• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-263
• 263-విజయవాడ ప్రెస్ మీట్లకు మార్గదర్శి ,ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ ,నిష్పక్షపాత విమర్శకు ఆద్యుడు ,నవయుగా ఫిలిమ్స్ జనరల్ మేనేజర్ –కాట్రగడ్డ నరసయ్య
• నరసయ్య సినిమాలపై విలువైన వ్యాఖ్యానాలకు పేరుగాంచారు. విజయవాడ ఫిలిం సొసైటీకి ప్రెసిడెంట్‌గా పనిచేసిన కాలంలో అద్భుతాలు చేశారు. అతను చలనచిత్ర పరిశ్రమకు చాలా ప్రయోజనం చేసాడు మరియు అతను ప్రచారంలో విప్లవాత్మక పోకడలను చేసాడు.
కాట్రగడ్డ నరసయ్య వ్యాఖ్యలు చాలా ఘాటుగా, సూటిగా ఉన్నాయి. నిజానికి నిర్మాతలు మరియు కళాకారులు నరసయ్య నుండి తన తీర్పు కోసం విడుదల తేదీకి కాల్స్ వచ్చేవారు. ఆ సంవత్సరంలో విడుదలైన చిత్రాల గురించి సంక్షిప్త సమాచారం ఇవ్వడానికి అతను సంవత్సరం చివరి రోజున ఒక సమావేశాన్ని నిర్వహించేవాడు.
. సినిమాలు ఉన్నంత వరకు నరసయ్య ఉంటారని, సినిమా విజయానికి ప్రచారమే ప్రాణమని నిరూపించారు. ఇంకా, 1993లోనే ‘రైతుబజార్’ ప్రారంభించడం వంటి సమాజహితం కోసం నరసయ్య కూడా కొన్ని ఆవిష్కరణలు చేశారని మోహనరామ్ అన్నారు. విజయవాడలో చాలా పెద్ద ఫంక్షన్ హాల్ కమ్ ఆడిటోరియం నిర్మించాడు. మహా మానవతావాది కాట్రగడ్డ నరసయ్యకు మోహనరామ్ నివాళులర్పించారు.
సినీ ప్రముఖుడు కాట్రగడ్డ నరసయ్య విజయవాడలో కన్నుమూశారు
•
• వామపక్ష ఉద్యమం, రాజకీయ పరిణా మాలు, సినిమా, మీడియా రంగం వంటి వాటిపై వామపక్ష ఉద్యమం కళా సాహిత్య వాణిజ్య సామాజిక క్షేత్రంలో సుదీర్ఘ కాలం సేవలం దించిన చైతన్య వంతుడు దూరమైనారు. స్వతంత్ర పోరాటంతోనూ సామ్యవాద భావ జాలంతోనూ పెనవేసు కుపోయిన కాట్రగడ్డ కుటుంబంలో పాత తరంలో ఆఖరి ప్రతినిధి, కొత్త తరాలకు వారధిó అస్తమించారు. సినీ రాజకీయ వాణిజ్య దిగ్గజాలతో సాన్నిహిత్యం నెరిపిన పెద్దాయన లేకుండా పోయారు. వ్యక్తిగతంగా నాకు అత్యంత ఆప్తులొకరు కరువైనారు.
