శ్రీ భీమ లింగేశ్వర శతకం -1
పల్నాడు తాలూకా జూలకల్లు గ్రామవాసి శ్రీ శానం పూడి వరద కవి శ్రీ భీమేశ్వర లింగ శతకం రాసి ,వినుకొండ తాలూక ముప్పాళ్ళ గ్రామస్తులు శ్రీ కాకుమాను కాశీ విశ్వానాథం ఆర్ధిక సహకారం తో గుంటూరు కన్యకా ముద్రాక్షర శాలలో శ్రీ పెండేల చక్రపాణి సోదరుల చే 1924లో ముద్రించారు .’’కృతి గ్రహింపు ము బిడ్డలకింపు నింపు –దీవెనలు సల్పి మనుపుము దీర్ణమతిని –రామయామాత్య గృహిణి సాధ్వీమతల్లి –విష్ణు పద రోలంబ వేంక మాంబ’’అని శ్రీమతి వే౦క మాంబ కు అంకితమిచ్చారు .
భూమిక లో కవి వచనం లో తాను జూలకంటి భీమేశ్వరుని పేర ఒక శతకం రాయటానికి 28-8-1922 న పూనుకొని పది పద్యాలురాసి ,తీవ్రమైన వ్యాధితో పది నెలలు ఇబ్బందులు పడి,వ్యాధి నివారణ పొందాక మళ్ళీ ఉత్సాహంతో మొత్తం 50పద్యాలు రాసి ,మేళ్ళ వాగు స్కూలు నుంచి ముప్పాళ్ళ స్కూలు కు బదిలీ అయి తృతీయ ప్రధానోపాధ్యాయుడై ,కొద్దికాలం లోనే శతకం పూర్తీ చేసి శ్రీ భీమ లింగేశ్వరుని సమర్పించి నట్లు చెప్పాడు కవి .
అందులోనే దేవాలయ చరిత్ర గురించి చెబుతూ పల్నాడు తాలూకా జూలకల్లు లో శ్రీ భీమేశ్వర స్వామి వెలసి ఉన్నాడని ,కాకతి రాజులు ప్రతిష్ట చేశారని చెప్పే శిలా శాసనాలున్నాయని ,నిత్యపూజాదికాలు ఉత్సవాలు జరపటానికి తగిన భూ వసతి కూడా కల్పించారని ,ఆ గ్రామం లో ని గుంటుపల్లి వారు ఆలయాన్ని శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తున్నారని చెప్పారు. ముప్పాళ్ళ వాసి వైశ్యకుల ప్రముఖులు శ్రీ కాకుమాను కాశీ విశ్వనాథం ఈ శతక ముద్రణకు కావలసిన ధన సహాయం చేశారనీ ,వారు ,వారి వంశీకులు ఆ చంద్ర తారార్కం గా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు .శ్రీ కింతాడ వీరభాద్రాచారి కవి గారి కృషిని పద్యం లో అభినందించారు .
శతకం లో మొదట వంశ వర్ణ చేశాడు కవి .మొదటి సీసపద్యం లో శ్రీ ఆది నారాయణ స్వామిని స్తుతించాడు .తర్వాత వైశ్య వర్ణం ఏర్పడిన విధానం ,కాకుమాను వారి వంశం గురించి చెప్పి వారిది నాభిళ్ళ గోత్రం అనీ అందులో బసవయ్యగారు ప్రముఖులనీ ,ఆయన భార్య శాయమ్మ అనీ ,వారికి ఆరుగురు పుత్రులని ,అందులో రంగయ అనంతమ్మను పెళ్లాదాడని , వీరి సంతానం లో పట్టాభి రామయ్య దంపతులకు కలిగిన కాశీ విశ్వనాధం కనకా౦బను పెళ్ళాడి ,ఆమె కొద్దికాలానికే చనిపోతే ఆమె చెల్లెలు అన్నపూర్ణను ద్వితీయం చేసుకొని గొప్ప శ్రీమతుడై దాతగా కీర్తిపొంది,ఈ శతకాన్ని ముద్రించటానికి ధనం అందించాడు .తర్వాత కవిగారు ఆయనకు పద్యాశీస్సులు వర్షించారు.
శ్రీ గోపాలుని హనుమంత రాయ శాస్త్రి ,అష్టావధాని శ్రీ పోతరాజు లక్ష్మీ నరసింహకవి పద్యాలతో కవిని అభినందించారు .
కవిగారు ముందుగా ‘’శ్రీ మన్మహా దేవ దేవేశ -సోమార్ధ జూటాగ్ర-భూమీధరాధీశ కన్యా మనః పద్మ షట్పాద-శ్రీదా-సుధా ధామ మందార –బృందారకాధీశ దంతావళ శ్రేష్ఠ దుగ్దోధదీ ట్కుంద-డి౦డీర ధావల్యకీర్తుజ్వలా ‘’అంటూ దండకం మొదలుపెట్టి ‘’క్రూర రాత్రి౦చరధ్వంస –శ్రీ జూలకల్వాస శ్రీ భీమ లింగేశ –నే దండకంబొండు,నీనామ రూపంబులన్ జేసి యర్పించితిన్ –దీని రత్నోరు హారంబుగా దాల్పవే –నాపయిన్ నీ కృపన్ నిల్పవే –శూల హస్తా –నమస్తే నమస్తే నమస్తే నమః ‘’అని భక్తి చిప్పిలేట్లు ముగించాడు .మత్తేభ ,శార్దూల పద్యాలతో ‘’భీమ లింగేశ్వరా ‘’మకుటంతో రాసిన పద్య శతకం ఇది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-22-ఉయ్యూరు