మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293
• 293-ప్రభుత్వ రజతపతకం ,,స్పెయిన్ అంతర్జాతీయ  సినీ ప్రదర్శన యోగ్యత పొందిన ‘’నమ్మినబంటు’’ సిని నిర్మాత ,మహాదాత ,పారిశ్రామిక వేత్త ,,ఉప్పు స
• త్యాగ్రహి ,కృతిభర్త ,సాహిత్య పోషకుడు ,-యార్లగడ్డ వెంకన్న-2
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే సినిమా తో ఆ బ్యానర్ ప్రారంభమైంది. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. బోల్డు పేరువచ్చింది. విదేశాల్లో జరిగిన ఫిలిం ఫెస్టివల్స్ కూడా ప్రశంసలు సాధించింది . రాష్ట్రపతి నుంచి బంగారు పతకం పొందింది. అయినా…ఆ నిర్మాత సినిమాలు తీయడం మానేయాలనుకున్నాడు. ఆ బ్యానరేమిటి? ఆ నిర్మాతెవరు? అసలా సినిమా ఏమిటి? ఈ వివరాల్లోకి ఓ సారి తొంగిచూద్దాం.
ఆ బ్యానర్ పేరు శంభు ఫిలింస్ బ్యానర్ మీద మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. అయితే మొదటి సినిమాలకు నిర్మాత యార్లగడ్డ వెంకయ్య చౌదరి. మిగిలిన చిత్రాలకు నిర్మాత ఆయన మేనల్లుడు దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి. చివరి సినిమాకు మాత్రం మళ్లీ యార్లగడ్డ వెంకయ్య కుమారుడు శంభూ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.
యార్లగడ్డ వెంకన్న చౌదరిది ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామం. స్వతంత్ర సమరయోధుడు. పారిశ్రామికవేత్త. అనేక వ్యాపారాలు చేసి చాలా గడించాడు. న్యాయశాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ మంచి ప్రవేశం ఉన్న మనిషి. అంతటి పెద్దమనిషికి సినిమా తీయాలనే కోరిక కలిగింది. చేతిలో డబ్బుంది. అనుకున్నదే తడవుగా అగ్రహీరోను అగ్ర దర్శకుడ్నీ అగ్ర హీరోయిన్నీ బుక్ చేసి సినిమా షురూ అన్నారు. ఆ సినిమానే నమ్మిన బంటు..
నమ్మిన బంటు చిత్రం యాంటీ హీరో సినిమా. ఊళ్లో దొరలకు నమ్మినబంటులా ఉండే హీరో అక్కినేని నాగేశ్వర్రావు. అతని మనసు గెల్సుకున్న సావిత్రి. ఆ సావిత్రికి నాగేశ్వర్రావంటే చాలా ఇష్టం. అయితే…అతను చేసే పనులు మాత్రం నచ్చవు. అతను భూస్వాముల తరపున వకాల్తా పుచ్చుకుని తన వాళ్ల మీదకు దాడికి రావడం అస్సలు నచ్చదు.అందుకే కొంచెం పొగరుగా ఉంటుంది. పొగరుబోతు పోట్లగిత్తరా అని నాగేశ్వర్రావు ఏడిపిస్తాడు కూడా ఒక రకంగా నమ్మినబంటు అంటే.. హీరోనే.
అయితే మరోకోణం కూడా ఉంది. రైతు జీవితంలో మూగజీవాలు నిర్వహించే పాత్రను కూడా సినిమాలో చర్చిస్తారు.అలా టైటిల్ కు మరో రకమైన జస్టిపికేషన్ కూడా ఉంది. రైతుతో పశువులకు ఉన్న అనుబంధాన్ని గురించి కొసరాజు అద్భుతమైన గీతం రాశారీ చిత్రం కోసం.
జాతివన్నె బుజ్జాయిల్లారా…నోరు లేని తువ్వాయిల్లారా…చెంగు చెంగునా గంతులు వేయండి అంటూ సాగే ఆ పాట వద్దనుకున్నారు ఆదుర్తి. అయితే కొసరాజు ఆ పాటతో రైతులు సినిమాకు ఎట్రాక్ట్ అవుతారని చెప్పడంతో ఉంచేశారు. సినిమా సక్సస్ లో ఆ పాటదే మేజర్ షేర్.
హీరోయిన్ సావిత్రి హీరో అక్కినేనిని మార్చి భూస్వాముల దుర్మార్గాలను అర్ధం చేయించి..వాళ్ల మీదకు ఉసికొల్పుతుంది. రైతు కూలీల హక్కుల సాధన కోసం హీరో ఉద్యమించడం…తన వారితో కల్సిపోవడం…సావిత్రిని పెళ్లాడడం….ఇదీ సినిమా.