కాట్రగడ్డ నరసయ్యగారి కుటుంబం గురించి తెల్కపల్లి రవి
• వారి తండ్రి మధుసూదనరావు మాత్రమే గాక వారి నాయనమ్మలు, మేనత్తలు, బాబాయిలు, పెదనాన్నలు చాలామంది ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లినవవారే. మహిళలు తమ ఆభరణాలు ఉద్యమాలకు ఇచ్చిన వారే. సుందరయ్య వంటి హేమాహేమీలకు అన్నం పెట్టి అజ్ఞాతవాసంలో ఆశ్రయం ఇచ్చినవారే. విజయవాడలో ‘ప్రజాశక్తి నగర్’కు భూములు సమకూర్చిన పెద్ద కుటుంబమే గాక తర్వాత కాలంలోనూ భూరి హృదయంతో ఆదుకున్న వారెందరినో చూడగలం. వారందరిలోనూ ‘నవయుగ ఫిలింస్’ సంస్థాపకుడైన కాట్రగడ్డ శ్రీనివాసరావు, సారథ్యం వహించిన నరసయ్య జనానికి మరింత బాగా తెలుసు. వాస్తవంలో నరసయ్య విద్యార్థి ఉద్యమాలలో పాల్గొనడమే గాక అభ్యుదయ రచయితల తొలి శిబిరానికి హాజరైనారు. ప్రజా కళారూపాలనూ అధ్యయనం చేశారు. కొద్ది కాలం ఉద్యోగం చేసినా బెనారస్ విశ్వవిద్యాలయంలో చేరి చాలా మంది అభ్యుదయ వాదులతో పాటు చదువు భావాలు నేర్చుకున్నారు. నవయుగ ఫిలింస్ జనరల్ మేనేజర్‌గా ఎన్నెన్నో గొప్ప చిత్రాలను పంపిణీ చేయడమే గాక ప్రమోట్ చేయడంలో ప్రత్యేకత చూపించారు. ‘నమ్మిన బంటు, రోజులు మారాయి’ వంటి గొప్ప సంచలనాత్మక చిత్రాలను ప్రమోట్ చేయడంలో నరసయ్య ముద్ర చెరగనిది. ఈ చిత్రాల రూపశిల్పులూ అభ్యుదయ వాదులే. ‘నమ్మినబంటు’లో నటీనటులతో పోటీ పడి నటించిన ఎద్దు గురించి, ‘రోజులు మారాయి’లో ‘ఏరువాక సాగారో…’ పాట గురించి వూపెత్తిస్తే నాయక పాత్రధారి నాగేశ్వరరావుకు చిర్రెత్తి పేచీ పెట్టుకున్నారట. ఏరువాక పాట చూడ్డానికి కొండ మీద కనకదుర్గ కూడా వచ్చిందని ఆరోజుల్లో ఓ వదంతి బయిలుదేరితే అందరూ ఆ పాట రాగానే మరీ మరీ వెతికేవారట! రోజులు మారాయి చిత్ర రజతోత్సవాల్లోనే మొదటిసారి పబ్లిసిటీ రంగానికి షీల్డు ఇవ్వడం మొదలైందంటే అది ఆయన కృషి ఫలితమే.
నవయుగ సంస్థ విడుదల చేసే చిత్రాలన్నిటికీ ప్రచార బాధ్యతలు చూసిన నరసయ్య పత్రికలకు డిజైన్లు, క్యాప్షన్లు, బొమ్మలు ఇవన్నీ కొత్త తరహాలో చేయించేవారు. స్త్రీల కోసం ఎంబ్రాయిడరీలు, ధైర్య సాహసాలు పెంచే ఎన్‌సిసి వంటి పద్ధతులు, వాటిలో జొప్పించే వారు. మహిళా సంఘాల వారిని ప్రత్యేకంగా తీసుకుపోయి వారి అభిప్రాయాలు వేయించేవారు. ఒక సినిమాతో మొబైల్ లాండ్రీ పద్ధతిని వ్యాప్తి లోకి తెచ్చారు. విద్యార్థులు, యువతకు కూడా సామాజిక అంశాలపై పోటీలు పెట్టి చిత్ర ప్రచారంతో కలిపేసేవారు. ఆ రోజుల్లో మద్రాసు లోనే చిత్ర పరిశ్రమ వున్నా విజయవాడను ప్రెస్‌మీట్ల కేంద్రంగా చేయడంలో ఆయన పాత్ర ముఖ్యమైంది. వాటిలోనూ నగరంలోని రచయితలు, మేధావులను పాత్రికేయులను భాగస్వాములను చేసి అలరింపచేసేవారు. కొత్త ఏడాది వస్తుండగానే గడచిపోయిన ఏడాది చిత్రాల జాబితా, శత దినోత్సవాలు, నటీనటులు ధోరణులు అన్నిటితో సమగ్ర సమీక్ష రెండు మూడు దశాబ్దాల పాటు కొనసాగించారు. ఆయనది ఆ విషయంలో సాధికార పరిజ్ఞానం. మీడియా పట్ల ఆయన ప్రత్యేకాసక్తి అడ్వర్టయిజ్‌మెంట్లకే పరిమితం కాదు. ఇంగ్లీషు పుస్తకాలు, మ్యాగజైన్లు విపరీతంగా చదివే ఆయన వాటిలోని కొత్త పద్ధతులు ప్రవేశ పెట్టాలని వెంటపడుతుండేవారు. కాలానుగుణమైన మార్పులను పసిగట్టడంలో దిట్టగనక చిన్నవిగా రాయాలనేవారు. సినిమాలకు పేజీల తరబడి రంగుల ప్రకటనలు ఇస్తే ఖరీదు పెరిగి చిన్న పత్రికలకు అవకాశముండదని చిన్న ప్రకటనలనే క్యాంపైన్ చేపట్టారు. ‘చిన్న మనుషుల బతుకులు’ అంటూ రోజూ సామాన్యుల గురించి రాసేవారు.
