మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224
· 224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం
‘కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై’ అంటూ సాగే ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ఈ యుగళ గీతం వింటూ ఉంటే నిజంగానే మన మనస్సులు మల్లె పూలలా గాలిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. ఈ పాటలో యన్.టి.ఆర్. శృంగారాభినయంతో పోటీపడి నటించింది ఆయన పరిచయ౦ చేసిన నూతన నటి నాగరత్నం (రత్న). ఈమె ప్రఖ్యాత సినీ నటి జి. వరలక్ష్మికి అక్క కూతురో లేక అన్న కూతురో నంటారు. యస్.వి. రంగారావు నటించిన మోడరన్ థియేటర్స్ వారి ‘మొనగాళ్ళకు మొనగాడు’చిత్రంలో చలం సరసన కూడా ఈమె నటించింది. ‘గులేబకావళి కథ’లో తడిసిన బట్టలతో కొలనులోనుంచి బయటకు ఠీవిగా నడచివచ్చేటప్పుడు ఈ ‘మదేభయాన’ మెల్లగా, పొందికగా, గంభీరంగా వేసే అడుగులు మళ్ళీ, మళ్ళీ చూడాలనిపిస్తాయి. ఆ చిత్రంలో ఈమె గంధర్వరాజు (మిక్కిలినేని) కుమార్తె. ఈ చిత్రానికి సముద్రాల రాఘవాచార్య (జూనియర్) రాసిన మాటలు, సి.నారాయణ రెడ్డి రాసిన పాటలు ప్రాణం. మంద్రంగా సాగే ఈ Slow Song ని పరిచయం చేయబూనడం నిజంగా మీ కళాభినివేశానికి మచ్చు తునక. చిన్ననాటి నుంచీ ఈ పాటంటే నాకూ ప్రాణం.నాకెప్పుడూ ఈ పాట నాలుకపై ఆడుతూనే ఉంటుంది. మీరు ఈ పాటను అక్షరీకరించే క్రమంలో మూడు చిన్నపొరపాట్లు దొర్లాయి. ‘ఎగసిపోదునో చెలియా.’అని , ‘ఝుమ్మనిపించే వెందుకు ?’అని, ‘సడి సవ్వడి’ అనీ వాటిని సవరించుకోవాలి. బహుశా టైపింగులో దొర్లిన భాషాపరమైన ఈ చిన్న తప్పిదాలదేముందిగానీ, ప్రధానంగా మీరు సవరించుకోవాల్సిన రెండు అవగాహనాపరమైన తప్పిదాల్ని పేర్కొనడం మాత్రం ఇక్కడ ఎంతైనా అవసరం. ‘గులేబకావళి కథ’ చిత్రానికి జంట సంగీత దర్శకులు జోసఫ్- కృష్ణమూర్తి. మీరు పేర్కొన్నట్లు విజయా కృష్ణమూర్తి కాదు. నేషనల్ ఆర్ట్ థియేటర్ (యన్. ఏ. టి.) బ్యానర్ పై యన్.టి. ఆర్. నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రమిది. చిత్రం టైటిల్స్ లో యన్. టి. ఆర్. తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాత అని పేర్కొన్నా, దర్శకుడి పేరుండదు.ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినట్లు యన్.టి.ఆర్. ఆ తరువాత పలు సందర్భాల్లో పేర్కొన్నారు. యన్. టి. ఆర్. ఇదే బ్యానర్ పై నిర్మించిన ‘పాండురంగ మహాత్యం’ చిత్రానికీ, యన్. టి. ఆరే స్వస్తిశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ‘రేచుక్క- పగటిచుక్క’ చిత్రానికీ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. కాని, ‘గులేబకావళి కథ’ చిత్రానికి మాత్రం దర్శకులు యన్. టి. ఆరే. కనుక పాట చిత్రీకరణకు మీరు ఆయనకే హాట్సాఫ్ చెప్పాలి, కానీ కే. కామేశ్వరరావుకు కాదని మనవి.
– రవీంద్రనాథ్ అని నాగ రత్నం ను పరిచయం చేశారు రవీంద్ర నాథ్.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-22-ఉయ్యూరు