మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201

201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

ఏల్చూరి విజయరాఘవ రావు (నవంబర్ 3, 1925 – నవంబర్ 30, 2011) ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.[1].ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా గొప్పవాడు. మహాత్మాగాంధీనే తన రామధున్‌ కార్యక్రమం ద్వారా మెప్పించినవా డు. ఖండాంతర ఖ్యాతినార్జించినవాడు. ప్రపంచంలోని ఐదు ఖండాలలో మూడు ఖండాలలో ఒకసారి కాదు ఎన్నోసార్లు ఆయన సంగీత కచేరీలు నిర్వహించాడు. శ్రోతల నుంచి బహుళ విశేష ప్రశం సలు పొందాడు. ఆయన వేణునాద రికార్డులు ఇంగ్లండులోనూ, పారిస్‌లోనూ లభిస్తాయి.ప్రాచుర్యం పొందాయి.

జీవిత విశేషాలు
విజయరాఘవ రావు గారు శ్రీ ఏల్చూరి రామయ్య,సుబ్బాయమ్మ దంపతుల ద్వితీయ సంతానంగా 1925, నవంబర్ 3 న జన్మించారు. ఆయన పసి బిడ్డగా ఉండగానె తండ్రి కాలం చేశారు. వీరి అన్నగారు నయాగరా కవుల్లో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. తండ్రి గారి నుంచి ఆయనకు సంగీతాభిమానం సంక్రమించింది.ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు. విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఇవన్నీకాక సుబ్రహ్మణ్యంగారి సోదరుడిగా తెలుగు కవిత్వమూ, కథలూ, ఇంగ్లీషులో రచనలూ చేశారు.[2]

కళాకారునిగా
బాల్యంలో నరసరావుపేటలో ఎకరాల కొద్దీ విస్తరించిన పెద్ద చెరువు నిండుగా నీళ్లతో తొణికిసలాడుతూ పలనాడు రోడ్డు వెంబడే ఉండేది. చెరువు కట్ట దగ్గర్లోనే ఏల్చూరి రామయ్య గారి ఇల్లు రాళ్ళబండి వారి వీధిలో ఉండేది. ఆ వీధికి పక్కగానే యాదవుల వీధి ఉంది. చెరువు కట్ట మీద యాదవుల పిల్లలతో కూడి వారి వద్దనే వేణువు వాయించడం నేర్చుకున్న విజయరాఘవరావు గారికి ప్రాథమికంగా గురువు ఎవరూ లేరు. అయితే గొల్ల పిల్లలతో చేరి కూడా అల్లరి చేయకుండా విద్యను మాత్రమే గ్రహించే వారు. తర్వాతి రోజుల్లో శాస్త్రీయ సంగీత కచేరిలు చూసి, ఇంటికి వచ్చి సాధన చేసేవారట.[3] ఆయన సంగీతానికి శ్రోతలుగా అనిసెట్టి కృష్ణ, నరసరావు పేట లోని కన్యకా పరమేశ్వరీ గ్రంథాలయ నిర్మాత, విద్యావేత్త మస్తాన్ గార్లు ఉండేవారు. అనిసెట్టి కృష్ణ గారి ప్రేరణతో ఆ తర్వాత ఆయన మద్రాసు వెళ్ళి కళా క్షేత్రంలో సంగీతం, రుక్మిణీదేవి అరండేల్ గారి వద్ద భరత నాట్యం అభ్యసించారు. అక్కడికి వచ్చిన ప్రఖ్యాత నర్తకులు ఉదయ శంకర్ గారి దృష్టిని ఆకర్షించి వారి నృత్య బృందంలో నర్తకుడిగా దేశ విదేశాలూ తిరిగారు. ఆ ప్రదర్శనలు ఇస్తున్నపుడే ఒకసారి రష్యాలో నాట్య ప్రదర్శన అనంతరం వేణు గానంతో అక్కడి శ్రోతల్ని అబ్బుర పరిచారు. ఆ సందర్భంలోనే ఉదయ శంకర్ గారి సోదరుడు పండిట్ రవి శంకర్ తన శిష్యుడిగా స్వీకరించి హిందూస్తానీ సంగీత ప్రపంచంలోకి ఆయన్ని ఆహ్వానించారు. అక్కడితో ఆయన ప్రతిభ మరింతగా విస్తరించింది.[3] సితార్ విద్వాంసుడైన రవిశంకర్‌వద్ద సంగీతం నేర్చుకున్న విజయరాఘవరావు ఆయనకు నికరమైన శిష్యుడు ఎందుకంటే కేవలం రాగతాళాలేకాక మొత్తం భారతీయసంస్కృతినీ, అందులోని వివిధ అంశాలనూ పరిశీలించి, అర్థంచేసుకునే సామర్థ్యం ఆయనకు అలవడింది. రవిశంకర్ స్వయంగా సంగీతరచన చేసిన అనూరాధా, గోదాన్, మీరా మొదలైన హిందీ చిత్రాల రికార్డింగ్‌లన్నిటిలోనూ రావుగారు ప్రధానపాత్ర నిర్వహించారు. ఫిల్మ్స్ డివిజన్‌వారి అసంఖ్యాకమైన డాక్యుమెంటరీల సంగీతంలో ఆయన రేడియోశబ్గాల దగ్గర్నుంచీ, రకరకాల ప్రపంచవాద్యాలదాకా అనేకం వాడి విజయవంతమైన ప్రయోగాలు చేశారు.[4] తెలుగువారికన్నా, ముంబాయి, ఢిల్లీ ఇంకా ఉత్తరభారతదేశ ప్రముఖ నగరాలలో సంగీత విద్వత్ప్రముఖుడిగా గొప్పఖ్యాతినార్జించినవాడు.1945 నుండి 1958 వరకు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో విజయరాఘవరావు సంగీత ప్రయోక్తగా, వాద్యబృంద కార్యక్రమ సంవిధాన కర్తగా పనిచేశారు.