సినిమా రంగంలో చిన్న సినిమాలు, ప్రగతిశీల చిత్రాలను, దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా ప్రోత్సహించేవారు. వారిని పత్రికల కార్యాలయాలకు తీసుకువచ్చేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ రామానాయుడు, ప్రత్యగాత్మ, మధుసూదనరావు వంటి పెద్దల నుంచి నాటికి నూతన నటులు సాయిచంద్, మాదాల రంగారావు వంటివారి వరకూ అందరితో కలసిపోతుండేవారు. ఔత్సాహికులకు అవకాశాలు రావడానికి సహకరించేవారు. చిత్రోత్సవాలకు తప్పక హాజరై ప్రజాశక్తికి వాటిపై ధారావాహికంగా రాసేవారు. తర్వాత కాలంలో ఆయన కుమార్తె సీత కూడా ఆ కృషి కొనసాగించారు. నవయుగ ఫిలింస్ తర్వాత మరో అరడజను ప్రముఖ పంపిణీ సంస్థలకూ సంచాలకుడుగా పనిచేశారు. విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ పక్షాన వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేశారు. రైతుబజార్లకు ముందే కూరగాయలు వాటిలో విక్రయించేవారు. కళ్యాణమండపాల పేరు తీరు మార్చి మధు కళామండపం కట్టించిన నరసయ్య అది వున్నంత కాలం ప్రజాసంఘాలకు, పార్టీ సమావేశాలకు నామకార్థపు ఖర్చులతో ఇస్తుండేవారు. 2005లో సాహితీ స్రవంతి మొదటి సాహిత్యశాల అక్కడే అపురూపంగా జరిగింది. వెంటపడి మరీ పుస్తక ప్రదర్శనలు పెట్టించేవారు. మసాలా దినుసులు, మత్తు పదార్థాల బదులు వేడుకలలో ఆరోగ్యకరమైన ఫలాలు, పదార్థాలు ఇవ్వడం అలవాటు చేశారు. చిత్రకళా శిబిరాలు, కార్టూన్ల శిక్షణ వంటివి నడిపేవారు. మొగల్రాజపురంలో ఆయన ప్రాంగణం నగరంలో బొమ్మారెడ్డి, మిక్కిలినేని, పొన్నం వీరరాఘవయ్య వంటి పెద్దల గోష్టిగా వుండేది. వయసు పైబడినా ఆయన మాత్రం కొత్తదనం కోసమే పాకులాడేవారు గాని వెనక చూపు వుండేది కాదు. కమ్యూనిస్టు నాయకులతో నరసయ్యకు అత్యంత ప్రేమ, గౌరవం వున్నా విమర్శ చేయాలంటే వెనుకాడేవారు కాదు. విజయవాడలో ఆయన హాజరు కాని సినిమా, సాంస్కృతిక వేడుక వుండేది కాదు. హైదరాబాదులో పరిశ్రమ పెరిగిన మొదటి దశలో కొంత పాత్ర వహించినా తర్వాత వయోభారం, అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనారు. ఆ కదలలేని స్థితిలో కూడా వామపక్ష ఉద్యమం రాజకీయ పరిణామాలు, సినిమా, మీడియా రంగంపై నాలాంటి వారితో, స్థానిక కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు పాటించేవారు. నేను, వెంకట్రావు, వొరప్రసాద్ లాంటివాళ్లం వీలైనప్పుడల్లా నరసయ్య గారిని, ఆయన సతీమణి విజయలక్ష్మి గార్లను పరామర్శించి రావడం పరిపాటి. ఆయన బహుముఖ జ్ఞాపకాలు రాయించాలని చాలాసార్లు ప్రయత్నించాను గాని అన్నీ కలగాపులగమై కుదరలేదు. ఇప్పటికి రాసిన వాటిని పరిశీలించి ఒక రూపం ఇచ్చేందుకు ప్రయత్నించవలసి వుంది. ఆయన జీవితంలో ఇవి కొన్ని పార్శ్వాలు మాత్రమే. కడదాకా చైతన్యశీలిగా సామాజిక ఆసక్తికి ప్రతిరూపంగా జీవించిన కాట్రగడ్డ నరసయ్యకు ఇవే నా జోహార్లు.
– తెలకపల్లి రవి
• —
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు
•
•
•