మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202
202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి
అద్దంకి శ్రీరామమూర్తి (సెప్టెంబరు 21, 1898 – 1968) తెలుగు నాటక, సినిమా నటుడు, సంగీత విద్వాంసుడు.పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శిష్యుడు .
జననం
ఈయన గుంటూరు జిల్లా కల్వకుర్తి గ్రామంలో సెప్టెంబరు 21, 1898 సంవత్సరంలో జన్మించాడు.
రంగస్థల ప్రవేశం
బాపట్ల ఉన్నత పాఠశాలలో చదివాడు. చదువుకునే రోజుల్లోనే బడిపిల్లలు ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకంలో ప్రపథమంగా సహదేవుడు పాత్రలో నటించాడు. సహదేవుడు పాత్రతో ప్రారంభమైన నటజీవితం దశరథుడి పాత్రతో పరాకాష్ఠకు చేరుకుంది. తర్వాత రాజమండ్రి లోని కృత్తివెంటి నాగేశ్వరరావు గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించాడు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో పాపట్ల కాంతయ్య, పారుపల్లి రామకృష్ణయ్య ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నాడు. బి.టి.రాఘవాచార్యులు వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నాడు. అనేక పాటకచేరీలు నిర్వహించాడు. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్నాడు. ఎంతటి పద్యమైనా ఈయన పాడితే ఇట్టే అర్థమైపోయేది. ప్రసిద్ధ నటులు హరి ప్రసాదరావు, బళ్ళారి రాఘవ ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఈయన పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన ధర్మారాజు, దశరథుని పాత్రలకు పేరొందాడు. పాండవ ఉద్యోగ విజయం నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవాడు. 1913 నుంచి 1920 వరకు స్టార్ థియేటర్ సమాజం తరపున నాటకాలు ప్రదర్శించాడు. అనంతరం వరుసగా రాజమండ్రి హిందూ నాటక సమాజం, బందరు బాలభారతి సంఘం, మైలవరం మోతే కంపెనీ లలో ప్రధాన భూమికలు ధరించాడు. కాకినాడలో జరిగిన పాదుకాపట్టాభిషేక నాటక పోటీలలో ఈయన నటించిన దశరథుడి పాత్రకు సువర్ణ పతకం అభించింది.
శాకుంతలం లో కణ్వమహర్షి ,హరిస్చంద్రలో హరిశ్చంద్ర ,వీరబాహు గా ,పాదుకలో దశరధుడు ,కురుక్షేత్రం లో ధర్మరాజు గాఎనలేని కీర్తి సాధించారు .50ఏళ్ళు ఆంద్ర నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన నట శిరోమణి అద్దంకి .
సినిమా నటుడిగా
హరిశ్చంద్ర సినిమాలో హరిశ్చంద్ర పాటలో అద్దంకి శ్రీరామమూర్తి. ఒక పాట, సన్నివేశం.
తన తొలి సినిమా, పసుపులేటి కన్నాంబ సరసన పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన హరిశ్చంద్ర సినిమాలో హరిశ్చంద్రుని పాత్రలో నటించి మంచిపేరు తెచ్చుకున్నాడు. అప్పటివరకు హరిశ్చంద్ర పాత్రలో డి.వి. సుబ్బారావు, హరిప్రసాదరావు లను చూడడా డానికి జనం అలవాటు పడినా అందుకు భిన్నంగా పుల్లయ్య హరిశ్చంద్ర పాత్రకు శ్రీరామమూర్తిని ఎంపికచేశాడు. చలనచిత్ర రంగంలో ప్రవేశించి సుమారు 25 చిత్రాలలో నటించి అసమాన నటుడుగా కీర్తి సంపాదించాడు. ఈయన ధరించిన పాత్రలలో జీవించి ఆ పాత్ర ప్రేక్షక హృదయాలకు హత్తుకునే విధంగా నటించేవాడు. పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని పాత్ర పోషించాడు.
మరణం
నాటకరంగంలో ప్రేక్షకలోకాన్ని సమ్మోహనపరచిన అద్దంకి అవసాన దశలో పక్షవాతంతో బాధపడి 1968లో మరణించాడు.
నటించిన సినిమాలు
· బ్రహ్మరధం (1947)
· మాయా మచ్చీంద్ర (1945)
· పాదుకా పట్టాభిషేకం (1945)
· కృష్ణ ప్రేమ (1943)
· సత్యభామ (1942)
· భక్తిమాల (1941)
· భోజ కాళిదాసు (1940)
· మహానంద (1939)
· సారంగధర (1937) – రాజరాజ నరేంద్రుడు
· హరిశ్చంద్ర (1935)
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-22-ఉయ్యూరు