ముఖ్య ఘట్టాలు
గాంధీజీ హత్య జరిగినపుడు బిర్లా భవన్‌ ప్రార్థన సమావేశపు ప్రసార కార్యక్రమానికి శబ్దగ్రాహక యంత్రాలు, సిబ్బంధి ఎంతో శ్రద్ధా నిమగ్నతతో సంసిద్ధమై ఉండగా భయంకరమైన తుపాకి కాల్పులు, సభా స్థలిలో హాహాకారాలు, రోదనలు, విషాదోద్వేగ కలకలం, వీధుల్లో జనం ఆందోళనతో ఉరుకులు పరుగులు తీస్తూ మూలమైన సంక్షభ సూచకంగా పెడుతున్న కేకలు, ఆక్రందనలు ఆకాశవాణి ప్రసారయంత్రాలు విన్పించడం ప్రారంభమైంది. అప్పుడు ఆకాశవాణి కార్యాలయం ఉద్యోగులంతా నిర్ఘాంతపోయారు. నిలువెల్లా సంచలించారు. ఎవరికీ ఏం చేయాలో, అసలేం జరిగిందో తెలియలేదు. అప్పుడు విజయరాఘవరావు ఉద్యోగ బృందానికంతా స్థైర్యం కలగజేసి ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గీతాన్ని శృతిలయబద్ధంగా ఎడతెగకుండా వాద్యసంగీత రూపంగా ప్రసారం చేయించారు. మధ్యలో చిన్న ప్రకటనేమైనా ప్రసారం చేసినా ఆ తర్వాత 24 గంటలు ఈ ప్రార్థన సందేశ గీతిక ప్రసారమవుతూనే ఉంది. దీనిని స్వరపరచినది రాఘవరావే. ఆ తరువాత మహాత్మాగాంధీ సంస్మరణ నివాళిగా ఇది సంప్రదాయ నిబద్ధమైంది.[5]

