మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227
227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి ,
6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ
భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు ‘కీర్తిశేషులు’ లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాడు.
· , నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కె.విశ్వనాథ్ తొలి చిత్రమైన ఆత్మగౌరవం కూడా ఉంది. బ్రహ్మచారి, కథానాయకుడు, కీర్తిశేషులు, మరపురాని కథ, విచిత్ర కుటుంబం, పల్లెటూరి బావ, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామ కళ్యాణం, నారీనారీ నడుమ మురారి, కాలేజీ బుల్లోడు వంటివితో సహా తెలుగు చిత్రాలకు కథలు వ్రాశారు ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఆయన సన్నిహితుడు. 1994 తర్వాత క్రమంగా ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.
· తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. భమిడిపాటి రాధాకృష్ణ క్యాలెండర్ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉంది. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా చిన్నారుల నామకరణ సమయంలో బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా ఆయన జాతకాలు చెబుతారనే పేరుంది.
· ఆయన 79 సంవత్సరాల వయస్సులో రాజమండ్రిలో మరణించారు . ఆయనకు భార్య, ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
సాహిత్య రచనలు
· భజంత్రీలు (నాటకం)
· దంత వేదాంతం (నాటకం)
· కీర్తిశేషులు (నాటకం)[2]
· మనస్థత్వాలు (నాటకం)
· తరం-అంతరం (నాటకం)
సినిమా రంగం
- ఆత్మ గౌరవం (1965) (డైలాగ్స్ రచయిత)
- మరపురాని కథ (1967)
- కథానాయకుడు (1969)
- అల్లుడే మేనల్లుడు(1970)
- ఆడజన్మ (1970)
- బొమ్మా బొరుసా (1971)
- రామరాజ్యం (1973)
- ఆడపిల్లల తండ్రి (1974)
- అల్లుడొచ్చాడు (1976)
- పొగరుబోతు (1976)
- మనిషి రోడ్డున పడ్డాడు (1976)
- సాహసవంతుడు (1978)
- షోకిల్లా రాయుడు (1979)
- నారి నారి నడుమ మురారి
అవార్డులు
· జంద్యాల మెమోరియల్ అవార్డ్. దృశ్యకావ్య ధురీణ బిరుదాంకితుడు .
·
కాలచక్రంతో పాటు గ్రహగతులనూ, జ్యోతిశ్శాస్త్రాన్నీ కూలంకషంగా అధ్యయనం చేసి అక్షరాలకూ, సంఖ్యలకూ బ్రహ్మముడులు వేస్తూ ఒక వ్యక్తి పేరులోంచి వారు పుట్టిన సమయాన్ని వెలికి తీసేందుకు తెలుగు భాషలోని 24 లక్షల 9 వేల 428 గుణింతాలతో కూడిన ఒక నిర్దిష్ట సూత్రం రూపొందించి దాని ఆధారంగా జాతకాలను అధ్యయనం చేస్తూ జ్యోతిశ్శాస్త్రంలో ఓ వినూత్న ధోరణిని ప్రవేశపెట్టి ఆ శాస్త్రం యొక్క విలువను ప్రపంచానికి అందిస్తూ ఎందరికో భవిష్యన్మార్గదర్శకం చేసింది ఒక ఆంధ్రుడేనంటే అది మనకు గర్వకారణం కదూ….
తప్పుల తడకలతో నడకలు సాగిస్తున్న ప్రపంచ కాలచక్రానికి గతులు సరిచేసే నిమిత్తం 45 బి.సి నుంచి 5,555 ఎ.డి వరకూ ఆంగ్ల క్యాలెండర్‌ను సరిదిద్ది భమిడిపాటి కేలెండర్‌ను రూపొందించిన మేటి విజ్ఞానవేత్త మన తెలుగుబిడ్డేనంటే ఈ ఘనతను మనం ఆస్వాదించవద్దూ ….
