జయశంకర ప్రసాద్ -1
హిందీలో రమేష చంద్ర శాహ రాసిన దానికి తెలుగులో అనువాదం చేసిన డా.ఎ బి సాయి ప్రసాద్ ‘’జయశంకర ప్రసాద్’’పుస్తకాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్ లో కేంద్ర సాహిత్య అకాడెమి 1995లో ప్రచురించింది .వెల-పాతిక రూపాయలు .
అప్పటి ఆ యుగం
కవి నాటక రచయితా కధాశిల్పి ,నవలారచయిత జయశంకర ప్రసాద్ జీవించిన -1889-1937 కాలం అత్యంత గౌరవప్రద,గగుర్పాటు కలిగించే అధ్యాయం . ఈ కాల నిర్మాణం లో శ్రీ రామకృష్ణ పరమహంస ,దయానంద సరస్వతి ఉన్నారు .వీరిద్దరూ ఆధ్యాత్మికంగా భారత సమాజాన్ని తీర్చి దిద్దిన మహనీయులు .బెంగాల్ లో కేశవ చంద్ర సేన్ స్థాపించిన బ్రహ్మసమాజం ,మహారాష్ట్రలో రానడే స్థాపించిన ప్రార్ధనా సమాజం సంఘ సంస్కరణకు అంకురార్పణ చేశాయి .ప్రముఖ ఆంగ్లకవయిత్రి తోరు దత్’’ రామాయణాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించింది .రవీంద్రుడు తన రచనలద్వారా ఉద్దీపనం కలిగించాడు .గీతా రహస్యం తో తిలక్ స్పూర్తి రగిలించాడు .ఈ నేపధ్యం లో సంఘానికిపైపై పూసే మందులు పనికిరావనీ శస్త్ర చికిత్స చేయాలనిజయశంకర్ ప్రసాద్ లాంటి వారు ముందుకొచ్చారు .విశ్వ మైత్రి నుండి మనలను ఉద్ధరించాలనే వారసత్వం అబ్బాలని మహాత్మా గాంధీ లాంటి జాతీయనాయకులు జయశంకర ప్రసాద్ లాంటి రచయితలూ పుట్టుకొచ్చారు .మద్రాస్ లోని అడయార్ లోఆనీబిసేంట్ ‘’దివ్యజ్ఞాన సమాజం ‘’జయశంకర్ పుట్టిన బెనారస్ లో స్థాపించబడింది .జయశంకర్ తన ఏకైక కుమారుడిని ఆ సమాజ స్కూల్ లో చేర్చాడు .కానీ కొద్దికాలానికే దానిపై విశ్వాసం సడలి పోయింది ఆయనకు .జిడ్డు కృష్ణమూర్తి ఆ స్కూల్ కు వస్తే హారతులిచ్చి ఆహ్వానం పలకటం జయశంకర్ కు నచ్చక ,నిరసనగా కొడుకును ఆ స్కూల్ మాన్పించేశాడు .
1885లో కాంగ్రెస్ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ లో మహోన్నత నాయకత్వం వచ్చింది విప్లవాత్మకంగా ఆలోచించే అరుదైన వ్యక్తులు వచ్చారు .వీరిలో తిలక్ ,పాల్ ,అరవిందులు లజపతిరాయ్ లాంటి ఉద్దండులు స్పూర్తి ప్రేరణకలిగించారు , హిందీ లో ఈ కొత్త చైతన్యానికి పురుడు పోసిన’’ భారతేందు హరిశ్చంద్ర ‘’,జయశంకర ప్రసాద్ కు అన్నివిధాలా పెద్దన్న లాంటి వాడు .ఇద్దరూ బహుముఖ ప్రజ్ఞా శీలురే .భారతే౦దు స్వాభావికంగా కవి .పరిస్థితుల ప్రభావంతో వచన రచనా చేశాడు .కవిత్వాన్ని తన వ్రజభాష లోనే రాశాడు .ఇదే మధ్యయుగాలనుంచి ‘’సంపర్క భాష ‘’గా ఉండేది .క్రమంగా క్షీణి౦చి పోయింది .కొత్తగా పుట్టుకొచ్చిన ‘’ఖడీ బోలీ ‘’మాండలీకం లో రాయటానికి భారతే౦దు మొదట్లోసందేహించినా అభి ప్రాయ వ్యక్తీకరణకు అదే చక్కని వచన రచనకు అనువుగా ఉందని నిర్ణయానికి వచ్చి సద్వినియోగం చేసుకొవటమేకాదు కావ్యాలకు విముక్తి ప్రసాదించాడు .ఈ భాషపై ఆచార్యుల అంకుశపు పోటులు లేవు.ఖడీ బోలీ ని ఆధారం చేసుకొని హిందీ నాటక రచనలను తన భుజస్కందాలపై మోశాడు .పార్శీ దియేటర్ స్థూల రూపాన్ని పోషిస్తూ ,అప్పటి వ్యవహారాలూ ,పరిస్థితులను తననాటకాల ద్వారా పరిపోషించాడు .భారతేందు వాడిన కొత్త భాషాజాలం ,అందించిన మనోవిజ్ఞాన వినోదాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి .చాయానువాదంగా రాసిన ‘’దుర్లభ బందూ ‘’అంటే ‘’మర్చెంట్ ఆఫ్ వెనిస్ ‘’నాటకం లోనూ చూడగలం .ఆయన వేసిన బాటను గట్టి పరచాడు జయశంకర్ .
