• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-170
• 170-‘’నాటకం ‘’ రచయిత,నటుడు ,ఎం.ఎన్ .రాయ్ అనుచరుడు ,పెద్ద మనుషులు,గుండమ్మకధ డైలాగ్స్ ఫేం, కలం లో హాస్యం ,వ్యంగ్యం చిలికించిన ,కారుదిద్దినకాపురం దర్శకుడు –డి.వి.నరసరాజు
• డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 – ఆగష్టు 28, 2006) రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.
జననం
1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించాడు.[1] ఇతను హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రికలో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు.
నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.[2] ఈ ఇల్లు అమ్మబడును, వాపసు నాటకం రాశాడు.[3]
నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. 1951లోపాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం “నాటకం” చూసి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.[4] గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత, దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ, భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.
మరణం
2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.[5] ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య శిరీష నరసరాజు మనవరాలే.
సినిమా దర్శకుడిగా
సుప్రసిద్ధ రచయిత డి.వి.నరసరాజు గారు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించే వారు. కాని, అతి బలవంతం మీద రెండుమూడు సినిమాల్లో నటించారు. నరసరాజు గారు ఉషాకిరణ్ మూవీస్ వారి ‘కారు దిద్దిన కాపురం’ డైరెక్టు చేశారు. కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత రామోజీరావు గారికి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు వచ్చింది ప్రశ్న. ఎవరు దర్శకుడు? అని. ఒక్క నిమిషం ఆలోచించి, మీరే డైరక్టు చెయ్యండి. మొత్తం అంటే అందులోనే వుంది కదా- అంతా మీరే చేశారు అన్నారట రామోజీరావు. నరసరాజుగారు ఆఁ? అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత ‘అబ్బే’ అన్నారట. తర్వాత రామోజీరావు గారి బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం విజయగార్డెన్స్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు రావి కొండలరావు అక్కడికి వెళ్లారు. వెళితే నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి ఉన్నారు. రావి కొండలరావు వెళ్లి అడిగారు షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా- డైలాగ్స్ ఏంలేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను అన్నారాయన. హాయిగా ఏసి రూమ్‌లో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే అన్నారు రావి కొండలరావు ఆయనకున్న చనువుతో. ఆయన నవ్వి, అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం? అన్నారు నరసరాజు. అప్పుడే, పైన చెప్పిన విషయం చెప్పారు.
సినిమాలు
సినిమాలు
కథ లేదా మాటల రచయితగా
1. మనసు మమత (1990)
2. కారు దిద్దిన కాపురం (1986) దర్శకుడు కూడాను
3. వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
4. యుగంధర్ (1979)
5. యమగోల (1975)
6. అమ్మ మనసు (1974)
7. ఇద్దరు అమ్మాయిలు (1972)
8. మూగనోము (1969)
9. బాంధవ్యాలు (1968)
10. భక్తప్రహ్లాద (1967)
11. చదరంగం (1967)
12. గృహలక్ష్మి (1967)
13. రామ్ ఔర్ శ్యామ్ (1967) కథ, స్క్రీన్ ప్లే
14. రంగుల రాట్నం (1966)
15. నాదీ ఆడజన్మే (1965)
16. రాముడు భీముడు (1964)
17. గుండమ్మ కథ (1962)
18. మన్ మౌజీ (1962)
19. మోహినీ రుక్మాంగద (1962)
20. రేణుకాదేవి మహాత్మ్యం (1960)
21. రాజమకుటం (1959)
22. దొంగరాముడు (1955)
23. పెద్దమనుషులు (1954)
భరద్వాజ చెప్పిన కబుర్లు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన రచనతో ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన ప్రసిద్ధ రచయిత డి.వి. నరసరాజు గారి శతజయంతి నేడు(జూలై 15).. డి.వి. నరసరాజు గారి పూర్తి పేరు దాట్ల వెంకట నరసరాజు.. గుంటూరు జిల్లా కోసూరు మండలం తాళ్లూరులో 1920 జూలై 15న జన్మించారు.
నరసరాజు గారి శత జయంతి సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు, విశేషాలను తెలుసుకుందాం..
