జయశంకర ప్రసాద్ -8
కామాయిని కావ్య సంశ్లేషణం -2
కామాయిని రెండవ సర్గ పేరు ఆశ .ప్రళయ కాళ రాత్రి తన వికృత స్వరూపం చూపించి నీటిలో అదృశ్యమౌతుంది .ఉషస్సు తన బంగారు కిరణాలతో జయలక్ష్మిలా ఉదయిస్తుంది .ఇందులో మనుషుల అంతరంగాన్ని బయట పడేస్తాడు కవి జయశంకర ప్రసాద్ .హిమ ఆచ్చాదం తొలగి భూమి నెమ్మదిగా బయట పడింది .వనస్పతులు మత్తుగా లేచాయి .ప్రకృతి చైతన్యమైంది .జలధి తల్పం పై భూమి పెళ్ళికూతురు రాత్రి కోలాహల జ్ఞాపకాలతో అలిగి ఒదిగి కూర్చుంది .ఈ ప్రళయం వెనక ఉన్న శక్తి ఏది ?అనే ప్రశ్న వచ్చింది .దేవతాశక్తి అయిన పకృతి శక్తి అని సమాధానం దొరికింది .దైవత్వం ఒక భ్రమ మాత్రమే .మనం తోలు బొమ్మలమే అనే భావం కలిగింది .ప్రకృతికి కావాల్సిన జీవరసాన్ని ఎవరిస్తున్నారు ?ఆ అస్తిత్వం ఎక్కడుంది ?ఎవరి ఆజ్ఞల్ని గ్రహనక్షత్రాలు పాటిస్తున్నాయి ?మనువుకు ఈ అస్తిత్వపు చిరు సవ్వడి వినిపిస్తుంది .అది అనంత రమణీయం .దీనితో లోలోపల ఒక మెలకువ కలుగుతుంది –‘’వరం లాంటి భావం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది .నేను ఉంటానని నేనూ స్వరం కలిపాను ‘’
ఈ జిగీష తర్వాత మనువు ఒక గుహలో నుంచి తన జీవిత చర్చ చేస్తాడు .జీవితానుభవం ఒక యజ్ఞ రూపం లో కనిపిస్తుంది .అది ఆయన నిత్యజీవితం లో అంతర్భాగమే అయిపోతుంది .అనుభూతి చింతనలు క్రమంగా విస్తరించి అంతర్జగత్తును ఆవిష్కరిస్తాయి .ఒంటరిగా ఉన్నానన్న తీవ్రభావన ఆయన్ను కలవర పెడుతుంది .
శ్రద్ధా సర్గ లో కవి సుందర ఛందస్సులా మనువు శ్రద్ధను దర్శిస్తాడు .ఆమె వేసిన జిజ్ఞా పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘’నేను భూమ్యాకాశాలమధ్య నిరపాయంగా వేలాడుతున్న జీవన రహస్యాన్ని విస్మృతి చైతన్య రహిత స్తూపాన్ని ‘’అని పరిచయం చేసుకొంటాడు .ఆమె అతని గుండెల్లో ఆశ రేపుతుంది .’’శ్రుణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః ‘’లాంటి ధైర్యాన్నిస్తాడు .ఆమె అతడిని ‘’చేతన సుందర చరిత్ర లాంటి అఖిలమానవ భావ సత్యం వైపుకు ఉన్ముఖుడిని చేస్తుంది .ఆమె సాంగత్యం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది .మధుమాస అనుభూతి కల్గిస్తుంది .మోహం మొలకెత్తుతుంది .ఒకరాత్రి కలలో ‘’కామం ‘’స్వరం వినిపించి ,సృష్టిలీలను ప్రేరేపించే మూలశక్తి అయిన ప్రేమకళను పరిచయం చేస్తుంది .దాన్ని పొందే యోగ్యత సాధించమని మనువు మనసు బోధిస్తుంది .
