జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం )
కామాయిని కావ్య సంశ్లేషణం -4(చివరిభాగం )
సామూహిక హత్యతో ఉన్న ‘’సంఘర్షణ పర్వం ‘’పూర్తయ్యాక ,’నిర్వేద సర్గం ‘’మొదలౌతుంది .మనువు శరీరమంతా గాయాలే .గ్లాని తో ఉన్న ఇడ అతన్ని చూసి పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది .అసహ్యం –మమతల మధ్య అంతర్ సంఘర్షణ లో కకా వికలమౌతుంది .శ్రద్ధ కొడుకుతోసహా అక్కడికి వస్తుంది .ఆమె మాటలు అంతటా ప్రతిధ్వనిస్తాయి .అతనిలో రేగిన తుఫాను గమనిస్తుంది .వ్యాకులం లో మేల్కొనే ఉన్న మనువు ఎక్కడికో పరిగెత్తి పోతాడు .దర్శన్ సర్గ లో కొడుకును ఇడకుఅప్పగించి ఆమె అతని కోసం పరిగెత్తిపట్టుకొంటు౦ది . ఇడ తన హృదయబాధను శ్రద్ధకు తెలియజేస్తుంది .విరహం ,కలయిక నిత్య నిరతమైన ఈ జగత్తు నిత్య చితి రూపం అని పిస్తుంది .శ్రద్ధ కొడుకును అక్కున చేర్చుకొని ‘’సౌమ్యుడా !ఇడ నిర్మలానురాగం నీ దుఖాన్ని హరిస్తుంది .నువ్వు ఆలోచనా పరుడవు .మానవ సౌభాగ్యానికి భూమిక తయారు చేయి .సమరసభావాన్ని చాటు’’అని బోధిస్తుంది . .
శ్రద్ధ మనువును కలుస్తుంది .ఆమె ‘’లోకాగ్ని లో కాలి కరిగిన ,మూసలో పోసిన విశ్వామిత్ర మాత్రు భూమిలా కనబడుతుంది .అతని రుణ విద్యుత్ ధన విద్యుత్ గా మారుతోందని చెబుతుంది .అతడు ఇప్పుడు స్వతంత్రుడు అని గుర్తు చేస్తుంది .కొన్నేళ్ళ క్రితం అక్కడే తాను అతనికి సర్వం సమర్పించు కొన్నాను అని చెబుతుంది .ఇద్దరం కలిసి శాంతి ప్రభాతం దగ్గరకు వెడదాం అంటుంది .
తర్వాత అధ్యాయం ‘రహస్యం ‘’లో శ్రద్ధా ,మనువులు హిమాలయా రోహణం చేస్తూ౦డగా,మనువు అలసి పొతే ,ఆమె ధైర్యం చెప్పి ,ఎక్కడున్నామో చూడమంటే అతనికి ‘’మూడు అలోక బిందువులు ‘’కనిపిస్తాయి .ఆతడు మూడు లోకాల ప్రతినిధిగా ,అది ఇచ్చ జ్ఞానం క్రియల ప్రపంచం అని చెబుతుంది కామాయిని .అతడు ఆ త్రికోణ కేంద్ర బిందువు అనీ ,ఇచ్చాలోకం ఎర్రగా సుందరంగా జీవిత మధ్యప్రాంత౦ గా ఉండి మధురలాలసతో కూడి మాయ రాజ్యం చేస్తుందని చెబుతుంది .రెండవ వృత్తాకారం కర్మలోకం .నియతి ,ప్రేరణ ప్రకారం ఇక్కడ చక్రం విరామం లేకుండా తిరుగుతుంది .ఇచ్చాలోకపు సుఖాలు ఇక్కడ దుఖాలుగా మారుతాయి .ఇక్కడ నిరంతర పోరాట వైఫల్యాలు కోలాహలం రాజ్యమేలుతాయి .భయపడి మూడవ లోకం గురించి అడుగుతాడు .అది జ్ఞాన క్షేత్రమని ,నిర్మలత్వం ఉదాసీనత ఇక్కడ ఉంటాయని ,అక్కడి మరుభూమిలా ఎండిన నది మెరుపుతో సమానమని ,ఇక్కడి మనుషులు భ్రమతోకూడిన శాంతి నెలకొల్పుతారు .శాస్త్ర పరిరక్షణ వారి బాధ్యత అని తెలియజేస్తుంది .దివ్య అనాహత నినాదం లో –శ్రద్ధాయుతుడైన మనువు తన్మయు డౌతాడు ‘’.
ఆనంద సర్గ ఉపసంహార సర్గ .మానససరోవరం వైపు వెళ్ళే యాత్రిక సమూహం కనిపిస్తుంది .ఆ సమూహం లో మనువు శ్రద్ధా ఇడా,మనువు పుత్రుడు మానవుడు కూడా ఉన్నారు .మానససరోవరం చేరి అక్కడ మనువు ధ్యానమగ్నుడౌతాడు .అందరూ పరమ పవిత్ర భావనకు లోనౌతారు .శ్రద్ధ ఒడిలో కొడుకు మానవుడు ఉంటాడు .పాదాలవద్ద ఇడ నత మస్తక అయింది .కైలాసాన్ని చూపిస్తూ మనువు ‘’రెండు అనే భావనే విస్మృతి .ఈ అద్వైతాన్ని చూడండి ‘’అంటాడు –‘’నేను అనే చేతనా –అందర్నీ స్ప్రుశిం చేలా –అన్ని విభిన్న పరిస్థితుల –మత్తు గుటక తాగినట్లుగా ‘’ఉందన్నాడు .ఈ దృశ్యం లో కామాయిని ‘’ఈ జగతి ఏకైక మంగళకరమైన కోరిక గా ‘’కామం సంపూర్ణ ప్రతిమలా ,విశ్వ చైతన్యం పులకింత గా వర్ణించాడు జయశంకర ప్రసాద్ .-‘తనదంటూ ఉన్న ఒక కళలో –జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సౌందర్యం రూపు దాల్చి –చైతన్య విలసితమైంది –గాఢ మైన ఆనందం అఖండం ‘’అంటాడు ప్రసాద్. ఆ ఆనంద సంగీతమే అన్నిటా ప్రతిధ్వనిస్తుంది .మానవ పరిణతి ఆశించి రాసిన కావ్యమే కామాయిని .
ఆధారం –రమేశ్ చంద్ర శాహ రచనకు డా ఎ బి సాయి ప్రసాద్ చేసిన తెలుగు అనువాదం ‘జయశంకర ప్రసాద్ ‘’పుస్తకం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-22-ఉయ్యూరు