మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-179
179-సురభి నాటకాల రచయిత,,పరమానందయ్య శిష్యులు ,పంతులమ్మ సంభాషణా రచయిత ఆంద్ర నాటక కళాపరిషత్ వ్యవస్థాపక సభ్యులు ,కవిరాజు -విశ్వనాథ కవిరాజు
విశ్వనాధ కవిరాజు అసలుపేరు మల్లాది విశ్వనాథ శర్మ (1900 – 1947) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, రచయిత.
. జీవిత విశేషాలు
వీరు విశాఖపట్నం జిల్లా, బొబ్బిలి తాలూకా శ్రీకాకుళ గ్రామానికి చెందినవారు. పర్లాకిమిడి రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత కొంతకాలం దక్షిణాముర్తి శాస్త్రి గారి వద్ద ప్రత్యేకంగా సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. 1921 నుండి జీవితాంతం వరకు విజయనగరంలోని మహారాజా కళాశాల లో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. కంచి కామకోటి పీఠాధిపతి వీరి కవితా ప్రావీణ్యానికి మెచ్చి “కవిరాజు” గౌరవం ఇచ్చారు. అప్పటి నుండి వీరు విశ్వనాథ కవిరాజు గా ప్రసిద్ధులయ్యారు. వీరు కొన్ని చలనచిత్రాలకు కథలు, మాటలు, పాటలు రాశారు. పరమానందయ్య శిష్యులు, పంతులమ్మ (1943) అనే సినిమాలకు స్క్రిప్టులు రాశారు.
నాటకరంగం
ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులు, 1929
విశ్వనాథ కవిరాజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాటక సంస్థ సురభి నాటక కళాసమితికి నాటకాలు రచించేవారు. అనేక సంస్కృత నాటకాలను కూడా తెలుగులోకి అనువదించి వారికి అందించేవారు. ఈ క్రమంలో సురభి నాటక సమాజంలో చాలా గౌరవప్రదమైన స్థితిని పొందారు. కుటుంబ నాటక సమాజంగా పేరొందిన ఈ సంస్థలో అతికొద్ది మంది మాత్రమే బయటివారు సన్నిహితులుగా ఉండేవారు. అటువంటి కొద్దిమందిలో విశ్వనాథ కవిరాజు కూడా ఉండేవారు. 1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపక సభ్యులలో వీరు కూడా ఒకరు.[1]
రచనలు
అనువదించిన సంస్కృత నాటకాలు
• అనర్ఘ రాఘవము
• ఆశ్చర్య చూడామణి (శక్తిభద్రుని నాటకానికి అనువాదం
• మృచ్ఛ కటికము
• మాళవికాగ్ని మిత్రము
• విక్రమోర్వశీయము
• శివపురాణము
ఆధునిక నాటకాలు
• కిఱ్ఱుగానుగ
• దొంగాటకము
• ప్రహ్లాద
• వారసులు
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-22-ఉయ్యూరు
•
•
• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-180
• 180-ఆదర్శ నటుడు సంగీత ప్రియుడు ,నాటకాలలో సత్యవంత ,శ్రీరామ పాత్రధారి,సినీ రామ ,దుర్యోధనుడు-యడవల్లి సూర్యనారాయణ
• 1888లో జన్మించి ,1939లో 51ఏటనే మరణించిన యడవల్లి సూర్యనారాయణ పదహారవ ఏట నాటక రంగం లో ప్రవేశించి 35ఏళ్ళు నిర్విరామంగా నాటక రంగం లో రాణించిన ఆదర్శ నటుడు .గుంటూరులో ఆగర్భ శ్రీమంతుల ఇంట జన్మించాడు .పూర్వాచార పారాయణ వంశం .ఇంగ్లీష్ లో మెట్రిక్ పాసై ,సంస్కృత ఆంధ్రాలను కూడా నేర్చాడు .
• మంచి ఆరోగ్యం అవయవ సౌష్టవం ,ఠీవి గాత్రం,అందం గామ్భీర్యలతో మహారాజ పాత్ర పోషణకు తగినవాడు అనిపించాడు .అందం తో నాటక రంగాన్ని స్వాధీన పరచుకొన్నాడు .నాటక జీవితం ఎంతటి ఉదాత్తమో నిజజీవితమూ అంత ఉదాత్తమైనది .కనుకనే గౌరవం విశిష్టత సాధించగలిగాడు .
• సంగీత ప్రియుడైన యడవల్లి దేశం లోని ప్రసిద్ధ గాయకుల కచేరీలను స్వయంగా చూసి నేర్చి నటనకు, గాత్రానికి మెరుగులు దిద్దుకొన్నారు .సరసుడు ,సాహిత్య ప్రియుడు కూడా .వ్యంగ్య చమత్కారంతో సంభాషణతో అందర్నీ ఆకర్షించే నైపుణ్యం ఉండేది .సహజ నటనకు నిత్య సాధన తోడ్పడి ఉన్నత శిఖరాలను చేర్చింది .
• గద్య ,పద్య పఠనం లో సూర్య నారాయణకు ఒక ప్రత్యేకత ఉండేది .ఎంతటి సమాసాన్ని అయినా చక్కగా విడమర్చి అందరికి అర్ధమయేట్లు పలకగల సామర్ధ్యం ఆయనది .నాటక సమాజాన్ని గొప్ప క్రమశిక్షణతో నడపగల సమర్ధుడు .నాటక ప్రయోగాలకు సిద్ధంగా ఉండే దర్శకుడు .
• బాల్యం లో గుంటూరు విద్యార్ధి సంఘంతో ,యవ్వనంలో బెజవాడలోని మైలవరం బాలభారతీ నాటక సమాజం తో ,తర్వాత ఏలూరు లో సీతారామాంజనేయ నాటక సమాజం తో నాయక పాత్రలు ధరించి , ఆంధ్రదేశమంతా ప్రదర్శనలిచ్చి విఖ్యాతనటకీర్తి పొందాడు .
• సావిత్రి నాటకం లో సత్యవంతుడు ,పాదుక లో శ్రీ రాముడు ,శాకుంతలం లో దుష్యంతుడు ,సారంగధర లో సారంగ ధరుడుగా ,గయోపాఖ్యానం లో అర్జునుడు ,చిత్ర నళీయం లో బాహుకుడుగా ,వేణీ సంహారం,ద్రౌపదీ వస్త్రాపహరణం ,పాండవోద్యోగ విజయంలో దుర్యోధనుడుగా నటించి రాజసం ఒలకబోస్తూ ,విశేష ప్రఖ్యాతి పొందాడు .
• 1932లో చలన చిత్ర రంగం లో ప్రవేశించి పాదుకా పట్టాభి షేకం లో శ్రీ రాముడుగా నటించాడు ,మెప్పించాడు .అదే ఏడాది లో వచ్చిన శకుంతల లో దుష్యన్తుడిగా నటించి చిరయశస్సు నార్జించాడు .1936లో ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో దుర్యోధనుడుగా నటనలో జీవించి ఈ రంగాన్ని కూడా సుంపన్నం చేశాడు యడవల్లి సూర్యనారాయణ .
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-22-ఉయ్యూరు
•