‘’వాసన ‘’అనే నాలుగవ అధ్యాయం లో మను –శ్రద్ధ ల సహజీవనం తళుక్కుమంటు౦ది .తర్వాత అతడి ఈర్ష్య ,అధికార దర్పం వ్యక్తమౌతాయి .ఇందులో స్త్రీ పట్ల పురుషుడి కోరిక మేల్కోవటం దాని అభి వ్యక్తీ దృశ్యాలు ఉంటాయి .శ్రద్ధ లోని స్త్రీత్వం కొంత చలిస్తుంది –‘’నారీత్వపు ఆ ఆది మధురాను భావం –నాలో పె౦పొందిస్తోంది అనురాగం –మధుర క్రీడా చింతనతో ఉత్సాహం మీటగా పలికి౦ది ఆనందం తో హృదయం ‘’అంటుంది .
‘’లజ్జ ‘’అధ్యాయం లో స్త్రీ హృదయపు అత్యంత సూక్ష్మ గుణగణాలపై రాయబడింది..సమర్పణకు ముందు అంతర్ జగత్ భావ సృష్టి ,దాని కార్యకలాపాలతో కూడిన సంవేదనాత్మక సృష్టి హిందీ సాహిత్యం లో అంతకు ముందు లేనే లేదు .ప్రసాద్ కవిత్వం మంత్రం ముగ్ధుల్ని చేస్తుంది .’’ది ఆఫుల్ డేయరింగ్ ఆఫ్ ఎ మూమెంట్స్ సరెండర్ ‘’అన్నాడు ఆంగ్లకవి .స్త్రీ హృదయం దృష్టిలో ఈ సమర్పణ భావం తీవ్రంగా హృదయానికి హత్తుకోనేట్లు చిత్రించాడు ప్రతిభతో ప్రసాద్ .చాయావాదకవిత్వం రాసిన జయశంకర్ సర్వ శ్రేష్ఠ ఐంద్రియ కవిత్వమూ రాసి సవ్యసాచి అయ్యాడు .-‘’కోమల కిసలయాల కొంగులో –దాగిన అతి చిన్నారి మొగ్గలా-సాయం కాల దుమ్ము తెరలో –ప్రకాశించే దీప స్వరంలా –మెరిసే మనసు ఉన్మాదంలా-సురభిత అలల నీడలలో –బుడగ వైభవం చిమ్ముతోంది –సరస వసంత కుతూహలంలా –కనులనిండిన నీటితో ఉంది ‘’.
లజ్జ లో స్త్రీకి అధిక ప్రాధాన్యమిచ్చి భారతీయతకు అద్దంపట్టాడు జయశంకర్ .’’సౌందర్యం అని దేన్నీ అంటారో –ఎవరిలో అది ఎప్పుడూ జాగృతమౌతుందో –ఆ చపలత్వ ధాత్రినేను-తగలబోయే దెబ్బలని నిదానంగా తెలియజేస్తాను’’ .ఇందులో మనసుయొక్క జ్ఞాన సరసత్వం ,దాని అనుభవ పరిపక్వత స్పష్టం చేస్తాడు కవి –‘’ఎప్పుడూ జాగృతి కోరను –కదలను మెదలను –పిచ్చివానిలా ఆలోచించ లేక పోతున్నాను –పురుష తరువు పరిష్వంగం లో –లతలా ఉయ్యాలలూగుతున్నాను .’’ఆమె లోని ఈ అంతర్ నాట్యం వ్యాఖ్యానం చేస్తుంది .దీనితో పాఠకులు ఒక ఆశ్చర్యకర ఆట౦కాన్ని అనుభవిస్తారు .-‘’ఈ అర్పణలో ఏ ముంది ?త్యాగం పోగు మాత్రమె –ఇచ్చి ,బదులుగా మరేదీ తీసుకోలేను’’అంటుంది .ఇందులో యేట్స్ కవి రాసిన’’ క్రేజీ గన్ ‘’లో లాగా ‘’హోల్ నెస్’’ను సంపూర్ణత్వం తో సమర్పణ చేసిందని పిస్తుంది .అధ్యాయం చివర్లో –‘’ఓనారీ!నువ్వు కేవలం శ్రద్ధవు –విశ్వాసం వెండికొండ బాటలపై-జీవితపు ఈ సుందర సమతలం పై –పీయూష ధార గా ప్రవహించు ‘’.ఇక్కడే ఇలియట్ రాసిన ‘’వేస్ట్ లాండ్’’ కావ్యం గుర్తుకొస్తుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-22-ఉయ్యూరు