ఔట్ డోర్ అంతా కారంచేడులోనే సాగింది. నిర్మాతగారి మరో మేనల్లుడు రామానాయుడి సారధ్యంలో. సినిమా సూపర్ హిట్ అయ్యింది. స్పెయిన్ వెళ్లి అక్కడా అందరినీ ఆకట్టుకుంది.
నమ్మినబంటు చిత్రానికి సంబంధించి మరో విశేషం…ఎస్.రాజేశ్వర్రావు వదిలేసిన సినిమాల్లో ఇదీ ఉండడం. తమిళ కవి ఉడుమలై నారాయణస్వామితో ఓ ట్యూన్ విషయంలో వచ్చిన తగాదా సందర్భంగా రాజేశ్వర్రావు నమ్మిన బంటు చిత్రం నుంచి విరమించుకున్నారు.
చెంగు చెంగునా గంతులు వేయండి. తెల తెలవారెను లేవండమ్మా పాటలు మాత్రమే రాజేశ్వర్రావు ట్యూన్ చేశారు. మిగిలినవన్నీ మాస్టర్ వేణు చేసినవే.
మరి ఇంత చారిత్రాత్మక నేపధ్యం ఉన్న నమ్మినబంటు చిత్రం తీసిన నిర్మాత మళ్లీ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి.మరి శంభు ఫిలింస్ బ్యానర్ మీద మరో నాలుగు సినిమాలు ఎలా వచ్చాయి? ఇవే కదా మీ అనుమానం. ఆ డౌటును క్లియర్ చేసేస్తామిప్పుడు..
ముందసలు శంభూ ఫిలింస్ కు సంబంధించి ఒక విషయం… వెంకయ్య చౌదరి నమ్మినబంటుకు మాత్రమే నిర్మాత. మిగిలిన వాటికి ఆయన మేనల్లుడు , కొడుకు నిర్మాతలు. బ్యానర్ మాత్రమే వెంకయ్యది.
మిగిలిన వ్యాపారాల్లో డబ్బు పెట్టిన వాణ్ణే అందరూ గౌరవిస్తారు. సినిమాల్లో మాత్రం డబ్బు పెట్టిన వాడే అందరికీ గౌరవం ఇవ్వాల్సి రావడం తనను బాధించిందని వెంకయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.తన మేనల్లుడు లక్ష్మీనారాయణ చౌదరి సినిమా తీస్తానంటే ఒద్దన్నారు.
నమ్మినబంటు తో యార్లగడ్డ వెంకన్నచౌదరి సినీ ప్రయాణం ఆగిపోయింది. ఆయన ఇక సినిమాలు తీయదల్చుకోలేదు. తీయలేదు కూడా. అయితే ఆయన మేనల్లుడు దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి శంభూ ఫిలింస్ మీద మూడు సినిమాలు చేశారు. లక్ష్మీ నారాయణను సినిమాల్లోకి రావద్దన్నారు వెంకన్న…కానీ వినలేదు. ఆ సినిమాలేంటి? ఆ కథేంటి చూద్దాం.
పూజాఫలం శంభూ పిలింస్ బ్యానర్ లో వచ్చిన రెండో చిత్రం. బి.ఎన్ రెడ్డి బయటవారికి చేసిన సినిమాల్లో ఇది ఒకటి.
హీరో అక్కినేని నాగేశ్వర్రావే. ఇది నవలా చిత్రం. మునిపల్లెరాజుగారి పూజారి నవల ఆధారంగా పూజాఫలం రూపుదిద్దుకుంది. ఒక పురుషుడి జీవితంలోకి ప్రవేశించిన ముగ్గురు అమ్మాయిల కథ ఇది.
బిఎన్. రాజేశ్వర్రావుల కాంబినేషన్ లో పగలే వెన్నెల లాంటి అద్భుతమైన పాటలు రూపుదిద్దుకున్నాయి.
ఇక మరో విశేషం ఏమిటంటే. బి.ఎన్, రాజేశ్వర్రావు కాంబినేషన్ లో దేవులపల్లి రాసిన గీతాలు కాకుండా నారాయణరెడ్డి రాసిన పాటలు హిట్ కావడం విశేషం కాక మరేమిటి.
పగలే వెన్నెలే కాదు….నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో పాట కూడా నారాయణరెడ్డిగారిదే. ఈ చిత్రంలో ఘంటసాల పాడిన పాట కూడా అదొక్కటే.
