మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200
· 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ
· శ్రీ వాత్సవ గా ప్రసిద్ధి చెందిన యండమూరి సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా పసలపూడి 1913లో మే21న జన్మించారు .ఉన్నత విద్య పూర్తీ అయ్యాక ఆకాశవాణి విజయవాడ ,మద్రాస్ కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకులు గా చాలాకాలం సేవ చేశారు . అసిస్టెంట్ డైరెక్టర్ గా ఢిల్లీ వెళ్ళారు .
· శ్రీ వాత్సవ సాహిత్య విమర్శకులుగా విశేష కీర్తి పొందారు .భారతి ,జయంతి ,ఆంద్ర పత్రిక మొదలైన పత్రికలలో ప్రతి ఏటా’’ సాహిత్య సింహావలోకనం ‘’రాసి ప్రచురించేవారు .ఆయన రాసిన ఉషః కిరణాలు ,శారదా ధ్వజం గ్రంధాలకు 1966లో ఆంద్ర ప్రదేశ సాహిత్య అకాడెమి బహుమతి లభించింది .తంజావూర్ నాయక రాజుల సాహిత్యభాషను ‘’శారదాధ్వజం ‘’లో వివరించారు .ఆనాటి సాంఘిక ,సాంస్కృతిక రాజకీయ ,చారిత్రిక స్థితి గతులను అందులో చక్కగా విశ్లేషించారు .’’జలతారు జాబిల్లి ‘’అని బాలలకోసం ఒక పుస్తకం రాశారు .వయోజన విద్యా వ్యాప్తికోసం టెలివిజన్ కు ‘’రంగు రంగుల పూలు, ‘’కత్తి’’గ్రంధాలు రాశారు .వీటికి కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.పెళ్ళాడే బొమ్మ ,తీరని కోరికలు నాటకాలు ,నాగరిక ,చెట్లు గేయ సంపుటి రచించారు .
· బి ఎన్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఆల్ టైం క్లాసికల్ చిత్రం ‘’మల్లీశ్వరి ‘’లో కృష్ణ దేవ రాయలుగా అద్భుతంగా నటించి రాజసం వీరం దాన దయాగుణాలను ప్రస్ఫుటంగా వ్యక్తీకరించారు .ఆతర్వాత మరికొన్ని సినిమాలలోనూ నటించారు .
· మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక భానుమతి), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయ్యాక నందమూరి తారక రామారావు) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన (న్యాపతి రాఘవరావు)వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు. మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి అని అంటాడు.
· ఇక్కడే ‘’పిలచినా బిగువటరా ‘’ జావళి కృష్ణశాస్త్రి గారు రాయగా భానుమతి పాడుతూ అభినయిస్తుంది .రాయలు పెద్దన మురిసిపోతారు .
· 1969లో 56వ ఏట శ్రీ వాత్సవ ఢిల్లీ లో మరణించారు . ఈయన కుమారుడు యండమూరి రామచంద్రరావు జర్నలిస్ట్ గా బెజవాడలో ఉన్నారు .
· ఉగాది వచ్చింది అంటే శ్రీ వాత్సవ సాహిత్య సింహావలోకనం కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూసే వాళ్ళం .అంత బాగా రాసేవారు .
· సశేషం
· అనుకోకుండా ఈ శీర్షిక మొదలుపెట్టి ఇవాల్టికి 200మంది మరపురాని సినీ మహానుభావులపై రాయగలిగాను .ప్రస్తుతం కొన్ని రోజులు విరామం .తర్వాత మిగిలిన వారి గురించి రాస్తాను
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-22-ఉయ్యూరు