సూర్యుని చుట్టూ భూమి చేసే భ్రమణానికి పట్టే సమయం 365.25 రోజులనీ లేదా 365.2425 రోజులంటూ ప్రపంచం ఇప్పటి వరకూ నమ్ముతున్న సూత్రాలను తిరగరాసి, ఈ భ్రమణానికి 365.2422 రోజులు పడుతుందంటూ గణిత సూత్రాల ఆధారంగా నిరూపించి నిర్ధారించిన మహా శాస్త్రవేత్త, సాటిలేని ఈ జ్యోతిశ్శాస్త్ర ఘనాపాటి మన భమిడిపాటి రాధాకృష్ణ.
పుట్టిన తేదీ మరియు సమయంతో సహా ఒక జాతకాన్ని నలుగురైదుగురు జ్యోతిష్కులకిస్తే ఒకొక్కరూ ఒక్కో రకమైన అసంబద్ధ ఫలితాలను పేర్కొంటూ జ్యోతిశ్శాస్త్రంపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి తప్పుదోవ పట్టిస్తున్న తరుణమిది. ఈ నేపథ్యంలో పలువురు జ్యోతిష్య, పంచాంగ పండితుల బండారం బయటపెట్టడం ద్వారా ఈ శాస్త్రం కల్పితం కాదని, భాషా వ్యాకరణ, ఖగోళ, గణితశాస్త్ర సూత్రాలతో అనుసంధానమై నిర్దిష్ట ఫలితాలను నిక్కచ్చిగా అందించే విజ్ఞాన గని అని నిరూపించి తన వాస్తవిక దక్పథాన్ని నిరూపించుకున్న వ్యక్తిత్వం ఆయన సొంతం.
అటు నాటక – సినీరంగాల్లో మేటి రచయితగా సగానికి పైగా జీవితాన్ని సన్మాన, సత్కార్యాలతో గడిపిన శ్రీభమిడిపాటి రాధాకృష్ణ వ్యాకరణ, ఖగోళ, గణితశాస్త్రాలను అనుసంధానించి అధ్యయనం చేయడం ద్వారా జ్యోతిశ్శాస్త్ర మూలాలను మర్ధించి మేటి జ్యోతిశ్శాస్త్రవేత్తగా రాణించారు. విజ్ఞాన వీచిక అయిన శ్రీరాధాకృష్ణ అనుభవ గుళికలను ఎన్టీయార్, అమితాబ్‌బచ్చన్ వంటి వారితో సహా పలువురు విదేశీయులు సైతం అందుకొని అచ్చెరువొందారు. ఈ అపూర్వ విజ్ఞానవేత్త జీవిత విశేషాలను మీ కోసం అందించడం మా వంతు, ఆస్వాదించడం మీ వంతు.
పండిత పుత్ర
పండిత పుత్ర పరమ శుంఠ అన్న నానుడిని తిరగరాస్తూ అలనాటి హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి ఏకైక పుత్రులైన శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ 14-11-1929 వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఇక్కడి శ్రీ వీరేశలింగం ఉన్నత పాఠశాలలోను, తరువాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోను విద్యాభాస్యం చేసి, 1949లో బీ.ఎస్సీ పట్టభద్రులయ్యారు. తండ్రి శ్రీ కామేశ్వరరావు ఖ్యాతిగాంచిన హాస్య రచయిత కాగా… వారి రచనాభినివేశాన్ని తన జీన్స్‌లోనూ జీర్ణించుకున్నారు. రాధాకృష్ణ.
వెయ్యికి పైగా ….