పూజాఫలం ఓ మోస్తరుగా ఆడడంతో ఈ సారి ఎన్.టి.ఆర్ తో సినిమా తీయాలనుకున్నారు లక్ష్మీనారాయణ చౌదరి.
పింగళి నాగేంద్రరావు విజయా బ్యానర్ లో కాక బయట రాసిన నాలుగైదు సినిమాల్లో ఇది ఒకటి.
విశేషం ఏమిటంటే…వాహినీ సంస్ధ మూలపురుషుల్లో ఒకడైన ఆర్ట్ డైరక్టర్ ఎ.కె.శేఖర్ శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కథను డైరెక్ట్ చేయడం.
కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు ఉంది. అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉంది. మహాంధ్ర సామ్రాజ్య స్థాపకుడు ఈ శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు. ఆయన కథే శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు కథ.
ఒక రాజును అవతార పురుషుడుగా జనం చెప్పుకున్నారంటే ఆయన పాలన ఏ స్థాయిలో ఉందో అర్ధ మౌతుంది. పెండ్యాల సంగీతం అందించిన ఈ సినిమా కోసం బాలమురళీ కృష్ణ ఓ డ్యూయట్ ఆలపించడం విశేషం. వసంతగాలికీ వలపులు రేగ అంటూ సాగుతుంది.
శ్రీ కృష్ణదేవరాయలుతో ఆముక్తమాల్యద రాయించింది శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుడే అనే నమ్మకం ఉంది.
రాయలవారు సామ్రాజ్య విస్తరణతో పాటు శత్రు నిర్జన కార్యక్రమంలో భాగంగా దండయాత్రలు సాగించినప్పుడు కృష్ణాతీరాన కల శ్రీకాకుళంలో విశ్రాంతి తీసుకున్నారట.
అప్పుడే ఆంధ్రదేవుడు రాయల కల్లో కనిపించి ఆముక్తమాల్యద రాయించడంతో పాటు…ఆ కృతిని తిరుపతి శ్రీవారికి అంకితం ఇచ్చేలా మాట తీసుకున్నారని చెప్తారు.
శ్రీకాకుళాంధ్రమహావిష్ణుకథ తర్వాత దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి తీసిన సినిమా పంతాలు పట్టింపులు. కొల్లిపర బాలగంగాధర తిలక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చౌదరిగారికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. మ్యూజికల్ గా సక్సస్ కొట్టినా…వసూళ్ల పరంగా నిలబడలేదు.
శోభన్ బాబు హీరోగా వాణిశ్రీ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం నాట్య ప్రధానంగా సాగుతుంది.
పంతాలు పట్టింపులు చిత్రానికి సంబంధించి మరో విశేషం ఉంది. ఈ సినిమాలోనే మహాకవి శ్రీశ్రీకి చాలా ఇష్టమైన పాట ఉంది. గుమ్మడి మీద చిత్రీకరించిన ఈ పాటలో ఈ బతుకుందే సానా బరువు అనే లైను శ్రీశ్రీ ఎంత ఇష్టపడి రాశారో…అంతే గొప్పగా ఆలపించారు ఘంటసాల. ఆ లైపులో ఈ బతుకుందే అనే బిట్ అప్పటి కారక్టర్ యాక్టర్ చదలవాడ అడ్వైజ్ చేశారు.
నమ్మిన బంటుతో మొదలైన శంభూ ఫిలిమ్స్ పతాకం అక్కడితో ఆగిపోకుండా ఎనభై దశకం వరకు కొనసాగింది.
యార్లగడ్డ వెంకన్నచౌదరి కుమారుడు శంభూ ప్రసాద్ చిత్ర నిర్మాణంలోకి దిగి కట్టాసుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో బంగారు బావ పేరుతో సినిమా తీశారు. కారణాలేవైనా ఆ సినిమా పెద్దగా పే చేయలేదు. మల్లికా నవ మల్లికా పాట మాత్రం సూపర్ డూపర్ హిట్టైంది.
బంగారుబావ తర్వాత శంభూ ప్రసాద్ కూడా సినిమా నిర్మాణానికి దూరంగానే ఉండిపోయారు.
తిరుపతి వెళ్లి వస్తూ యాక్సిడెంట్ లో భార్యతో పాటు కన్నుమూశారు. తీసింది నాలుగైదు సినిమాలే అయినా…కారంచేడు నుంచి ఓ స్టార్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లోకి రావడానికి మార్గం వేశారు వెంకన్న చౌదరి.
నిజానికి అదే ఆయన సాధించిన విజయం. శంభూ ఫిలింస్ బ్యానర్ కథ
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు, సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.