కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2
ఆ కాలం లోతద్దినం నాడుమాత్రమే వరి అన్నం తినేవారు మిగిలిన రోజుల్లో జొన్నలు సజ్జలు వరిగలు వండుకొని తినేవారు .డబ్బిచ్చి బియ్యం నెయ్యి కొనేవారు .కేసరి తల్లి పొలాలకు వెళ్లి కందికంప పీక్కొని వచ్చి వంట చెరుకుగా వాడేది .మళ్ళీ పైరు వేసే లోపు వీటిని సమూలంగా త్రవ్వి తీసేవారు .అవి పొరబాటున కాలిలో గుచ్చుకొంటే గాయం త్వరగా మానేది కాదు .కూలీలతో పీకిస్తే చాలా డబ్బు అవుతుంది కనుక రైతుల భార్యలే వచ్చి తవ్వుకొని తీసుకు వెళ్ళేవారు .కేసరి తల్లి సంవత్సరానికి సరిపడా కండి కంప పోగేసి జాగ్రత్త చేసేది .
కేసరి బంధువు అదే వూళ్ళో ములుకుట్ల కృష్ణయ్య భిక్షాటన, పౌరోహిత్యం చేసేవాడు .సమీపగ్రామం బసవన్న పాలెం కూడా వెళ్ళే వాడు .కేసరికి ఊళ్ళో బిచ్చమెత్తుకోట౦ సిగ్గుగా ఉండేది .అందుకని కృష్ణయ్యతో కలిసి బసవన్నపాలెం కు జోలేకట్టుకొని ఒకసారి వెళ్ళాడు .చిన్న వాడుకనుక ఆదరించి ఆయనకంటే ఎక్కువ బిచ్చెం వేసేవారు .జోలి మోయలేనంత బరువు అయ్యేది .కృష్ణయ్య గారే ఆమూట కూడా కొంత దూరం మోసి సాయం చేశాడు . ఇంటికి చేరగానే మూట చూసి తల్లి చాలా సంతోషించింది . .కానీ ఆయనపడిన కష్టం ఆయాసం చెమట చూసి చలించిపోయింది . .స్నానం చేయించి అన్నం పెట్టి నిద్ర పుచ్చింది . .తల్లి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చండి .కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని ఉండటం చూసి వ్యధ చెందింది .ఈయనకు మెలకువ వచ్చి ఎందుకేడుస్తున్నావని తల్లిని అడిగితె కాళ్ళలో దిగిన తుమ్మ ముళ్ళు చూపించి మరీ ఏడ్చేసింది. సూదితో నెమ్మదిగా ముళ్ళు తీసేసి మళ్ళీ ఎప్పుడూ భిక్షాటనకు వెళ్ళను అని ప్రమాణం చేయించింది .ఆతల్లి హృదయం అంతగా తల్లడిల్లి౦దన్నమాట .
వీరింటి ఎదురుగానే మేనమామ ములుకుట్ల మహాదేవయ్య గారిల్లు .కానీ వారినుంచి కానీ కూడా సహాయం అందేది కాదు .ఆయన మంచివాడే ధర్మరాజు ,భార్య పరమగయ్యాళి. ఆవిడకు ఆయనే గాక ఊరుఊరంతా భయపడేది .జగడాలమారి ఆమె తిట్టినతిట్టు తిట్టకుండా రెండు గంటలు తిట్టేది .భార్యకు భయపడి మేనమామ ఏమీ వీరికి సాయం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండేవాడు .కనుక తల్లిస్వయం శక్తితోనే ఏదో సంపాదిస్తూ ,తాను ఒంటిపూట తింటూ కొడుకుకు రెండు లేకమూడు పూటలా భోజనం అమర్చేది.కంటికి రెప్పలాగా కాపాడేది. ఆమె కష్టాలు చూడలేక ఒకరోజు ఇంట్లో చెప్పకుండా మద్రాస్ కు కాలినడకన నడిచి వెళ్ళాడు బాలకేసరి .
