మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248
248-తెలుగు నాటక రంగ రూప శిల్పి ,ఫణి,రాగరాగిణి నాటక ఫేం ,నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విజిటింగ్ ఫాకల్టి,అగ్నిప్రవేశం ,స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినీ ఫేం –అడబాల
అడబాల (ఫిబ్రవరి 9, 1936 – మార్చి 14, 2013) రంగస్థల నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడు.[1
ఈయన 1936, ఫిబ్రవరి 9 న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు సత్యమ్మ, వెంకన్ననాయుడు.
రంగస్థల ప్రస్థానం
నాటకరంగానికి రూపశిల్పిగా సుపరిచితులు. ఆ శాఖలో లోతుపాతులు కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేసి నైపుణ్యం సంపాదించాడు. జాతీయ స్థాయిలో నాటక విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహార్యంలో మెళకువలు బోధించాడు. సీనియర్ మేకప్ ఆర్టిస్టులలో ఆడబాల ముఖ్యులు. ఈయన బి.ఏ పట్టభద్రుడు. డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనలోను, ఆదర్శ నాట్యమండలి, పాలకొల్లుకి చీఫ్ మేకప్ ఆర్టిస్టు అయిన మెషక్ వద్ద మేకప్‌లోనూ శిక్షణ పొందాడు.[2]
అడబాల బాల్యదశ నుండే నాటకాల్లో వేషాలు వేశాడు. విద్యార్థి దశలో భమిడిపాటి ఇప్పుడు అనే నాటికలో శానయ్య పాత్ర ధరించి శభాష్ అనిసించుకున్నాడు. 1940 నుంచీ పినిసెట్టి శ్రీరామమూర్తి నిర్వహించిన ఆదర్శ నాట్యమండలి పక్షాన ప్రదర్శించిన పల్లెపడుచు, అన్నాచెల్లెలు తదితర నాటకాల్లో పాల్గొన్నాడు. మద్రాస్‌లో రైల్వేశాఖ ఉద్యోగం కె. వేంకటేశ్వరరావు శిక్షణలో ర.స.న సమాఖ్యలో ఫణి, రాగరాగిణి వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో పాల్గొన్నాడు. పలుచోట్ల ఉత్తమ నటుడిగానూ, హాస్య నటుడిగానూ బహుమతులు అందుకున్నాడు. 1966లో సికింద్రాబాద్ వచ్చిన అడబాల 1967లో ఆంధ్ర లలిత కళాసమితిని స్థాపించిన వ్యవస్థాపక సభ్యుడు. ఎ.ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో చాలా నాటకాల్లో పాల్లొన్నాడు. అందులో ముఖ్యమైనది మాలపల్లి. నేరము- శిక్ష, కప్పలు, నీలా తెరలు, లేపాక్షి, ఆశ్రయం, అరణి, వీలునామా మొదలైన నాటకాలు, మానవుడు, పెళ్ళిచూపులు, పగ, అమ్మ, రాజీవం, రాతిమనిషి మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి. అడబాల కొన్ని టీవీ సీరియల్స్‌లో, అగ్నిప్రవేశం, స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ మొదలైన చిత్రాల్లో కూడా నటించాడు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి విజిటింగ్ ఫాకల్టీగా చేశాడు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖలో విజిటింగ్ లెక్చరర్ గా పనిచేశాడు. ఇతని శిక్షణలో అనేక మంది శిష్యులు ఆహార్యంలో నైపుణ్యం సంపాదించారు.
రూపశిల్పిగా
ఆదర్శ నాట్యమండలి నాటకాలకు అప్పట్లో మేకప్ చేస్తున్న మాస్టారు అడబాల అసక్తిని గమనించి, మేకప్ లో తొలి పాఠాలు నేర్పి ప్రోత్సహించాడు. ఆనాటి నుండి అటు నటన, ఇటు రూపశిల్పం రెండీంటినీ నిర్వహిస్తూ వచ్చాడు.
మరణం
ఈయన మార్చి 14, 2013న మరణించాడు.
249-చలం గారి తమ్ముడిభార్య ,బళ్ళారి రాఘవ పిలుపుతో సంప్రదాయం వదలి నాటక రంగ ప్రవేశం చేసి ,ప్రహ్లాద నాటక లీలావతి ఫేం,రాఘవతో కలిసి చంద్రగుప్త ,రామదాసు లలో నటించి ,రైతుబిడ్డ ,పెద్దమనుషులు సినీ ఫేం ,గాంధి డాక్యుమెంటరి వ్యాఖ్యాత –కొమ్మూరి పద్మావతీ దేవి
కొమ్మూరి పద్మావతీదేవి ( జూలై 7, 1908 – మే 9, 1970) తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి.
పద్మావతీదేవి చెన్నై లో 1908 జూలై 7 న సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు సంఘసంస్కరణోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కరణ వివాహాం చేసుకున్నారు. వారి వివాహన్ని స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించారు. తల్లితండ్రులు పద్మావతిదేవికి చదువుతో పాటూ సంగీతం కూడా నేర్పించారు. పద్మావతిదేవికి 14 యేళ్ల వయసులో గుడిపాటి వెంకట చలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్యతో వివాహం జరిగింది. ఈమె కూమార్తె ఉషారాణి భాటియా కూడా రచయిత్రి.
