రొయ్యూరు గ్రామ చరిత్ర
కృష్ణా జిల్లా కంకిపాడుకు సుమారు పది కిలోమీటర్ల దూరం లోపల కృష్ణా తీరం లో రొయ్యూరు గ్రామం ఉంది .కృష్ణ కరకట్ట పై నుంచి కూడా రొయ్యూరు చేరవచ్చు .షుమారు ఒక శతాబ్దం పూర్వం రొయ్యూరులో రొయ్యూరు జోగిరాజు ,,గోపరాజు అనే సోదరులు ఉండేవారు .ఆర్వెల నియోగులు ,భారద్వాజ గోత్రీకులు .తండ్రి అచ్యుతరామయ్య ,తాత రామరాజు ఈ గ్రామం లో మొదట నివాసులు .జోగిరాజు భగవద్భక్తుడు నిష్టా గరిష్టుడు .,కవి వరేణ్యుడు .కాళ్ళకు గజ్జలు కట్టి చిందులు తొక్కుతూ,ఒక చేతిలో తంబూర ,రెండవ చేతితో తాళం వేస్తూ ,పరవశంగా నృత్య గీతాలు చేస్తూ అభినవ భక్త రామదాసు గా ,కబీరు గా త్యాగయ్య లా ఉండేవాడు.నారదుడో తుంబురుడో అని పించేవాడు .కవి ,భక్తుడు కనుక మొదటగా ఈయన గురించే అందరూ చెప్పుకొనేవారు .
తానూ రచించిన కీర్తనలను తన్మయా వస్తలో మమరచి గానం చేసేవాడు కవి భక్త జోగిరాజు .తానూ బీద వాడైనా అశక్తుడు అనిఅనుకోకుండా ఊరిలో ఒక దేవాలయం కట్టాలనే సంకల్పం కలిగింది ..సోదరుడు గోప రాజు కూడా ఈ మహత్కార్యానికి అంగీకారం తెలిపాడు .ఈ సోదరులు ప్రతినిత్యం జపతపాలు ,దేవతార్చన నియమం తప్పకుండా చేస్తూ, సీతారామ కల్యాణం ,రామాయణ పారాయణం ,సంతర్పణలు చేస్తూ ఉండేవారు .
రొయ్యూరు వల్లూరు జమీ లోభాగం కనుక గోపరాజు సంస్థానం లో ఉద్యోగం చేస్తూ ,లౌకిక వ్యవహార దక్షుడయ్యాడు .ప్రజలలో సోదరులకు మంచి పేరు ప్రతిష్టలు ఉండటం ,కార్య దక్షులవటం వలన జమీందారు సాయంతో ,ప్రజా సహకారం తో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ,శ్రీ పార్వతీ సమేత శ్రీ సకలేశ్వరాలయం అద్భుతంగా నిర్మించి నిత్య పూజాదికాలకు అన్ని ఏర్పాట్లు చేశారు .వీరు నిర్మించిన శేష తల్ప విమానం కల విష్ణ్వాలయం ,శివాలయం అత్యంత శిల్ప శోభితం .తమ స్వంత ఈనాము నుంచి కొంత పోలముకూడాస్వామివార్లకు సమర్పించారు .
వీరికి గురువులు వైష్ణవులు .తమకున్న గురుభక్తిని ప్రకటిస్తూ గురువుగారిపై ఒక అనేక గ్రంథాలు రాసి సమర్పించారు ,వీరు రాసిన వేణుగోపాలశతకం లో మూడవ పద్యం లో వీరి గురుభక్తి ప్రత్యక్ష మౌతుంది .-
సీసపద్యం –‘’శ్రీరామ తారక సేవాభి రతుడనై –ముందు విష్వక్సేన మూర్తి దలచి
పరమ త్రైలోక్య దీపాంకుర జనని యైన –త్రివిధంబు మెలగు ఇందిరకు మొక్కి
రామానుజాచార్య రాజితాళ్వారాది-పరమ వైష్ణవులకు ప్రణతి జేసి
తిరుమల పురిహళ్ళదేశకాన్వయ కంధి –సోముడౌ రఘునాధ సూరి సూను
గీ-రాఘవా చార్య కృపను విరాజితముగ-సన్ను తి౦చెద నిన్ను
భూరి గుణ జాల రొయ్యూరి పురవిలోల –వేణు గోపాల శ్రీలోల విజయ శీల’’.