మద్రాస్ జీవితం
మద్రాస్ లో ప్రతి డిసెంబర్ చివరి వారం లో రాణీ తోట అనే పీపుల్స్ పార్క్ లో ‘’పార్క్ ఫేర్ వేడుకలు ‘జరిగేవి .మద్రాస్ రాష్ట్ర ప్రజలు వేసవిలో ఊటీ వెడతారు .అందుకని చిన్నచిన్న ఉద్యోగులు మద్రాస్ వెళ్ళేవారు .కుటుంబాలతో తరలి వచ్చేవారు .వీరందరివలన వ్యాపారాలు బాగా జరిగేవి .ఈప్రదర్శనలకు కొబ్బరాకులతో,బొంగులతో పెద్ద పెద్ద ఆవరణలు రెండు కట్టేవారు .మొదటిది ఇన్నర్ సర్కిల్ రెండోది ఔటర్ సర్కిల్ .మొదటి దానిలో విలువైన వస్తువులు ప్రదర్శనకు పెట్టేవారు రెండవదానిలో కాఫీ హోటల్లు సోడా బడ్డీలు ,లాటరీ కొట్లు ఉండేవి .ఒక్కొక్క ఆవరణకు నాలుగు ద్వారాలు౦డేవి .గేట్ల దగ్గర పోలీసు కాపలా తోపాటు కాంట్రాక్టర్ల మనుషులుకూడా కాపలా ఉండేవారు .బయటహాలుకు అర్ధణా ,లోపలిదానికి నాలుగు అణాలు టికెట్ .అర్ధణా ఇచ్చి లోపలి వెళ్లి ,పావలా ఇచ్చి లోపలి ఆవరణలోకి వెళ్ళాలి .
అప్పటికి మద్రాస్ లో ఇంకా కరెంట్ రాలేదు .రాత్రిళ్ళు వెలుతురుకోసం కిరసనాయిల్ పోసిన తగరపు బుడ్లు ను లోపలా బయటా తోరణాలుగా కట్టేవారు .వీటిని సాయంత్రం అయిదుకు వెలిగించటం మొదలుపెడితేకానీ చీకటి పడేసరికి పూర్తయ్యేదికాదు.అప్పుడు కేసరి మద్రాస్ లో చదువుతున్నాడు .వాళ్ళమ్మ ఒకసారి మద్రాస్ వచ్చి కొడుకును చూసింది .ఆమె వచ్చినప్పుడు కొత్వాలు బజారుదగ్గర ఆచారప్పన్ వీధిలో ఒకగదిని నెలకు 12అణాలు అద్దెకు తీసుకొని ఉన్నారు .
1886లో రాణీ తోటలో వేడుకలు ప్రారంభమై మూడేళ్ళయింది .ఆ ఏడూ అలానే సంరంభంగా వేడుకలు మొదలయ్యాయి .కేసరి తన ఇంటి యజమాని గారబ్బాయితో వేడుకలు చూడటానికి వెళ్ళాడు .బయట రంగుల రాట్నంఎక్కి హాయి అనుభవించి ,’’చుక్కాణి’’ అంటే బయోస్కోప్ లో కాశీ రామేశ్వరాలు చూసి సంతోషించారు .ఆకుర్రాడు లోపలకు పోదామన్నాడు .అర్ధణా తనదగ్గర లేదన్నాడు కేసరి .అఆకుర్రడి దగ్గర అర్ధణా ఉంటె విడిచి వెళ్ళలేక వెళ్ళలేక లోపలి ఒక్కడే వెళ్ళాడు .వాడి చేతిలో అర్ధణా ఉ౦దికనుక లోపలి వెళ్ళాడు. ఆ అర్ధణా లేని నిర్భాగ్యుడు కేసరి లోపలి వెళ్ళలేక పోయాడు .అప్పటికే సాయంకాలం 6అయింది . కాసేపటికి లోపలినుంచి పొగలు మంటలు వచ్చి వెదురు బొంగులు పేఠేల్ ,పెఠీల్ మని కాలుతూ పగులుతున్న శబ్దం లోపలి నుంచి వినబడుతోంది .ఆ పొగలో కళ్ళు కనపడక తొక్కిసలాట జరిగి ,కాళ్ళకింద పసిపిల్లలు నలిగి పోయారు ధనవంతుల కుటుంబాలు చాలావచ్చాయి ప్రదర్శనకు .ఆడ మగ పిల్లా జెల్లా అందరూ ఆమంటల్లో మాడి మసి అయిపోయారు .అరగంటలో అంతా రుద్రభూమయిపోయింది .మంటల వేడికి తట్టుకోలేక కూవం నదిలో దూకారు కొందరు .ఆభరణాల ప్రదర్శనలో ఉన్నవారు వాటిని వదిలి రాలేక అక్కడే సజీవంగా దహనమయ్యారు .సందట్లో సడేమియా లాగా దొంగతనాలకు పెద్దగా అవకాశం కలిగింది వీలైనంత దోచుకొని పోయారు .ఆభరణాల బంగారం వెండి కరిగి ముద్దలయ్యాయి .ఆరోజు అమావాస్య కూడా కావటం తో కన్నుపొడుచుకున్నా వెలుతురూ లేదు .పోలీసు వారొచ్చి నిప్పునార్పు యంత్రాలతో మంటల్ని ఆర్పేశారు .అయినా తగినన్ని ఫైర్ ఇంజన్లు లేవు అప్పుడు .