నాటక రంగం వరకూ చూస్తే …. రాసింది తక్కువే అయినా అన్నీ వాసికెక్కిన రచనలే కావడం శ్రీ రాధాకృష్ణలోని రచనా తృష్ణకు తార్కాణం. ఆయన మొదటి రచన భజంత్రీలు నాటిక. దీన్ని మొదటిసారిగా 25-2-1950 వ తేదీన రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి పూర్వ విద్యార్థి వార్షికోత్సవ సందర్భంలో ప్రదర్శించారు. ప్రేక్షకుల ఆదారాభిమానాలు పుష్కలంగా లభించడంతో, ఆ ఉత్సాహంతోనే మనస్తత్వాలు, అంతా ఇంతే, దంత వేదాంతం, పెళ్ళి పందాలు, పేటెంటు మందు అనే ఆరు నాటికలు – ఇదేమిటి?, కీర్తిశేషులు, దైవ శాసనం అనే మూడు నాటకాలను రచించారు. ఇందులో 6 నాటికలు, 3 నాటకాలు ఆంధ్రదేశంలో అపూర్వ జనాదరణ పొందుతూ, ప్రతీ ఒక్కటీ వెయ్యి ప్రదర్శనలకి పైగా ప్రదర్శింపబడి నాటకరంగ ఖ్యాతిని ఇనుమడింప చేశాయి. ఇవిగాక తరం-అంతరం అనే మరో నాటిక కూడా వీరి కలం నుండి జాలువారింది.
అపురూప నాటకోత్సవం
1950 నుంచి 1970 వరకు ఆంధ్ర దేశంలో జరిగిన అనేక నాటిక నాటక పరిషత్తులలో, ఈ ఆరు నాటికలు, 3 నాటకాలు ఉత్తమ శ్రేణిలో ఎన్నో బహుమానాలు అందుకున్నాయి. దైవశాసనం నాటకం, గుడివాడలో జరిగిన 29వ ఆంధ్ర నాటక కళాపరిషత్తు మహాసభలో ఉత్తమ, రచన బహుమతిని పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని, 28-1-1952న రాజమండ్రిలో జరిగిన సన్మానసభలో, ఆ సభకి అధ్యక్షత వహించిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి ఆధ్వర్యాన, శ్రీ రాధాకృష్ణకి దృశ్య కావ్య ధురీణ అనే గౌరవ పురస్కారం జరిపారు. 1985లో జనవరి 12, 13, 14, 15 తేదీలలో రాజమహేంద్రవరంలో శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ నాటకోత్సవం జరిపించి, శ్రీ రాధాకష్ణ రచించిన 3 నాటకాలు, 6 నాటికలు వరసగా ప్రదర్శించడం ద్వారా రాజమండ్రి మయూరి కళాసమితి వారు తెలుగు నాటకరంగ చరిత్రలో మరో కొత్త ప్రయోగానికి నాంది పలికారు.
సినీరంగంలో అగ్రతాంబూలం
ఆత్మగౌరవం చిత్ర సంభాషణల రచయితగా, తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీ రాధాకష్ణకు లభించిన ప్రోత్సాహంతో మరో 150 చిత్రాలకు కథ, సంభాషణలు అందించారు. కథానాయకుడు, విచిత్ర కుటుంబం, బ్రహ్మచారి, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామకళ్యాణం, బొమ్మాబొరుసా, నారీ నారీ నడుమ మురారి మొదలైనవి ప్రముఖ చిత్రాలలో కొన్ని మాత్రమే.
శ్రీ గుళ్ళ పూడి విజయకుమార్ చెప్పిన సంగతులు
ది భమిడిపాటి కేలెండర్
శ్రీ రాధాకృష్ణకి గణితశాస్త్రం అన్నా, ఆ శాస్త్ర పరిశోధనలన్నా చాలా మక్కువ. ఆ ఉత్సాహంతోనే, 45 ఆ.ఇ. నుంచి 5555 అ.ఈ వరకు రోజు వారి ఇంగ్లీషు కేలెండరును రూపొందించారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇంగ్లీషు కాలెండర్‌లో తప్పు ఉందని రుజువు చేసి, దానిని సరి చేసుకొనే విధానాన్ని సూచిస్తూ 1990లో ది భమిడిపాటి కేలెండర్‌ను ఆంగ్లంలో పుస్తక రూపంలో ప్రచురించారు. జపాన్ మరియు లండన్ వంటి విదేశాల్లో ఈ క్యాలెండర్ విడుదలై, విక్రయించబడి సంచలనం సష్టించింది. ప్రపంచంలో ఇటువంటి ప్రయత్నం ఇదే తొలిసారికాగా వీరి అపూర్వ కృషి విజ్ఞులు, విమర్శకుల మన్ననలందుకుంది. ఇది ఆంధ్రులందరకూ గర్వకారణం.