1950 ప్రాంతాలలో సర్దార్‌ పటేల్‌ కొద్ది రోజులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండేవారు. అప్పుడు వరసగా కొన్ని రోజులు తనను సంగీతంతో సేదదీర్చవలసిందని పటేల్‌ మహాశయుడు విజయరాఘవరావును కోరారు. సాయంకాలం ఒక గంట విజయరాఘవరావు, ఉస్తాద్‌ అల్లారాఖా తబలా వాద్యసహకారంతో పటేల్‌ మహాశయుడి మనస్సును స్వస్థపరచేవారు, రంజింపజేసేవారు.[5]

అమెరికాలో
అమెరికాలో వాషింగ్టన్, డి.సి.లో ‘కార్నెజీ హాల్‌’ అని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సభా భవనం ఉంది. ప్రపంచ ప్రసిద్ధులైన కళాకారుల గాన సభలు అక్కడ జరుగుతవి. అక్కడ సంగీత కచేరీ నిర్వహించడం జీవిత సాఫల్యంగా భావిస్తారు ప్రసిద్ధ కళాకారులు. విజయరాఘవరావు కార్నెజీ హాల్‌లో వారి ఆహ్వానంపై వేణునాదం విన్పించారు.

అమెరికాలో జార్జియా రాష్ట్రంలో భారతీయ సంగీతం, సంస్కృతి, జ్ఞాన సాధన, చింతనధారలను ప్రచారం చేసే ఒక పత్రిక వెలువడుతున్నది. ముఖ్యంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి కార్యక్రమ నిర్వహణ విశేషాలను ప్రకటిస్తుంది ఈ పత్రిక. పన్నెండేళ్ళ కిందట ‘అట్లాంటా’ నగరంలో ‘ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ సొసైటీ ఆఫ్‌ గ్రేటర్‌ అట్లాంటా అనే సాంస్కృతిక సంస్థ విజయరాఘవరావు సంగీత కచేరీ ఏర్పాటు చేసింది. ఆయన గొప్ప నర్తకుడు కూడా. దేశవిదేశాలలో అనేక నృత్యప్రదర్శనలిచ్చాడు. పసిపిల్లల వంటి పరమ ఉల్లాస ప్రవృత్తి ఆయనది.

సోనీ కంపెనీ వాళ్ళు విజయ రాఘవరావు హంసధ్వని గంటన్నరసేపు ఆలపించగా రికార్డు చేసరు. ‘భువన్‌ షోమ్‌’ కూడా నాకు వారు ప్రదర్శించి చూపారు. ఏల్చూరి విజయరాఘవరావు ఇంగ్లీషులో, తెలుగులో కవిత్వం రాశారు, కథలు రాశారు. 1991 జనవరి- ఫిబ్రవరి ఇండియన్‌ లిటరేచర్‌ (సాహిత్య అకాడమి)లో వారి సాహిత్య ప్రస్థాన వ్యాసం ప్రచురితం. అందులో సంగీత సా హిత్యాలలో ఆయన ప్రజ్ఞ, హదయ వైశాల్యం ఎంతో గొప్పగా ఆవిష్కృతమైనాయి.

అవార్డులు
ఆయనకు 1970 లో భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన పద్మశ్రీ వచ్చింది.[6] 1982 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[7] జాతీయ అంతర్జాతీయ స్వర్ణ పతక సమ్మానితుడు.

వ్యక్తిగత జీవితం
ఆయన 1947 లో శ్రీమతి లక్ష్మి వి.రావును వివాహమాడారు. ఆయనకు నలుగురు పిల్లలు, తొమ్మిదిమంది మనవళ్ళు.sident of the United States.

ఎన్నెన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం చేశారు .స్వయంగా నటులు .ఉదయ శంకర్ తో కలిసి పని చేశారు .ఈయన కుమారుడు మురళీ ధర్ విజయవాడ రేడియోలో డ్యూటీ ఆఫీసర్ గా చేశారు .పద్యకవి కూడా .ఇక్కడ రాజీనామా చేసి న్యు ఢిల్లీ వెంకటేశ్వర కాలేజిలో తెలుగు లెక్చర్ చేశారు .పి.హెచ్ డి.చేశారు .పురాణ వ్యాఖ్యానం లో దిట్ట .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.