నారు’ అంటూ, నాన్నను గుర్తు తెచ్చుకుంటారు. నాన్న నిండైన విగ్రహమే అందుకు కారణం. అమ్మ 90 సంవత్సరాలు వచ్చేవరకు జీవించింది. నాన్న గురించి అమ్మ చెప్పే మాటలు వింటూ పెరిగాను.
· —
· ఇప్పటికీ గుర్తుండిపోయింది…
నాన్న పోయిన రోజున ఆయనను తీసుకురావటం బాగా గుర్తుంది. గదిలో పడుకుని ఉండగా మాసివ్ అటాక్ వచ్చి అతి పిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయనను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ చేదు జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది . నాన్న గురించి వింటూ, పెరగటం వల్ల, నాన్నలా ఉండాలనే భావన నాకు తెలియకుండానే అలవాటైపోయింది. ఆయన పర్సనాలిటీ నాకు వచ్చిందని గర్వపడతాను. నాన్న ఇప్పటికీ మా మనసులో, ఆలోచనలలో, చేతలలో సజీవంగానే ఉన్నారు. నాన్నకి అందమే కాదు, వ్యక్తిత్వం, అస్తిత్వం కూడా ఉన్నాయి. తల్లిదండ్రులతో ఉన్న బంధం మరచిపోవటం కష్టం.
· నాన్న వెరీ పర్టిక్యులర్
నాన్న ఆజానుబాహువు. అందమైనవారు. నాన్న స్టయిల్‌ని చాలామంది ఫాలో అయ్యేవారు. నవాబుల కంటె హుందాగా, గొప్పగా ఉండేవారు. నాన్న దగ్గర 300 సూట్లున్నాయి. షూస్ లెక్క చెప్పలేను. ఏ సూట్‌లో చూసినా ఎంతో కంఫర్టబుల్‌గా అనిపించేవారు. ఎస్‌వి రంగారావు అంకుల్ గృహప్రవేశానికి నాన్న హై కాలర్ (నెహ్రూ కాలర్) బ్లాక్ సూట్, ఎస్‌విఆర్ వైట్ సూట్, టోపీ ధరించారు. అతిథులందరికీ నాన్న విస్తళ్లు వేసి వడ్డించారు. అడ్డగీతల రా సిల్క్, బ్రైట్ ఎల్లో… హై కాలర్ స్వెటర్‌తో ఇంగ్లీషు దొరలా ఎంతో దర్పంగా, హుందాగా అనిపించేవారు. మా అందరికీ నాన్నే బట్టలు కొనేవారు. ఒకసారి నాకు అద్దాలు కుట్టిన నల్ల లంగా తీసుకువచ్చారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పటికీ అలాంటి లంగా కనిపిస్తే, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. – సుహాసిని
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-22-ఉయ్యూరు