కె.వి.రెడ్డి విజయా బ్యానర్లో ‘పాతాళబైరవి’ తీసిన తర్వాత వాహినీకి పెద్దమనుషులు కమిట్ అయ్యారు. పింగళి విజయాలో రచయితగా జీతానికి చేరడంతో గత్యంతరం లేక చక్రపాణి అనుమతి కోరారు. ఆయన ఇవ్వలేదు. మీరు రచయితను ఇవ్వకపోతే నేను సినిమా తీయలేనా అని బెజవాడ నుంచి ఓ కొత్త రచయితను తీసుకువచ్చారు. ఆయన పేరు డి.వి.నరసరాజు.
ఈ నరసరాజుగారిని కె.వి.కి తగిలించింది గుడివాడ శరత్ టాకీసు యజమాని కాజా వెంకట్రామయ్య. ఇప్పుడు ఈ థియేటరు కొడాలి నాని ఆధ్వర్యంలో ఉందనుకోండి. ఇప్పుడు విజయవాడలో కలసిపోయిన ముత్యాలంపాడు గ్రామంలో తొలి గ్రాడ్యుయేట్ దాట్ల వెంకట నరసరాజు. మొదటి నుంచి సృజనాత్మక కళల మీదే నరసరాజు దృష్టి. ఉద్యోగాలు చేయాల్సిన లంపటాలు లేకపోవడం పైగా బాగా ఆస్తి, బంధువుల దన్ను ఉండడంతోనూ… నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించారు. ‘అంతర్వాణి, నాటకం’ లాంటి సూపర్ హిట్ నాటకాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అవి చూసే ‘పెద్దమనుషులు’ చిత్రం కోసం కె.వి. పికప్ చేశారు. కె.వి.నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు నరసరాజు
కె.వి.రెడ్డి ఒకానొక సందర్భంలో విజయాధినేతలతో పొసగక బైటకు వచ్చారు. సరిగ్గా అప్పుడే.. దుక్కిపాటి మధుసూదనరావు గారు సినిమా చేయమని అడిగారు. అప్పుడు అన్నపూర్ణ కంపెనీకి కె.వి. చేసిన సినిమా ‘దొంగరాముడు’.
ఆ మూవీకీ డి.వి.నరసరాజునే రచయితగా తీసుకున్నారు. అందులో కూడా డి.వి.మార్క్ డైలాగులు పేల్తాయి. ముఖ్యంగా హీరో జైలు నుంచి విడుదలై హోటల్‌కి వెళ్లి పండితుల్ని బురిడీ కొట్టించే సీన్ అద్భుతంగా రాశారు. విజయా బ్యానర్లో కె.వి.రెడ్డి డైరక్ట్ చేసిన చిత్రాలకు మాత్రమే పింగళి నాగేంద్రరావు మాటలు రాసేవారు. మిగిలిన చిత్రాలకు ఎక్కువగా బయట రచయితలే రాసేవారు
• అలా ‘గుండమ్మ కథ’కు డి.వి.నరసరాజుతో సంభాషణలు రాయించుకున్నారు చక్రపాణి. స్క్రిప్ట్ వర్క్ ఎక్కువగా చక్రపాణే చేసుకునేవారు. ‘స్కేప్ గోట్’ అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా నరసరాజు రాసుకున్న స్క్రిప్ట్ చాలా కాలం ఏ నిర్మాతా తీసుకోలేదు. బెజవాడ లక్ష్మీ టాకీసు ఓనరు మిద్దే జగన్నాథం లాంటి వారైతే.. అది సక్సెస్ కాదని నిరాశపరిచారు కూడా. అయితే విచిత్రంగా రామానాయుడు సురేష్ మూవీస్ ప్రారంభిస్తూ కథ కోసం నరసరాజును అప్రోచ్ అయ్యారు.
నరసరాజు తన దగ్గరున్న డబుల్ యాక్షన్ కథ చెప్పారు. నాయుడుగారు ఓకే అన్నారు.