తెలుగు నాటకరంగంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టిన బళ్ళారి రాఘవ రంగస్థలం పైకి సంసార స్త్రీలను ఆహ్వానించినప్పుడు ఈమె సంప్రదాయపు సంకెళ్ళను త్రెంచుకుని నాటకరంగం మీద కాలుపెట్టారు. ఈమె ప్రహ్లాద నాటకంలో లీలావతి పాత్ర పోషించేవారు. ఆమె రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు, చంద్రగుప్త, ఆ లోకం నుండి ఆహ్వానం మొదలైన నాటకాలలో రాఘవతో కలిసి సముచిత పాత్రలలో నటించారు. మహాత్మా గాంధీ డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సినిమాల ప్రవేశంతో ద్రౌపదీ మానసంరక్షణం, రైతు బిడ్డ, సుమతి, పెద్ద మనుషులు చిత్రాలలో నటించారు. వీరు స్త్రీల సమస్యల మీద ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు.
మరణం
ఈమె చెన్నై లో 1970 మే 9 తేదీన పరమపదించారు.
250-ముదినేపల్లి పంచాయితీ ప్రెసిడెంట్ ,ఎక్సేల్సియర్ నాట్యమండలి ,నవభారత ,శ్యామల నాట్య మండలి స్థాపకుడు ,డైరెక్టర్ ,త్రిపురనేని వారి ‘’ఖూనీ ‘’నాటక ఫేం ,పల్లెటూరు ,పుట్టిల్లు ,పిచ్చిపుల్లయ్య సినీ ఫేం –కోడూరి అచ్చయ్య
కోడురి అచ్చయ్య చౌదరి ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు.
వీరు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లిలో జన్మించారు. చిన్నతనం నుండి నాటకాలంటే సరదా పడి తీవ్రంగా కృషిచేశారు. వీరు నాటకరంగంలో ప్రవేశించేముందు కృష్ణాజిల్లా బోర్డు రాజకీయాలలో తనమునకలవుతూ వుండేవారు. ముదినేపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షునిగా సుమారు పన్నెండు సంవత్సరాలు వ్యవహరించారు.ముదినేపల్లిలో ఎక్సెల్షియర్ క్లబ్బును స్థాపించి దాని ఆధ్వర్యాన మూడేండ్లపాటు చెడుగుడు, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. అయితే గ్రామ రాజకీయాలతో విసుగు చెంది ఆయన ఆ రంగం నుండి తప్పుకుని తన దృష్టిని నాటకరంగంవైపు మళ్ళించారు[1].
నాటకరంగం
1939 ప్రాంతాలలో ఎక్సెల్షియర్ నాట్యమండలిని స్థాపించి తెలుగుతల్లి, ఆశాజ్యోతి, సత్యాన్వేషణం అనే సాంఘిక నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించి ఊరూరా ప్రదర్శింపచేశారు. అనేక షీల్డులు, ప్రశంసలు పొందారు. నిజానికి ఈయన బాల్యం నుండే నటునిగా పేరు పొందారు. తమ తొమ్మిదేళ్ల వయసులో వడాలి అగ్రహారం జగన్నాథస్వామి కళ్యాణోత్సవాలలో పెంజెండ్ర నాటక సమాజం వారు ప్రదర్శించిన కుశ లవ నాటకంలో రిహార్సల్ లేకనే లవుని పాత్రను అభినయించి సాటి నటబృందాన్ని ఆశ్చర్యచకితులను చేశారు. నాటక రచనలోని ప్రత్యక్షరం పూర్వాపరార్థాలు తెలుసుకుని పాత్ర స్వభావాన్ని అవగాహన చేసుకుని నాటకీయతలో పాత్రను సజీవంగా నిలపడం ఈయన ప్రత్యేకత. తాను స్థాపించిన ఎక్సెల్షియర్ నాట్యమండలిలో స్త్రీ పాత్రలు ధరించే అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగానికి వెళ్ళిపోవడంతో స్త్రీపాత్రలకు స్త్రీలను పెట్టుకుని నాటకాలాడడంలో వున్న సాధక బాధకాలను తట్టుకోలేమని భావించి ఆ నాట్యమండలినే రద్దు చేశారు. ఈయన కృష్ణాజిల్లా ప్రజా నాట్య మండలికి దర్శకుని బాధ్యతను నిర్వహించి మొదట సుంకర వాసిరెడ్డి రచించిన “ముందడుగు” నాటకాన్ని ప్రదర్శించారు. తర్వాత గుడివాడలో రావూరి రచించిన పరితాపం నాటకాన్ని తయారుచేసి ఆంధ్ర నాటక పరిషత్తులో ప్రదర్శించారు. ఈ సమయంలోనే మెరికల వంటి ఉత్తమ నటీనటులను ఈయన తీర్చిదిద్దారు. పెదపాలపర్రులో నవభారత నాట్యమండలి, గుడివాడలో శ్యామల నాట్యమండలులను వీరు స్థాపించారు. ఈ మండలులద్వారా అనేక సాంఘిక నాటకాలు ప్రదర్శించడమే కాక, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి “ఖూనీ” నాటకాన్ని రంగస్థలిపై ప్రదర్శించి రక్తి కట్టించిన ఖ్యాతి దక్కించుకున్నారు. వీరు పిల్లల కోసం కొన్ని నాటికలు, పెత్తందారు, ధర్మచక్రం, విజయభేరి మొదలైన నాటకాలను స్వయంగా రచించారు.
సినిమా రంగం
వీరు చలనచిత్ర రంగంలో ప్రవేశించి పల్లెటూరు, పుట్టిల్లు, కన్నతల్లి, వయ్యారి భామ, లక్ష్మి, పరివర్తన, పిచ్చిపుల్లయ్య, బాల సన్యాసమ్మ కథ మొదలైన సినిమాలలో విభిన్నమైన పలు పాత్రలు ధరించారు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సినిమా రంగంలో అన్ని అవకాశాలు వుండి కూడా, మిత్రులు బలవంతపెట్టినా ఆ రంగాన్ని విడిచిపెట్టి తిరిగి గుడివాడ వెళ్ళి అనేక నాటక సమాజాలకు దర్శకత్వం వహించారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-22-ఉయ్యూరు