గురుదేవులకు పది ఎకరాల ఈనాం భూమిని కూడా ఇచ్చి తమ గురుభక్తి చాటుకున్నారు .జోగిరాజకవి రాసిన ‘’పారిజాతాపహరణం ‘’మొదలైన కావ్యాలను తానె అచ్చు వేయించి ఇస్తానని గురువు తీసుకొని వెళ్లి , ప్రచురించలేదు .తిరిగి కవి గారికి ఇవ్వనూ లేదు .ఒకరకంగా పంగనామాలు పెట్టాడు .అదొరకమైన ‘’కైంకర్యం’’ అని పించింది .ఆ వంశ పారంపర్యంగా పునర్లిఖి౦పబడిన,కొంపల్లి కాగితములపై వ్రాయబడిన గోపాల శతకం ,హనుమంత శతకం ,వామన విజయం ,,కీర్తనలు ,పాటలు మాత్రం తమకు దక్కాయని రొయ్యూరు గురించి రాసిన శ్రీ రొయ్యూరి రామ చంద్ర ప్రసాద రావు బాధతో తెలిపారు .
రొయ్యూరు గురించి నా జ్ఞాపక శకలం – వత్సవాయి లోసైన్స్ మేస్టర్ గా , ,పెనుగంచి ప్రోలులోనో ,హెడ్ మాస్టర్ గా వత్సవాయి లోనో పని చేస్తున్నప్పుడు ఒక శనివారం సాయంత్రం స్కూల్ అయ్యాక ,బస్ మీద బయల్దేరి ఉయ్యూరు వస్తూ అంచెలంచెలుగా బస్సులు మారుతూ ,నిద్రమత్తులో జోగుతూ ప్రయాణం చేస్తూ .కంకిపాడు దాకా వచ్చే సరికి రాత్రి సుమారు 9అయింది .అక్కడి నుంచి ఉయ్యూరు రావాలి బస్ లో .కంకిపాడు బస్ స్టేషన్ లో బస్సు ఎక్కాను .మంచినిద్ర మత్తులో ఉన్నాను .ఒక అరగంట తర్వాత బస్ ఆగింది .తీరా చూస్తె అది రొయ్యూరు .ఉయ్యూరు అనుకోని రొయ్యూరు బస్ ఎక్కానని అర్ధమైంది .అక్కడినుంచి మళ్ళీ కంకిపాడు కు రావాలంటే బస్ లేదు .ఏం చేయాలో అర్ధం కాక దిగి అటు ఇటూ తిరుగుతుంటే ఒకాయన గుడిదగ్గర బిజెపి వాళ్ళ సభ జరుగుతోంది .కాసేపట్లో అయిపోతుంది .వాళ్ళ వెహికిల్ లో కంకిపాడు వెళ్ళండి అని చెప్పాడు .అక్కడికి వెడితే తెలిసిన ఆర్ ఎస్ ఎస్ వర్కర్ కనపడ్డాడు .ఆయనకు నా గొడవ చెబితే’’ మా కారు లో డ్రాప్ చేస్తాం మాష్టారూ ‘’అన్నాడు .వాళ్ళ మీటింగ్ పూర్తయి కారు బయల్దేరే సరికి రాత్రి 11దాటింది .వాళ్ళ కారులో కంకిపాడుకు వచ్చేసరికి 11-30అయింది .రోడ్డుమీద వచ్చే పోయే లారీలను ఆపమని చెయ్యి చూపుతూ చివరికి ఏదో లారీ దొరికితే ఉయ్యూరు కుచేరేసరికి అర్ధరాత్రి 12-30అయింది .ఇదొక తమాషా అనుభవం .
గత మూడేళ్ళుగా సరసభారతి నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవం లో శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారితో పాటు రొయ్యూరి సురేష్ అనే ఆయనకూడా వచ్చి పాల్గొని చక్కగా గానం చేసేవారు .ఈ రొయ్యూరు కు చెందిన వారేమో తెలీదు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-22-ఉయ్యూరు