జయశంకర్ గొప్పతనం లో రెండు గుణాలున్నాయి .మొదట్లో ఇవి పరస్పర విరుద్ధంగా అనిపించినా క్రమేపీ విడదీయలేనంతగా కలిసిపోయి లీనమై ఒక బిందువుగా మారతాయి .ఈ బిందువే జయశంకర్ ప్రసాద్ ప్రసిద్ధ కావ్యం ‘’కామాయిని ‘’.ఇందులో ఆయన చారిత్రిక ప్రతిభ కూడా గమనిస్తాం .వ్యక్తులగతం జాతీయగతం కలిసిపోతాయి .ఆయన ‘’నావిక్’’ కవిత లో ఆయన వ్యక్తిగతం ,జాతి సాంస్కృతిక గతం గా దర్శనమిస్తుంది .దీనినే సామూహిక ‘’అవచేతన’’ అంటారు .కామాయిని కావ్యమనే సముద్ర యానానికి బయల్దేరే ముందు ‘’లనూర్ ‘’అనే కావ్యం లో ఆయన –‘’ఓహో ! ఈ నిండిన నావను –నావ తెరచాపను ఈపెనుగాలి నుంచి ఎవరు కాపాడుతారు ?నియతిలో వ్యాపించిన చిక్కటి చీకటి జలధి-కాంతిరేఖ రహిత బాధ తో ఉప్పొంగుతోంది .-కాలం అనే బెస్తవాడు అనంతం లోకి లాక్కేళ్ళుతున్నాడు –ఏదో ఆశతో ఊపిరి కొట్టుకొంటోంది ‘’.
జయ శంకర్ కావ్యయాత్ర ‘’కానన్ కుసుమ ‘’అనే కవితా సంకలనం తో మొదలైంది .ఆయన మొదటికధ’’గ్రామం ‘’.భారతేందు లాగా జయశంకర ప్రసాద్ కూడా సంపన్న కుటుంబం లో నుంచి వచ్చినవాడే .ఆలక్షణాలన్నీ వారసత్వంగా పొందినవాడే .జయశంకర్ రచనాత్మక ప్రతిక్రియ టాగూర్ లాగాకాక బంకిం చంద్ర లాగా ఉంటుంది .భారతే౦దు వ్రజభాషలోనే పద్య రచన చేశాడు .వ్యక్తీ ప్రతిభ పరంపరగా వస్తున్నా అభిప్రాయాలతో ఉన్నా ,కొంత మార్పు తెచ్చింది .ఈ పరిణామం సంప్రదాయం ను దూరం చేసింది .ఆయన నాటకాలు కావ్యాలలో కరుణ వెల్లివిరుస్తుంది .ఈయన ‘’ఆనంద వాదం ‘’పాశ్చాత్యుల విమోచన మార్గం కాదు .సంఘర్షణ ,సమాధానాల అద్భుత లీల ఆయన నాటకాలు .
గాంధీ దేశ చరిత్రను లోకచచైతన్యమలుపు వైపు మళ్లిస్తే ,జయశంకర్ లాంటి వారు ఆ మలుపు చూపిన మొగ్గును ‘’కావ్యాత్మక వేదాంతం ‘’వైపు అంటే ఆనందంతో కూడిన పార్శ్వాన్ని చిగురి౦పజేసే భూమిక పోషించారు .జయశంకర్ ఆదర్శాలు ఆయన స్వంత బాణీలలో ఉప్పొంగి అలరిస్తాయి .దేశ యువతను ఉద్బోధిస్తూ –‘’అందర్నీ హృదయానికి హత్తుకోవాలని –హృదయ గవాక్షాలు తెరుచుకున్నాయి –మనసు శాంత మనోహరంగా మారింది –ఎవరు అంటరాని వారి పాలిటి దైవమో –వ్యవసాయదారుల సుదృఢ హలమో –దుఖితులకన్నీరో ,శ్రామికుల యంత్రమో –ఎవరి జీవితం ప్రేమమయమో –ఆచలసత్య సంకల్ప జీవితమే ఎవరి కావ్యాలో -ఆ యువకులు చిరంజీవులౌగాక –దేశం సుఖ శాంతులరాశి కాగా –ముందుముందు అందరికీ ఈ మహాపురుషులే అనినశ్వరంగా ఉండాలి ‘’.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-22-ఉయ్యూరు
You replied to this comment.
నమస్తే ధన్యవాదాలు
Virus-free. http://www.avast.com