• అలా రూపొందిన ‘రాముడు భీముడు’ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మాస్ సినిమాకు ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. విజయా, వాహినీ కాంపౌండ్ రైటర్ కావడంతో నరసరాజుగారితో ఎన్టీఆర్‌కు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన సాంఘిక చిత్రాలకు ఎక్కువగా నరసరాజుకే స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించేవారు ఎన్టీఆర్
• అలా రూపుదిద్దుకున్న చిత్రాల్లో ‘కోడలు దిద్దిన కాపురం’ ఒకటి. ఆ సినిమా కథా చర్చలు జరిగే సయమంలో నిజంగా ఆడవాళ్లు ఇంత ఇబ్బంది పడతారా రాజుగారూ అని ఎన్టీఆర్ అడిగారట. నరసరాజు సుమారు ఓ గంటన్నర పైగా వివరించారట. అప్పట్నించీ ఎన్టీఆర్ వాళ్ల ఆవిడ బసవతారకంతో వ్యవహరించే తీరులో మార్పు వచ్చిందని సాక్షాత్తు నరసరాజుగారే చెప్పారు.
• ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆడపిల్లకూ పిత్రార్జితంలో హక్కు కల్పించడం దాకా నడిచింది. అలా నరసరాజు అంటే ఎన్టీఆర్ కు అపరిమితమైన గౌరవం…గురి కూడా.
• నరసరాజుగారు చాలా ఖచ్చితమైన మనిషి. స్క్రిప్ట్ చెప్పిన సమయానికి ఇచ్చేసేవారు. ఆత్రేయలా ఇబ్బందులు పెట్టేవారు కాదు.
ఆత్రేయకు అడ్వాన్స్ ఇచ్చి ఆయన రాయక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న చాలా మంది నిర్మాతలకు నరసరాజు అభయం ఇచ్చి పని పూర్తి చేసేవారు. అలాంటి సినిమాల్లో ‘బడిపంతులు’ ఒకటి. బడిపంతులు డైలాగ్స్ కోసం డబ్బులు తీసుకున్న ఆత్రేయ రాయలేదు. ఫైనల్‌గా నరసరాజుగారే కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అయితే డైలాగులు రాయకపోయినా ఆ మొత్తానికి ‘నీ నగుమోము’ అనే ఓ అజరామర గీతాన్ని రాసి ఇచ్చారు ఆత్రేయ.
• ఎవిఎమ్ చెట్టియార్‌కు కూడా నరసరాజుగారి మీద విపరీతమైన నమ్మకం ఉండేది. ‘భక్త ప్రహ్లాద’ సినిమా కోసం చిత్రపు నారాయణమూర్తి ఎమిఎమ్ అధినేతను అప్రోచ్ అయ్యారు. నరసరాజు స్క్రిప్ట్ రాస్తానంటే తీస్తాను అని చెట్టియార్ షరతు పెట్టారు.
• చిత్రపు నారాయణమూర్తి అప్పుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఆయన పరిస్థితి చూసి సాధారణంగా పౌరాణికాలు పెద్దగా అంగీకరించని నరసరాజుగారు భక్త ప్రహ్లాదకు పనిచేశారు. ఎస్వీ రంగారావు కూడా డి.వి. గారి మాటే వినేవాడు. చిత్రపు నారాయణమూర్తి ఫ్లాపుల్లో ఉండడం వల్ల ఆయన మాట లెక్కచేసేవారు కాదు ఎస్వీఆర్. క్లైమాక్స్ సీన్ సరిగా రాకపోయే సరికి ఎస్వీఆర్ను మరో సారి సెట్స్‌కు రమ్మనడానికి ధైర్యం చాలలేదు. అందుకని డి.వి.నే ఆశ్రయించారు. నరసరాజు అనుకోకుండా ఎస్వీఆర్ను కలసి ఆ క్లైమాక్స్ ఏమిటండీ అలా ఉందీ… నాకు చూపించారు. మీరు బాగా డల్‌గా ఉన్నట్టు అనిపించింది. నాకెందుకులే అని ఊరుకున్నా.. మీరడిగితే రీషూట్ పెడతారు అనిచెప్పి వచ్చేశారు. అంతే.. పని అయిపోయింది. అంత లౌక్యంగా వ్యవహరించేవారు డి.వి.
• ఒక రచయితను అంగీకరించాలంటే చాలా ఆలోచించే బి.ఎన్.రెడ్డికి కూడా డి.వి.నరసరాజు అంటే ఇష్టం. బి.ఎన్. కు ప్రయోగాల మీద పెద్దగా మోజు ఉండేది కాదు. అందుకే పింగళి నాగేంద్రరావు గారి రచన నచ్చేది కాదు. పింగళి ‘గుణసుందరి కథ’కు రాసిన డైలాగులు బిఎన్ కు అస్సలు నచ్చలేదట. అయితే నరసరాజు మాత్రం బిఎన్ కు ‘రంగులరాట్నం, రాజమకుటం’ లాంటి సినిమాలకు పనిచేశారు. యమలోకపు గందరగోళంతో కూడిన బెంగాలీ సినిమా ‘జీవాంతమానుష’ రీమేక్ హక్కులు కొన్నారు పల్లవీ ప్రొడక్షన్స్ వెంకటరత్నం.