పేరులోనే ఉంది…
జ్యోతిష్య శాస్త్రంలో కూడా గణితశాస్త్రం ముఖ్యమైన స్థానాన్ని అందుకుందన్న విషయాన్ని తీవ్ర అధ్యయనం, పరిశోధనల పిమ్మట రుజువు చేసుకున్న తదుపరి శ్రీ రాధాకృష్ణ ఆ జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధనలు జరిపి – పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరులోంచి ఆ వ్యక్తి పుట్టిన సమయాన్ని గంటలు, నిమిషాల్లోనే గాక సెకన్లతో సహా శాస్త్రీయంగా తీసుకువచ్చారు. అపూర్వమైన ఈ కషిని, దేశ, విదేశాల్లో కూడా ప్రస్తుతించారు.
నిజం దిశగా…
జ్యోతిశ్శాస్త్రంలో పూర్వం నుంచీ ఉన్న ఆ శాస్త్ర గ్రంథాలైన సారావళి, బృహజ్జాతకం, పరాశర గ్రంథం, జాతక మార్తాండ, జాతక సర్వస్వం, జాతక చంద్రిక, కేరళీయం ఇత్యాది గ్రంథాల్లో నిర్దిష్ట అంశంపై పరస్పర విరుద్ధమైన ఫలితాలు పేర్కొనబడడం శ్రీ రాధాకృష్ణ గమనించారు. అనంతరం వాస్తవిక దక్పథంతో ఈ శాస్త్ర గ్రంథాల నిగ్గు తేల్చేందుకు 40 ఏళ్ల పైబడిన వారికి చెందిన 2,600 జాతకాలు, 72 మంది కవలల జాతకాలు సేకరించి పై గ్రంథాలు మరియు తన పరిశోధనల ప్రకారం అధ్యయనం చేసి నిర్దిష్ట ఫలితాలను చెబుతూ విశ్వసనీయ ప్రమాణాలకు నూరుశాతం చేరువగా జ్యోతిశ్శాస్త్రాన్ని తీసుకెళ్లారు. ఇది అపూర్వం.
అందుకున్న పురస్కారాలెన్నో…
నాటక – సినీ రంగాలకు తానందించిన విశిష్ట రచనలకు ఫలంగా రేలంగి ఆర్ట్స్ అకాడెమి, చాట్ల శ్రీరాములు ధియేటర్ ట్రస్టు (లైఫ్ అఛీవ్‌మెంట్ పురస్కారం), తెలుగు విశ్వ విద్యాలయం వంటి ఎన్నెన్నో సంస్థల నుంచి అత్యుత్తమ గౌరవాలను శ్రీరాధాకృష్ణ అందుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ హాస్య రచయితగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ నుంచి పురస్కారం అందుకున్న శ్రీరాధాకృష్ణకు రాష్ట్ర ప్రజలు విశాఖలో కనకాభిషేకం చేసి నాటక – సినీ రంగాలను గౌరవించారు.
మరణాన్ని సైతం…
తన మరణాన్ని సూచించేలా అన్యాపదేశంగా సెప్టెంబర్ 4వ తేదీన గంట కోట్టేస్తానని ముందుగానే తన డైరీలో రాసుకున్న రాధాకృష్ణ రాతలు ఆయన నుదుటి మీద గీతలేనని ఎవరూ ఊహించలేకపోవడం గమనార్హం.
- సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు