సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )
సుమతీ శతక సంస్కృతానువాదం
శ్రీ జనపాటి పట్టాభి రామయ్య గారు 1910లో సుమతీ శతకం ను సంస్కృతం లోకి ‘’నీతి గీతలు ‘’ గా అనువాదం చేసి నరసరావు పేట భారతీ విలాస ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెల-రెండు అణాలు మాత్రమె .తెలుగు పద్యాన్ని దానికింద సంస్కృత అనువాదాన్ని అందించారు .
1-కం.-‘’శ్రీరాముని దయచేతను –నారూఢిగ సకల జనులు నౌరా యనగా –దారాళమగు నీతులు –నోరూరగ జవులు బుట్ట నుడివెద సుమతీ ‘’
సంస్క్రుతనువాదం –శ్లో –శ్రీరామ చంద్ర కృపయాక్షిత్యాం-శ్లాఘ్యంభవేద్య ధామనుజైః –ధారాళ నీతిశతకం –తధాతి రుచిరం ప్రవచిన్మధురతరం ‘’
3-అడిగిన జీతం బీయని –మిడిమేళపు దొరను గొల్చి మిడుగుటకన్నన్-వడిగల ఎద్దుల గట్టుక –మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ
శ్లో –యోభ్యర్దితోపివిత్తం –యచ్ఛతినహి తజ్జనస్య సేవాతః –కృత్వా కృషిమతి విపులాం – కు౦భిన్యా౦ జీవనం వరం ‘’
5-ఆధరము గదిలియు గదలక –మధురములగు భాష లుడిగి మౌనవ్రతమౌ –యధికార రోగ పూరిత –బధిరాంధక శవము జూడ బాపము సుమతీ
శ్లో-అనుదిత మధుర వచస్కం –మౌనిన మధికార రోగ భూయిష్టం –దృష్ట్వా బధిరాంధ శవం –దోషీస్యాన్ముద్రితా ధరం మనుజః
12-ఇమ్ముగ జదవని నోరును –నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ –దమ్ముల బిలువని నోరును –గుమ్మరి మహి ద్రవ్వినట్టి గుంటర సుమతీ
శ్లో –యద్వక్త్రం నహి పతతే –జననీ త్యాహూయయాచ తేనాన్నం-యత్సహజాన్నాహ్వయతే తద్వక్త్రం –కుంభాకార కృతం గర్తం .
104-సిరిదా వచ్చిన వచ్చును –సలలితముగ నారికేళ సలిలము భంగిన్ –సిరి దా బోయిన బోవును –కరిమింగిన వెలగపండు గదరా సుమతీ .
శ్లో –శ్రీరాయాత్రికమ శస్త్వారామ –గ నారి కేళనీరమివ –భూరి క్షయ మేత్యచిరం –వారణ కబలీ కృతః కపిత్ధ ఇవ .
108-వేసరపు జాతి గానీ –వీసము దా జేయనట్టి వ్యర్ధుడు గానీ –దాసీ కొడుకైన గానీ –కాసులుగలవాడే రాజు ధరలో సుమతీ .
శ్లో-హీన కుల స్థోభూయా –దితర ప్రజ్ఞా భిరన్వితోనస్యాత్ –సూరు ర్వాస్యాద్దాస్యాః-క్షోణీనాధస్తువిత్తవానేవ .
ఇలా శతకాన్ని చక్కగా గీర్వాణీకరి౦చారు కవి జానపాటి .తనసంస్కృత సత్తా చాటి చెప్పారు .
స్కాంద పురాణం లోని ‘’నాగర ఖండం ‘’6,7,8ఆశ్వాసాలను ను పట్టాభి రామయ్య గారు సరళమైన తెలుగులోకి అనువదించి తన ప్రతిభ చాటారు .ఇది 1928లో గుంటూరు చంద్రికా ముద్రణ శాలలో ముద్రించారు .వెల-కేవలం అర్ధరూపాయి మాత్రమె .
ఇందులో అజాగృహోత్పత్తి,ఖండశిలా సౌభాగ్యకూపికల ఉత్పత్తి , పతివ్రతా దీర్ఘిక చరిత్ర ,మాండవ్య మునిని గొల్ల వారు కొరతవేయటం ,యముడు దాసీ గర్భం లో పుట్టటం ,చనిపోయిన బ్రాహ్మణ బాలకుడు బతికి రావటం ,యుధిష్టిర ఉపాఖ్యానం ,అనూదకదాన ఫలం ,పార్వతి గణపతిని సృష్టించటం ,రంభ జాబాలి మహర్షి తపస్సు భంగం చేయటం ,రంభకు ఫలవతి పుట్టటం ,చిత్రాన్గాదేశ్వరుడు ఆమెకు వరాలివ్వటం ,స్త్రీల ఉత్క్రుష్టత ప్రశంస ,శివవారంతో దేవతలు రాక్షసులని పారద్రోలటం ,వసురుద్రాదిత్య వర్ణన ,శుక వ్యాస సంవాదం ,వ్యాసుడికి పటికలో కపిమ్జలుడు పుట్టటం ,త్రిపురాసుర సంహారం ,నారసింహ మంత్రం ప్రభావం ,వశిష్ట విశ్వామిత్ర పోరాటం ,పిప్పలాద జననం ,పద్మావతి చరిత్ర ,పుష్కర త్రయ వర్ణన ,బ్రహ్మ నారద సంవాదం ,శివుడు కపాలం పోగొట్టుకోవటం ,నాగతీర్ధ మహాత్మ్యం ,పింగలోపాఖ్యానం ,యక్ష్మ తీర్ధ ఉత్పత్తి ,గయా శ్రాద్ధఫలం ,సామ్బోపఖ్యానం ,విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటం వగైరాలున్నాయి .
ఇవన్నీ పద్యాలుగా అనువాదం చేశారు కవి .మార్కండేయ మహర్షి రోహితాశ్వుడికి చెప్పాడని సూతమహర్షి శౌనకాదులకు తెలియజేశాడు ..
మొదటి పద్యం –‘’శ్రీ యాడవరవిమృష్టన్యాయా –విమర్శనావసర ధృతా –మేయసమవర్తికాయ మహాయా –వరబాకరాత్పరా౦ కుశ రాయా ‘’
మరోపద్యం 8వ ఆశ్వాసం లోనిది –‘’కలదిల నాగరాఖ్య గడు ఖ్యాతము క్షేత్రము కుష్టు రోగ సం-కలితుడనై తడనంతరమొకానొక కాలము నందు తీర్ధ యా –త్రలు నొనరించు జనుడు దత్ స్థలవర్తి తపస్వి యొక్క డి-బ్బలు రుజ నొంది కుందునను బాగుగ జూచి కృపావిశిష్టుడై ‘’.
దాదాపు తొమ్మిది వందల పద్య గద్యాల అనువాదం ఇది. తపస్సుగా చేసి ఫలితం మనకు అందించారు .లోకం ఆయనకు సదా రుణ పడి ఉంటుంది .
పట్టాభి రామకవి గారు ‘’చమత్కార మంజరి ‘’అనే పద్య కావ్యం ను 132పద్యాలలో రాసి నరసరావు పేట భారతీ విలాస ముద్రాక్షర శాలలో 1911న ముద్రించారు .వెల పావలా .
ఇవికాక విరూపాక్ష పీఠ గురు పరంపర ,వాసంతికా పరిణయం నాటకం ,కరణీకోద్ధారిణి,విశ్వ బ్రాహ్మణ శబ్ద ఖండనం –బ్రాహ్మణ శబ్ద విచారం ,విగ్రహారాధన ఖండనం ,స్వర్ణకార వ్యవహారం ,శుద్ధాంధ్ర హరిశ్చంద్ర చరితం ,ఆంద్ర సూత సంహిత ,భారతీయ ప్రబోధం ,ధర్మ నిర్ణయం ,అస్పృశ్యతా నివారణఖండనం ,పల్నాటి వీర చరిత్ర ,భాగవత రహస్యములు ,సోమేశ్వర శతకం ,వధూ శాకంబబరీ విడంబనం మొదలైనవి రచించి అతి తక్కువ వెలలో అందజేశారు .
ఇంతటి విశిష్ట రచయితను ఆంద్ర సాహిత్యలోకం నిర్లక్ష్యం చేసిందేమిటి అని బాధగా ఉంది .నలభై ఏళ్ళు ‘’అభినవ సరస్వతి ‘’పత్రిక ను నడపటం ఆషా మాషీ కాదు .అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నెన్నో విషయాలు,వారి జీవితానికి సంబంధించిన విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి.చదివి తెలుసుకోవాల్సిన బాధ్యత మనది అని మనవి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-22-ఉయ్యూరు