• నేరుగా తనకు సాన్నిహిత్యం ఉన్న ముళ్లపూడి దగ్గరకెళ్లి తెలుగులో రాయమన్నారు. అయ్యా అది పొలిటికల్ సెటైరికల్ డ్రామా… మనవల్ల కాదు… డి.వి.నరసరాజే దీనికి సమర్ధుడు.. అని చెప్పి రమణ గారే పంపారు. కథ నరసరాజు చేతిలో పడడంతో హీరో కూడా మారాడు. శోభన్ బాబు ప్లేస్ లో ఎన్టీఆర్ వచ్చారు. ‘యమగోల’ చేసి జనంతో ఈలలు కొట్టించుకున్నారు
• ఇక్కడ ఇంకో పిట్టకథ..నిజానికి వెంకటరత్నం ఎన్టీఆర్ దగ్గరకు పోయి ఇప్పుడు సినిమాలో ఉన్న ఎన్టీఆర్ కారక్టర్‌ను బాలకృష్ణతోనూ యముడు కారక్టర్ ఎన్టీఆర్‌తోనూ చేయించాలని తనకు ఉన్నట్టు చెప్పారు. అయితే ఎన్టీఆర్ దీనికి ఒప్పుకోలేదు.ఆ కారక్టర్కు బాలయ్య సరిపోడు. అది నేనే చేస్తాను. యముడుగా సత్యనారాయణను తీసుకుందాం అని సలహా చెప్పారు.
• అలా సత్యనారాయణను యముడుగా ప్రమోట్ చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. యమగోలలో చాలా పొలిటికల్ డైలాగులు పేల్చారు నరసరాజు. అప్పట్లో ఏదన్నా సినిమాలో డైలాగులు హిట్టైతే చాలు వాటిని ఎల్పీ రికార్డులుగా విడుదల చేసేవారు. ముఖ్యంగా ఎమర్జన్సీ మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా సెటైర్లు పేల్చారు నరసరాజు.
తెర మీద చెప్పేది ఎన్టీఆర్ కావడంతో ఆ తెర మీద చెప్పేది ఎన్టీఆర్ కావడంతో ఆ డైలాగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘నాటకం’ అనే నాటకంతో రంగస్థలం మీద సంచలనం సృష్టించిన డి.వి.నరసరాజు తెర మీద కూడా రెండు సినిమాల్లో నటించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించారు.
నరసరాజుగారికి ఈనాడు రామోజీరావుతో బాగా సాన్నిహిత్యం ఉండేది. ఓ సారి రామోజీరావు మీకేమండీ ఎప్పుడూ తెల్లని మడత నలగని పంచె కట్టుకుని హాయిగా ఉంటారు… మా టెన్షన్లు ఏం చెప్పమంటారు అన్నాడట. అయ్యా మీరేమో మోసే గాడిదలు… మేం మేసే గాడిదలం అదీ తేడా అనేశార్ట నరసరాజు. రామోజీరావు కూడా సినిమాలకు సంబంధించి ఏవన్నా అనుమానాలుంటే నరసరాజు సలహా తీసుకునేవాడు
• ‘కారు దిద్దిన కాపురం’ సినిమా సరిగా రావడం లేదని నరసరాజుకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన సినిమాను విజయతీరాలకు నడిపించారు.
• సినిమా పరిశ్రమలో నాన్ కాంట్రోవర్షియల్ పర్సన్ ఎవరైనా ఉంటే అది నిస్సందేహంగా నరసరాజుగారే. ఆయన ఎన్ని సినిమాలకు రాసినా నరసరాజు అనగానే గుర్తొచ్చే సినిమా మాత్రం ‘యమగోలే’.
-భరద్వాజ
• సశేషం
• రేపు శ్రీ శుభకృత్ ఉగాది శుభా కాంక్షలతో
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-22-ఉయ్యూరు
•
•