క్రిష్టియన్ కాలేజి ప్రిన్సిపాల్ మిల్లర్ దొర వచ్చితానేస్వయంగా గుంజలపై ఉన్న పందిళ్లను దులిపి లోపలి స్త్రీ శిశువులను బయటికి తెచ్చికాపాడాడు .బాధితులకు చేతనైన సాయం చేశాడు .కాలేజికి వెళ్లి రిజిస్టర్లు తనిఖీ చేసి విద్యార్ధుల యోగ క్షేమాలు కనుక్కొని తలిదండ్రులకు వెంటనే తెలియజేశాడు .తెల్లారేసరికి అక్కడ కరిగి ఉన్న బంగారం వెండి ముద్దలు మాయమైపోయాయి .చనిపోయిన వారి బంధువులంతా అక్కడ శవ జాగరణం చేసి మర్నాడు ఉదయం తమ వారిని గుర్తు పట్టగలిగారు .గుర్తు పట్టలేక పోయినవార్కి సామూహికంగా అంత్యక్రియలు జరిపించారు .చావుతప్పి బయట పడినవారిలో కసరత్తు చేసిన బలశాలి కొల్లా కన్నయ్య శ్రేష్టి ఉన్నాడు .పల్టీకొట్టి దూకుతూ బయటపడ్డాడు. అప్పుడు ఆయనమెడలో ఉన్నపగడాలహారం జారిపోయింది .అది దొరికినవాడు సెట్టిగారింటికి మర్నాడు తీసుకు వెళ్లి ఇచ్చి బహుమానం పొందాడు .
బాలకేసరి లోపలి వెళ్ళకుండా బయటనే తిరుగుతూ ,లోపలి వెళ్ళిన ఇంటియజమాని కొడుకుకోసం బయట చాలా సేపు నిరీక్షించాడు .అతడు కనపడలేదు. కేసరి తల్లి రొప్పుతూ రోజుతూ పరిగెత్తుకు వచ్చి కొడుకును చూసి కావలించుకొని ఊరట చెందింది .ఆమెను తీసుకొని సెంట్రల్ స్టేషన్ గేటు ఎదురుగా జనరల్ హాస్పిటల్ ఆవరణ గోడపక్కన కూర్చుని తల్లీ కొడుకు సేద తేరారు .ఒంటేద్దుబండిలో రాత్రికి ఇంటికి చేరారు .ఇంటియజమానిభార్య తనతో వచ్చిన వాళ్ళ అబ్బాయి సంగతి అడిగితె జరిగింది. అంతా చెప్పగా ఆమె వెళ్లి యెంత వెతికినా జాడ దొరక్క నిరాశతో తిరిగి వచ్చింది .
(ఇక్కడే ఆతర్వాత1960-70లలో సెకండ్ హాండ్ బుక్ షాపులు ఉండేవి ,’’మూర్ మార్కెట్’’ అనే వారు .అన్నీ తక్కువధరకే దొరికేవి .అవీ ఆతర్వాత కాలిపోయాయి.మేము చాలాపుస్తకాలు వస్తువులు కొన్నా౦ .వాటిని ఇప్పుడు పారిస్ కు దూరంగా ఏర్పాటు చేశారు ).
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-22-ఉయ్యూరు