విశ్వ పుత్రిక తోరూ దత్ -1
పద్మిని సేన్ గుప్త రాసిన పుస్తకానికి ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగులోకి ‘’తోరూదత్’’అనే పేరుతొ అనువదించగా సాహిత్య అకాడెమి 1977లో ప్రచురించింది .వెల-2-30.దీన్ని’’ విశ్వ పుత్రిక తోరూ దత్ ‘’శీర్షికతో మీకు అందిస్తున్నాను .
తోరూదత్ ప్రపంచానికి వర ప్రసాదిని .బెంగాల్ లో గంగ ఒడ్డున జన్మించినా ఆమె మనసుమాత్రం జాతి భాషా సంకుచితాలను దాటి ,ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాషా సౌందర్యాలను ఆకళింపు చేసుకొని ,ఆ భాషలనే వాహికలుగా గ్రహించి సర్వ విద్యల్నీ కరతలామలకం చేసుకొన్నది .ఆభాషణ రుణాన్ని రచనలద్వారా తీర్చుకోన్నది .దీనితోతన మాతృదేశాన్ని ప్రపంచ సాహిత్య పటం లో ప్రధానమైనదిగా గుర్తి౦చేట్లు చేసింది .అసలు ఆమె తన మాతృభాష బెంగాలులో రచనలే చేయలేదు అంటే ఆశ్చర్యపోతాం .
ఆమె జీవించినకాలం లో ఇండియా లార్డ్ విలియం బెంటిక్ ,లార్డ్ మెకాలే లు భారతీయులలో ఇంగ్లీష్ వ్యాప్తికోసం తంటాలు పడేవారు .దానికి డబ్బు మంచినీళ్ళులా ఖర్చు చేశారు .కనుక దేశీయులకు ఇంగ్లీష్ నేర్చుకోవటం తప్పని సరి అయింది .పరభాష నెత్తిన రుద్దటం పై దోషం అనిపించలేదు.అక్షరజ్ఞానమున్న ప్రతి వారూ అలానే చేశారు కనుక తోరూ దత్ ను తప్పు పట్టలేము .తండ్రి వద్ద సంస్కృతం లో గొప్ప ప్రవేశం పొందింది .ఆమెకు ఆయుర్దాయం పరి పూర్ణంగా ఉండి ఉంటే తన సృజనాత్మక సాహిత్యాన్ని తప్పని సరిగా భారతీయం చేసి ఉండేది .తన సంప్రదాయం సంస్కృతీ వారసత్వం ఆమెను క్రమంగా తన్మయురాలిని చేసేశాయి .అన్నిటా ఈశ్వర తత్వమే ఉందన్న భావన కలిగించేది . తాత్వికురాలైన తోరూ,చిన్నవయసులో చెల్లెలు ‘’ఆరు ‘’చనిపోతే –‘నోరు చెప్పగలిగీ –కలం రాయగలిగీ –ఎక్కువవిచారాన్ని కలిగించే –మాటలివీ-ఇది ఇలా జరిగి ఉండేది ‘’అని విలపించింది ఇరవై ఒక్క ఏళ్ళకే చనిపోయిన తోరూఫ్రెంచ్ ఇంగ్లీష్ లను జీర్ణించుకొని ఆభాషల్లోనే రాసింది కాని ఆతత్వం తన దేశానికి కాకుండా పోయింది .ఆమెను ఎవరూ ఎప్పుడూ ఈ దేశం నుంచి బహిష్కరించలేదు .రచయితలూ పత్రికలూ ఆమెనుస్మరించినట్లు ఇంగ్లీష్ లో రాసే వేరెవర్నీ స్మరించలేదు .మనదేశం తయారు చేసిన గొప్పవారి పట్టిక లో తోరూ పేరూ ఉందని గుర్తించాలి .ఇప్పటికీఆమే ఉత్తమ రచయితగానే గుర్తింపు లో ఉంది .
తోరూ ను అంచనా వేయాలంటే ఆమె జీవితాన్నీ,అందులో ఆమె పొందిన విషాద భారాన్నీ ఆవిడ రచనలతో కలిపి చూడాల్సిందే .ఆమె కవన శక్తీ ,పాండిత్యం ఆమె రచనలలో భాగాలే .విడదీసి చూడ లేము .ఆమె రాసినలేఖలు, చేసినస్నేహాలు ఆమె పై ఒక అంచనాకు రావటానికి తోడ్పడతాయి .అందుకే విల్ఫ్రెడ్ఓవెన్ ‘’కవిత్వం తోరూ జీవితం లో పరచుకొన్న విషాదం లోనే ఉంది ‘’అని గొప్పగా కనిపెట్టి చెప్పాడు .ఆమెకూ ఆమె విషాద జీవితానికీ కవిత్వానికీ విడదీయరాని సంబంధం ఉందని విమర్శకులు విశ్లేషకులు ముక్త కంఠం తో విశ్వ వ్యాప్తంగా చెప్పారు .అందం విషాదం మృత్యు భీకరత్వం ఆమె జీవితం తో చెర్లాటలాడాయి.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-22-ఉయ్యూరు